షుగర్ పేషంట్లు మామిడి పండ్లు తినకూడదన్నది అపోహా? సంప్రదాయ వాదనలను సవాల్ చేస్తున్న అధ్యయనాలు

మామిడి పండ్లు

ఫొటో సోర్స్, Mansi Thapliyal

ఫొటో క్యాప్షన్, మామిడి పండ్లు
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
    • నుంచి, లండన్

‘సార్.. నేను మామిడి పండ్లు తినొచ్చా?’

ఎండాకాలంలో తనవద్దకు వచ్చే రోగుల నుంచి ముంబయికి చెందిన ప్రముఖ డయాబెటాలజిస్ట్ రాహుల్ బక్షికి ఎక్కువగా ఎదురయ్యే ప్రశ్న ఇది.

అయితే, ఈ సాధారణ ప్రశ్నకు సంబంధించి అపోహలు ఎక్కువగా ఉన్నాయని.. ఎంతలా అంటే, "మామిడి పండ్లను అస్సలు తినకూడదలు అనే దగ్గరి నుంచి.. షుగర్‌ను తగ్గించుకోవాలంటే (రివర్స్ డయాబెటిస్) మామిడి పండ్లు బాగా తినాలనేంత వరకు'' అని ఆయన అంటున్నారు.

వాస్తవం ఏదైనా, ఈ సందిగ్ధం సీజన్‌తో ముగిసేది కాదు.

''చాలామంది రోగులు మామిడి పండ్ల సీజన్ ముగిసిన తర్వాత, మరోసారి వైద్య పరీక్షలకు వస్తారు. అందులో కొందరి గ్లూకోజ్ స్థాయిలు పెరిగి ఉంటాయి. కొన్నిసార్లు, వారికి ఇష్టమైన మామిడి పండ్లను అతిగా తినడం కారణం కావొచ్చు'' అని రాహుల్ చెప్పారు.

ఈ నిరంతర సందిగ్ధం మధుమేహ బాధితులను మామిడి పండు గురించి జాగ్రత్తగా ఉండేలా చేసింది. కానీ, డయాబెటిస్ రోగులు అనుకున్నంతగా మామిడి పండ్లు అంత ఇబ్బందికరం కాదని కొత్త పరిశోధన చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మామిడి పండ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మామిడి పండ్ల ప్రాధాన్యతను తెలుపుతూ ఇండియాలో మ్యాంగో ఫెస్టివల్స్ జరుగుతాయి.

'అన్నిసార్లూ విలన్ కాదు'

ఇటీవలి రెండు ఇండియన్ క్లినికల్ ట్రయల్స్ షుగర్ పేషంట్ల ఆహార నియమాలకు సవాల్ విసిరాయి.

కార్బోహైడ్రేట్లకు బదులుగా మోతాదు మేరకు మామిడి తినడం టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో జీవక్రియను, రక్తంలో చక్కెరను మెరుగుపరుస్తుందని అవి సూచిస్తున్నాయి.

క్లోమం ఇన్సులిన్‌ను తక్కువగా, లేదంటే అసలు ఉత్పత్తి చేయనప్పుడు టైప్-1 డయాబెటిస్ వస్తుంది. అయితే, టైప్-2 డయాబెటిస్‌లో ఇన్సులిన్ ప్రభావాలకు శరీరం నిరోధకంగా మారుతుంది.

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 90 శాతం కన్నా ఎక్కువ కేసులు టైప్-2 డయాబెటిస్‌వే.

మామిడి పండ్లు, షుగర్, మధుమేహం

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

కొత్త పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

అనేక సవాళ్ల మధ్య కొత్త పరిశోధనల ఫలితాలు మామిడి ప్రియులకు కొంత ఊరటనిస్తున్నాయి.

‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌’లో దీనికి సంబంధించిన అధ్యయనం ప్రచురితం కాబోతోంది.

ఒక పైలట్ స్టడీలో భాగంగా 95 మందిపై గ్లూకోజ్ టెస్టింగ్ ప్రయోగాలు చేశారు. వారికి దేశంలో ప్రసిద్ధి చెందిన సఫేదా, దశేరి, లాంగ్రా రకాల మామిడి పండ్లు తినేందుకు ఇచ్చారు.

ఈ పరీక్షలో వైట్‌బ్రెడ్‌ తిన్నవారితో పోలిస్తే, ఈ మామిడి పండ్లు తిన్నవారి రక్తంలో చక్కెర అంతే స్థాయిలో లేదా తక్కువ పెరుగుదల(గ్లైసిమిక్ రెస్పాన్స్)ను ఫలితాలు చూపించాయి.

ఈ అధ్యయనంలో టైప్-2 డయాబెటిస్ ఉన్న కొందరిని, ఈ సమస్య లేని కొందరిని మూడు రోజుల పాటు పరిశీలించారు. భోజనం తర్వాత మామిడి పండు తిన్న డయాబెటిస్ వ్యక్తుల రక్తంలో, చక్కెర స్థాయిల్లో వ్యత్యాసం తక్కువగా ఉందని తేలింది.

గ్లైసెమిక్ రెస్పాన్స్ హెచ్చుతగ్గులు స్వల్పంగా ఉంటే దీర్ఘకాలంలో శరీరానికి ప్రయోజనకరమని పరిశోధకులు చెబుతున్నారు.

''మామిడిపండ్లు చాలామందికి ఇష్టమైనవి. ఇవి శరీరంలో గ్లూకోజ్‌ను, ఇంకా బరువు పెంచేస్తాయని దుష్ప్రచారానికి గురయ్యాయి'' అని డాక్టర్ సుగంధ కేహార్ చెప్పారు.

సుగంధ కేహార్ మామిడి పండ్లపై చేసిన రెండు అధ్యయనాలకు ప్రధాన రచయిత్రి.

మామిడి పండ్లు, షుగర్ రోగులు, మధుమేహం, డయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

రెండోది, దిల్లీలోని ఫోర్టిస్ సి-డాక్‌తో కలిసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ 8 వారాల పాటు నిర్వహించిన ప్రయోగ ఫలితాలను 'జర్నల్ ఆఫ్ డయాబెటిస్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్' ప్రచురించింది.

అవి మొదటి ప్రయోగ ఫలితాలకు మరింత బలం చేకూర్చాయి.

టైప్-2 డయాబెటిస్ ఉన్న 35 మంది పెద్దలు అల్పాహారంలో బ్రెడ్‌కు బదులు 250 గ్రాముల మామిడి తిన్నారు.

వారిలో ఫాస్టింగ్ గ్లూకోజ్(రాత్రిపూట తినకుండా ఉన్న తర్వాత రక్తంలో చక్కెరను కొలవడం), హిమోగ్లోబిన్ ఏ1సీ (హెచ్‌బీ ఏ1సీ), ఇన్సులిన్ రెసిస్టెన్స్, బరువు, నడుము చుట్టుకొలత, హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ మెరుగుదల కనిపించింది.

ఇవి డయాబెటిస్ నియంత్రణ, మొత్తం జీవక్రియ ఆరోగ్యానికి కీలక సంకేతాలు.

''మొదటిసారిగా, అల్పాహారంలో బ్రెడ్‌కు బదులుగా కొద్ది మొత్తంలో మామిడి తినడం ప్రయోజనకరంగా ఉంటుందని రెండు వివరణాత్మక అధ్యయనాల ద్వారా మేం నిరూపించాం. ఇది మామిడి జీవక్రియకు హాని కలిగిస్తుందనే సందేహాలను తొలగిస్తుంది'' అని సీనియర్ రచయిత, స్టడీ లీడ్ ప్రొఫెసర్ అనూప్ మిశ్రా చెప్పారు.

మామిడి పండ్లను మితంగా తీసుకుంటే పర్లేదని అయితే, వైద్య సలహా పాటించాలని అనూప్ మిశ్రా సూచిస్తున్నారు.

మామిడి తోటలో రైతు

మితంగా తినడమంటే?

దీనికి ప్రొఫెసర్ మిశ్రా సమాధానమిస్తూ ''మీ రోజువారీ పరిమితి 1,600 కేలరీలైతే, మామిడి పండు తినడం వల్ల వచ్చే కేలరీలు ఆ మొత్తంలో భాగంగా ఉండాలి, అదనంగా కాదు. ఒక 250 గ్రాముల బరువైన చిన్న మామిడి పండులో దాదాపు 180 కేలరీల శక్తి ఉంటుంది. అధ్యయనంలో చూపినట్లుగా, అవే ఫలితాలను పొందడానికి కార్బోహైడ్రేట్లకు బదులుగా దానికి సమానమైన మామిడి పండ్లను తీసుకుంటారు'' అని వివరించారు.

డాక్టర్ బక్షి కూడా తన వద్దకు వచ్చిన రోగులకు ఇంచుమించుగా అదే విషయం చెప్పారు.

''గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటే, మామిడి పండ్లను పరిమిత పరిమాణంలో తినడానికి నా రోగులను ప్రోత్సహిస్తాను. మామిడి పండులో సగం భాగం (15 గ్రాముల కార్బోహైడ్రేట్లు) రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తినడానికి అనుమతిస్తాను'' అని బక్షి చెప్పారు.

''భోజనానికి, భోజనానికి మధ్య సమయంలో మామిడి పండ్లను తినాలి. ఖాళీ కడుపుతో కాదు. వాటిని ప్రొటీన్ లేదా ఫైబర్‌తో తీసుకోవాలి. ఇతర కార్బోహైడ్రేట్లు లేదా చక్కెర రూపాలైన జ్యూస్‌లు, మిల్క్‌షేక్‌ వంటి వాటితో కలపకూడదు'' అని వివరించారు.

భారతీయుల జీవితంలో మామిడికి చాలా పెద్ద స్థానమే ఉంది. సాంస్కృతిక, సామాజిక, దౌత్యపరమైన ప్రాముఖ్యత దీనికి ఉంది.

మామిడి పండ్లతో దౌత్య సంబంధాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2007లో మాజీ భారత రాయబారి రోనెన్ సేన్ ఒక వేడుకలో అమెరికా అధికారి మైక్ జోహన్స్‌కు భారత మామిడి పండ్ల బుట్టను బహూకరించారు.

'మామిడి పండ్ల దౌత్యం'

మామిడి పండ్ల దౌత్యం (మ్యాంగో డిప్లమసీ)... ఈ పదం భారత ఉపఖండంలో బాగా ప్రముఖమైంది. రాజకీయ ఒప్పందాల సమయంలో నాయకులు తరచుగా మామిడి పండ్ల ప్రత్యేక పెట్టెలను పంపుతారు.

మామిడి పండ్ల సాంస్కృతిక, ఆర్థిక ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మ్యాంగో ఫెస్టివల్స్ జరుగుతాయి.

'మ్యాంగీఫెరా ఇండికా: ఏ బయోగ్రఫీ ఆఫ్ మ్యాంగో' రచయిత సోఫాన్ జోషి ప్రకారం, దేశంలో 1,000కి పైగా మామిడి రకాలు సాగవుతున్నాయి. ఉత్తరాది, తూర్పు ప్రాంతాల్లో లాంగ్రా, దశేరి, చౌసా, హిమసాగర్ తదితర రకాల మామిడి పండ్లు చాలా తియ్యగా ఉంటాయి.

దక్షిణాది రకాలు తీపి, పుల్లదనంతో ఉంటాయి. పశ్చిమ భారత దేశానికే ప్రత్యేక రకమైన ఆల్ఫోన్సో రుచిలో చక్కెర, ఆమ్లాల ప్రత్యేక సమతుల్యతతో దానికదే సాటి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)