ఒక కిలో మామిడి పండ్లు రూ. 2 లక్షల 70 వేలు - ప్రెస్‌రివ్యూ

మామిడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మధ్యప్రదేశ్‌లో ఏడు మామిడి కాయలకు నలుగురు గార్డులు, ఆరు కుక్కలతో రక్షణ ఏర్పాటు చేశారని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

దాని ప్రకారం.. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌కు చెందిన రాణి, సంకల్ప్‌ దంపతుల తోటలో ఈ మామిడి చెట్లున్నాయి.

ఇవి జపాన్‌లోని మియాజాకి ప్రాంతానికి చెందిన అరుదైన రకానికి చెందిన మామిడి చెట్లు.

అందుకే ఈ చెట్లకు కాసిన మామిడి పండ్లకు మియాజాకి పేరు స్థిరపడింది.

ఈ పండ్లు రూబీ కలర్‌లో ఉంటాయి.

ఈ మియాజాకి రకం కిలో మామిడి పండ్లు గతేడాది అంతర్జాతీయ మార్కెట్లో 2.7 లక్షలు పలికాయి.

ఈ విషయం తెలిసి అప్పుడు కొందరు ఈ మామిడి పండ్లను దొంగిలించారు.

అందుకే ఈసారి వీటిని ఎవరూ చోరీ చేయకుండా గట్టి రక్షణ ఏర్పాటు చేశారు.

ఓసారి రైలు ప్రయాణంలో ఓ వ్యక్తి తమకు ఈ అరుదైన మొక్కలు ఇచ్చారని ఈ దంపతులు చెబుతున్నారు.

కార్లు

వాహనదారులకు గుడ్ న్యూస్

కోవిడ్ వేళ వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పిదంటూ ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇతర పర్మిట్లకు సంబంధించిన పత్రాల గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

2020 ఫిబ్రవరి ఒకటితో గడువు ముగిసిన పత్రాలు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక పొల్యూషన్ సర్టిఫికేట్ జారీ విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఏకరీతిన పొల్యూషన్ సర్టిఫికేట్ జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే, పీయూసీ డేటాను జాతీయ రిజిస్టర్‌తో అనుసంధానం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఈనాడు పేర్కొంది.

విద్యార్థి

ఫొటో సోర్స్, Getty Images

మూడేళ్ల ప్రతిభ ఆధారంగా మూల్యాంకనం

కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల 2020-21 విద్యా సంవత్సరంలో 12వ తరగతి బోర్డు పరీక్షల రద్దు నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ), కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (సీఐఎస్‌సీఈ)లు ప్రతిపాదించిన అసెస్‌మెంట్‌ స్కీమ్‌కు సుప్రీంకోర్టు గురువారం ఆమోదముద్ర వేసిందని సాక్షి పత్రిక ఒక కథనం రాసింది.

దాని ప్రకారం దేశంలో 12వ తరగతి బోర్డు పరీక్షల రద్దు నిర్ణయంపై ఇక పునరాలోచన లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. 10, 11, 12వ తరగతుల ఫలితాల ఆధారంగా విద్యార్థులకు తుది మార్కులు కేటాయించేందుకు 30:30:40 ఫార్ములాను సీబీఎస్‌ఈ తెరపైకి తీసుకొచ్చింది.

తుది ఫలితాలను ప్రకటించే విషయంలో గత ఆరేళ్లలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటామని సీఐఎస్‌సీఈ వెల్లడించింది. జూలై 31వ తేదీలోగా ఫలితాలను ప్రకటిస్తామని రెండు బోర్డులు తెలియజేశాయి.

అసెస్‌మెంట్‌ స్కీమ్‌ పట్ల సంతృప్తి చెందని విద్యార్థులు కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహించే పరీక్షలకు హాజరు కావొచ్చని సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ సూచించాయి.

విద్యార్థులు 10, 11, 12వ తరగతుల్లో సాధించిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి, 30:30:40 ఫార్ములా ప్రకారం తుది ఫలితాలు వెల్లడిస్తామని సీబీఎస్‌ఈ పేర్కొంది.

10వ తరగతి మార్కులకు 30 శాతం, 11వ తరగతి మార్కులకు 30 శాతం, 12వ తరగతిలో యూనిట్‌ టెస్టు, మిడ్‌-టర్మ్, ప్రి-బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుందని తెలిపింది.

12వ తరగతిలో ప్రాక్టికల్, ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను సంబంధిత పాఠశాలలు సీబీఎస్‌ఈ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని, తుది ఫలితాలను ప్రకటించే విషయంలో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

పదో తరగతిలో ప్రధాన ఐదు సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్టులను మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకుంటారు.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

47 వేల దిగువకు పసిడి

బంగారం ధర 47వేల దిగువకు వచ్చిందని నమస్తే తెలంగాణ ఒక కథనం రాసింది.

దాని ప్రకారం అమెరికా రిజర్వుబ్యాంక్‌ వచ్చే రెండేళ్లకు వడ్డీరేట్లను పెంచబోతున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్లో అలజడి సృష్టించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీ 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.860 తగ్గి రూ.47 వేల దిగువకు పడిపోయింది. బులియన్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి ధర రూ.46,860గా ఉన్నది. బుధవారం ఈ ధర రూ.47,720గా ఉన్నది.

బంగారంతోపాటు వెండి రేటు కూడా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు అంతంత మాత్రంగానే ఉండటంలో కిలో వెండి ఏకంగా రూ.1700 తగ్గి రూ.68,798గా ఉన్నది. అంతకుముందు ఈ ధర రూ.70 వేలుగా ఉన్నది.

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 దిగొచ్చి రూ.48,930 పలుకగా, 22 క్యారెట్ల ధర రూ.44,850 వద్దకు తగ్గాయి. కిలో వెండి రూ.1,100 దిగొచ్చి రూ.75,100 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,810 డాలర్లకు పడిపోగా, వెండి 26.98 డాలర్లకు దిగొచ్చింది.

త్వరలో వడ్డీరేట్లు పెంచకతప్పదని యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ వ్యాఖ్యలు బులియన్‌ ధరలు ఒత్తిడికి గురవడానికి కారణమయ్యాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)