చైనా తరహాలో అమెరికాపై భారత్ ప్రతీకార సుంకాలు ఎందుకు విధించలేదు? 4 కారణాలు

ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్‌లను వెతుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తొలిసారి ప్రపంచ దేశాలపై సుంకాలు విధించినప్పుడు, చైనా తీవ్ర స్వరంతో స్పందించింది.

2025 ఏప్రిల్‌లో ఈ టారిఫ్‌లకు సంబంధించి చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అప్పుడు అమెరికా చైనాపై 145 శాతం, చైనా అమెరికాపై 125 శాతం సుంకాలు విధించుకున్నాయి.

జెనీవాలో జరిగిన చర్చల తర్వాత, అమెరికా తాను విధించిన టారిఫ్‌లను 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించింది, చైనా 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.

ప్రస్తుతం భారత్ 50 శాతం అమెరికా సుంకాలను ఎదుర్కొంటోంది. అయితే చాలామందిలో మెదిలే సందేహం ఏంటంటే, చైనాలా భారత్ ఎందుకు ప్రతీకారం తీర్చుకోలేదు అని. చైనాలాగా ప్రతీకార సుంకాలను విధించే అవకాశం భారత్‌కు ఉందా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు
ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించే స్థితిలో భారత్ లేదని నిపుణులంటున్నారు.

అమెరికాపై భారత్ సుంకాలు ఎందుకు విధించలేదు?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాన్ని విధించారు. ఇది ఆసియాలో అమెరికా అత్యధిక సుంకం. ఈ సుంకం ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చింది.

గతంలో ట్రంప్ భారత్‌పై 25 శాతం సుంకం విధించారు. ఆ తర్వాత, రష్యా నుంచి చమురు కొనడడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అదనంగా 25 శాతం సుంకాన్ని కూడా ప్రకటించారు.

అయితే, చైనా, తుర్కియే, యూరోపియన్ యూనియన్ కూడా రష్యా నుంచి చమురు కొంటున్నాయి. అందుకే రష్యా చమురు అన్నది భారత్ విషయంలో ఒక సాకు మాత్రమే అన్న అభిప్రాయముంది.

అమెరికా, యూరప్‌లు రష్యా నుంచి యురేనియంతో పాటు ఎరువులను కొంటున్నాయని, మరి తమ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకని భారత్ ప్రశ్నిస్తోంది.

ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకార సుంకాల వల్ల భారత్‌కు నష్టం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

జయంత్ దాస్‌గుప్తా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కు భారత రాయబారిగా (2010-14) పనిచేశారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి రాసిన ఒక వ్యాసంలో అమెరికాపై సుంకాలు విధించడం భారత్‌కు తేలికైన వ్యవహారం ఎందుకు కాదో వివరించడానికి ఆయన ప్రయత్నించారు.

"అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే ప్రధాన వస్తువులు ఖనిజ ఇంధనాలు, చమురు, కట్ అన్‌కట్ వజ్రాలు, యంత్రాలు, సేంద్రీయ రసాయనాలు, ప్లాస్టిక్‌, పండ్లు, గింజలు. ఈ ఉత్పత్తులలో ఎక్కువ భాగం ముడి పదార్థాలు లేదా మధ్య స్థాయివి. అమెరికాపై సుంకాలు విధించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవడం భారత దేశీయ, ఎగుమతి మార్కెట్‌లకు హాని కలిగిస్తుంది. దీనితో పాటు, సుంకాలపై ప్రతీకారం తీర్చుకోవడం సేవా రంగానికి కూడా నష్టం కలిగిస్తుంది. దీనిని నివారించడం ముఖ్యం" అని ఆయన విశ్లేషించారు.

"చైనా తప్ప, ఇతర ప్రధాన దేశాలు అమెరికా ఒత్తిడికి లొంగిపోయి 10శాతం (బ్రిటన్) లేదా అంతకంటే ఎక్కువ సుంకాలను భరించడానికి అంగీకరించాయి. కాబట్టి సమీప భవిష్యత్తులో భారత్‌కు ఏదైనా ఉపశమనం లభించే అవకాశం చాలా తక్కువ" అని జయంత్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు.

"పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు కోల్పోవడం, ట్రంప్ మద్దతుదారుల కోపం 2026 నవంబర్‌లో అమెరికాలో జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు అమెరికా విధానాలను కొంచెం మెతగ్గామార్చే అవకాశం ఉంది"అని విశ్లేషించారు.

ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ విషయంలో రష్యా నుంచి చమురు అన్నది ట్రంప్‌కు ఒక సాకు మాత్రమేనని నిపుణులంటున్నారు.
ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

చైనా లాగా అమెరికాపై సుంకాలు విధించడం ఆర్థిక దృక్కోణం నుంచి భారతదేశానికి ప్రయోజనకరంగా ఉండదని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌కు సరైన మార్గం దౌత్యం, దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం అని, తద్వారా ట్రంప్ విధించిన సుంకాల ప్రభావాన్ని తగ్గించవచ్చని వారు అంటున్నారు.

చైనా మార్గాన్ని భారత్ ఎంచుకోలేదని, దీనికి బలమైన కారణాలు ఉన్నాయని భూటాన్ వార్తాపత్రిక 'ది భూటానీస్' సంపాదకుడు తెన్జింగ్ లామ్సాంగ్ అంటున్నారు.

"భారత్‌కు ఉన్న సమస్య ఏంటంటే, చైనాలా, అమెరికా టెక్నాలజీ, రక్షణ రంగానికి గట్టి దెబ్బ తగిలేలా చేసే అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్ మెటల్స్) వంటి ముఖ్యమైన ఆయుధం దాని దగ్గర లేదు. భారత ఎగుమతులు కూడా వాటిని భర్తీ చేయలేని విధంగా లేవు. ఇతర దేశాలు భారత్‌ను సులభంగా భర్తీ చేయగలవు" అని తెన్జింగ్ లామ్సాంగ్ 'ఎక్స్'‌లో రాశారు.

ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ ప్రతీకార సుంకాలు విధిస్తే ట్రంప్ మరిన్ని సుంకాలు విధించే అవకాశముంది.
ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఎకనామిస్ట్ సుజన్ హజ్రా ఇంగ్లీష్ వార్తాపత్రిక మింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ , "భారత్‌ను ఒంటరిని చేయడం అత్యంత బాధ కలిగించే విషయం. అమెరికా, దాని యూరోపియన్ మిత్రదేశాలు ఇప్పటికీ రష్యాతో వ్యాపారం చేస్తున్నాయి, కానీ భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ పరిస్థితిలో, ప్రతీకార సుంకాల రూపంలో భారత్ ప్రతీకాత్మక ప్రతిస్పందనను మాత్రమే ఇవ్వడం సరైనది కాదు" అని అన్నారు.

అమెరికాపై భారత్ సుంకాలు విధిస్తే, ట్రంప్ కోపం మరింత పెరిగి భారత్‌పై మరిన్ని సుంకాలు విధించవచ్చని తెన్జింగ్ లామ్సాంగ్ అభిప్రాయపడ్డారు.

"చైనా లాగా భారత్ కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలను విధించాలని కొందరు అంటున్నారు. కానీ భారత్ ఈ మార్గాన్ని ఎంచుకోలేదు. దాని వెనుక ఒక బలమైన కారణం ఉంది. కోపంగా ఉన్న ట్రంప్ భారత్‌పై సుంకాలను మరింత పెంచుతారు. ఇది భారతదేశానికి నష్టాన్ని కలిగించే ఒప్పందం అవుతుంది. ఎందుకంటే అమెరికాకు ఎగుమతి చేసే దానికంటే చాలా తక్కువ భారత్ దిగుమతి చేసుకుంటుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక అభివృద్ధి స్థితిని బట్టి చూస్తే, ట్రంప్‌కు వ్యతిరేకంగా భారత్‌కు ఆర్థిక ఆప్షన్లు లేవు" అని విశ్లేషించారు.

ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాకు చేసే ఎగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడిఉందని నిపుణులంటున్నారు.
ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

భారతదేశం ఐటీ సేవల ఎగుమతి కోసం అమెరికాపై ఎక్కువగా ఆధారపడి ఉందని ఎకనామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకులు జి. చొక్కలింగం అన్నారు.

"భారత్ ప్రతీకార సుంకాలను విధించడం సరైనది కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన ఐటీ ఎగుమతులు దాదాపు 140 బిలియన్ డాలర్లు( సుమారు రూ. 11.90 లక్షల కోట్లు). అమెరికా ప్రతీకారం తీర్చుకుంటే, మనం చాలా ఇబ్బందుల్లో పడతాం'' అని ఆయన అన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం సాఫ్ట్‌వేర్, ఐటీ సేవల ఎగుమతి దాదాపు 200 బిలియన్ డాలర్లు( సుమారు 17 లక్షల కోట్లు). వీటిలో 54.7 శాతం అమెరికాకు జరిగిన ఎగుమతులు. ఈ రంగంలో అమెరికా అతిపెద్ద వాటా ఇది.

2024-25లో భారత ఐటీ రంగ ఎగుమతులు 224.4 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 19 లక్షల కోట్లు)కు చేరుకుంటాయన్న అంచనా ఉంది. దీనికి అమెరికానే ముఖ్యమైన మార్కెట్.

ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా నుంచి కొనే చమురుతో భారత్‌కు పెద్ద ప్రయోజనం లేదన్న వాదన ఉంది.

భారత్‌కు రష్యాతో చమురు ప్రయోజనమా...అమెరికాతో వ్యాపారమా?

చమురు ధరలపై రష్యా తగ్గింపు శాతం ఇటీవల బాగా తగ్గింది. మేలో భారత్ సౌదీ అరేబియా నుంచి కొనే చమురు కంటే రష్యా నుంచి కొనే ముడి చమురు కోసం బ్యారెల్‌కు కేవలం 4.50 డాలర్లు తక్కువ చెల్లించింది. 2023లో, ఈ వ్యత్యాసం బ్యారెల్‌కు 23 డాలర్లు కంటే ఎక్కువగా ఉంది.

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ ప్రకారం, రష్యా చమురుపై తగ్గింపుల వల్ల మార్చి 2025 నాటికి చమురు కొనుగోళ్లపై దాదాపు 3.8 బిలియన్ డాలర్లను భారత్ ఆదా చేసింది. కానీ గత ఏడాది భారతదేశం దాదాపు 87 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసింది .

వారెన్ ప్యాటర్సన్ సింగపూర్‌లోని ఐఎన్‌జీ గ్రూప్‌లో కమోడిటీ స్ట్రాటజీ అధిపతి.

"అమెరికాతో భారత వాణిజ్యం ఎంత పెద్దదో, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా ఎంత పొదుపు చేస్తోందో పరిశీలిస్తే, భారత్ ఏమి చేయాలో స్పష్టంగా తెలుస్తుంది. చమురు తగ్గింపులో కొన్ని బిలియన్లను ఆదా చేయడానికి మీరు 87 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఎగుమతులను పణంగా పెడతారా?" అని బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ ప్యాటర్సన్ ప్రశ్నించారు.

ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే ట్రంప్ మరో సాకు వెతుకుతారనే వాదన ఉంది.

రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనడం మానేస్తే?

భారత్, రష్యా మధ్య దీర్ఘకాల సంబంధం ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు సోవియట్ కాలం నాటివి. కాలక్రమేణా, రెండు దేశాలు ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకుంది.

సోవియట్ అనంతర కాలంలో కూడా భారతదేశం-రష్యా వాణిజ్య సంబంధాలు పెరుగుతూనే ఉన్నాయి.

పెట్టుబడుల రంగంలో కూడా రెండు దేశాలు సహకారాన్ని బలోపేతం చేసుకున్నాయి. భారత కంపెనీలు రష్యా చమురు-గ్యాస్, ఔషధ, ఐటీ రంగాలలో పెట్టుబడులు పెట్టగా, రష్యా కంపెనీలు భారతదేశ ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలలో పెట్టుబడులు పెట్టాయి.

2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకుంది. ఇది కోవిడ్ మహమ్మారికి ముందున్న పరిస్థితి నుంచి దగ్గరదగ్గరగా 6 రెట్లు పెరిగింది.

యుక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు భారతదేశం ఆర్థికంగా సహాయం చేస్తోందని, ఆ దేశం నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోందని చెబుతూ ట్రంప్ భారత్‌పై అదనంగా 25శాతం సుంకం విధించారు.

భారతదేశం రష్యా నుంచి ముడి చమురు కొనడం ఆపివేస్తే, భారత్‌పై విధించిన సుంకాలను తొలగిస్తారా? చెప్పలేమంటున్నారు నిపుణులు.

చమురు కొనుగోలును భారత్ ఆపివేస్తే, ట్రంప్ సాకులను మార్చే అవకాశం ఉందని జయంత్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు.

"యూరప్, చైనా రెండూ రష్యా అతిపెద్ద ఇంధన కొనుగోలుదారులు అయినప్పటికీ, ట్రంప్ వాటిపై ఎలాంటి సుంకం విధించలేదు. రష్యా నుంచి చమురు కొనడం ఆపివేసినప్పటికీ, రష్యా రక్షణ పరికరాల కొనుగోలును నిలిపివేయడం, బ్రిక్స్ నుంచి నిష్క్రమించడం, ఇతర దేశాల కరెన్సీలో వ్యాపారం చేయకుండా ఉండటం వంటి నిబంధనలను ట్రంప్ పెట్టవచ్చు" అని విశ్లేషించారు.

ట్రంప్, సుంకాలు, భారత్, చైనా, ఎగుమతులు, దిగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు ఎలాంటి అవకాశాలున్నాయి?

ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని, ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో ప్రత్యామ్నాయాల కోసం కూడా వెతకాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

"ట్రంప్, ఆయన బృందం వైఖరి 'హాస్యాస్పదంగా' ఉంది. భారతదేశానికి వ్యతిరేకంగా ఈ విధానం దీర్ఘకాలంలో అమెరికాకు తీవ్రమైన వ్యూహాత్మక నష్టంగా నిరూపితమవుతుంది. ముఖ్యంగా చైనా ఇప్పటికే అమెరికా ప్రత్యర్థిగా ఉన్న నేపథ్యంలో. కానీ పరిస్థితి ఇలా ఉంది. భారతదేశం దీన్నుంచి నేర్చుకోవాలి" అని తెన్జింగ్ లామ్సాంగ్ అన్నారు.

ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ ఇలా చేయాలని లామ్సాంగ్ భావిస్తున్నారు

  • ఆర్థిక వ్యవస్థ బలంగా మారడానికి భారీగా ఆర్థిక సంస్కరణలు తేవాలి.
  • పరిస్థితులు మెరుగుపడాలంటే పరస్పర సామరస్యం, స్థిరత్వం అవసరం.
  • పొరుగు దేశాలతో, 'శత్రు దేశాలతో' కూడా దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవాలి.
  • చైనా లాగే, భారత్ కూడా సమయానికి తగ్గట్టుగా, ప్రశాంతంగా పని చేయాలి, అంతర్గతంగా బలంగా ఉండాలి.

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కి భారత్ వెళ్లగలదా?

''వివాదాల పరిష్కారానికి డబ్ల్యూటీవో రెండు అంచెల వ్యవస్థగా పని చేస్తుంది. రెండో స్థాయిలో, ఏడుగురు శాశ్వత సభ్యుల బృందం (అప్పీల్ బాడీ)లోని ముగ్గురు సభ్యులు అప్పీళ్లను నిర్ణయిస్తారు. ఈ ఏడుగురు సభ్యులను అన్ని దేశాల అంగీకారంతో ఎంపిక చేస్తారు. కానీ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో కొత్త సభ్యుల నియామకాన్ని నిలిపివేశారు. 2019 నుంచి ఈ సంస్థలో సభ్యులు లేరు. కాబట్టి, ఈ వ్యవస్థ పనిచేయడం లేదు. అలాంటి పరిస్థితిలో, అమెరికాపై కేసు నమోదు చేయడం కేవలం లాంఛనప్రాయంగా ఉంటుంది" అని జయంత్ దాస్ గుప్తా విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)