ఎలాన్ మస్క్ 'పాము లాంటోడు' అని పిలిచిన వ్యక్తిని ట్రంప్ భారత్‌లో ఎందుకు నియమించారు?

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా సెర్జియో గోర్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నియమించారు.
సెర్జియో గోర్‌ను భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా, దక్షిణ, మధ్య ఆసియాలో ప్రత్యేక రాయబారిగా నియమిస్తున్నట్లు శుక్రవారం ట్రంప్ ప్రకటించారు.
గోర్ ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ''ప్రెసిడెన్షియల్ పర్సనల్ అపాయింట్‌మెంట్స్‌కు హెడ్''గా పనిచేస్తున్నారు.
గోర్ నియామకాన్ని అమెరికా సెనేట్ ఆమోదించాల్సి ఉంది.

అమెరికా-భారత్ మధ్య సుంకాల వివాదం నడుస్తోన్న సమయంలో గోర్‌ను భారత్‌లో అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు, భారత్-చైనాలు కూడా దగ్గరవుతున్నాయి.
గోర్ నియామక ప్రకటనను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు.
''ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్‌గా సెర్జియో గోర్, ఆయన బృందం సుమారు 4 వేల మంది అమెరికా మద్దతుదారులను రికార్డు సమయంలో ప్రభుత్వంలోని మా ప్రతి విభాగంలో నియమించింది. సెనేట్ నుంచి ఈ నియామకానికి ఇంకా ఆమోదం రాకపోవడంతో ప్రస్తుతం ఆయన వైట్‌హౌస్‌లోనే తన బాధ్యతల్లోనే కొనసాగనున్నారు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
'నాకు మంచి స్నేహితుడు, నమ్మకమైన వ్యక్తి'
'' ఎన్నో ఏళ్లుగా నాతో ఉన్న గోర్ నాకు మంచి స్నేహితుడు. ఎన్నో అధ్యక్ష ప్రచారాలకు పనిచేశారు. నా బెస్ట్ బుక్స్ ప్రచురించారు. మా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాటిల్లో ఒకటైన సూపర్ ఫ్యాక్స్‌ను (పీఏసీను) కూడా నడిపారు'' అని రాశారు.
'' ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దక్షిణ, మధ్య ఆసియాలో నాకు పూర్తిగా నమ్మగలిగిన వ్యక్తి కావాలి. 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే నా అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఆ వ్యక్తి సాయం చేయాలి. సెర్జియో అద్భుతమైన రాయబారి కానున్నారు. కంగ్రాచ్యులేషన్స్, సెర్జియో!'' అని ట్రంప్ అన్నారు.
'' భారత్‌లో తదుపరి అమెరికా రాయబారిగా, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారిగా నన్ను నామినేట్ చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ నాపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞుడను అయి ఉంటాను! అమెరికాకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోనే అత్యంత గర్వకారణం'' అని సెర్జియో గోర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సెర్జియో గోర్ చుట్టూ వివాదాలు
సెర్జియో గోర్ పనితీరుపై వివాదాలున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్.. ట్రంప్ మధ్య వివాదంలో గోర్ పాత్ర కూడా ఉందని చెబుతున్నారు.
సెర్జియో గోర్‌ను మస్క్ 'స్నేక్' అని అన్నారు.
అమెరికాలో చాలామంది సెర్జియో గోర్‌ను ట్రంప్‌కు కుడి భుజంగా చెబుతుంటారు.
గోర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారన్న విమర్శలున్నాయి.
''మస్క్ ప్రాణ స్నేహితుడు, వ్యాపారవేత్త జారెడ్ ఐజాక్‌మన్ డెమొక్రాట్లకు డబ్బులు ఇచ్చినట్లు ట్రంప్‌కు గోర్ తెలియజేశారు'' అని అమెరికా వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ రాసింది.

ఫొటో సోర్స్, TRUTH SOCIAL
మస్క్ ప్రతిపాదన మేరకు, 2024 చివరిలో నాసా అధినేతగా ఆయన్ను నియమించేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఈ విషయం తెలిసిన తర్వాత, సెనేట్ నుంచి ఐజాక్‌మన్ నామినేషన్‌ను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు.
2024లో జరిగిన సమావేశంలో ఐజాక్‌మన్ స్వయంగా ట్రంప్‌కు ఈ విరాళం గురించి తెలియజేసినప్పటికీ, దాని గురించి తాను మొదటిసారి తెలుసుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు గోర్ నియామకం ఎందుకంత ఇంపార్టెంట్?
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం రద్దయిన సమయంలో భారత్‌లో అమెరికా రాయబారిగా గోర్ నియామకంపై ప్రకటన చేశారు ట్రంప్.
భారత్‌పై డోనల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. ఈ సుంకాల విధింపు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది.
గోర్ నియామకాన్ని ఎంత వేగంగా సెనేట్ ఆమోదిస్తుందో చూడాల్సి ఉంది.
వీలైనంత త్వరగా అమెరికా రాయబారిని ఇక్కడ నియమించాలని భారతదేశం కూడా కోరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జనవరిలో ఎరిక్ గార్సెట్టి భారత్‌ను విడిచి వెళ్లినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.
కొత్త అమెరికా రాయబారిగా ఈ ఉద్యోగం కొంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌ను నిత్యం అమెరికా అడ్మినిస్ట్రేషన్ లక్ష్యంగా చేసుకుంది.
''భారత్‌లో తమ తదుపరి రాయబారిగా గోర్‌ను నామినేట్ చేసే అధ్యక్షుడి నిర్ణయం నాకు థ్రిల్లింగ్‌గా ఉంది. ఆయన అద్భుతమైన ప్రతినిధిగా ఉంటారు'' అని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రుబియో చెప్పారు.
''భారత్‌లో అమెరికా రాయబారిగా గోర్ నియామకాన్ని సెనేట్ ఆమోదిస్తే, ఆయన ప్రత్యేక రాయబారి పాత్ర కూడా పోషిస్తే.. భారత్-పాకిస్తాన్ 'హైఫెనేషన్' (రెండింటినీ ఒకే రకంగా చూసే విధానం) తిరిగి వస్తుందని భావిస్తున్నా'' అని దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు మైఖెల్ కుగ్మాన్ చెప్పారు.
కాగా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు ప్రత్యేక రాయబారిగా అమెరికా అంబాసిడర్‌ను నియమించడం కొత్త విషయం.

ఫొటో సోర్స్, Getty Images
సెర్జియో గోర్ ఎవరు?
సెర్జియో గోర్‌కు 39 ఏళ్లు. భారత్‌లో పిన్న వయస్కుడైన అమెరికా రాయబారి ఈయనే.
గోర్ ఇంటిపేరు గోరోకోవ్స్కి. ఈయన అప్పటి సోవియట్ యూనియన్‌లోని ఉజ్బెకిస్తాన్‌లో 1986లో పుట్టారు.
1999లో ఆయన కుటుంబం అమెరికాకు వెళ్లింది. ఆ సమయంలో గోర్ వయసు కేవలం 12 ఏళ్లే.
తండ్రి యూరీ గోరోకోవ్స్కి ఏవియేషన్ ఇంజనీర్. సోవియట్ ఆర్మీ కోసం విమానాలను డిజైన్ చేసేవారు. గోర్ తల్లి ఇజ్రాయెల్ సంతతికి చెందినవారు.
లాస్ ఏంజెలెస్ శివారులో గోర్ పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత వాషింగ్టన్ డీసీలో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో తదుపరి విద్యను కొనసాగించారు.
రిపబ్లికన్ సెనేటర్, అధ్యక్ష అభ్యర్థి జాన్ మెక్‌కైన్ 2008 ప్రచార కార్యక్రమంలో గోర్ కీలక పాత్ర పోషించారు. ఆయన అప్పుడు డెమొక్రాటిక్ అభ్యర్థి బరాక్ ఒబామాపై పోటీ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకుముందు రాయబారి నియామకం వివాదాస్పదం
2023లో లాస్ ఏంజెలెస్ మాజీ మేయర్ ఎరిక్ గార్సెట్టిని భారత్‌లో అమెరికా రాయబారిగా నియమించింది. 2021 జులైలో బైడెన్ ప్రభుత్వం ఈయన్ను నామినేట్ చేసింది.
కానీ, గార్సెట్టి నియామకం వివాదాస్పదంగా నిలిచింది. ఆయన మేయర్‌గా కొనసాగే సమయంలో తన సన్నిహిత వ్యక్తిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో, గార్సెట్టి నియామకాన్ని కొంతకాలం నిలిపివేశారు.
గార్సెట్టి ఈ ఆరోపణలను కొట్టేశారు.
కానీ, చివరకు సెనేట్ ఆయన నియామకాన్ని ఆమోదించింది.
ఈయన నియామకాన్ని కొంతమంది డెమొక్రాట్లు వ్యతిరేకించి, ఆయనకు వ్యతిరేకంగా ఓటు కూడా వేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














