యుక్రెయిన్‌పై వాషింగ్టన్‌లో ఏం చర్చించారు? ట్రంప్, జెలియెన్‌స్కీ భేటీ ఎలా సాగింది?

డోనల్డ్ ట్రంప్, జెలియెన్‌స్కీ, యుక్రెయిన్, రష్యా, యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, మేక్రాన్
    • రచయిత, బెర్న్డ్ డెబుస్మాన్ జూనియర్, లారా గోజీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

యుక్రెయిన్‌లో యుద్ధం ముగించే విషయం చర్చించేందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అమెరికా ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు వాషింగ్టన్ వెళ్లారు.

అంతకుముందు అలాస్కాలో జరిగిన ట్రంప్, పుతిన్ సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందమేదీ లేకపోవడంతో యూరోపియన్ దేశాల నాయకులు కూడా తమ ప్లాన్ మార్చుకుని వాషింగ్టన్ చేరుకున్నారు.

సోమవారం సాయంత్రం వరకు జరిగిన చర్చల్లో భద్రత పరమైన హామీలు, శాంతి ఒప్పందం దిశగా కచ్చితమైన అడుగులు పడలేదు.

పుతిన్, జెలియెన్‌స్కీ మధ్య చర్చల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడికి చెప్పినట్లు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వారిద్దరు ఎక్కడ సమావేశమవుతారో తేలిన తర్వాత, అక్కడే వారిద్దరితో తాను కూడా చర్చల్లో పాల్గొంటానని ట్రంప్ చెప్పారు.

సోమవారం పుతిన్‌తో డోనల్డ్ ట్రంప్ 40 నిముషాలు మాట్లాడారని పుతిన్ సలహాదారు వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్, జెలియెన్‌స్కీ, యుక్రెయిన్, రష్యా, యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, మేక్రాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాల్పుల విరమణ ప్రతిపాదనపై యూరోపియన్ దేశాధినేతలు పట్టుపడుతున్నారు.

వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో యూరోపియన్ దేశాధినేతలు ట్రంప్‌తో భేటీ కావడానికి ముందు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, డోనల్డ్ ట్రంప్ మధ్య సంభాషణ బయటకు వచ్చింది.

"ఆయన ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు. నా కోసం ఆయన ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు" అని ట్రంప్ మేక్రాన్‌తో చెప్పారు. ఇందులో ట్రంప్ పుతిన్‌ను ఉద్దేశించి మాట్లాడినట్లు భావిస్తున్నారు.

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర తర్వాత మొదటి సారి ఇద్దరు బద్ద శత్రువుల్ని చర్చల కోసం ఎదురెదురుగా కూర్చోబెట్టడం ఎలా ఉంటుందో చూడాలి.

పుతిన్‌తో సమావేశం కావడం వల్ల యుద్ధం ముగుస్తుందనే గ్యారంటీ ఏమీ లేనప్పటికీ, రష్యా అధ్యక్షుడిని కలవాలని జెలియెన్‌స్కీ కొన్ని నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు.

పుతిన్‌తో సమావేశం వల్ల శాంతి కుదరకపోతే శాంతి ఒప్పందం విషయంలో రష్యాకు చిత్తశుద్ధి లేదని నిరూపించాలని జెలియెన్‌స్కీ భావిస్తున్నారు. తనతో సమావేశం విషయంలో పుతిన్‌కు ఆసక్తి లేదని జెలియెన్‌స్కీ నమ్ముతున్నారు.

పుతిన్, జెలియెన్‌స్కీ సమావేశాన్ని మాస్కో పదేపదే తిరస్కరిస్తోంది.

డోనల్డ్ ట్రంప్, జెలియెన్‌స్కీ, యుక్రెయిన్, రష్యా, యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, మేక్రాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌తో పాటు యురోపియన్ దేశాల భద్రతకు అమెరికా హామీ ఇవ్వాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు కోరుతున్నారు.

కాల్పుల విరమణకు ఈయూ పట్టు

యుక్రెయిన్‌లో యుద్ధం ముగించడానికి ముందు కాల్పుల విరమణ అవసరాన్ని ట్రంప్ తోసిపుసినట్లు కనిపిస్తోంది.

కాల్పుల విరమణ గతంలో యుక్రెయిన్ ప్రధాన డిమాండ్‌గా ఉండేది. అయితే రష్యాతో చర్చలు, దీర్ఘకాలిక పరిష్కారంతో యుద్ధం ముగించడం యుక్రెయిన్ ఇప్పుడు కీలకంగా భావిస్తోంది.

పూర్తి శాంతి ఒప్పందం సాధించాలంటే అనేక విడతలుగా చర్చలు జరగాల్సి ఉంటుంది. అప్పటి వరకు రష్యా యుక్రెయిన్ మీద దాడులు చేస్తూనే ఉంటుంది. అందుకే పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కంటే కాల్పుల విరమణ ఒప్పందం తక్షణ పరిష్కారంగా కనిపిస్తోంది.

యూరోపియన్ దేశాల నేతలు కాల్పుల విరమణ కోసం పట్టు పడుతున్నారు.

జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కాల్పుల విరమణపై గట్టిగా ఉన్నారు.

"కాల్పుల విరమణ లేకుండా తర్వాతి సమావేశం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. అందుకే ముందు దాని గురించి ఆలోచించి రష్యాపై ఒత్తిడి తెద్దాం" అని ఆయన చెప్పారు.

డోనల్డ్ ట్రంప్, జెలియెన్‌స్కీ, యుక్రెయిన్, రష్యా, యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, మేక్రాన్

ఫొటో సోర్స్, EPA

యుక్రెయిన్ భద్రతకు ట్రంప్ హామీలు

యుద్ధాన్ని ముగించే ఏ ఒప్పందంలోనైనా యుక్రెయిన్ భద్రతకు హామీ ఇవ్వడానికి అమెరికా సాయం చేస్తుందని ట్రంప్ జెలియెన్‌స్కీకి చెప్పారు. అయితే అది ఏ మేరకు అన్నది మాత్రం స్పష్టం చేయలేదు.

యుక్రెయిన్‌కు భద్రత హమీలో భాగంగా అక్కడ అమెరికన్ సైన్యం ఉంటుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నపై ఆయన స్పందించలేదు.

యుక్రెయిన్ భద్రతలో యూరప్ ముందు ఉంటుందని, అయితే అందులో తాము కూడా ఉంటామని ట్రంప్ చెప్పారు.

ఒక దశలో "మేం వారికి మంచి భద్రత కల్పిస్తాం" అని అన్నారు.

రష్యాతో ఏ ఒప్పందం కుదిరినా అత్యంత కీలకమైన భద్రత హామీ విషయంలో ట్రంప్ ఇప్పటి వరకు చేసిన అత్యంత నిర్ణయాత్మక ప్రకటన ఇది.

అలాస్కాలో జరిగిన సమావేశంలో యుక్రెయిన్‌కు భద్రత హామీ గురించి పుతిన్‌కు ట్రంప్ వివరించారు.

భద్రత హామీలో భాగంగా అమెరికా యుక్రెయిన్ మధ్య 90 బిలియన్ డాలర్ల ఆయుధాల ఒప్పందం కుదిరిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ చెప్పారు.

ఇందులో భాగంగా యుక్రెయిన్‌కు ఇప్పటి వరకు ఇవ్వని అమెరికన్ గగనతల వ్యవస్థ, యాంటీ మిసైల్ సిస్టమ్స్, ఇంకా వెల్లడించని ఇతర ఆయుధాలు అందిస్తారని యుక్రెయిన్ అధ్యక్షుడు చెప్పారు.

అమెరికా యుక్రెయిన్ నుంచి డ్రోన్లు కొనుగోలు చేస్తుందని, దీని వల్ల స్థానికంగా తాము తయారు చేస్తున్న మానవ రహిత విమాన నిర్మాణానికి అవసరమైన నిధులు అందుతాయని జెలియెన్‌స్కీ చెప్పారు.

డోనల్డ్ ట్రంప్, జెలియెన్‌స్కీ, యుక్రెయిన్, రష్యా, యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, మేక్రాన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ అధ్యక్షుడు తాను తరచూ ధరించే సైనిక దుస్తులకు భిన్నంగా సూట్ ధరించి వచ్చారు.

'స్టైల్' మార్చిన జెలియెన్‌స్కీ

ఈ ఏడాది ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌కు వచ్చినప్పుడు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని యుక్రెయిన్ అధ్యక్షుడు తన డ్రెస్సింగ్ స్టైల్, సంభాషణ తీరు మార్చారు.

సమావేశం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ఆయన 6 సార్లు ధన్యవాదాలు చెప్పారు.

గత పర్యటనలో యుక్రెయిన్‌కు అమెరికా మద్దతు ఇచ్చినందుకు జెలియెన్‌స్కీ తమకు కృతజ్ఞతలు చెప్పకపోవడంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ జెలియెన్ స్కీతో వాదనకు దిగారు.

ఈసారి అమెరికా పర్యటనలో ఎప్పటిలా సంప్రదాయ సైనిక దుస్తులు కాకుండా, జెలియన్‌స్కీ ముదురు రంగు సూట్ ధరించారు.

జెలియెన్‌స్కీ డ్రస్‌పై స్పందించిన ట్రంప్ "ఈ రోజు చాలా అందంగా దుస్తులు ధరించారు" అంటూ సెటైర్ వేశారు.

ఈ పర్యటనలో జెలియెన్‌స్కీ కుటుంబ సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేశారు.

యుక్రెయిన్ ప్రథమ మహిళ రాసిన లేఖను ట్రంప్‌కు ఇచ్చి, ఆ లేఖను మెలానియాకు ఇవ్వాలని సూచించారు.

"ఇది మీకు కాదు. మీ భార్యకు" అని ఆయన ట్రంప్‌తో చెప్పారు.

యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను యురోపియన్ దేశాధినేతలు ప్రశంసించారు.

"మీ నాయకత్వానికి నిజంగానే ధన్యవాదాలు చెప్పాలి" అని నేటో చీఫ్ మార్క్ రూటే అన్నారు.

గతంలో శాంతి ఒప్పందం దిశగా రష్యా నుంచి ఎలాంటి స్పందన లేదని అయితే "పరిస్థితి కొంత మారిందని" అందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలపాలని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలొనీ అన్నారు.

యూరోపియన్ దేశాధినేతలు ప్రస్తుత పరిణామాలను స్వాగతిస్తున్నప్పటికీ భవిష్యత్‌లో రష్యా తమపైనా దాడి చేసే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

"భద్రత హామీల గురించి మాట్లాడేటప్పుడు యూరప్ ఖండం భద్రత గురించి కూడా మాట్లాడాలి" అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)