ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌: ఇజ్రాయెల్ అధ్యక్ష పదవిని చేపట్టాలని కోరినప్పుడు ఏమన్నారు?

ఐన్ స్టీన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫెలిపే వ్యాన్ డార్సెన్
    • హోదా, బీబీసీ న్యూస్ బ్రెజిల్

రష్యాలో జన్మించిన బ్రిటీష్ వ్యక్తి చైమ్ వీజ్‌మాన్ (1874-1952). ఈయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న బయోకెమిస్ట్.

1910లో మిలిటరీలో వాడిన అసిటోన్‌ అనే రసాయనాన్ని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు ఆయన ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయి.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యూకే ఉపయోగించిన కార్‌డైట్ అనే పేలుడు పదార్థం తయారీకి దీన్ని ఎక్కువగా వాడారు.

వీజ్‌మాన్ రాజకీయ ప్రయాణంలో కూడా విశేషం ఉంది.

జియోనిజంలో బాగా పేరున్న నేతలలో ఈయన ఒకరు. జియోనిజమనేది 19వ శతాబ్దం చివరిలో ఆవిర్భవించిన జాతీయ ఉద్యమం. పాలస్తీనాలో యూదులకు రాజ్యం కావాలని ఈ ఉద్యమం పిలుపునిచ్చింది.

1947లో హోలోకాస్ట్ భయానక సంఘటనల తర్వాత బ్రిటీష్ పాలనలో ఉన్న పాలస్తీనాను రెండు దేశాలుగా విభజించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంగీకరించింది.

ఒకటి యూదుల కోసం, మరొకటి అరబ్‌ల కోసమని తెలిపింది.

140కి పైగా దేశాలు దీనిని ఒక దేశంగా అంగీకరించినప్పటికీ, నేటికి కూడా పాలస్తీనా ఏర్పాటు కాలేదు.

పాలస్తీనాను దేశంగా గుర్తించే దేశాల సంఖ్య పెరుగుతోంది.

పాలస్తీనాను ఒక దేశంగా సెప్టెంబర్‌లో జరగబోయే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో గుర్తిస్తామని ఇటీవలే కొన్ని దేశాలు ప్రకటించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1948లో స్వాతంత్య్రం పొందిన కొత్త దేశం ఇజ్రాయెల్‌కు వీజ్‌మాన్ తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

జియోనిజం ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసినందుకు ఆయనకు ఇజ్రాయెల్ అధ్యక్ష పదవి లభించింది.

అయితే, కార్యనిర్వాహక పదవికంటే ఇది ఎక్కువ కాదు. పెద్దగా అధికారాలు ఉండవు.

ఎందుకంటే, ఇజ్రాయెల్ పార్లమెంటరీ రిపబ్లిక్. అక్కడ ప్రభుత్వానికి ప్రధానమంత్రే అధినేతగా ఉంటారు.

1952లో 77 ఏళ్ల వయసులో వీజ్‌మాన్ కన్నుమూశారు. అప్పుడు ఇజ్రాయెల్‌కు కొత్త అధ్యక్షుడు కావాల్సి వచ్చింది.

ఆ పదవిని చేపట్టగలిగే కొందరు ప్రముఖ యూదుల పేర్లను విదేశాంగ శాఖ ప్రతిపాదించింది.

కొత్తగా ఏర్పడిన తమ దేశానికి రావాలని వారికి ఇమ్మిగ్రేషన్‌ను కూడా ఆఫర్ చేసింది.

ప్రధానమంత్రి డేవిడ్ బెన్-గురియన్ ప్రభుత్వం మళ్లీ ఆ పదవిలో ఒక శాస్త్రవేత్తనే నియమించాలని నిర్ణయించింది.

వెంటనే ఆయన అప్పటికి అత్యంత ప్రముఖ శాస్త్రవేత్తగా పేరున్న వ్యక్తి పై ఫోకస్ చేశారు.

వీజ్‌మాన్ (ఎడమవైపు), ఐన్‌స్టీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వీజ్‌మాన్ (ఎడమవైపు), ఐన్‌స్టీన్.. ఇద్దరూ శాస్త్రవేత్తలు, జియోనిస్టులు

‘సంతోషం, విచారం’

అమెరికాకు ఇజ్రాయెల్ అంబాసిడర్‌గా పనిచేసే అబ్బా ఎబన్ వెంటనే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను సంప్రదించారు.

అడాల్ఫ్ హిట్లర్ పదవిలోకి వచ్చి, జర్మనీలో యూదులను హింసించడం ప్రారంభించినప్పటి నుంచి అంటే 1933 నుంచి ఈ జర్మన్ శాస్త్రవేత్త అమెరికాలో నివసిస్తున్నారు.

బెన్ గురియన్ తరఫున ఐన్‌స్టీన్‌కు ఎబన్ లేఖ రాశారు.

''భౌతిక పరిమాణాల పరంగా చూస్తే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. కానీ, ఎంతో ఉన్నత స్థాయిని సాధించగలదు. ఎందుకంటే, యూదులు ప్రాచీనకాలంతోపాటు ఆధునిక కాలంలో కూడా తమ హృదయాలతో, మనసులతో ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక, మేధో సంప్రదాయాలను సృష్టించారు'' అని అన్నారు.

తన సైంటిఫిక్ కెరీర్‌ను ఐన్‌స్టీన్ వదులుకోవాల్సిన అవసరం లేదని కూడా అబ్బా ఎబన్ భరోసా ఇచ్చారు..

కానీ, న్యూజెర్సీ నుంచి ఇజ్రాయెల్ రావాల్సి ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో ఐన్‌స్టీన్ ప్రిన్స్‌టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీలో పనిచేస్తూ..అక్కడే నివసిస్తుండే వారు.

అప్పుడు, ఐన్‌స్టీన్‌కు 73 ఏళ్లు.

ఇజ్రాయెల్ అంబాసిడర్ అభ్యర్థనకు ఆయన చాలా మర్యాదగా స్పందించారు.

తనకు ఆ ఆఫర్‌ను ఇచ్చినందుకు సంతోషించిన ఆయన, తాను ఆ సాహసం చేసేందుకు మాత్రం ఇష్టపడలేదు.

ఐన్‌స్టీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌తో లోతైన సంబంధాన్ని కలిగి ఉన్న ఐన్‌స్టీన్

ఆ పదవిని నిర్వహించగల స్కిల్స్ తన దగ్గర లేవని ఐన్‌స్టీన్ చెప్పినట్లు, ఐన్‌స్టీన్ స్క్రాప్‌బుక్ పుస్తకంలో ఈ విషయాలు ఉన్నట్లు జెరూసలెంలోని హిబ్రూ యూనివర్సిటీలో ఐన్‌స్టీన్ ఆర్కైవ్స్ క్యూరెటర్‌ జీవ్ రోసెన్‌క్రాంజ్ తెలిపారు.

ఐన్ స్టీన్

ఫొటో సోర్స్, Getty Images

''నా జీవితమంతా నిష్పాక్షిక అంశాల చుట్టూ నడిచింది. ప్రజలతో ఎలా మెలగాలి, అధికారిక బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో నాకు సరైన అనుభవం, సహజంగా లభించిన అవగాహన లేదు'' అని తెలిపారు.

కేవలం ఈ కారణాల వల్ల, తాను ఈ పదవిని చేపట్టేందుకు సరిపోనని అనిపించిందని అన్నారు.

‘‘ఈ పరిస్థితులతో నేను చాలా బాధపడ్డాను. యూదు ప్రజలతో నా సంబంధం ప్రపంచ దేశాలలో మన అనిశ్చిత పరిస్థితి గురించి పూర్తిగా తెలిసినప్పటినుంచి చాలా బలమైన మానవ సంబంధంగా మారింది" అని తెలిపారు.

అయితే, ఐన్‌స్టీన్ ఆ పదవిని తిరస్కరించడంతో బెన్-గురియన్ ఉపశమనం పొందారని పలు పుస్తకాలకు రచయితగా వ్యవహరించిన అలీస్ కలాప్రైస్ చెప్పారు.

''తన మనసాక్షికి విరుద్ధంగా ఉండే విధానాల గురించి కుండబద్దలు కొట్టినట్లు ఐన్‌స్టీన్ మాట్లాడే తత్వం భయాన్ని కలిగించింది'' అని ‘యాన్ ఐన్‌స్టీన్ ఎన్‌సైక్లోపీడియా’లో ఆయన రాశారు.

ప్రధానమంత్రి తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇట్సాక్ నవోన్‌తో రహస్యంగా ఈ విషయం చెప్పినట్లు వాటిల్లో ఉంది.

‘‘ఆయన యెస్ చెబితే ఏం చేయాలి చెప్పు’’ అని అన్నట్లు చెప్పారు.

ఇట్సాక్ నవోన్ 1978 నుంచి 1983 మధ్యలో ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా పనిచేశారు.

డేవిడ్ బెన్ గురియన్ (కుడివైపు), ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (ఎడమవైపు)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డేవిడ్ బెన్ గురియన్ (కుడివైపు), ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (ఎడమవైపు)

ఐన్‌స్టీన్, ఇజ్రాయెల్

ఐన్‌స్టీన్ ఈ పదవిని అంగీకరించకపోవడానికి కారణం ఇజ్రాయెల్ రాజకీయ విధానానికి ఐన్‌స్టీన్ వ్యతిరేకమని కాదు.

''ఐన్‌స్టీన్ జియోనిస్ట్ ఉద్యమంలో సభ్యుడు. పాలస్తీనాలో అరబ్‌లకు, యూదులకు జాతీయ హక్కులతో టూ నేషన్ స్టేట్‌ను ఏర్పాటు చేయాలని ఉద్యమించిన జియోనిజానికి ప్రాతినిధ్యం వహించిన వీజ్‌మాన్‌తో 1921 నుంచి ఆయన సన్నిహితంగా ఉన్నారు'' అని జియోనిజం విషయాలపైనా, ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభంపైనా పరిశోధనలు చేసే రీసర్చర్, ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డీ జెనీరో (యూఎఫ్ఆర్జే) ప్రొఫెసర్ మైఖెల్ ఘెర్మాన్ వివరించారు.

ఐన్‌స్టీన్ ఉత్తరప్రత్యుత్తరాలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దేశానికి తొలి ప్రధాని అయిన జవహార్‌లాల్ నెహ్రూకు ఐన్‌స్టీన్ లేఖ రాశారు.

ఆ లేఖలో భారత్ సాధించిన ఈ విజయానికి నెహ్రూకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన ఐన్‌స్టీన్.. ‘‘నేను జియోనిస్ట్ భావాజాలాన్ని స్వీకరించాను. ఎందుకంటే, తప్పును సరిదిద్దేందుకు ఇదే సరైన మార్గంగా నాకనిపించింది'' అని పేర్కొన్నారు.

ఆ తర్వాత ఏడాది ఇజ్రాయెల్‌ ఏర్పడింది. జియోనిస్టులు దశాబ్ద కాలంగా పోరాటం చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఏర్పడటంపై ఆయన సంతృప్తి చెంది ఉండొచ్చు.

అయితే, 1948 చివరిలో ఆయన, ఇతర యూదుల మేధావులు కలిసి న్యూయార్క్ టైమ్స్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో మెనాచెమ్ బెగిన్ అమెరికా దేశ పర్యటనను గట్టిగా విమర్శించారు.

ఇజ్రాయెల్ ఏర్పడటానికి ముందు పాలస్తీనియన్లపై, బ్రిటీష్ వారిపై టెర్రరిస్ట్ అటాక్‌లు జరిపిన జియోనిస్ట్ పారామిలిటరీ ఆర్గనైజేషన్ ‘ఇర్గున్‌’కు బెగిన్ లీడర్.

ఆ ఏడాది జెరూసలెంకు దగ్గర్లోని డెయిర్ యాసిన్ గ్రామంలో ఇర్గున్ మారణహోమానికి పాల్పడింది.

మహిళలు, పిల్లలు, పురుషులతో కలుపుకుని వందమందికి పైగా పాలస్తీనియన్లను చంపేసింది.

ఆ తర్వాత కొద్దికాలానికే ఈ సంస్థ హెరూట్ (హిబ్రూలో స్వాతంత్య్రం) అనే పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసింది.

2024లో హమాస్‌కు వ్యతిరేకంగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ పాల్పడుతున్న చర్యలను బ్రెజీలియన్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా అప్పటి హోలోకాస్ట్‌తో (మారణహోమంతో) పోల్చినప్పుడు, న్యూయార్క్ టైమ్స్‌కు రాసిన ఈ లేఖ బయటపడింది.

బ్రెజిల్‌ సోషల్ మీడియా అకౌంట్లలో లెఫ్ట్ వింగ్ ప్రొఫైల్స్‌లో ఈ లేఖ కనిపించింది.

ఈ లేఖను వాడుకుంటూ, ఇజ్రాయెల్‌ భావనకు ఐన్‌స్టీన్ వ్యతిరేకమనే వాదనలు కూడా వినిపించాయి.

‘‘జియోనిజానికి, ఇజ్రాయెల్ దేశానికి విమర్శకుడుగా, మద్దతుదారుడుగా రెండు రకాలుగా ఐన్‌స్టీన్‌ను చిత్రీకరించారు. ఎందుకంటే, ఎవరికివారు సొంత ప్రయోజనాల కోసం ఆయనను వాడుకున్నారు'' అని ‘ఐన్‌స్టీన్ అండ్ ట్వంటీయత్ సెంచురీ పాలిటిక్స్ - ఏ సాల్యుటరీ మోరల్ ఇన్‌ఫ్లూయెన్స్’ అనే పుస్తకంలో బ్రిటీష్ చరిత్రకారుడు రిచర్డ్ క్రాకాట్ చెప్పారు.

1952లో దేశ అధ్యక్షుడి పదవి చేపట్టాలని ఐన్‌స్టీన్‌కు ఆహ్వానం అందింది.

ఐన్‌స్టీన్ చిత్రంతో ఉన్న నోటు

ఫొటో సోర్స్, Getty Images

దేశద్రోహిగా ముద్ర

ఇజ్రాయెల్ అధ్యక్ష పదవికి అధికారం విషయంలో పెద్దగా ప్రాధాన్యం లేకపోయినప్పటికీ, రాజకీయంగా ప్రాధాన్యముందని చరిత్రకారుడు మైఖెల్ ఘెర్మాన్ చెప్పారు.

‘‘ కేవలం యూదుడు కావడం వల్లనే ఐన్‌స్టీన్‌ను ఆహ్వానించారని అనుకోవడానికి వీలులేదు. ఆయనకు జియోనిస్ట్ ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఏర్పాటుకు ఆయన గట్టి మద్దతుదారు'' అని ఘెర్మాన్ రాశారు.

మరికొందరు యూదు ప్రముఖులు కూడా ఉన్నారని, దేశం పేరు ప్రతిష్టలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో వారిని కూడా ఈ పదవిని చేపట్టాలని ఆహ్వానించినట్లు తెలిపారు.

ఉదాహరణకు..రచయిత ఆర్మోస్ ఓజ్ రాజకీయాల్లోకి రావాల్సిందని మాజీ ప్రధానమంత్రి షిమోన్ పెరెజ్ 1990ల ప్రారంభంలో పలు ఇంటర్వ్యూలో చెప్పారు.

1952లో ఐన్‌స్టీన్‌తో అనుబంధం ఉన్న బ్రిట్ షాలోమ్‌ అనే గ్రూప్‌కు మైనార్టీ ఒపీనియన్ ఉండేది. కానీ, వారెప్పుడూ ఒంటరి కాలేదని ఘెర్మాన్ వివరించారు.

ఈ గ్రూప్‌లోని సభ్యులకు అంతర్జాతీయంగా మంచి గౌరవ మర్యాదలు ఉండేవి. మేధావులుగా పేరుండేది. వారిలో కొందరు ఫిలాసఫర్లు హెన్నా ఆరెండ్, మార్జిన్ బుబర్, గెర్షోమ్ స్కోలెం వంటివారున్నారు.

బ్రిట్ షాలోమ్ సభ్యులే జెరూసలెంలో హిబ్రూ యూనివర్సిటీని కూడా నిర్మించారు.

కానీ, నేడు ఈ గ్రూప్ సభ్యులను ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి దేశద్రోహులుగా చూస్తున్నారని ఘెర్మాన్ చెప్పారు.

టూ నేషన్ థియరీ ఒక పరిష్కారం కోసం వాదిస్తోన్న వారి అభిప్రాయాలకు ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు, తన పాలనలో ఎలాంటి చోటు లేకుండా చేస్తున్నారు.

ఐన్‌స్టీన్ అధ్యక్ష పదవిని తిరస్కరించిన తర్వాత, ఆ ఏడాదే ఇజ్రాయెల్‌కు చరిత్రకారుడు ఇత్సాక్ బెన్-జ్వి అధ్యక్షుడయ్యారు.

అమెరికాను సందర్శించిన రాజకీయనేత, సైంటిస్ట్ చేత తీవ్ర విమర్శలు పాలైన వ్యక్తి మెనాచెమ్ బెగిన్ ఆ తర్వాత ఇజ్రాయెల్‌లో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు.

ఆ తర్వాత దశాబ్దాల్లో లేబర్ పార్టీ పదవిలో ఉన్నప్పుడు ప్రధాన ఇజ్రాయెల్ కన్జర్వేటివ్ పార్టీగా హెరూట్ మారింది. 1977లో బెగిన్ ప్రధానమంత్రి అయ్యారు. 1983 వరకు ఆ పదవిలో ఉన్నారు.

ఆ తర్వాత ఐదేళ్లకు, మరో రైట్ వింగ్ పార్టీ లికుడ్‌ను హెరూట్ విలీనం చేసుకుంది.

2006 నుంచి దాని నేత నెతాన్యాహు దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. తన మూడు పదవీకాలాలను కలుపుకుని, ఆయన ఈ పదవిలో ఉండబట్టి సుమారు 18 ఏళ్లు అయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)