మోదీ, జిన్‌పింగ్ భేటీ భారత్, చైనా సంబంధాలను కొత్త దారి పట్టిస్తుందా?

నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2017లో చివరిసారిగా సమావేశమయ్యారు.
    • రచయిత, సురంజన తివారి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల భారం అమల్లోకి వచ్చిన కొన్ని గంటల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోదీ చైనాలో అడుగు పెట్టారు.

ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వజ్రాలు, రొయ్యలు వంటి వాటిపై 50శాతం సుంకం చెల్లించాల్సి ఉంది.

రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌కు ఈ శిక్ష విధించినట్లు ట్రంప్ చెబుతున్నారు.

భారత ఎగుమతుల లక్ష్యాలపై ట్రంప్ సుంకాలు బలమైన శాశ్వత గాయాలను మిగిల్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్థిక రంగాన్ని గట్టెక్కించేందుకు చైనా అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలకు ట్రంప్ సుంకాల వల్ల ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాల నాయకులు తమ మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు.

అయితే గతంలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాల్లో అపనమ్మకం, సరిహద్దు వివాదాలు కీలకంగా ఉన్నాయి.

narendra modi, jinping

ఫొటో సోర్స్, Narendra Modi/YT

"సింపుల్‌గా చెప్పాలంటే, ఈ రెండు దేశాల సంబంధాల్లో ఏం జరుగుతుందనేది ప్రపంచ దేశాలకు ఆసక్తికరం" అని చాథమ్ హౌస్‌కు చెందిన చియెటీగ్జ్ బాజపేయీ ఒక సంపాదకీయంలో రాశారు.

"అమెరికా, పశ్చిమ దేశాలు భావిస్తున్నట్లు చైనాకు వ్యతిరేకంగా భారత్ ఎన్నటికీ ఒక రక్షణ కవచంగా ఉండదు. మోదీ పర్యటన కీలక మలుపును సూచిస్తుంది" అని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

భారత్, చైనా, అమెరికా, డోనల్డ్ ట్రంప్, సుంకాలు, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్

ఫొటో సోర్స్, Xu Feihong/Twitter

ఫొటో క్యాప్షన్, భారత దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ చెప్పారు.

రెండు దేశాల మధ్య బలమైన సంబంధం అంటే ఏంటి?

భారత్, చైనా ప్రపంచ ఆర్థిక శక్తులు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనా రెండో స్థానంలో, భారత్ ఐదో స్థానంలో ఉన్నాయి.

అయితే భారత్‌ సాధిస్తున్న 6 శాతం వృద్ధి రేటు, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 5 ట్రిలియన్ డాలర్ల స్టాక్ మార్కెట్ లాంటి అంశాలు భారత్ 2028కల్లా ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

"ప్రపంచం మొత్తం ప్రపంచంలో అతి పెద్ద రెండు ఆర్థిక వ్యవస్థలైన అమెరికా చైనా ఎలా కలిసి పని చేస్తాయా అని చూస్తున్నప్పుడు.. రెండు, మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిసి ఎలా పని చేస్తాయా అని చూడాల్సిన సమయం వచ్చింది" అని బీజింగ్‌లోని ఉసావా అడ్వైజరీ వ్యవస్థాపకుడు కియాన్ లియు అన్నారు.

అయితే ఈ రెండు దేశాల సంబంధాల్లో అనేక సవాళ్లు ఉన్నాయి.

2020 జూన్‌లో గాల్వాన్ లోయలో హింసాత్మక సంఘర్షణ, రెండు దేశాల సంబంధాలను గతంలో ఎన్నడూ లేనంత క్షీణ దశకు చేర్చింది.

ఇది ఆర్థిక సంబంధాల మీదనే ఎక్కువ ప్రభావం చూపింది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల రాకపోకల్ని నిలిపివేయడం, వీసాలు, పెట్టుబడులు ఆపేయడంతో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం మందగించింది. టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 200కి పైగా యాప్‌లను భారత్ నిషేధించింది.

భారత్, చైనా, అమెరికా, డోనల్డ్ ట్రంప్, సుంకాలు, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు చనిపోయారు.

భారత్ స్థానం మారింది

పశ్చిమ దేశాల ఆలోచనలకు భిన్నమైన ప్రపంచ దృష్టి కోణాన్ని ప్రదర్శిస్తోన్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌ సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనా వెళ్లారు. ఇందులో భారత్‌తో పాటు చైనా, పాకిస్తాన్, ఇరాన్, రష్యా సభ్య దేశాలు.

గతంలో భారత్ ఈ సంస్థ ప్రాధాన్యాన్ని తక్కువగా అంచనా వేసింది.

ఈ సంస్థ కొన్నేళ్ల వరకు గుర్తించదగిన ఫలితాలేవీ సాధించలేదని విమర్శకులు చెబుతున్నారు.

2025 జూన్‌లో జరిగిన ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ప్రకటనలో పహల్గాంలో తీవ్రవాదుల దాడిపై ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

అయితే దిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలు క్షీణించడంతో భారత్ మళ్లీ షాంఘై సహకార సంస్థ ప్రాధాన్యాన్ని గుర్తించేలా చేసిందని నిపుణులు చెబుతున్నారు.

అదే సమయంలో ట్రంప్ సుంకాల దాడితో ఆసియాన్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల ప్రాధాన్యాన్ని చైనా గుర్తించింది.

2024 అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ చివరిసారిగా జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్‌లను కలిశారు. త్వరలో చైనా, భారత్‌తో త్రైపాక్షిక చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు రష్యన్ రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు.

""చైనా తయారీ నైపుణ్యం, భారత్ సేవా రంగ బలాలు, రష్యా సహజ వనరులనుఉపయోగించుకోవడం ద్వారా ఈ మూడు దేశాలు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు" అని బాజపేయీ తన వ్యాసంలో రాశారు.

భారత్, చైనా, అమెరికా, డోనల్డ్ ట్రంప్, సుంకాలు, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో తయారవుతున్న చైనా స్మార్ట్ ఫోన్లకు భారత్ మార్కెట్‌లో గణనీయమైన వాటా ఉంది.

భారత్ చైనా మధ్య ఆర్థికంగా ఎలాంటి సహకారం ఉండవచ్చు?

భారత్ ఉత్పత్తి, తయారీ రంగంలో చైనా మీద ఆధారపడుతోంది. ఎందుకంటే భారత్‌లో తయారవుతున్న అనేక వస్తువుల ముడి పదార్ధాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఆ వస్తువుల మీద దిగుమతి సుంకాలు తక్కువగా ఉండాలని భారత్ ఆశిస్తోంది.

చైనా సరఫరా వ్యవస్థలతో ఆగ్నేయాసియా దేశాలు పొందుతున్న ప్రయోజనాలను పొందడంలో భారత్ అనుసరిస్తున్న కఠిన పారిశ్రామిక విధానాలు అడ్డంకిగా మారాయని నిపుణులు చెబుతున్నారు.

చైనాతో భారత్ భాగస్వామ్యం కోరుకోవడంలో బలమైన కారణం ఉందని, భారత్ మరిన్ని ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రయత్నిస్తోందని ఆసియా డీకోడెడ్ పరిశోధన సంస్థ వ్యవస్థాపకురాలు ప్రియాంక కిషోర్ అన్నారు.

"చైనా నుంచి వచ్చే వీసా అభ్యర్థనలను భారత్ త్వరగా ఆమోదించాలి. అప్పుడే ఇది చైనాకు సులభమైన విజయం అవుతుంది. ప్రత్యక్షంగా లేదా పెట్టుబడుల ద్వారా భారత మార్కెట్లలోకి ప్రవేశించాలని చైనా భావిస్తోంది. ఇదే జరిగితే భారత్‌లో తగ్గుతున్న అమెరికన్ పెట్టుబడుల లోటును పూడ్చుకోవచ్చు" అని ప్రియాంక కిషోర్ అభిప్రాయపడ్డారు.

"140 కోట్ల మందికి తమ ఉత్పత్తులను అమ్మే అవకాశాన్ని బీజింగ్ స్వాగతిస్తుంది" అని ఆమె చెప్పారు.

రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉన్న సంక్లిష్టత దృష్ట్యా ఒక్క సమావేశంలోనే ఏదో అద్భుతం జరిగే అవకాశం లేదు. అలాంటి అద్భుతం కోసం ఈ రెండు దేశాలు ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.

అయితే చైనాలో మోదీ పర్యటన అందుకు అవసరమైన ప్రారంభాన్ని అందిస్తుంది. అంతే కాకుండా భారత్‌కు ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే సంకేతాన్ని వాషింగ్టన్‌కు పంపిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)