డిజిటల్ సర్వీస్ ట్యాక్స్: ప్రపంచ దేశాలకు డోనల్డ్ ట్రంప్ మరో హెచ్చరిక, భారత్ ఏం చేయవచ్చు?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికన్ టెక్ కంపెనీలపై డిజిటల్ ట్యాక్స్ లేదా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్‌లు విధించే దేశాలు వాటిని రద్దు చేయాలని లేదా ఆయా దేశాలు తమ ఎగుమతులపై మరిన్ని సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
అయితే, భారత ప్రభుత్వం డిజిటల్ సేవా పన్నును అంటే నాన్-రెసిడెంట్ అమెరికన్ టెక్ కంపెనీలపై 'ఈక్వలైజేషన్ లెవీ'ని రద్దు చేసింది. 2025-26 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రకటించింది. ఈ ఉత్తర్వు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
వాస్తవానికి, ట్రంప్ ప్రభుత్వంతో వాణిజ్య ఒప్పందాన్ని సులభతరం చేస్తుందనే ఆశతో భారత్ ఈ పన్నును రద్దు చేసింది. కానీ, ఇప్పుడు భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకాన్ని ప్రకటించడంతో, భారత్ కూడా యూటర్న్ తీసుకోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.
భారత మీడియాలో ప్రచురితమైన రిపోర్టుల ప్రకారం, భారత ప్రభుత్వం ప్రతీకార చర్యగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌తో పాటు మెటా, అమెజాన్ వంటి సంస్థలపై డిజిటల్ సేవా పన్ను విధించవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

ట్రంప్ ఏమన్నారు?

ఫొటో సోర్స్, TRUTH SOCIAL
"డిజిటల్ పన్నులు, చట్టాలు, నియమాలు లేదా నిబంధనలు ఉన్న అన్ని దేశాలను హెచ్చరిస్తున్నాను. ఈ వివక్షత చర్యలు రద్దు చేయకపోతే, అమెరికా అధ్యక్షుడిగా, ఆ దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు విధిస్తాను. అమెరికా అత్యంత రక్షణాత్మకమైన సాంకేతికతలు, చిప్‌ల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తాను" అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు.
డోనల్డ్ ట్రంప్ 90కు పైగా దేశాలపై 10 శాతం (బేస్ టారిఫ్) నుంచి 50 శాతం వరకు సుంకాలు విధించారు.
భారత్, బ్రెజిల్ దేశాలపై అత్యధికంగా 50 శాతం సుంకం విధించారు. ఇండియాపై 50 శాతం సుంకం 2025 ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
డిజిటల్ సర్వీస్ టాక్స్ అంటే ఏమిటి?
డిజిటల్ సర్వీస్ టాక్స్ అనేది ప్రభుత్వాలు అక్కడ భౌతికంగా ఉనికిలో లేని పెద్ద అంతర్జాతీయ టెక్ కంపెనీలపై విధించే పన్ను. ఈ కంపెనీలు ఆ దేశం వెలుపల నుంచి పనిచేస్తాయి.
సాధారణంగా, ఆ దేశంలో శాశ్వత ఉనికి ఉన్న కంపెనీపై మాత్రమే కార్పొరేట్ పన్ను విధిస్తారు. కానీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గూగుల్, మెటా, అమెజాన్ లేదా నెట్‌ఫ్లిక్స్ వంటి కంపెనీలు ఏ దేశంలోనూ కార్యాలయం తెరవకుండానే బిలియన్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని చేయగలవు.
విదేశీ కంపెనీలకు ఈ ఆదాయం ప్రకటనలు, ఇతర సేవల నుంచి వస్తుంది. కంపెనీలు తమ దేశంలో భౌతికంగా లేనప్పటికీ, వారు ఇప్పటికీ డబ్బు సంపాదిస్తున్నారని, అందువల్ల వారు పన్ను చెల్లించాల్సి ఉంటుందనేది ఆయా దేశాల వాదన.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి కంపెనీలపై విధిస్తారు?
డిజిటల్ సర్వీస్ టాక్స్ సాధారణంగా ఒక దేశ వినియోగదారుల నుంచి ఆదాయాన్ని సంపాదించే విదేశీ కంపెనీలపై విధిస్తారు.
ఈ సర్వీస్ టాక్స్ అనేక రకాల సేవలపై ఉంటుంది. ఉదాహరణకు ఆన్‌లైన్ ప్రకటనలు వంటివి. గూగుల్, మెటా, యూట్యూబ్‌లు అటువంటి సేవల ద్వారా డబ్బు సంపాదిస్తాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ కంపెనీలు వస్తువులను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ఉబెర్ వంటి కంపెనీలు, ఎయిర్‌బీఎన్‌బీ వంటి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు, నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై వంటి స్ట్రీమింగ్ సేవలు అమెరికాలో కూర్చుని ఏ దేశంలోనైనా డబ్బు సంపాదిస్తాయి.
ఈ కంపెనీలు యూజర్ డేటా నుంచి కూడా డబ్బు సంపాదిస్తాయి. భారతదేశంలో డిజిటల్ సేవా పన్నును 'ఈక్వలైజేషన్ లెవీ' అంటారు. 2016లో అటువంటి ప్రకటనలపై 6 శాతం పన్ను ఉండేది. కానీ, 2025-26 బడ్జెట్‌లో దీన్ని తొలగించారు. అంతకుముందు, ఈ-కామర్స్ కంపెనీలపై విధించిన లావాదేవీల పన్నును కూడా రద్దు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వెనక్కి తగ్గిన కెనడా, ఈయూ
యూఎస్ టెక్నాలజీ కంపెనీలపై విధించిన పన్నులను వెనక్కి తీసుకుంటున్నట్లు కెనడా ఇటీవల ప్రకటించింది. ఆ చెల్లింపులలో మొదటి విడత డిపాజిట్ చేయడానికి కొన్ని గంటల ముందు ఈ చర్య తీసుకుంది.
ఇది అమెరికాతో తన వాణిజ్య ఒప్పందాన్ని పునఃప్రారంభించడానికి సహాయపడుతుందని కెనడా ఆశించింది. కెనడా ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కెనడా ఎగుమతుల్లో 80 శాతం ఆ దేశానికే వెళ్తాయి.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ పన్నును "బహిరంగ దాడి"గా అభివర్ణించారు. కొనసాగుతున్న వాణిజ్య చర్చలను రద్దు చేశారు, కెనడియన్ దిగుమతులపై మరిన్ని సుంకాలు విధిస్తామని బెదిరించారు.
ఇక, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అమెరికన్ డిజిటల్ కంపెనీలపై డిజిటల్ సేవా పన్ను విధించే ప్రణాళికలను ఉపసంహరించుకున్నాయి.
ఈయూ, యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. డిజిటల్ పన్ను విధించినట్లయితే, పరిస్థితులు మరింత దిగజారుతాయని ఈయూ భావించింది.
అమెరికన్ టెక్ కంపెనీలు ఏమంటున్నాయి?
ఏ దేశానికీ వెళ్లకుండానే భారీ లాభాలు ఆర్జించే అమెరికన్ టెక్ కంపెనీలు ఈ పన్ను చెల్లించడానికి ఇష్టపడవు. నిజానికి, ఈ పెద్ద టెక్ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయం ఉన్న దేశంలో ఇప్పటికే పన్ను చెల్లిస్తున్నామని చెబుతున్నాయి. ఇప్పుడు వివిధ దేశాల డిజిటల్ సర్వీస్ టాక్స్‌తో డబుల్ టాక్స్ చెల్లించవలసి వస్తుంది.
అమెరికన్ కంపెనీల మార్కెట్ యాక్సెస్‌ను నిలిపివేయడం ద్వారా చైనా తన దేశీయ కంపెనీలను ప్రోత్సహిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














