డెస్టినేషన్ వెడ్డింగ్: అవసరమా, ఆడంబరమా?

పెళ్లి కుమార్తె

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ కోసం

పెళ్లి అంటే కట్నం మొదలుకొని వివిధ తంతుల కోసం పెట్టే ఖర్చు చాలామందిలో ఒక భయాన్ని కలగజేసింది.కొందరికి పెళ్లి ఒక వేడుక అయితే, మరికొందరికి భారం.

ఇండియాలో పెళ్లి కోసం జీవితాంతం సంపాదించిన డబ్బును ఒకే రోజులో ఖర్చు పెట్టేస్తారు. ఇందులో సామాజిక ఒత్తిడి ఉంటుంది.

బంధువులందరిలో గొప్పగా పెళ్లి చేశారని అనిపించుకోవడానికి, తమ ఆర్థిక సామాజిక స్థాయిని తెలియ చేయడానికి పెళ్లిని ఒక వేదికగా వాడుకుంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అనంత్ అంబానీ, రాధిక పెళ్లి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అనంత్ అంబానీ, రాధికల పెళ్లి వేడుకలు మర్చిపోక ముందే, జూన్ 12వ తేదీన వారి వివాహ వార్షికోత్సవం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

ఆర్థిక పరిస్థితే కొలమానమా?

ఆర్ధిక స్థాయి పెళ్లికి ఒక పెద్ద కొలమానంగా మారింది.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి చాలామంది కలలు కన్నారు. ఈ జంట పెళ్లయి ఏడాది గడుస్తున్నా ఆ వేడుకలు మాత్రం ఇంకా చాలామంది మర్చిపోలేదు.

ఒకటా రెండా, మూడు సార్లకు పైగా పెళ్లికి ముందు జరిగిన వేడుకలు, వాటికి దేశ విదేశాల నుంచి హాజరైన సెలెబ్రిటీల వార్తలతో డిజిటల్ మీడియా నిండిపోయింది.

ఈ పెళ్లి వేడుకలు మర్చిపోక ముందే, జూన్ 12వ తేదీన వారి వివాహ వార్షికోత్సవం తిరిగి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ పెళ్లిలో శుభలేఖలు మొదలుకొని వధూవరులు వాళ్ల కుటుంబాలు ధరించిన డిజైనర్ నగలు, దుస్తులు, విందు, మిఠాయిలు, ఫోటోలు, వీడియోలు, పెళ్లికి చేసిన ఏర్పాట్ల వరకు ప్రతీ అంశం ఒక వార్తగా, వింతగా మారింది.

ఇలాంటి పెళ్లిళ్లు ఒక్క అంబానీలకు మాత్రమే పరిమితం కాదు. చాలామంది గతంలో చేశారు.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన దత్త పుత్రుడు సుధాకరన్ పెళ్లి చేసినప్పుడు కూడా వార్తల్లో నిలిచింది. ఈ పెళ్లికి 1,50,000 మంది అతిథులు హాజరైన విషయం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ప్రవేశించినట్లు వార్తలు కూడా వచ్చాయి. 1995లో ఈ పెళ్లికి అయిన ఖర్చు రూ. 10 కోట్లు అని ఐటీ శాఖ అంచనా వేసింది.

డెస్టినేషన్ వెడ్డింగ్, ఖర్చులు, మధ్య తరగతి
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

చదువు కంటే పెళ్లికే ఖర్చు

భారతీయులు తిండి తర్వాత అత్యధికంగా ఖర్చు పెట్టేది పెళ్లిళ్లకేనని ఇటీవల ఒక సర్వే చెప్పింది.

భారతీయ వివాహ పరిశ్రమ సుమారు రూ.10.7 లక్షల కోట్ల విలువ చేస్తుందని జెఫ్రీస్ అనే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ క్యాపిటల్ సంస్థ జులై 2024లో విడుదల చేసిన సర్వేలో తెలిపింది. భారతీయులు విద్య కంటే కూడా పెళ్లిళ్లపై రెట్టింపు ఖర్చు పెడతారని ఈ సర్వే పేర్కొంది.

భారతీయులు సగటున ఒక వివాహంపై పెట్టే ఖర్చు రూ.12.5 లక్షలు. ఇందులో నగలు, దుస్తులు, ఇతర ఖర్చులను చేర్చలేదు. ఇవి కాకుండా, పైకి చెప్పని కట్న కానుకలు కూడా ఉంటాయి.

ఈ రోజుల్లో కట్నాలు ఎవరు తీసుకుంటున్నారని ఆధునికులు ప్రశ్నలు వేస్తున్నా, కట్నం అనే వ్యవస్థ మధ్యతరగతిలో ఇంకా బలంగా నాటుకుని ఉంది. అదొక అవసరమైన సంప్రదాయంగా చాలామంది భావిస్తున్నారు.

ఒక్క 2022లోనే దేశవ్యాప్తంగా 6,450 వరకట్న చావులు చోటు చేసుకున్నట్లు ఆ ఏడాది విడుదలైన ఎన్సీఆర్బీ డేటా చెబుతోంది. 2023లో 4,797 వరకట్న బాధితులు నమోదు చేసిన ఫిర్యాదులు ఉన్నాయని నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ రిపోర్ట్ చేసింది.

2017-2022 వరకు చూసుకుంటే సగటున ఏడాదికి 7,000 వరకట్న హత్యలు ఉన్నాయి.

పెళ్లి, ఖర్చులు, మధ్యతరగతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నేను మనీలా వెళ్లినప్పుడు, నా కొలీగ్ నా దగ్గరకు వచ్చి పెళ్లికి రమ్మని కార్డు ఇచ్చి వెళ్లారు. నాకు తెలిసి అప్పటికే ఆమెకు ఇద్దరు టీనేజ్ పిల్లలున్నారు. అర్థం కాలేదు.

పెళ్లా అని నేను పెట్టిన ముఖానికి, ''ఇన్ని రోజులు మేం కలిసి ఉన్నాం. కానీ, మా దగ్గర తగినంత డబ్బు లేక పెళ్లిని ఒక వేడుకలా చేసుకోలేదు. ఇప్పుడు ఇద్దరం మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాం. అందుకే ఇప్పుడు అందరినీ పిలిచి ఈ పెళ్లి చేసుకుంటున్నాం" అని ఆమె చెప్పారు.

ఇది ఇండియాలో ఊహించలేని విషయం అనుకున్నాను. ఇండియాలో పెద్దలు కుదిర్చిన వివాహాలు, కట్న కానుకల గురించి చెప్పినప్పుడు వాళ్లు ఆశ్చర్యంగా చూశారు.

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'బంధువుల ఒత్తిడి'

పెళ్లిలో ఒక్కరి అభిప్రాయం ఉండదు. రెండు కుటుంబాలు, బంధువులు, చుట్టుపక్కలవాళ్లు, వీటన్నింటితో పాటు పెళ్లి చుట్టూ అల్లుకున్న సంప్రదాయాలు. ఇలా చాలామంది పాత్ర పోషిస్తారు. ఈ అభిప్రాయాలు అమ్మాయి తల్లిదండ్రులను ఎలా ప్రభావం చేస్తాయనే విషయం గురించి బెంగళూరుకు చెందిన శారదతో మాట్లాడాను.

ఆమె ఇటీవలే వాళ్ల అమ్మాయి పెళ్లి చేశారు. అమ్మాయి పెళ్లిని పర్యావరణానికి హాని కలగకుండా చేయాలనుకున్నారు శారద. ఒక్క మాటలో చెప్పాలంటే పాతకాలం మాదిరిగా ఇంటి ముందున్న స్థలంలో తాటాకు పందిళ్లు, మామిడి తోరణాలు, అరిటాకు విందు, బంధువుల సమక్షంలో చేయాలని ఆలోచించారు.

కానీ, పిల్లలు మాత్రం తమకు రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ మాదిరిగా చేస్తే బాగుంటుందనే కోరిక వ్యక్తం చేశారు. చివరకు ఒక స్టార్ హోటల్‌లో పెళ్లి జరిగింది.

పిల్లల కోరికకు తలవంచక తప్పలేదు అంటున్నారు శారద. పెళ్లి ఖర్చులను అబ్బాయి తరుపు వాళ్లు కూడా పంచుకున్నట్లు చెప్పారు.

అయితే, ఇలా చేయడం వాళ్ల తాహతుకు మించిన పనేమీ కాకపోయినా కూడా పిల్లలు తమ స్నేహితుల పెళ్లిళ్లు చూసి ఏర్పర్చుకున్న అభిప్రాయాలు అని శారద అంటున్నారు.

విశాఖపట్నానికి చెందిన లత కూడా వాళ్ల అమ్మాయికి ఇటీవల పెళ్లి చేశారు. పెళ్లి ఖర్చు అంతా వాళ్ల అమ్మాయి, అల్లుడు కలిపి పెట్టుకున్నట్లు చెప్పారామె. పెళ్లి దిల్లీలో జరిగింది. "కానీ, మేం ఇక్కడి బంధువుల ఒత్తిడి వల్ల ఇక్కడ కూడా రిసెప్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఒత్తిడితో పెట్టిన ఖర్చు" అని లత అన్నారు.

"ఈ ఖర్చును తప్పించుకోలేకపోయాను" అని ఒక నిట్టూర్పు విడిచారామె.

పెళ్లి, ఖర్చులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియా 'ఆడంబరం'

"ఎవరేమనుకుంటారోననే భయం, తాము చేసిన పెళ్లి గురించి గొప్పగా మాట్లాడుకోవాలనే కోరిక కూడా చాలా మందిని తాహతుకుమించి పెళ్లిళ్లు చేసేలా చేస్తుంది" అని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఫ్రైడే వాల్ ఫౌండర్ రాజేశ్వరి కళ్యాణం అన్నారు.

"పెళ్లి అనే తంతును ఎప్పుడైతే మీడియా, సోషల్ మీడియా పెద్దగా చేసి చూపించడం మొదలుపెట్టిందో, పెళ్లిలో దాగిన ప్రతీ విధానం ఒక వినిమయ సంస్కృతిగా మారిపోయింది" అని అన్నారామె.

"సంపన్నుల మాదిరిగా బతకాలనే ఆశ, వారి మాదిరిగా వేడుకలను చేసుకోవాలనే కోరిక మధ్యతరగతి వారిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. గొప్పగా పెళ్లిళ్లు చేయాలనే తపనతో అప్పులు పాలైన కుటుంబాలు ఉన్నాయి" అని రాజేశ్వరి అన్నారు.

పెళ్లి చుట్టూ ఒక ఆర్థిక వ్యవస్థ తిరుగుతూ ఉంటుంది. పెళ్లికి పూల సరఫరా చేసేవాళ్లు నుంచి భోజనాలు సప్లై చేసేవారి వరకు ఇదొక పెద్ద పరిశ్రమ. మరోవైపు, దేశంలో మెట్రో నగరాల్లో ఫేక్ వెడ్డింగ్స్ ప్రాచుర్యం చెందుతున్నాయి. ఇందులో ఒక్క వధూవరులు తప్ప పెళ్లి సంబరాలు, లైట్లు, డీజే, భోజనాలు అన్నీ ఉంటాయి, ఇదొక పార్టీ.

ఇప్పుడిప్పుడే బెంగళూరు, హైదరాబాద్‌లాంటి నగరాల్లో సస్టైనబుల్ వెడ్డింగ్స్ మొదలయ్యాయి. ఇది ఎంత మందిని ప్రభావితం చేస్తుందనేది చూడాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)