పక్కనే క్షిపణి కేంద్రం, వెన్నంటే సెక్యూరిటీ గార్డులు, ఒళ్లు కనిపించేలా దుస్తులు వేసుకోవద్దని ఆంక్షలు.. ఉత్తర కొరియాలో రష్యా పర్యటకుల అనుభవాలేమిటి?

ఫొటో సోర్స్, Anastasia Samsonova
- రచయిత, యారోస్లావా కిర్యుఖినా
- హోదా, బీబీసీ ప్రతినిధి
2025 జులైలో రష్యా నుంచి నార్త్ కొరియాలోని కొత్త హాలిడే రిసార్ట్‌కు పర్యటక బృందం ఒకటి వెళ్లింది. రష్యా నుంచి వెళ్లిన తొలి బృందం అదే. అందులో 33 ఏళ్ల హెచ్ఆర్ ఉద్యోగిని అనస్తాసియా సాంసనోవా ఉన్నారు.
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ తన యవ్వనంలో ఎక్కువ కాలాన్ని గడిపిన తూర్పు తీరంలో ఈ రిసార్ట్ జులై 1న ప్రారంభమైంది.
క్షిపణి పరీక్ష కేంద్రానికి సమీపంలో నిర్మించిన ఈ రిసార్ట్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వాటర్ పార్క్స్ ఉన్నాయని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపింది.
దీన్ని విదేశీ పర్యటకుల కోసం నిర్మించినట్లు చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెన్సీల ద్వారా రష్యన్లను మాత్రమే అనుమతించారు.
అనస్తాసియా జులైలో 14 మందితో కలిసి ఉత్తర కొరియాలోని ఈ రిసార్ట్‌కు వచ్చారు.
స్థానిక గైడ్‌లు, సెక్యూరిటీ గార్డులు అనస్తాసియా బృందం వెంటే ఉంటూ అధికారుల అనుమతి లేకుండా ఎటూ వెళ్లలేని విధంగా వారి టూర్‌ను నియంత్రించారు.
"స్థానికులతో మాట్లాడి, వారిని భయపెట్టే పరిస్థితులను నివారించడానికి" గార్డులు అవసరమంటూ గైడ్‌లు తమతో చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
"మేం వీధులలో నడిచి వెళ్తున్నప్పుడు స్థానికులు మమ్మల్ని చాలా ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే ఈ దేశంలోకి చాలా కాలంగా విదేశీ పర్యటకుల్ని అనుమతించలేదు" అని అనస్తాసియా అన్నారు.
ట్రావెల్ ఏజెన్సీ, మీడియా సంస్థకు సంబంధం లేకుండా ఈ రిసార్ట్‌ను సందర్శించిన వారికి జియో ట్యాగ్‌లు ఉండటాన్ని సోషల్ మీడియాలో గుర్తించిన బీబీసీ దీనిపై అనస్తాసియాతో మాట్లాడింది.


ఫొటో సోర్స్, Anastasia Samsonova
సన్ లాంజర్ల కోసం ఒత్తిడి లేదు
నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను ఫోటోలు తీయవద్దని, శరీరం కనిపించేలా దుస్తులు ధరించవద్దని తమ బృందానికి సూచనలు చేసినట్లు అనస్తాసియా చెప్పారు.
ఆంక్షలు విధించినప్పటికీ తాము విహారయాత్రను ఎంజాయ్ చేశామని ఆమె అన్నారు. "బీచ్‌లన్నీ తెల్లటి ఇసుకతో ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఎవరూ లేరు. మేం విహారయాత్రను పూర్తిగా ఆస్వాదించాం" అని ఆమె చెప్పారు.
"బీచ్‌లలో టూరిస్టులు సేద దీరేందుకు అక్కడ ఏర్పాటు చేసిన లాంజర్లు (కుర్చీలు) కొత్తవి. బీచ్‌లను రోజూ శుభ్రం చేస్తున్నారు. అంతా చాలా ప్రశాంతంగా ఉంది" అని అనస్తాసియా చెప్పారు.
కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఉత్తర కొరియా పర్యటకుల రాకను నిషేధించింది.
అయితే గతేడాది నుంచి రష్యన్ టూరిస్టుల తమ దేశంలో పర్యటించడానికి అనుమతించింది.
ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలకు చెందిన టూరిస్టులకు కూడా ఆహ్వానం పలికింది.
అయితే అనుమతి ఇచ్చిన కొన్ని వారాలకే కారణం చెప్పకుండా హఠాత్తుగా అనుమతులను ఆపేసింది.

ఫొటో సోర్స్, KCNA
కిమ్ జోంగ్ ఉన్ డ్రీమ్ ప్రాజెక్టు..!
ఉత్తర కొరియాలో పర్యటకాన్ని ప్రోత్సహించాలనే కిమ్ ఆశయ సాధనలో వోన్సాన్ కల్మా రిసార్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది.
స్పెయిన్‌లోని పర్యటక కేంద్రమైన బెనిడార్మ్ స్ఫూర్తితో ఉత్తర కొరియాలోనూ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ఈ రిసార్ట్ నిర్మించారు.
బెనిడార్మ్‌లో పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు 2017లో ఉత్తర కొరియా తమ దేశ ప్రతినిధి బృందాన్ని అక్కడకు పంపింది.
వోన్సాన్ కల్మా రిసార్ట్స్ నిర్మాణం గురించిన వివరాలు గోప్యంగా ఉంచారు.
వీటి నిర్మాణం కోసం స్థానికుల్ని తరిమేశారని, కార్మికులతో ఎక్కువ గంటలు పని చేయించారని, వారికి సౌకర్యాలేమీ కల్పించలేదని మానవ హక్కుల సంఘాలు విమర్శించాయి.
ఈ రిసార్ట్ ప్రారంభించిన కొన్ని వారాల తర్వాత, ఇక్కడ పర్యటించేందుకు రష్యన్లకు తప్ప వేరే ఏ దేశస్తులకు అనుమతి ఇవ్వలేదు.
ఈ ప్రాంతాన్ని ఇప్పటి వరకు రెండు రష్యన్ గ్రూపులు సందర్శించి వెళ్లాయి. మరో గ్రూప్ ప్రస్తుతం ఈ రిసార్ట్‌లో ఉంది.
రష్యా నుంచి ఉత్తర కొరియాకు చేరుకోవడం వోన్సాన్ కల్మా రిసార్ట్‌లో మూడు రోజులు సహా వారం రోజుల పర్యటనకు భారతీయ కరెన్సీ ప్రకారం లక్ష 57 వేల రూపాయలు ఖర్చవుతుంది. రష్యన్ల సగటు నెలవారీ జీతం కంటే ఇది 60 శాతం ఎక్కువ.

ఫొటో సోర్స్, Anastasia Samsonova
రిసార్ట్ దగ్గర్లోనే క్షిపణి పరీక్ష కేంద్రం
ఈ పర్యటనకు సంబంధించి ప్రభుత్వ ప్రకటనల్లో రిసార్ట్‌కు సమీపంలోని క్షిపణి పరీక్ష కేంద్రం గురించి కూడా ప్రస్తావించారు. దీనిని "ప్రత్యేకమైన" విడిది ప్రదేశంగా అభివర్ణించారు.
తానక్కడ ఉన్నప్పుడు క్షిపణులేవీప్రయోగించలేదని అయితే అక్కడ బొమ్మ రాకెట్లను ఒక్కొక్కటి 40 డాలర్లకు అమ్ముతున్నారని అనస్తాసియా చెప్పారు.
తన పర్యటనలో చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నప్పుడు ఉదయం 8 నుంచి 9.30 గంటల మధ్య తమ బృందానికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేవారని ఆమె చెప్పారు.
తమకు ఇచ్చిన ఆహారంలో మాంసం ఉందని ఆమె అన్నారు. అర లీటర్ బీర్ బాటిల్ చాలా చౌక అని ఆమె చెప్పారు. పర్యటకులు తమ పర్యటనకు గుర్తుగా ఒలింపిక్ దుస్తులు కొంటున్నారని వివరించారు.
అయితే తదుపరి రష్యన్ టూరిస్టు బృందాన్ని వోన్సాన్ కల్మాలోకి ఎప్పుడు అనుమతిస్తారనే విషయంలో అనిశ్చితి ఉంది.
ఆ రిసార్ట్‌కు మొదటి మూడు ట్రిప్పులను నిర్వహించిన ట్రావెల్ ఏజెన్సీ వోస్టాక్ ఇంతూర్ సెప్టెంబర్‌లో ప్రకటనలు జారీ చేయాలని భావిస్తున్నా ఉత్తర కొరియా అధికారుల నుంచి అనుమతి రాలేదు.

ఫొటో సోర్స్, AFP
వోన్సాన్ కల్మాకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతోంది రష్యన్లు మాత్రమే కాదు.
"ఉత్తర కొరియా సరిహద్దును పంచుకుంటున్న దాని మిత్ర దేశం, ఆర్థిక భాగస్వామిగా ఉన్న చైనా పౌరులు కూడా రిసార్ట్‌లోకి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" అని ఉత్తర కొరియా-రష్యా సంబంధాల నిపుణుడు ఆండ్రీ లాంకోవ్ చెప్పారు.
దేశ ప్రజలు తమను తాము ధనిక విదేశీయులతో పోల్చుకోకుండా ఉండేందుకు ప్యాంగ్యాంగ్ కావాలనే పర్యటకుల సంఖ్యను తగ్గిస్తోందని, వారి కదలికలను నియంత్రిస్తోందని ఆయన అన్నారు.
విదేశీ పర్యటకుల్ని చూసి స్థానికులు "మన నాయకుడు లేదా ఆయన కొడుకు లేదా కూతురు లేకుండా వారు ఇంత బాగా ఎలా జీవిస్తున్నారు? అని సామాన్య ప్రజలు ఆశ్చర్య పోవచ్చు" అని లాంకోవ్ అన్నారు.
అందుకే ఉత్తర కొరియాలోకి విదేశీయుల్ని ఎక్కువగా అనుమతించక పోవడం మంచిదని పాలకులు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Anastasia Samsonova
నిర్మాణంలో కార్మికుల శ్రమ దోపిడీ..!
ఆంక్షలు సడలించడంతో రష్యా నుంచి ఉత్తర కొరియాకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది.
2024లో దాదాపు 1500 మంది రష్యన్లు ఉత్తర కొరియాలో పర్యటించారని రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ బోర్డర్ గార్డ్స్ చెబుతోంది.
అదే సమయంలో తుర్కియేను 67 లక్షల మంది, చైనాను 19 లక్షల మంది సందర్శించారు.
2025 రెండో త్రైమాసికంలో 1673 మంది రష్యన్ పర్యటకులు ఉత్తర కొరియా సందర్శించారు.
ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో వోన్సాన్ కల్మా కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. అయితే దీనిపై వివాదాలు కూడా ఉన్నాయి.
2018లో ఈ రిసార్ట్ నిర్మాణం మొదలైన తర్వాత ఇక్కడ కార్మికుల శ్రమ, హక్కుల దోపిడీ జరుగుతోందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి.
ఉత్తర కొరియాలో బలవంతంగా పని చేయించడం, తరచు కఠిన పరిస్థితులు గురించి ఐక్య రాజ్య సమితి ప్రస్తావించడాన్ని జులైలో బీబీసీ వెరిఫై రిపోర్ట్ చేసింది.
"కఠిన పరిస్థితుల మధ్య కార్మికులతో పని చేయించినట్లు నివేదికలు ఉన్నాయి" అని దక్షిణకొరియాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయానికి చెందిన జేమ్స్ హీనన్ చెప్పారు
దీనిపై వివరణ కోసం బీబీసీ లండన్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది.

ఫొటో సోర్స్, Anastasia Samsonova
మళ్లీ వస్తానంటున్న అనస్తాసియా
వోన్సాన్ కల్మా రిసార్ట్ చేరుకోవడంలో సమస్యలు, పర్యటనపై ఆంక్షలు ఉన్నప్పటికీ మరోసారి ఇక్కడకు రావాలని భావిస్తున్నట్లు అనస్తాసియా చెప్పారు.
"నిజానికి వచ్చే ఏడాది మొత్తం బృందాన్ని ఒక చోటకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. అది వీలవుతుందో లేదో నాకు తెలియదు. వోన్సాన్ కల్మా దగ్గర ఒక స్కీ రిసార్ట్ కూడా ఉందని విన్నాను. ఏదో ఒక రోజు అక్కడకు కూడా వెళతానని అనుకుంటున్నాను" అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














