నాగార్జున@67: హీరో నుంచి విలన్ వరకు..‘టాలీవుడ్ మన్మథుడి’ 4 దశాబ్దాల సినీ ప్రయాణం ఎలా సాగింది?

నాగార్జున

ఫొటో సోర్స్, NagarjunaAkkineni/FB

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

అది 1991 సెప్టెంబర్‌..

కన్నడ స్టార్‌ హీరో వి.రవిచంద్ర స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన త్రిభాషా చిత్రం శాంతి క్రాంతి. కన్నడంలో రవిచంద్రన్‌ హీరో కాగా తెలుగులో అక్కినేని నాగార్జున, తమిళంలో రజనీకాంత్‌ హీరోలు.

2025 ఆగస్ట్..

దాదాపు 34 ఏళ్ల తర్వాత.. పాన్‌ ఇండియా మూవీ పేరిట వచ్చిన కూలీలో రజనీకాంత్‌ హీరో కాగా నాగార్జున విలన్‌ రోల్‌.. అది కూడా ప్రధాన విలన్‌ కాదు ఓ విలన్‌.. అంతే.

వాస్తవానికి, నాగార్జున ప్రయోగాలు అంటే ఇష్టపడతారు.

1980ల తర్వాత ముప్పై ఏళ్ల పాటు తెలుగు సినీపరిశ్రమకు నాలుగు స్తంభాలుగా నిలిచిన నలుగురు హీరోల్లో ఒకరు నాగార్జున.

ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం సీనియర్‌ హీరోలే కాదు.. టాలీవుడ్‌లోని స్టార్‌ హీరోలు, యువ హీరోలు ఆయనే మా ఆదర్శం అని చెబుతుంటారు.

నేటితో (ఆగస్ట్ 29) 66 ఏళ్లు పూర్తి చేసుకుని, 67వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు అక్కినేని నాగార్జున.

దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో నాగ్ ఎలాంటి ప్రయోగాలు చేశారు ? ఏఎన్నార్ నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన నాగార్జున ప్రయాణం నల్లేరు మీద నడకలానే సాగిందా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మజ్నుతో మొదటిసారి తండ్రి ప్రశంసలు

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా, అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన మొట్టమొదటి చిత్రం ‘విక్రమ్‌’. 1986లో వచ్చిందీ సినిమా. అయితే, ఆయన తొలిసారి వెండితెరపై కనిపించిన చిత్రం మాత్రం ‘సుడిగుండాలు’. తండ్రి ఏఎన్నార్ నిర్మించిన ‘సుడిగుండాలు’ సినిమాతోపాటు, ‘వెలుగునీడలు’ చిత్రంలోనూ ఆయన బాల నటుడిగా కనిపించారు.

ఆచితూచి మాట్లాడే వ్యక్తిగా పేరున్న అక్కినేని నాగేశ్వరరావు తన కుమారుడిని బహిరంగంగా మీడియా ముందు ప్రశంసించింది మాత్రం ‘మజ్ను’తోనే.

తొలి చిత్రం విక్రమ్‌ తర్వాత వరుసగా ‘కెప్టెన్‌ నాగార్జున’, ‘అరణ్యకాండ’ సినిమాలు ఫ్లాప్ కాగా.. దాసరి నారాయణరావు తన నిర్మాణ సంస్థ తారకప్రభు బ్యానర్‌పై నిర్మించి, తానే దర్శకత్వం వహించిన ‘మజ్ను’ సూపర్‌హిట్‌ అయింది.

ఆ సినిమాలో ప్రేయసికి దూరమై మద్యం తాగే పాత్రలో నాగార్జున నటనకు ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసలు కురిపించారు. ‘దేవదాసు’లో తన తాగుబోతు క్యారెక్టర్‌కి దీటుగా ‘మజ్ను’లో నాగార్జున బాగా యాక్ట్‌ చేశారని కితాబునిచ్చారు.

ఆ తర్వాత మళ్లీ ‘అన్నమయ్య’ సినిమా చూసిన తర్వాత.. తన నటనను మెచ్చుకుంటూ ఏఎన్నార్‌ తన చేయిపట్టుకుని అలా కాసేపు ఉండిపోయారని నాగార్జున పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

అక్కినేని నాగార్జున, సినిమా, యాక్టర్, తెలుగు సినిమా, టాలీవుడ్

ఫొటో సోర్స్, Annapurna Studios/Facebook

గీతాంజలితో బ్రేక్..

అప్పటికి హీరోగా దాదాపు 15 సినిమాలు.. అందులో సూపర్‌హిట్‌లు, హిట్‌లు, యావరేజ్‌లు, ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.

అయితే, 1989లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాతో సరికొత్త నాగార్జున తెర మీద కనిపించాడు.

నాగార్జున..ఇదీ నా సినిమా అనే మార్క్‌ ఈ గీతాంజలి నుంచే మొదలైంది.

నాగ్‌కి యువతలో ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో క్రేజ్‌ పెరిగింది ఈ సినిమాతోనే. 'యంగ్‌ డై ఫస్ట్' అనే ఆంగ్ల చిత్రం ప్రేరణతో మణిరత్నం నేరుగా తెలుగులో తీసిన ఈ సినిమా సూపర్‌హిట్‌ కాగా, తమిళంలో డబ్‌ అయి అక్కడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అక్కినేని నాగార్జున, సినిమా, యాక్టర్, తెలుగు సినిమా, టాలీవుడ్

ఫొటో సోర్స్, Annapurna Studios/Facebook

ఆ మాట అభిమానులే ఒప్పుకోవడం లేదు

ఇటీవల నాగార్జున తన చిన్ననాటి స్నేహితుడు, నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ఓ టీవీ షోలో మాట్లాడుతూ, "తొలి సినిమా విక్రమ్‌ నుంచి గీతాంజలి వరకు.. మధ్యలో కలెక్టర్‌‌గారి అబ్బాయి, మజ్ను సినిమాలు ఉన్నా, ఏదో చేయమంటున్నారు..చేస్తున్నాను.. నేను చేసేవే నాకు నచ్చట్లే అక్కడి వరకు.." అని వ్యాఖ్యానించారు.

అయితే, ఈ మాటలను ఆయన అభిమానులు మాత్రం అంగీకరించడం లేదు.

" గీతాంజలికి ముందు విక్రమ్, మజ్ను, కలెక్టర్‌గారి అబ్బాయి, ఆఖరిపోరాటం వంటి సూపర్‌హిట్‌ సినిమాలే కాదు. నిఖార్సైన హిట్‌బొమ్మలు విక్కీదాదా, జానకిరాముడుతో పాటు సంకీర్తన, మురళీకృష్ణుడు వంటి మంచిచిత్రాలు ఉన్నాయి. అప్పట్లో విక్కీదాదా, జానకిరాముడు పలు సెంటర్లలో రికార్డులు సృష్టించాయి" అని ఆలిండియా అక్కినేని నాగార్జున అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సర్వేశ్వరరావు బీబీసీతో అన్నారు.

అక్కినేని నాగార్జున, సినిమా, యాక్టర్, తెలుగు సినిమా, టాలీవుడ్

ఫొటో సోర్స్, Annapurna Studios/Facebook

తెలుగు తెరపై "శివ"తాండవం

1989లోనే గీతాంజలి బ్లాక్‌బస్టర్‌ తర్వాత వచ్చిన 'అగ్ని' సోసోగా ఆడినా.. ఆ తర్వాత వచ్చిన ‘శివ’ చిత్రం తెలుగు సినిమాలో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది.

రామ్‌గోపాల్ వర్మ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, శివకు ముందు.. శివకు తర్వాత అనే స్థాయిలో తెలుగు సినిమాను ప్రభావితం చేసింది.

సినిమా టేకింగ్, నటీనటుల డైలాగ్‌ డిక్షన్, ఫైట్లు.. ఒకటేమిటి అన్ని రంగాల్లోనూ శివతోనే మార్పు మొదలైందని సినీ విమర్శకులు చెబుతారు. ఈ సినిమాతోనే రామ్‌గోపాల్‌ వర్మ పేరు జాతీయస్థాయిలో మార్మోగగా, ఈ చిత్రానికి వివిధ విభాగాల్లో సహాయకులుగా పనిచేసిన వారెందరో తర్వాతికాలంలో దర్శకులుగా, కెమెరామెన్లుగా స్థిరపడ్డారు.

సొంత బ్యానర్‌పై నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి అందరినీ ప్రోత్సహించిన నాగార్జునే శివకు కర్త, కర్మ క్రియగా పేరు వచ్చింది.

‘శివ’ తర్వాత వరుసగా ‘ప్రేమయుద్ధం’, ‘నేటి సిద్ధార్ధ’, ‘ఇద్దరూ ఇద్దరే’, ‘నిర్ణయం’, ‘చైతన్య’, ‘శాంతి క్రాంతి’, ‘జైత్రయాత్ర’, ‘కిల్లర్’, ‘అంతం’ సినిమాలు చేశారు. వీటిలో మెజార్టీ సినిమాల టేకింగ్‌ చూస్తే.. దశాబ్దం తర్వాత చేయాల్సిన సినిమాలు ముందుగానే చేశారన్న అభిప్రాయం సినీ అభిమానుల నుంచి వ్యక్తమయ్యేది.

ఆ తర్వాత మాస్‌ సినిమాలు ‘ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం’, ‘వారసుడు’, ‘అల్లరి అల్లుడు’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున డబుల్‌ రోల్‌లో వచ్చిన ‘హలోబ్రదర్‌’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా ముందు నుంచే నటసామ్రాట్‌గా ఏఎన్నార్‌ను పిలుచుకునే అభిమానులు నాగార్జునను యువ సామ్రాట్‌గా పిలవడం మొదలుపెట్టారు.

అక్కినేని నాగార్జున, సినిమా, యాక్టర్, తెలుగు సినిమా, టాలీవుడ్

ఫొటో సోర్స్, Annapurna Studios/Facebook

ఆధ్యాత్మిక చిత్రాలతో మెప్పించిన కమర్షియల్ హీరో

‘ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం’(1992), 1995లో ‘క్రిమినల్‌’, 1996లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమా.. ఇలా హిట్‌ల మీద హిట్లతో నాగార్జునకు యువతతోపాటు మహిళా అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.

ఇక ఈ సినిమా తర్వాత 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రం నాగార్జున కెరీర్‌లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా మొదలైనప్పుడు 15వ శతాబ్దం నాటి వాగ్గేయకారుడు అన్నమయ్యగా మీసాలతో నాగార్జున నటిస్తుండటం చూసిన కొందరు, అప్పట్లో వచ్చిన ఆ ఫొటోలను చూసిన మరికొందరు అన్నమయ్యకి మీసాలేంటని విమర్శించారు.

అయితే, సినిమా విడుదలైన తర్వాత సినిమా పాటలు, దర్శకత్వ ప్రతిభతో పాటు ప్రధానంగా అన్నమయ్యగా నాగార్జున నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంతో నాగార్జునకు ఉత్తమ నటుడి పురస్కారం కూడా లభించింది.

అన్నమయ్య విజయం స్పూర్తితోనే, అదే కాంబినేషన్‌లో వచ్చిన శ్రీరామదాసులో భక్తరామదాసుగా నాగార్జున మరోసారి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు.

ఆధ్యాత్మిక పాత్రలు పోషించి విజయవంతమైన కమర్షియల్‌ హీరోగా నాగార్జున ముందు వరసలో ఉంటారు.

అక్కినేని నాగార్జున, సినిమా, యాక్టర్, తెలుగు సినిమా, టాలీవుడ్

ఫొటో సోర్స్, Annapurna Studios/Facebook

టాలీవుడ్‌ మన్మథుడు..

అన్నమయ్య తర్వాత, ఫ్లాప్‌లు ఎదుర్కొన్ననాగార్జున 'నువ్వువస్తావని'తో మళ్లీ హిట్‌ ట్రాక్ ఎక్కారు. 2002లో దశరథ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన ‘సంతోషం’ సినిమాతో భారీ విజయం అందుకున్నారు.

ఆ వెంటనే విజయభాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మన్మథుడు’ సినిమా ఎవర్‌గ్రీన్‌ హిట్‌గా నిలవడంతో పాటు నాగార్జునను టాలీవుడ్‌ మన్మథుడిగా మార్చేసింది.

అప్పటికి యువసామ్రాట్‌గా దాదాపు రెండు దశాబ్దాల పాటు ట్యాగ్‌లైన్‌ కొనసాగించిన నాగార్జునను 2008లో వచ్చిన ‘కింగ్‌’ సినిమా నుంచి ఆయన అభిమానులు టాలీవుడ్‌ కింగ్‌గా పిలవడం మొదలుపెట్టారు.

ఆ తర్వాత ‘మనం’, ‘ఊపిరి’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘బంగార్రాజు’ వంటి సెలెక్టెడ్ చిత్రాలు చేస్తూ వచ్చారు నాగార్జున.

"సీనియర్‌ హీరోల్లో మొదటిసారి రూ. 50 కోట్ల గ్రాస్‌ను నాగార్జున 2016లోనే ‘సోగ్గాడే చిన్నినాయన ’చిత్రంతో సాధించారు. ఆ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా విజయం సాధించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 86 కోట్ల గ్రాస్‌ సాధించినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఆ లెక్కన అప్పటికి నాగార్జునే మొదటి రూ.50కోట్ల హీరో" అని సినీ విశ్లేషకులు భరద్వాజ బీబీసీతో అన్నారు.

తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో 2011లో నాగార్జున నటించి, నిర్మించిన ‘రాజన్న’ సినిమాకి రచయిత విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహించగా, పోరాట ఘట్టాలకు రాజమౌళి దర్శకత్వం వహించారు.

బాలీవుడ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఇతర హీరోల సినిమాల్లో అతిథిపాత్రలు, ప్రత్యేక పాత్రల్లో కనిపించారు నాగార్జున.

అక్కినేని నాగార్జున, సినిమా, యాక్టర్, తెలుగు సినిమా, టాలీవుడ్

ఫొటో సోర్స్, Annapurna Studios/Facebook

బాలీవుడ్‌లోనూ ఎన్నో సినిమాలు..

తెలుగులో సంచలనం సృష్టించిన ‘శివ’ సినిమానే అక్కడ రీమేక్‌ చేసి బాలీవుడ్‌లోనూ మంచి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా హిందీ సినిమాల్లో సోలో హీరోగా కాకపోయినా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ వస్తున్నారు.

తొలి బాలీవుడ్‌ చిత్రం తర్వాత.. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖుదాగవా’, రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో ‘ద్రోహి’ (తెలుగులో ‘అంతం’ ద్విభాషా చిత్రం).. మహేష్‌భట్‌ దర్శకత్వంలో మూడు సినిమాలు ‘క్రిమినల్’, ‘అంగారే’ (తెలుగులో రౌడీగా డబ్‌ అయింది), ‘జఖ్’ అనిల్‌ కపూర్, శ్రీదేవి కాంబినేషన్‌లో ‘మిస్టర్‌ బేచారా’, మళ్లీ అమితాబ్‌తో కలిసి ‘అగ్నివర్ష’, కార్గిల్‌ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఎల్‌వోసీ’లో మేజర్‌ పద్మపాణి ఆచార్య పాత్ర, మరోసారి అమితాబ్‌‌తో కలిసి ‘బ్రహ్మాస్త్ర’( తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’) లో కీలక పాత్రలు పోషించారు.

అక్కినేని నాగార్జున, సినిమా, యాక్టర్, తెలుగు సినిమా, టాలీవుడ్

ఫొటో సోర్స్, Annapurna Studios/Facebook

కొత్త దర్శకులను పరిచయం చేసే ఫ్యాక్టరీగా పేరు..

సహజంగా స్టార్‌ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేసేందుకు సాహసించరు.

కానీ, నాగార్జున మాత్రం సరికొత్త పంథాను ఎంచుకున్నారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశమిచ్చారు. తన బ్యానర్‌లో వేరే హీరోలతో కూడా నూతన దర్శకులతో సినిమాలు చేశారు.

నాగార్జున పరిచయం చేసిన దర్శకులంటే మొదట గుర్తొచ్చేది రాంగోపాల్‌ వర్మ. కానీ, శివకు ముందే తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే 1986లో సంకీర్తన సినిమాతో గీతాకృష్ణను దర్శకుడిగా పరిచయం చేశారు.

శివ తర్వాత.. జైత్రయాత్ర సినిమాతో ఉప్పలపాటి నారాయణరావు, రక్షకుడు సినిమాతో ప్రవీణ్‌ గాంధీ, నువ్వు వస్తావని చిత్రంతో వీఆర్‌ ప్రతాప్‌, నిన్నే ప్రేమిస్తా సినిమాతో ఆర్‌ ఆర్‌ షిండే, ఎదురులేని మనిషితో జొన్నలగడ్డ శ్రీనివాసరావు, మాస్‌ సినిమాతో రాఘవ లారెన్స్‌, సంతోషంతో దశరథ్‌, కేడీ సినిమాతో కిరణ్‌, సోగ్గాడే చిన్నినాయనతో కల్యాణ్‌ కృష్ణ, వైల్డ్ డాగ్‌ మూవీతో సాల్మన్, నాసామిరంగా సినిమాతో కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నిని దర్శకులుగా పరిచయం చేశారు నాగార్జున.

ఇక తాను నటించిన సినిమాలు కాకుండా.. తన నిర్మాణ సారథ్యంలో వైవీఎస్‌ చౌదరి, సూర్యకిరణ్, విరించి వర్మ, నాగకోటేశ్వరరావు వంటి వారిని దర్శకులుగా తెలుగు తెరకు పరిచయం చేశారు.

అలాగే, తాను నటించిన నిర్ణయం, కిల్లర్‌, చైతన్య సినిమాలతో తమిళ, మళయాళ దర్శకులు ప్రియదర్శన్, ఫాజిల్, ప్రతాప్‌ పోతన్‌తో పాటు క్రిమినల్‌ సినిమాతో బాలీవుడ్‌ డైరెక్టర్‌ మహేష్‌ భట్‌ను తెలుగుకి తీసుకొచ్చారు.

ఓ స్టార్‌ హీరోగా ఉంటూ తనతో పాటు ఇతర హీరోలు, నటులతో పాతికేళ్లుగా వరుసగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు.

అక్కినేని నాగార్జున, సినిమా, యాక్టర్, తెలుగు సినిమా, టాలీవుడ్

ఫొటో సోర్స్, Annapurna Studios/Facebook

'నా కంటే చిన్నవాడే, కానీ..'

అక్కినేని నాగేశ్వరరావు హయాం తర్వాత సోదరుడు అక్కినేని వెంకట్‌తో కలిసి అన్నపూర్ణ స్డూడియోస్‌ బాధ్యతలు చేపట్టారు.

తన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్‌ను సినీరంగంలోకి తీసుకురావడంతో పాటు వారి కంటే ముందుగానే మేనల్లుళ్లు సుమంత్, సుశాంత్‌లనూ పరిశ్రమకు పరిచయం చేసి పలు సినిమాలు నిర్మించారు.

సినీ నిర్మాత, ఆయన సోదరి నాగ సుశీల ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మాకు నాన్న తర్వాత నాగార్జునే. నాకంటే చిన్నవాడే.. కానీ, బాధ్యతలు తీసుకోవడంలో మాత్రం పెద్ద" అని వ్యాఖ్యానించారు.

నాగార్జున టెలివిజన్‌ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు.

చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్రహీరోలతో పాటు జూనియర్‌ ఎన్టీయార్, నాని సహా పలువురు హీరోలు బుల్లితెరపై వివిధ షోలతో కొన్నాళ్లు కనిపించినా.. నాగార్జున ఏకంగా వరుసగా పదేళ్లుగా బుల్లితెరపై అలరిస్తూనే ఉన్నారు.

2009లో ‘యువ’ అనే సీరియల్‌తో నిర్మాతగా టెలివిజన్‌ రంగంలోకి వచ్చిన నాగార్జున.. ఆ తర్వాత 2014లో "మీలో ఎవరు కోటీశ్వరుడు" షోను హోస్ట్‌ చేశారు.

ఇక 2019లో బిగ్‌బాస్‌ షోను తొలిసారి హోస్ట్‌ చేసిన నాగార్జున.. ఇప్పటివరకు 8 సీజన్‌లను నడిపించారు.

అక్కినేని నాగార్జున, సినిమా, యాక్టర్, తెలుగు సినిమా, టాలీవుడ్

ఫొటో సోర్స్, Annapurna Studios/Facebook

విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారంటూ ప్రచారం

నటనతో పాటు మంచి వ్యాపారవేత్తగానూ పేరుతెచ్చుకున్న అక్కినేని నాగార్జున రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. రాజకీయ నేతలతో సత్సంబంధాలున్నాయని చెబుతారు.

ప్రధానంగా, ఏపీలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో మొదటి నుంచి ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. దీంతో ఓ దశలో ఆయన విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.

వై.ఎస్. జగన్ అక్రమాస్తుల ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో, 2012లో అరెస్టైన వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను నాగార్జున జైలుకు వెళ్లి పరామర్శించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ సందర్భంలో, నిమ్మగడ్డ ప్రసాద్ తనకు మంచి స్నేహితుడని ఆయన మీడియాతో చెప్పారు.

అయితే, నిమ్మగడ్డ ప్రసాద్‌కి చెందిన వాన్ పిక్ ప్రాజెక్ట్‌లో నాగార్జునకు కూడా వాటాలు ఉన్నాయని ప్రచారం కూడా జరిగింది.

వీటిని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ నాగార్జునకు సత్సంబంధాలు ఉన్నాయని చెబుతారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దిల్లీ వెళ్లి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు.

బిగ్‌బాస్‌ షో హోస్ట్‌ చేయడంపై నాగార్జున తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‌‌లో నాగార్జునకి చెందిన ఎన్‌ కన్వెన్షన్‌‌ సెంటర్‌ను చెరువు స్థలం ఆక్రమించి కట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది.

దీనిపై స్పందిస్తూ, ''ముందుగా మాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, నేనే దాన్ని కూల్చేసేవాడిని'' అని ఆ సందర్భంలో నాగార్జున ట్వీట్‌ చేశారు.

అక్కినేని నాగార్జున, సినిమా, యాక్టర్, తెలుగు సినిమా, టాలీవుడ్

ఫొటో సోర్స్, Sarveswararao

అభిమానితో క్లాప్‌ కొట్టించి..

అక్కినేని నాగేశ్వరరావుకి ఉన్న అభిమానగణమంతా తొలి చిత్రం ‘విక్రమ్‌’తోనే నాగార్జునకు సపోర్ట్ చేసింది. ఆ తర్వాత గీతాంజలి, శివ, అన్నమయ్య, మన్మథుడు సినిమాలతో మరెంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

1990లో మురళీమోహన్‌ నిర్మించిన ‘నిర్ణయం’ సినిమాకి అభిమానులతోనే క్లాప్ కొట్టించి, కెమెరా స్విచాన్‌ చేయించారని.. ఆ సినిమాకి స్విచాన్‌ చేసిన ఆలిండియా అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షులు సర్వేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

వాస్తవానికి, నాగార్జున ఇటీవల కూలీ సినిమాలో నటించిన విలన్‌ పాత్ర అక్కినేని అభిమానులను బాధించగా, ఆయన సరికొత్త పంథాలో వెళ్లడాన్ని అప్పుడే తప్పు పట్టకూడదని సినీ విశ్లేషకులు భరద్వాజ బీబీసీతో అన్నారు.

మరోవైపు ,అభిమానులు మాత్రం 1997లో అక్షయ్‌ ఖన్నా హీరోగా వచ్చిన హిందీ సినిమా అంగారే (తెలుగులో రౌడీగా డబ్‌ చేశారు)లో నాగార్జున ఒకింత ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తే తాము బాధపడ్డామని, దాంతో అలాంటి సినిమాలు చేయనని అప్పట్లో చెప్పారని గుర్తు చేసుకున్నారు.

కుబేరుడు, కూలీ సినిమాలు వదిలేసి తాము కింగ్‌–100పైనే దృష్టి పెట్టామని విశాఖకు చెందిన నాగార్జున ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నేత చందురెడ్డి అన్నారు.

అభిమానులు అన్నట్టుగానే ఇటీవల జగపతిబాబు హోస్ట్‌ చేసిన షోలో మాట్లాడుతూ, "కింగ్‌–100వ సినిమాపై 6–7 నెలలుగా బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్‌ జరుగుతోంది. డైరెక్టర్‌ రా కార్తిక్‌ ఈ కథను ఏడాది క్రితమే చెప్పారు. గ్రాండ్‌గా రూపొందే ఆ సినిమాలో నేనే ప్రోటాగనిస్ట్’’ అంటూ వందో సినిమాతో వస్తున్నానని నాగార్జున అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)