ముగ్గురు పిల్లల్ని కనడం, బీజేపీ సంబంధాలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Youtube/Rashtriya Swayamsevak Sangh
దేశంలోని ప్రతీ పౌరుడు ముగ్గురు చొప్పున పిల్లల్ని కనాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
''దేశంలో ప్రతీ ఒక్కరికి 2.1 మంది పిల్లలు ఉండాలని మన దేశ పాలసీ సిఫార్సు చేస్తుంది. ఇది దేశ సగటు. ఈ లెక్క ప్రకారం చూస్తే, ఇద్దరి కంటే ఎక్కువ అంటే దేశంలోని ప్రతీ పౌరుడికి ముగ్గురు పిల్లలు ఉండాలి'' అని ఆయన వివరించారు.
''దేశాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ విషయం చెబుతున్నా. దేశంలో జనాభా సరిపడినంత ఉండాలి, అలాగే నియంత్రణలో ఉండాలి. ఈ లెక్కన ముగ్గురు పిల్లలు ఉండాలి. ముగ్గురి కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి'' అని ఆయన అన్నారు.

''ఇప్పుడు అందరిలోనూ జనన రేటు తగ్గుతోంది. హిందువులకు ఇదివరకే ఇది తక్కువగా ఉంది. ఇప్పుడు మరింతగా తగ్గింది. అయితే, ఇతర వర్గాల వారికి ఇది అంతగా తగ్గలేదు. ఇప్పుడు వారిలో కూడా తగ్గుతోంది'' అని ఆయన అన్నారు.
సంఘ్ స్థాపించి ఈ ఏడాదికి వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా రాజధాని దిల్లీలో ఆగస్ట్ 26 నుంచి 28 వరకు సంఘ్ వేడుకలు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, Youtube/Rashtriya Swayamsevak Sangh
బీజేపీతో సంబంధాల గురించి ఏమన్నారు?
ప్రభుత్వానికి సంబంధించి ప్రతీ నిర్ణయాన్ని సంఘ్ తీసుకుంటుందనే భావన పూర్తిగా తప్పు అని భాగవత్ అన్నారు.
''మేం కేవలం సలహాలే ఇస్తాం. ప్రభుత్వం పని చేస్తుంది. కానీ, నిర్ణయం వారిదే'' అని అన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో సంఘ్ జోక్యం చేసుకుంటుందా అని అడిగినప్పుడు, ''మేం నిర్ణయించం. ఒకవేళ మేమే నిర్ణయం తీసుకున్నట్లయితే ఇంత సమయం పడుతుందా? మేం దాన్ని నిర్ణయించాల్సిన అవసరం లేదు. మేం ఏమీ చెప్పం'' అని ఆయన బదులిచ్చారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంపై కూడా ఆయన మాట్లాడారు.
''ఇందులో మార్పు రావడాన్ని కూడా మేం గమనించాం. 1948లో జయ ప్రకాశ్ బాబు చేతిలో మండుతున్న టార్చ్ పట్టుకుని సంఘ్ కార్యాలయాన్ని తగలబెట్టడానికి వెళ్లారు. ఆ తర్వాత, ఎమర్జెన్సీ సమయంలో 'మీరే మార్పును తీసుకొస్తారని ఆశిస్తున్నాం' అని ఆయన అన్నారు.
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ వంటి వారు సంఘ్ కార్యక్రమాలకు వచ్చారు. వారి అభిప్రాయాలు మారలేదు. కానీ సంఘ్ గురించి ఉన్న అపోహలు మాత్రం తొలగిపోయాయి'' అని భాగవత్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














