గోరుచిక్కుడు గమ్: భారత్ నుంచి అమెరికా భారీగా దిగుమతి చేసుకునే ఈ గ్వార్ గమ్ ఏమిటి, ఎందులో ఉపయోగిస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాహ్నవి మూలె
- హోదా, బీబీసీ ప్రతినిధి
గోరు చిక్కుడు. మనకు ఆహారంలో ఉపయోగపడే కూరగాయే కాదు, భారత్‌కు మిలియన్ డాలర్లు కూడా సంపాదించి పెడుతోంది. అమెరికాకు పెద్దఎత్తున ఎగుమతీ అవుతోందని మీకు తెలుసా?
గ్వార్ లేదా క్లస్టర్ బీన్ లేదా గోరుచిక్కుడును దేశంలో ఓ కూరగాయగా ఉపయోగిస్తారు. అయితే గ్వార్ గమ్ అనే పదార్థాన్ని గోరుచిక్కుడు విత్తనాల నుంచి ఉత్పత్తి చేస్తారు.
పొడిరూపంలో ఉండే గ్వార్ గమ్‌కు విపరీతమైన డిమాండ్. దీనిని వివిధ రకాల పరిశ్రమల్లో ద్రావణాలను(లిక్విడ్స్) చిక్కగా చేసేందుకు స్టెబిలైజర్ లేదా బైండర్‌గా(కలిపి ఉంచే పదార్థం) ఉపయోగిస్తారు.
సాధారణంగా, గ్వార్ గమ్‌ను శిలాజ ఇంధనాల వెలికితీతలో వినియోగిస్తారు. ముఖ్యంగా.. ఫ్రాకింగ్ ద్వారా భూమి లోపలి నుంచి గ్యాస్, ముడిచమురును వెలికితీసేందుకు ఉపయోగించే షెల్‌రాక్‌లో దీనిని ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అంటారు.

ఈ ప్రక్రియలో గ్వార్ గమ్, ఇతర పదార్థాల మిశ్రమాన్ని రాళ్ల మధ్య పగుళ్లలోకి పంపిస్తారు, అది ఎలాంటి ఆటంకం లేకుండా చమురు బయటకు వచ్చేందుకు తోడ్పడుతుంది.
పెట్రోలియం పరిశ్రమతో పాటు ఆహార, ఔషధ, కాగిత, వస్త్ర పరిశ్రమల్లోనూ, సౌందర్య సాధనాల తయారీలోనూ ఈ గ్వార్ గమ్‌ను ఉపయోగిస్తారు.
గ్వార్ గమ్‌కు భారత్ ప్రధాన వనరుగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, ఆఫ్రికాల్లో కూడా గ్వార్‌ను సాగు చేస్తారు. కానీ, గ్వార్ ఉత్పత్తిలో 80 శాతం భారత్ నుంచే అవుతున్నట్లు అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవెలప్‌మెంట్ అథారిటీ (అపెడా) గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని గ్వార్ ఉత్పత్తిలో, 72 శాతం రాజస్థాన్ నుంచి ఉత్పత్తి అవుతోంది.
గుజరాత్, రాజస్థాన్, హరియాణాతో పాటు మహారాష్ట్రలోనూ గ్వార్ సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లోనూ ఈ పంట పండిస్తారు.
ఈ గోరుచిక్కుడు సాగుకు ఎండ, పరిమిత వర్షపాతం అవసరం. ఎక్కువ వర్షపాతం కురిస్తే ఈ మొక్క ఆకులను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. కానీ, కాయలు, అందులోని విత్తనాలు పెద్దగా పెరగవు.
అందువల్ల, వర్షాలు కొద్దిగా తగ్గిన సమయంలో.. అంటే జూలై - ఆగస్ట్‌లో ఈ గోరుచిక్కుడు పంటను నాటుతారు. అక్టోబర్ - నవంబర్ నెలల్లో పంట చేతికందుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో ఉత్పత్తయ్యే గ్వార్ గమ్‌లో 90 శాతం విదేశాలకు ఎగుమతి అవుతోంది.
గోరుచిక్కుడు, దాని నుంచి ఉత్పత్తైన గమ్ (గ్వార్ గమ్) వివిధ రూపాల్లో ఎగుమతి అవుతున్నాయి.
అపెడా తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, 2023 - 24లో భారత్ నుంచి 4,17,674 మెట్రిక్ టన్నుల గ్వార్ గమ్ ఎగుమతి అయింది. దాని విలువ 541.65 మిలియన్ డాలర్లు. అంటే సుమారు 4,753 కోట్ల రూపాయలు.
భారత్ గ్వార్ గమ్ అతిపెద్ద ఎగుమతిదారు కాగా, అమెరికా అతిపెద్ద దిగుమతిదారు. అలాగే, భారత్ నుంచి జర్మనీ, రష్యా, నార్వే, నెదర్లాండ్స్‌కు కూడా గ్వార్ గమ్ ఎగుమతి అవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
డోనల్డ్ ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత, అమెరికా చమురు, గ్యాస్ పరిశ్రమపై ఆంక్షలను ఎత్తేశారు. అది గ్వార్ గమ్ డిమాండ్‌ను మరింత పెంచుతుందని అంచనా వేశారు.
కానీ, భారత్‌పై ట్రంప్ సుంకాల నిర్ణయంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అనిశ్చితి నెలకొని ఉంది. ఇది గ్వార్ గమ్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














