ఫైటోసార్: చెరువును తవ్వుతుంటే దొరికిన ఈ అరుదైన జంతు అవశేషం గురించి అధికారులు ఏం చెప్పారు?

డైనోసార్ శిలాజాలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఈ ప్రాంతంలో మరిన్ని శిలాజాలు ఉండొచ్చని పరిశోధకులు అంటున్నారు
    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

జురాసిక్ యుగానికి చెందిన ఒక అరుదైన మొసలి లాంటి జంతువు శిలాజ అవశేషాలను భారత పరిశోధకులు కనుగొన్నారు.

ఫైటోసార్ అని పిలిచే ఈ శిలాజం పొడవు 1.5- 2 మీటర్లు ఉంది. ఇది 20 కోట్ల ఏళ్ల (200 మిలియన్) కిందటిది కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

జైసల్మీర్ జిల్లాలోని మేఘా గ్రామంలో ఈ శిలాజాన్ని సీనియర్ హైడ్రాలజిస్ట్ డాక్టర్ నారాయణదాస్ ఇంఖియా, ఆయన బృందం దీనిని వెలికి తీసింది.

ఈ ప్రాంతంలో మరిన్ని శిలాజాలు ఉండొచ్చని, చరిత్ర పరిణామ క్రమానికి సంబంధించిన కీలక ఆధారాలను ఇవి అందించవచ్చని బీబీసీతో చెప్పారు నారాయణదాస్.

''ఈ ప్రాంతం ఫాజిల్ టూరిజానికి ఒక ముఖ్య కేంద్రంగా మారొచ్చు'' అని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సరస్సును తవ్వుతుండగా..

ఫైటోసార్ ఒక పాక్షిక జలచర జీవి. అంటే ఇది నదుల్లోనూ, నేలపైనా జీవించిందని జియోసైంటిస్ట్ సీపీ రాజేంద్రన్ తెలిపారు.

''ఈ జీవి, తర్వాత్తర్వాత ఇప్పుడున్న మొసళ్లలాగా పరిణామం చెందింది'' అని ఆయన వివరించారు.

మేఘా గ్రామంలోని ఒక చెరువును తవ్వుతుండగా కొంతమంది గ్రామస్థులు ఈ శిలాజానికి సంబంధించిన అవశేషాలను గుర్తించారు.

నేలపై ఒక పెద్ద అస్థిపంజరంలా కనిపిస్తున్న ఈ అవశేషాలను చూసిన గ్రామస్థులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.

మొసలి వంటి జంతువు అవశేషాలను మొదట గ్రామస్థులు గుర్తించారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మొసలి వంటి జంతువు అవశేషాలను మొదట గ్రామస్థులు గుర్తించారు

చేపలను తింటూ జీవించిందా?

ఈ ప్రదేశంలో తవ్వినప్పుడు శిలాజంగా మారిన ఒక గుడ్డు వంటి నిర్మాణాన్ని కూడా పరిశోధకులకు దొరికింది. అది ఈ జంతువుకే సంబంధించినదని భావిస్తున్నారు.

''ఈ శిలాజం ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే ఫైటోసార్‌లా కనిపిస్తుంది. ఇది బహుశా లక్షల ఏళ్ల కిందట నది సమీపంలో నివసించి ఉండొచ్చు. చేపలను తింటూ జీవించి ఉండొచ్చు'' అని ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న సీనియర్ పాలియోంటాలజిస్ట్ వీఎస్ పరిహార్, న్యూస్ చానల్ ఎన్డీటీవీకి చెప్పారు.

''ఇప్పటివరకు ఫైటోసార్‌లోని కొన్ని భాగాలు మాత్రమే దొరికాయి. కాబట్టి ఇప్పుడు లభించిన ఈ అవశేషాలు బహుశా అరుదైన శిలాజాలు'' సీపీ రాజేంద్రన్ అన్నారు.

జైసల్మీర్ అనేది లాఠీ ఫార్మేషన్ అనే భౌగోళిక నిర్మాణంలో ఒక భాగం. ఇక్కడ జురాసిక్ యుగంలో డైనోసార్‌లు విరివిగా ఉండేవని ఇంఖియా చెప్పారు.

జైసల్మీర్‌ ప్రాంతంలో ఇంఖియా 2023లో ఒక గుడ్డు శిలాజాన్ని కనుగొన్నారు. అదొక డైనోసార్ గుడ్డు అని భావిస్తున్నారు.

దేశంలో ఇంతకు ముందెన్నడూ గుర్తించని అత్యంత పురాతన శాకాహార డైనోసార్ శిలాజాలను 2018లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు వెలికితీశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)