అమెరికా సుంకాలు: భారత్‌ను నిలబెట్టే 5 బలాలేమిటో తెలుసా?

భారత్

ఫొటో సోర్స్, Getty Images

"నేడు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ఆర్థిక స్వార్థంతోనే నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఎవరి పనులు వారు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. మేం దీనిని బాగా గమనిస్తున్నాం. మాపై ఒత్తిడి పెరగవచ్చు, కానీ, బలంగా నిలబడతాం" .

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించింది. అంటే ఆగస్టు 27న ఇండియాపై మొత్తం 50 శాతం సుంకం అమలు కానుంది.

ఈ నేపథ్యంలో సోమవారం అహ్మదాబాద్ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి 'స్వావలంబన, స్వదేశీ' పునాది అని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్ స్వావలంబనను పునాదిగా చేసుకుందని ఆయన అన్నారు.

మన రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు బలంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని మోదీ తెలిపారు. తన ప్రభుత్వం రైతులు, దుకాణదారులు, పశుపోషకుల ప్రయోజనాలను కాపాడుతూనే ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

ఇక, మంగళవారం గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో ఆయన స్వదేశీకి తన నిర్వచనాన్ని ఇచ్చారు. భారతదేశంలో జపాన్ చేస్తున్న ఉత్పత్తి కూడా 'స్వదేశీ' అన్నారు.

"జపాన్ ఇక్కడ తయారు చేస్తున్న వస్తువులు కూడా స్వదేశీనే. స్వదేశీకి నా నిర్వచనం చాలా సులభం. ఎవరి డబ్బును ఉపయోగిస్తున్నారనేది కాదు. అది డాలర్ లేదా పౌండ్ లేదా కరెన్సీ నలుపు లేదా తెలుపు అనే దానితో సంబంధం లేదు. కానీ, ఏ ఉత్పత్తి చేసినా అది నా ప్రజల చెమట ద్వారానే అవుతుంది" అన్నారు మోదీ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత ప్రభుత్వం, సుంకాలు, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, P.A.

ఫొటో క్యాప్షన్, సోమవారం అహ్మదాబాద్ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధించడం మోదీ ప్రభుత్వానికి, భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు నిపుణులు.

అయితే ఎప్పటికప్పుడు వచ్చే ఈ షాక్‌లను ఎదుర్కోవడానికి శాశ్వత ఏర్పాటు ఉండాలని, భారత ఆర్థిక వ్యవస్థకు ఈ బలం ఉందని ప్రధాని మోదీ పలు వేదికల నుంచి చెబుతున్నారు.

  • ఇంతకీ, భారత ఆర్థిక వ్యవస్థకు 'బయటి దేశాల షాక్‌లను' తట్టుకునే సామర్థ్యం ఉందా?. 'స్వావలంబన, స్వదేశీ' విశ్వాసం వెనుక బలమేంటి?.
భారత్; సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
భారత్, సుంకాలు

నిజానికి, గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంపై విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి దిశలో ఉంది. సుంకాల వార్తల నేపథ్యంలో కూడా, రేటింగ్ ఏజెన్సీలైన ఎస్ అండ్ పీ, ఫిచ్ కూడా భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేశాయి.

ఫిచ్ ప్రకారం, భారత్ అమెరికాకు చేసే ఎగుమతులు దాని మొత్తం జీడీపీలో దాదాపు 2 శాతం, కాబట్టి భారత జీడీపీపై సుంకాల ప్రభావం స్వల్పంగా ఉంటుంది.

"2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే తక్కువ కాదు" అని ఫిచ్ రిపోర్టు పేర్కొంది.

మరో రేటింగ్ ఏజెన్సీ 'ఎస్ అండ్ పీ గ్లోబల్' 18 సంవత్సరాల తర్వాత భారత్ రేటింగ్‌ను పెంచింది. భారత దీర్ఘకాలిక సావరిన్ రేటింగ్‌ను 'BBB-' నుంచి 'BBB'కి పెంచింది. అంటే దీనర్థం ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ పెరిగిందని.

  • భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది. కోవిడ్ తర్వాత ఇది బలంగా కోలుకోందని, స్థిరమైన వృద్ధిని చూపుతోందని తెలిపింది.
సుంకాలు, దేశీయ మార్కెట్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
భారత్, సుంకాలు

ప్రపంచ మొత్తం వినియోగంలో 2050 నాటికి భారత వాటా 16 శాతానికి పెరగవచ్చు. ఇది 2023లో కేవలం 9 శాతం మాత్రమే. ఈ సంవత్సరం మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన నివేదికలో ఈ సమాచారం ఉంది.

2050 నాటికి, ఉత్తర అమెరికా మాత్రమే 17 శాతం వాటాతో ఇండియా కంటే ముందుంటుందని తెలిపింది.

కొనుగోలు శక్తి సమానత్వం(పీపీపీ) ఆధారంగా ఈ అంచనా వేసింది.

ఇది దేశాల మధ్య ధర వ్యత్యాసాలను సమానం చేస్తుంది.

  • ప్రపంచ మొత్తం వినియోగంలో భారత్ వాటా పెరగడానికి కారణం ఇక్కడ పెద్ద సంఖ్యలో యువ జనాభా ఉండటం.
భారత్, సుంకాలు

జీఎస్టీ అధికారిక డేటా ప్రకారం, ఇండియాలో 2025 మే నెలలో జీఎస్టీ వసూళ్లు 16.4 శాతం పెరిగి, రూ. 2,01,050 కోట్లకు చేరుకున్నాయి. 2024 మేలో ఈ వసూళ్లు రూ. 1,72,739 కోట్లు మాత్రమే.

అంతకుముందు, ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 2.37 లక్షల కోట్లు.

  • జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వ ఖజానా నింపుతున్నాయి. దేశీయంగా భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తోందని ఇది నిరూపిస్తోంది.
వస్తువుల కొనుగోలు, భారత్, సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
భారత్, సుంకాలు

ఈ ఏడాది జూలైలో విడుదలైన ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నివేదిక ప్రకారం, బలమైన దేశీయ డిమాండ్, వడ్డీ రేట్ల తగ్గింపు తదితరాల కారణంగా భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతం వరకు ఉంటుందని, వచ్చే ఏడాది కూడా బలంగా ఉంటుందని అంచనా.

ఈ సంవత్సరం దేశంలో ద్రవ్యోల్బణం 3.8 శాతం, 2026లో 4 శాతం ఉంటుందని నివేదిక పేర్కొంది.

  • ఏడీబీ ప్రకారం, ఆహార వస్తువుల ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 1.55 శాతానికి తగ్గింది. గత ఎనిమిది సంవత్సరాలలో ఇదే అత్యల్ప స్థాయి. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 2.1 శాతంగా ఉంది.
వస్తువుల కొనుగోలు, భారత్, సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
భారత్, సుంకాలు

చైనా వంటి దేశాలతో పోటీ పడటానికి, విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి, భారత్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించాల్సి ఉంటుంది. భూమి, నీరు, విద్యుత్తులో సంస్కరణల అవసరాన్ని నిపుణులు ఇప్పటికీ నొక్కి చెబుతున్నారు.

అయితే, మోదీ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిసారీ మౌలిక సదుపాయాలపై ఎక్కువ నిధులు ఖర్చు చేయడం గురించి మాట్లాడుతోంది.

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఫిబ్రవరి 1న చేసిన బడ్జెట్ ప్రసంగంలో మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై కీలక ప్రకటనలు చేశారు. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు వడ్డీ లేకుండా రూ. 1.5 లక్షల కోట్ల వరకు రుణ మంజూరు కూడా ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)