భారత్‌పై ట్రంప్ సెకండరీ టారిఫ్‌లు: ‘‘రష్యాతో వ్యాపారం చేసే చైనా, యూరోపియన్ యూనియన్‌పై ఈ టారిఫ్‌లు విధించలేదే?’’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చెరిలాన్ మోలాన్
- హోదా, బీబీసీ న్యూస్, ముంబయి
దేశంలోని 140 కోట్ల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, 'బెస్ట్ డీల్' ఉన్న చోట నుంచే చమురు కొనుగోలును భారత్ కొనసాగిస్తుందని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ స్పష్టం చేశారు.
రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై డోనల్డ్ ట్రంప్ 25 శాతం పెనాల్టీతో కలిపి విధించిన 50 శాతం టారిఫ్‌ల అమలుకు కొన్ని రోజుల ముందు వినయ్ కుమార్ ఈ ప్రకటన చేశారు.
రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికి, యుక్రెయిన్‌తో యుద్ధం ఆపేలా ఒత్తిడి పెంచడానికి భారత్‌పై ట్రంప్ సెకండరీ టారిఫ్‌లు (నేరుగా రష్యాపై కాకుండా, ఆ దేశంతో వ్యాపారం చేసే ఇతర దేశాలపై సుంకాలు విధించడం) విధించారని సోమవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు.
ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా చౌక ముడి చమురును భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకోవడంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాణిజ్య ఒప్పందం చర్చలు కూడా దీనివల్ల ప్రభావితమయ్యాయి.


ఫొటో సోర్స్, Getty Images
భారత చమురు దిగుమతుల్లో రష్యా క్రూడాయిల్ వాటా 2021లో 3 శాతం ఉండగా, 2024లో 35-40 శాతానికి పెరిగింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల యుక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు నిధులు సమకూరేందుకు భారత్ సహకరిస్తోందంటూ అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణను భారత్ ఖండిస్తోంది.
భారత వాణిజ్యం, మార్కెట్ అంశాలపై అధారపడి ఉందని, దేశ ప్రజల ఇంధన భద్రతకే కట్టుబడి ఉందని సోమవారం రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్‌తో వినయ్ కుమార్ అన్నారు.
భారత్‌పై ట్రంప్ సెకండరీ టారిఫ్‌ల విధింపు 'అన్యాయం, అహేతుకం, అసమంజసం' అని ఆయన పునరుద్ఘాటించారు.
రష్యా క్రూడాయిల్‌ను భారత్ కొనుగోలు చేయడాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గట్టిగా సమర్థించారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే వినయ్ కుమార్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
‘‘వాణిజ్యానికి అనుకూలంగా ఉన్న అమెరికా పాలకవర్గంలో పనిచేసే వ్యక్తులే ఇతరులు వ్యాపారం చేస్తున్నారంటూ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. ఇంకా చెప్పాలంటే, రష్యా చమురుకు అతిపెద్ద దిగుమతిదారు అయిన చైనా, రష్యాతో పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తున్న యూరోపియన్ యూనియన్‌పై ట్రంప్ సెకండరీ టారిఫ్‌లు విధించలేదు. భారత్ వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గదు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
భారత్‌కు అత్యంత ముఖ్య మిత్రదేశాల్లో రష్యా ఒకటి కాగా, యుక్రెయిన్‌తో కూడా భారత్ స్నేహపూర్వక సంబంధాలనే కొనసాగిస్తోంది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి చర్చలు, దౌత్యం ద్వారా శాంతిపూర్వక పరిష్కారం దిశగా పనిచేయాలని భారత్ పదే పదే చెబుతోంది. అయితే, పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యాను బహిరంగంగా భారత్ ఇప్పటివరకు ఖండించలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ 2024లో యుక్రెయిన్‌ను సందర్శించారు. వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది.
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియన్‌స్కీ త్వరలోనే భారత్‌కు రావొచ్చని, తేదీలు ఇంకా ఖరారు కాలేదని సోమవారం స్థానిక మీడియాతో భారత్‌లోని యుక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్చెక్ చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కూడా ఈ ఏడాది భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.
యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలపై వాన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.
''ఒకవేళ ఈ హత్యలను ఆపేస్తే రష్యాను తిరిగి ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఆహ్వానించే అవకాశం ఉందని ట్రంప్ చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, వాళ్లు ఈ హత్యలను ఆపకపోతే ఇలాగే ఒంటరిగానే మిగిలిపోతారు'' అని వాన్స్ వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














