వాజపేయీ విదేశాంగ విధానం ఎలా ఉండేది? 1998 అణు పరీక్షల సమయంలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Tide Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకం విధించినప్పుడు.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయకుండా భారత్‌పై ఒత్తిడి పెంచడమే దీని లక్ష్యం అన్న విశ్లేషణలు వినిపించాయి.
"రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ యంత్రాంగానికి భారత్ ఇంధనం నింపుతోంది" అని కూడా అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అన్నారు.
భారత విధానాలను అమెరికా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు.
1998లో అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్‌పై అమెరికా అనేక ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది.
"వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి క్లింటన్ బెదిరింపు సందేశం పంపించారు, 'నేను బెర్లిన్ వెళ్తున్నాను. అక్కడికి చేరుకోవడానికి నాకు ఆరు గంటలు పడుతుంది. అప్పటికి భారత ప్రభుత్వం బేషరతుగా సీటీబీటీపై సంతకం చేస్తే, దానిపై నేను ఎలాంటి ఆంక్షలు విధించను' అని క్లింటన్ అన్నట్టు భారత అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న దౌత్యవేత్త టి.పి. శ్రీనివాసన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
"మిగిలిన అణు పరీక్షలు మరుసటి రోజు మధ్యాహ్నం పూర్తయ్యేవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాన మంత్రి కార్యాలయం భారత రాయబారి నరేశ్ చంద్రకు తెలిపింది"
"ఇకపై అణు పరీక్షలు నిర్వహించబోమని, సీటీబీటీపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మే 13న ప్రకటించింది''
చాలా రోజుల పాటు సాగిన తెరవెనుక దౌత్యం, జస్వంత్ సింగ్, స్ట్రోవ్ టాల్బోట్ మధ్య అనేక సమావేశాల తర్వాత, అమెరికాను తన వైపు తిప్పుకోవడంలో భారత్ విజయం సాధించింది.


ఫొటో సోర్స్, Getty Images
ఇరాక్‌పై అమెరికా దాడితో సందిగ్ధంలో భారత్
2003లో హోలీ సందర్భంగా, అటల్ బిహారీ వాజపేయీ తన నివాసం 7 రేస్ కోర్స్ రోడ్‌లోని లాన్‌లో ఉన్నప్పుడు, మంత్రులు, శ్రేయోభిలాషులంతా ఆయన చుట్టూ చేరారు.
ఎవరో ఆయనకు తలపాగా పెట్టారు. విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా, అన్ని ఫార్మాలిటీస్‌ను పక్కన పెట్టి హోలీ పాట పాడటం ప్రారంభించారు.
అక్కడున్నవారి కోరిక మేరకు వాజపేయీ కూడా కాళ్లు, చేతులు కదుపుతూ నృత్యం చేయడానికి ప్రయత్నించారు.
ప్రధానమంత్రిగా ఆయన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
అభిషేక్ చౌధురి ఇటీవల ప్రచురించిన అటల్ బిహారీ వాజపేయీ జీవిత చరిత్ర 'బిలీవర్స్ డైలమా'లో ఇలా రాశారు.
"వాజపేయీ కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలని కోరుకున్నారు, కానీ ఇరాక్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉండటంతో ఇందులో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఇరాక్ సామూహిక విధ్వంసక ఆయుధాల ముప్పు నుంచి తన దేశాన్ని రక్షించుకోవాలని అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ కోరుకున్నారు"
"ప్రారంభంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్‌తో ఉన్న వాజపేయీ, ఐక్యరాజ్యసమితి తీర్మానాలను పాటించాలని, సామూహిక విధ్వంసక ఆయుధాలను నాశనం చేయాలని ఇరాక్‌ను కోరారు"

ఫొటో సోర్స్, Indian Picador
యుద్ధం న్యాయబద్ధతపై భారత్ సందేహాలు
ఐక్యరాజ్యసమితి పరిశీలకులు ఇరాక్‌లోని 300 ప్రదేశాలను తనిఖీ చేశారు. కానీ సామూహిక విధ్వంసక ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు ఏవీ దొరకలేదు. అయినప్పటికీ, బుష్ వెనక్కి తగ్గలేదు.
"తాలిబన్లను అధికారం నుంచి తొలగించడం సరిపోదు. ఇస్లామిక్ తీవ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలనే అమెరికా లక్ష్యాన్ని ఇది పూర్తిగా తీర్చలేదు" అని మాజీ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసింజర్ నిర్మొహమాటంగా చెప్పారు.
అయితే, ప్రపంచంలోని అనేక దేశాలు దీనిని వ్యర్థమైన యుద్ధంగా భావించాయి, దీనికి ఎలాంటి సమర్థన దొరకలేదు.
"ఈ యుద్ధం వల్ల భారతదేశం లాభం కంటే ఎక్కువ నష్టపోబోతోంది, ఎందుకంటే భారతదేశం పూర్తిగా గల్ఫ్ చమురుపై ఆధారపడి ఉంది. ఎన్నికల సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరగడం ఏ ప్రభుత్వానికైనా చెడ్డ వార్త" అని అభిషేక్ చౌధురి రాశారు.
"ఈ సంక్షోభం ప్రభావం వల్ల చమురు రంగం వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని ప్రభుత్వం గ్రహించింది. ఈ కారణంగానే హిందూస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కంపెనీల ప్రైవేటీకరణ నిలిపివేసింది. గల్ఫ్‌లో పనిచేస్తున్న 40 లక్షల మంది భారతీయులను సురక్షితంగా తీసుకురావడం గురించి ప్రభుత్వం ఆందోళన చెందడం ప్రారంభించింది"
"గుజరాత్ అల్లర్ల తర్వాత, భారత్‌లో నివసిస్తున్న ముస్లింలు బాగ్దాద్‌ను అమెరికా ఆక్రమించడాన్ని తీవ్రంగా, బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు" అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా నిర్ణయానికి లభించని విస్తృత మద్దతు
మార్చి 17 నాటికి ఇరాక్ తన వద్ద ఉన్న అన్ని సామూహిక విధ్వంసక ఆయుధాలన్నీ అప్పగించాలని డిమాండ్ చేస్తూ భద్రతా మండలిలో అమెరికా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
"ఈ ప్రతిపాదనపై ఓటింగ్ జరగాల్సిన రోజున, తీర్మానం వీగిపోతుందన్న భయంతో అమెరికా దానిని ఉపసంహరించుకుంది. రెండు రోజుల తర్వాత, ఇరాక్‌పై బుష్ దాడి చేశారు'' అని జీన్ ఎడ్వర్డ్ స్మిత్ తన పుస్తకం 'బుష్'లో రాశారు.
"దేవుడి ఉద్దేశాన్ని అమలుచేసిన వ్యక్తిగా, ఇరాక్‌లో నియంతృత్వాన్ని అంతం చేసి, అక్కడ పాశ్చాత్య తరహా ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకున్న వ్యక్తిగా ఆయన తనను అభివర్ణించుకున్నారు. కానీ చాలా దేశాలు ఇరాక్‌పై అమెరికా చేస్తున్న యుద్ధంలో చేరడానికి నిరాకరించాయి"

ఫొటో సోర్స్, imon & Schuster
అమెరికా దాడిని ఖండించిన భారత పార్లమెంట్
'ఏ దేశంలోనైనా పాలనను మార్చడానికి ఒక అగ్రరాజ్యం బలప్రయోగం చేయడం తప్పు. దానిని సమర్థించలేం' అని స్పష్టంగా చెప్పమని భారత పార్లమెంటులో ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది.
ఆ తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ "ఇరాక్‌లో జరుగుతున్న సైనిక చర్యను సమర్థించలేం" అని పేర్కొంది.
తర్వాత రోజు, వాజపేయీకి బుష్ ఫోన్ చేసి భారత్ నిరసనను కొంచెం తగ్గించమని అభ్యర్థించారు.
మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా తన ఆత్మకథ 'రెలెంట్‌లెస్'లో ఇలా రాశారు.
''ఇరాక్‌పై అమెరికా దాడి చేసినప్పుడు భారత్‌లో పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. తాను అమెరికా వ్యతిరేకని ప్రపంచానికి చూపించాలని కాంగ్రెస్ అనుకుంది. అమెరికా చర్యను పార్లమెంటు ఖండించాలని, లేకుంటే సమావేశాలు సాగనివ్వబోమని పట్టుబట్టింది''
"వ్యక్తిగతంగా, నేను ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాను. అంటే ఇరాక్‌లో అమెరికా చర్యకు నేను మద్దతు ఇస్తున్నానని కాదు, కానీ పార్లమెంటు ప్రతిపాదన ప్రభుత్వ విధానంలో సౌలభ్యాన్ని పరిమితం చేస్తుందని నేను భయపడుతున్నాను"
"తరువాత, పార్లమెంటు సమావేశాలు సాగేందుకు వీలుగా, మేం ఒక తీర్మానాన్ని ఆమోదించాం, అందులో మేము 'నిందా' అనే హిందీ పదాన్ని ఉపయోగించాము, కానీ ఇంగ్లీషులో మాత్రం 'డిప్లోర్' అనే పదం వాడాం. ఇది 'నిందా' కంటే తీవ్రత తక్కువైన పదం'' అని యశ్వంత్ సిన్హా రాశారు.

ఫొటో సోర్స్, Bloomsbury
ఇరాక్‌కు సైన్యాన్ని పంపాలని భారత్‌ను కోరిన అమెరికా
భారత్-అమెరికా సంబంధాలలో మరో ఇబ్బంది తలెత్తింది.
అప్పటి జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా వాషింగ్టన్ పర్యటన సందర్భంగా.. యుద్ధం తర్వాత పంపే స్థిరీకరణ బలగాల కోసం భారత సైన్యాన్ని పంపాలని అమెరికా కోరింది.
మిశ్రా దీనికి అనుకూలంగా ఉన్నారు. అంతకుముందు, మిశ్రా 'ఇస్లామిక్ ఉగ్రవాదం'పై పోరాడటానికి భారతదేశం-అమెరికా-ఇజ్రాయెల్ కూటమిని సమర్థించారు.
జూన్ 2003లో అమెరికా పర్యటన సందర్భంగా, అమెరికా ఉపాధ్యక్షుడితో జరిగిన సమావేశంలో ఎల్.కె. అడ్వాణీ కూడా దళాలను పంపడానికి భారతదేశం సుముఖంగా ఉందన్న సంకేతాలిచ్చారు.
నిజానికి, ఈ శాంతి దళంలో భారత్, పాకిస్తాన్ రెండూ తమ సైనికులను పంపాలని అమెరికా కోరింది. ఉత్తర ఇరాక్‌లో పరిపాలన నిర్వహణకు భారత్ తన విభాగాల్లో ఒకదాన్ని పంపాలని అమెరికా ప్రత్యేకంగా కోరింది.
"భారత పత్రికలలో ఒక వర్గం ఈ ప్రతిపాదనను భారత్ అంగీకరించాలని కోరుకుంది, ఎందుకంటే ఇది భారత్-అమెరికా సంబంధాలలో మార్పును తీసుకురాగలదు. దీనికి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి"
''భారత సైన్యానికి శాంతిని కాపాడటంలో చాలా అనుభవం ఉంది, దాని ఇమేజ్ బాగుంది. వారి సంఖ్య కూడా సరిపోతుంది కాబట్టి శాంతి పరిరక్షక దళంలో భారతదేశం పాల్గొనాలని అమెరికా కోరుకుంటోందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మిషన్‌లో పంపాల్సిన యూనిట్లను కూడా భారత సైన్యం షార్ట్‌లిస్ట్ చేసింది'' అని యశ్వంత్ సిన్హా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ప్రతిపాదనకు వ్యతిరేక వాతావరణం సృష్టించిన వాజపేయీ
"జస్వంత్ సింగ్, బ్రజేశ్ మిశ్రాతో పాటు, అడ్వాణీ, భారత సైన్యంలోని సీనియర్ అధికారులు కూడా ఇరాక్‌కు భారత సైనికులను పంపడానికి అనుకూలంగా ఉన్నారు. అమెరికాను వ్యతిరేకిస్తారన్న పేరున్న జార్జ్ ఫెర్నాండెజ్ దానిని బహిరంగంగా సమర్ధించలేదు" అని పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేసి, తరువాత విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన శివశంకర్ మీనన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
కానీ దీనిపై వాజపేయీ ఎటువంటి కచ్చితమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదు. వాజపేయీకి ఒక లేఖ రాసిన సోనియాగాంధీ అలాంటి చర్యను వ్యతిరేకించారు.
"వాజపేయీ వెంటనే సోనియా గాంధీని సమావేశానికి పిలిచారు. ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్, నట్వర్ సింగ్‌లతో కలిసి సోనియా ఆయనను కలవడానికి వచ్చారు. వాజపేయీ ఆమె అభిప్రాయాలను చాలా జాగ్రత్తగా విన్నారు. ఆయన ఈ విషయాన్ని తన ఎన్డీఏ మిత్ర పక్షాలతోనూ చర్చించారు" అని యశ్వంత్ సిన్హా రాశారు.
"భారతదేశం ఇరాక్‌కు సైన్యాన్ని పంపాలన్న ఆలోచనను చాలా మంది సమర్థించలేదు. వైద్య బృందాన్ని పంపడాన్ని కూడా వ్యతిరేకించారు. అప్పుడు వాజపేయీ అందరి అభిప్రాయాలను తీసుకొని చివరికి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించారు. తనకు దగ్గరగా ఉన్న వ్యక్తుల అభిప్రాయాలను విస్మరించడానికి ఉత్తమ మార్గం దానికి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని సృష్టించడమేనని ఆయన నమ్మారు'' అని సిన్హా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
దళాలను పంపకూడదని నిర్ణయించిన ప్రభుత్వం
ఈ అంశంపై వాజపేయీ ఇతర పార్టీల సభ్యుల అభిప్రాయాన్ని కూడా కోరారు. కమ్యూనిస్టులను మరింత గట్టిగా వ్యతిరేకించమని కూడా ఆయన సూక్ష్మంగా రెచ్చగొట్టారు.
"సమావేశంలో అడ్వాణీ మౌనంగా ఉన్నారు. వాజపేయీ ఆయనను.. ‘మీరు ఏమనుకుంటున్నారు? అందరూ భారత సైనికులను పంపడానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు’ అన్నారు" అని భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ సమావేశం వివరాల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శివశంకర్ మీనన్ చెప్పారు.
"నిశ్శబ్దం మరింత పెరగడానికి వాజపేయీ అనుమతించారు. తర్వాత ఆయన ఇలా అన్నారు, 'ఈ ఆపరేషన్‌లో పిల్లలు చనిపోయే తల్లులకు నేను ఏమి చెప్పాలి?' సమావేశంలో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. వాజపేయీ నిశ్శబ్దాన్ని ఛేదించి, 'లేదు, మన పిల్లలను అక్కడికి పంపలేం' అని అన్నారు"

ఫొటో సోర్స్, Getty Images
స్నేహంతో పాటు స్వతంత్ర విదేశాంగ విధానం
ఈ విషయంలో మొదట ఐక్యరాజ్యసమితి మద్దతు తీసుకోవాలని జూలై వరకు భారతదేశం అమెరికాకు చెబుతూ వచ్చింది. కానీ అది సాధ్యం కాలేదు. తన చేతులు కట్టేశారని చెప్పడం ద్వారా సమస్య నుంచి బయటపడటానికి వాజపేయీ ఒక మార్గాన్ని కనుగొన్నారు.
ఇరాక్ వద్ద సామూహిక విధ్వంసక ఆయుధాలు లేవని ఆ సంవత్సరం చివర్లో స్పష్టమైనప్పుడు, వాజపేయీ మొదటిసారిగా బహిరంగంగా మాట్లాడారు. "స్నేహపూర్వక దేశంలో మన సైనికులు బుల్లెట్లకు బలైపోవాలని మేము కోరుకోం" అని అన్నారు.
"దీనర్థం అమెరికాతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని వాజపేయీ కోరుకోలేదని కాదు. కానీ అమెరికా చెప్పిన ప్రతిదానికీ భారతదేశం అంగీకరించాలని ఆయన కోరుకోలేదు. సమానత్వం, అన్యోన్యత, పరస్పర గౌరవం సంబంధాల్లో ముఖ్యమైనవైని వాజపేయీ భావన" అని యశ్వంత్ సిన్హా రాశారు.
"కార్గిల్ యుద్ధం సమయంలో వాజపేయీ, నవాజ్ షరీఫ్‌లను బిల్ క్లింటన్ వాషింగ్టన్‌కు ఆహ్వానించినప్పుడు అక్కడకు వెళ్లడానికి వాజపేయీ నిరాకరించారు. భారత గడ్డపై ఒక్క పాకిస్తానీ కూడా లేనప్పుడే తాను అమెరికాకు వెళ్తానని చెప్పి వాజపేయీ అక్కడికి వెళ్లడానికి నిరాకరించారు"

ఫొటో సోర్స్, Getty Images
సిక్కిం అంశంపై చైనాను ఒప్పించిన వాజపేయీ
అదేవిధంగా, భారతదేశం ఒకసారి చైనా నుంచి ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చింది. 2003 జులైలో అటల్ బిహారీ వాజపేయీ చైనాను సందర్శించారు. చర్చల అజెండాలో ప్రధానమైనది వాణిజ్యం కోసం నాథు లా పాస్‌ను ప్రారంభించడం.
రెంకింగ్‌గాంగ్‌ను చైనాలో భాగంగా భారతదేశం అంగీకరించింది, కానీ నాథు లాను సిక్కింలో అంటే భారతదేశంలో భాగంగా అంగీకరించడానికి చైనా తటపటాయిస్తోంది. బ్రజేశ్ మిశ్రా, ఇతర భారత దౌత్యవేత్తలు చైనాను ఒప్పించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు, కానీ విజయం సాధించలేదు.
"సమస్యను పరిష్కరించడానికి, ఉమ్మడి ప్రకటనపై వాజపేయీ సంతకం చేశారు, ఇది విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులకు నచ్చలేదు. పత్రికలు దీని గురించి ఆయనను ప్రశ్నించినప్పుడు, భారత్ ప్రయోజనాలతో రాజీ పడలేదని ఆయన ఖండించారు" అని అభిషేక్ చౌధురి రాశారు.
"రెండు దేశాలు ఒకదానికొకటి ఉద్దేశాలను అనుమానిస్తూనే ఉన్నాయి. సరిహద్దులోని ఇతర ప్రాంతాలలో వివాదాలు కొనసాగాయి, కానీ తర్వాత చైనా తన మ్యాప్‌లలో సిక్కింను భారతదేశంలో భాగంగా చూపించడం ప్రారంభించింది"

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ప్రధానమంత్రితో ఫోన్ కాల్
మరోవైపు, పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపర్చడానికి కూడా వాజపేయీ చొరవ తీసుకున్నారు. కార్గిల్‌లో యుద్ధం ఉన్నప్పటికీ, ఆయన కశ్మీర్‌లో పర్యటించారు "మేం మీ దుఃఖాన్ని, బాధను పంచుకోవడానికి వచ్చాం" అని చెప్పారు.
"కశ్మీరీ ప్రజలు గతాన్ని మరచిపోయి మానవత్వం, ప్రజాస్వామ్యం, కశ్మీరీయత్ సూత్రాలను అనుసరించడం ప్రస్తుత అవసరం" అని ఆయన అన్నారు.
మరుసటి రోజు, కశ్మీర్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో, "పాకిస్తాన్ ఇవాళ సీమాంతర ఉగ్రవాదాన్ని వదిలేశామని ప్రకటిస్తే, నేను రేపు ఇస్లామాబాద్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారిని పంపుతాను" అని అన్నారు.
"మనం చర్చల ద్వారా మన విభేదాలను పరిష్కరించుకోవడం ఇప్పుడు మరింత ముఖ్యం" అని ఇరాక్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఆయన అన్నారు.
ఈ ప్రకటన తర్వాత పది రోజులకు, పాకిస్తాన్‌కు కొత్తగా ఎన్నికైన ప్రధాన మంత్రి.. వాజపేయీకి ఫోన్ చేసి, రైలు, బస్సు, విమాన సేవలను పునరుద్ధరించుకుందామని, రెండు దేశాల హైకమిషన్లను తిరిగి పాత స్థితికి తీసుకొద్దామని ప్రతిపాదించారు.
అక్కడి నుంచి, రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ అంతరం తొలగిపోవడం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌తో నేరుగా చర్చలు
2004 జనవరిలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో సార్క్ శిఖరాగ్ర సమావేశం జరుగుతుందని ప్రకటించినప్పుడు, సరిహద్దు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పాకిస్తాన్ తన నిబద్ధతను అధికారికంగా ప్రదర్శిస్తే, సార్క్ సమావేశానికి తాను హాజరు కావాలనుకుంటున్నానని వాజపేయీ సంకేతాలిచ్చారు.
"వాజపేయీ హాజరు కాకపోతే శిఖరాగ్ర సమావేశానికి అంత ప్రాముఖ్యం ఉండదని ముషారఫ్‌కు తెలుసు. పాకిస్తాన్ మా డిమాండ్లకు అంగీకరించకపోతే, వాజపేయీ తన స్థానంలో మరొకరిని పాకిస్తాన్‌కు పంపుతారని మేం చివరి నిమిషం వరకు ఆయనకు చెబుతూనే ఉన్నాం. చివరికి, పాకిస్తాన్ మా డిమాండ్లకు అంగీకరించాల్సి వచ్చింది" అని పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్, తరువాత విదేశాంగ కార్యదర్శి అయిన శివశంకర్ మీనన్ చెప్పారు.
వాజపేయీ బీఎమ్‌డబ్ల్యూ కారును దిల్లీ నుంచి ఇస్లామాబాద్‌కు తీసుకెళ్లారు. విమానాశ్రయం నుంచి హోటల్ వరకు అరగంట పాటు ఆయన అందులో ప్రయాణించారు. భారతదేశంలో ఉగ్రవాద దాడులు నిరంతరం జరుగుతున్నాయని, దీని వల్ల ఎన్నికల సంవత్సరంలో ఏదైనా ప్రకటనపై సంతకం చేయడం తనకు కష్టమవుతుందని ముషారఫ్‌తో జరిగిన సంభాషణలో వాజపేయీ చెప్పారు.
ఆ తర్వాత తీవ్రవాదులపై తీసుకోబోయే చర్యల గురించి జనరల్ ముషారఫ్ సమాచారం ఇచ్చారు.
"9/11 తర్వాత, పాశ్చాత్య దేశాలు కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని విదేశాంగ విధానంలో ఓ అంశంగా చూడడానికి అనుకూలంగా లేవు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. అంతకు కొన్ని వారాల క్రితం చైనా పర్యటనలో కూడా భారతదేశంతో చర్చలు జరపాలని ముషారఫ్‌కు సూచనలొచ్చాయి. చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడంలో వాజపేయీ పాత్ర కారణంగా ఇది సాధ్యమైంది"

ఫొటో సోర్స్, Getty Images
ఉమ్మడి ముసాయిదాలోని ఒక వాక్యంపై మేధోమథనం
భారత, పాకిస్తాన్ అధికారులు ఉమ్మడి ప్రకటన ముసాయిదా సిద్ధం చేస్తున్నప్పుడు, పాకిస్తాన్ ముసాయిదాలోని ఒక లైన్‌పై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆ వాక్యం ఏంటంటే "పాకిస్తాన్ నేల ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడదు" అని.
పాకిస్తాన్‌లో మాజీ భారత హైకమిషనర్ అజయ్ బిసారియా తన 'యాంగర్ మేనేజ్‌మెంట్' పుస్తకంలో ఇలా రాశారు.. "ముసాయిదాలో 'పాకిస్తానీ భూమి' అనే పదాలను 'పాకిస్తాన్ నియంత్రణలోని భూమి'తో భర్తీ చేయాలని భారతదేశం పట్టుబట్టింది.
"శివశంకర్ మీనన్ తారిఖ్ అజీజ్‌కు ఫోన్ చేసి భారత్ అభ్యంతరం గురించి చెప్పారు. అజీజ్ ఆ సమయంలో ముషారఫ్ పక్కనే కూర్చుని ఉన్నారు. ముషారఫ్ భారతదేశం అభ్యంతరాన్ని క్షణాల్లో తొలగించారు’’
"అప్పుడు అజీజ్ రియాజ్ ఖోఖర్‌కు ఫోన్ చేసి, భారత్ కోరిక మేరకు పత్రంలో మార్పులు చేయాలని పంజాబీలో చెప్పారు. అంతకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఆగ్రా లాహోర్ సమావేశంలో సాధించలేకపోయినది ఈ సమావేశంలో భారతదేశం చేయగలిగింది’’
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














