భారత్‌తోనే కాదు.. మొత్తం ప్రపంచంతో ట్రంప్ ప్రవర్తన అలాగే ఉంది - జైశంకర్

ఫొటో సోర్స్, Roy Rochlin/Getty Images for Newsweek
పాకిస్తాన్‌తో అమెరికాకు పెరుగుతున్న సాన్నిహిత్యం, అమెరికాతో భారత్ సంబంధాలలో ఒడుదొడుకులపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. భారతదేశంపై అమెరికా విధించిన సుంకాలు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై కూడా దిల్లీలో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో ఆయన స్పందించారు.
"రెండింటికీ సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ చరిత్రను విస్మరించిన చరిత్ర కూడా ఉంది" అని పాకిస్తాన్‌తో అమెరికా సంబంధాలను జైశంకర్ విశ్లేషించారు.
భారత్, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన సంఘర్షణ తన మధ్యవర్తిత్వం కారణంగా ఆగిపోయిందన్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వాదనను ఆయన మరోసారి తిరస్కరించారు.
భారత్, అమెరికా సంబంధాలతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపైనా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రష్యా నుంచి చమురు కొనాలనే భారత్ నిర్ణయాన్ని జైశంకర్ సమర్థించారు.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికాతో సంబంధాల గురించి జైశంకర్ ఏం చెప్పారు?
భారత్, అమెరికా సంబంధాలకు సంబంధించి విదేశాంగ మంత్రి మూడు అంశాల గురించి మాట్లాడారు. మొదటిది వాణిజ్యం, రెండోది చమురు, మూడోది మన ప్రాంతం- ట్రంప్ మధ్యవర్తిత్వం.
వాణిజ్యం చాలా పెద్ద సమస్యని జైశంకర్ వ్యాఖ్యానించారు. ''ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి కానీ కొన్ని విషయాలు చాలా సమస్యాత్మకమైనవి. ఇవి మన రైతులు, చిన్న ఉత్పత్తిదారులకు సంబంధించిన సమస్యలు. వారి ప్రయోజనాలను కాపాడటానికి మేం కట్టుబడి ఉన్నాం'' అని ఆయన అన్నారు.
వాణిజ్య చర్చల కోసం అమెరికా ప్రతినిధులు భారత్‌కు రావడం లేదని కొన్ని రోజుల క్రితం మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన జై శంకర్, "చర్చలు ఆగిపోయాయని ఎవరూ చెప్పలేదు, కాబట్టి చర్చలు కొనసాగుతున్నాయని మేము నమ్ముతున్నాం" అని అన్నారు.
చమురు సమస్యపై రష్యా పేరు ఉపయోగించి భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు.
"రష్యా చమురును ఎక్కువగా కొనే దేశం చైనా, కానీ దానిపై ఎలాంటి అధిక సుంకం విధించలేదు. రష్యా నుంచి యూరప్ అత్యధికంగా ఎల్ఎన్‌జీని కొంటుంది. కానీ వాటి విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇది అన్యాయం'' అని ఆయన అన్నారు.
రష్యా నుంచి చమురు కొనడంపై అమెరికాతో (బైడెన్ పాలనలో) స్పష్టమైన చర్చ జరిగిందని, దీనిపై తమకు ఎలాంటి సమస్యా లేదని అమెరికా చెప్పిందని జై శంకర్ అన్నారు.
"ధరల పరిమితి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? 2022 లో చమురు ధరల స్థిరీకరణకు అలాంటి చర్చలు జరిగాయి. కానీ జనవరి 2025 నుంచి (ట్రంప్ ఎన్నికైన తర్వాత) ఇలాంటి చర్చలు జరగలేదు" అని ఆయన అన్నారు.
"రష్యా నుంచి చమురు కొనడం మన జాతీయ ప్రయోజనాలకు సంబంధించినది. అలాగే అది ప్రపంచ ప్రయోజనాలకు సంబంధించినది కూడా. మేం దీనిని ఎప్పుడూ దాచలేదు. మన జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించడం మన హక్కు. ఇది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, PA/Reuters
పాకిస్తాన్, అమెరికాతో వివాదంపై జైశంకర్ ఏమంటున్నారు?
కాల్పుల విరమణకు సంబంధించి భారత్, పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయని జైశంకర్ మరోసారి చెప్పారు.
భారత్, పాకిస్తాన్ మధ్య వివాదాన్ని తాను ఆపానని ట్రంప్ చాలాసార్లు చెప్పుకున్నారు. దీనిపై పాకిస్తాన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.
కానీ ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంటులో ట్రంప్ వాదనను తిరస్కరించారు. "ప్రపంచంలోని ఏ నాయకుడూ ఆపరేషన్ ఆపమని భారత్‌ను అడగలేదు" అని మోదీ అన్నారు.
"కశ్మీర్ సమస్యపై ఏ మూడో దేశం మధ్యవర్తిత్వాన్నీ భారత్ అంగీకరించదు. భారత్ వైఖరి స్పష్టంగా ఉంది" అని జైశంకర్ చెప్పారు.
భారత్, పాకిస్తాన్ మధ్య మే నెలలో సంక్షోభం ముగిసిన తర్వాత కొన్నిరోజులకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్‌లో ట్రంప్ కలిశారు. ఈ రహస్య సమావేశం గురించి మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. పాకిస్తాన్, అమెరికా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని ఈ సమావేశం ప్రతిబింబించిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ వ్యవహారంపై అడిగిన ఓ ప్రశ్నకు జైశంకర్ స్పందించారు. "ఆ రెండింటికీ సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ చరిత్రను విస్మరించిన చరిత్ర కూడా ఉంది. ఇలాంటివి జరగడాన్ని మనం చూడడం ఇదే మొదటిసారి కాదు" అని అన్నారు.
''విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్టిఫికెట్ జారీ చేస్తున్న సైన్యమే అబోటాబాద్‌లోకి ప్రవేశించి అక్కడ ఎవరిని గుర్తించిందో మీకు తెలుసు. ప్రాథమిక సమస్య ఏంటంటే దేశాలు తమ సౌలభ్యం కోసం మళ్లీ మళ్లీ అలాంటి చర్యలు తీసుకొంటుంటాయి. కొన్నిసార్లు వ్యూహాత్మక కోణం, ఇంకొన్నిసార్లు లాభనష్టాల లెక్కలు ఇందులో ఉంటాయి'' అని ఆయనన్నారు.
ఇస్లామాబాద్‌కు ఈశాన్యంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబోటాబాద్‌లో 2011లో అమెరికా ప్రత్యేక ఆపరేషన్‌తో ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చింది.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ విదేశాంగ విధానం గురించి జైశంకర్ ఏమన్నారు?
భారత్‌పై విధించిన సుంకాలు, అమెరికాతో సంబంధాల గురించి మాట్లాడిన జై శంకర్ "రెండు దేశాల మధ్య ఇంతకు ముందు ఎలాంటి సమస్యలు లేవని లేదా ఇతర రంగాలలో సంబంధాలు ముందుకు సాగడం లేదని నేను చెప్పను. అది నిజం కాదు" అని అన్నారు.
తన విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగపరిచిన అమెరికా అధ్యక్షుడిని ప్రపంచం ఎప్పుడూ చూడలేదని.. ట్రంప్‌ను ఉద్దేశించి జైశంకర్ వ్యాఖ్యానించారు.
"ఇది భారతదేశానికే పరిమితం కాదు. ట్రంప్ ప్రపంచంతో, తన సొంత దేశంతో వ్యవహరించే విధానం కూడా సంప్రదాయ పద్ధతులకు చాలా భిన్నంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. సుంకాల బహిరంగ ప్రకటన మునుపటి కంటే భిన్నమైనది. ప్రపంచం మొత్తం ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది'' అని జైశంకర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మీ రష్యా పర్యటన గురించి ఏమంటారు?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలో సమావేశమయ్యారు .
ఆ తర్వాత జై శంకర్ రష్యా వెళ్లి పుతిన్‌ను కలిశారు. ఆయన పర్యటన చాలా చర్చనీయాంశమైంది.
దీనిపై జై శంకర్ స్పందించారు. "దీని గురించి నేను వివరంగా మాట్లాడలేనుగానీ మా వైఖరి స్పష్టంగా ఉంది. ఈ యుద్ధం ముగియాలని మేం కోరుకుంటున్నాం. యుద్ధాన్ని ఆపడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని స్వాగతిస్తాం. ఇదంత సులభమైన విషయం కాదు. చాలా సంక్లిష్టమైనది. అలాస్కాలో జరిగినదాన్ని పురోగతిగా పరిగణిస్తాం'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్, చైనా గురించి జైశంకర్ ఏం చెప్పారు?
ఇటీవలి కాలంలో భారత్, చైనా సంబంధాలలో కొంత స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్‌ను సందర్శించి రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాల గురించి మాట్లాడారు.
ప్రధాని మోదీ కూడా ఎస్‌సీఓ సమావేశానికి చైనా వెళ్తున్నారు. భారతదేశంపై అమెరికా విధించిన సుంకాలను భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ వ్యతిరేకించారు.
అయితే భారత్‌కు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, పాకిస్తాన్‌తో తన సంబంధాలు చెక్కుచెదరవని చైనా అంటోంది. రఫెల్ యుద్ధ విమానాలతో సహా అనేక భారతీయ విమానాలను కూల్చివేసేందుకు పాకిస్తాన్ పీఎల్-15ఈ క్షిపణులతో ఉన్న చైనా జే-10సీ విమానాలను ఉయోగించిందని పాకిస్తాన్ విదేశాంగమంత్రి చెప్పారు.
చైనాతో సంబంధాలపై స్పందించిన జై శంకర్ సరిహద్దు వివాదం సమస్య 1950ల నాటిదన్నారు. సరిహద్దులో శాంతిని, స్థిరత్వాన్ని కాపాడుకోవడం మనకు చాలా ముఖ్యమని చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం డబ్ల్యుటీవోలోకి చైనా ప్రవేశించిన తర్వాత ప్రారంభమైన వాణిజ్య లోటు కూడా ఒక పెద్ద సమస్యగా ఉందన్నారు.
"కోవిడ్ మహమ్మారి సమయంలో సప్లై చైన్‌కు అంతరాయం కలిగింది. ఆ తర్వాత గాల్వాన్ ఘర్షణతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. చైనా ఎగుమతుల విధానం వల్ల ఆటోమొబైల్ పరిశ్రమకు అరుదైన భూ ఖనిజాల కొరత ఏర్పడింది'' అని తెలిపారు.
"ఇది ఒక సమయంలో ఉన్న సమస్య కాదు, వేర్వేరు సమయాల్లో వేర్వేరు సమస్యలు ఉన్నాయి, అవి కొనసాగుతున్నాయి" అని చైనాతో సంబంధాల్లో సంక్లిష్టతపై తన అభిప్రాయం వ్యక్తంచేశారు జైశంకర్.
"కానీ మీరు పరిష్కారాన్ని చూడాలి. ఈ పరిస్థితులన్నింటి మధ్యే, భారత్, చైనా మధ్య చర్చలు కొనసాగాయి. ప్రధానమంత్రి కజాన్‌లో చైనాతో మాట్లాడారు. గత ఏడాది నేను చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపాను'' అని తెలిపారు.
"ప్రతిదానినీ ఒక నిర్దుష్ట పరిస్థితికి ప్రతిస్పందనగా చూడటం తప్పుడు విశ్లేషణ అవుతుంది. సరిహద్దు సమస్యను గమనిస్తే 24 రౌండ్ల చర్చలు జరిగాయి. చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. ఇది సుదీర్ఘమైనది'' అని జై శంకర్ ముగించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














