నడిసముద్రంలో మునిగిన 3 బోట్లు, 9 మంది గల్లంతు.. సముద్రంలో అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Faruk Kadri/BBC
- రచయిత, గోపాల్ కటేషియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమ్రేలీలోని జఫ్రాబాద్ ఓడరేవు, గిర్ సోమనాథ్ జిల్లాకు సమీపంలోని రాజ్పారా ఓడరేవు నుంచి ఆగస్ట్ 19న చేపల వేటకు వెళ్లిన మూడు ఫిషింగ్ బోట్లు సముద్రంలో మునిగిపోయాయి.
రెండు జఫ్రాబాద్ నుంచి, మరోటి రాజ్పారా నుంచి బయలుదేరి వెళ్లాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వాటిలో వేటకు వెళ్లిన 11 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.
గల్లంతైనవారిలో ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలు దొరకగా.. మిగిలిన 9 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. వారి కోసం గాలిస్తున్నారు.

గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కానీ, సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు చెప్పారు.
మత్స్యకార నాయకులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు ఈ ఏడాదిలో చేపల వేటకు వెళ్లడం ఇదే తొలిసారి.
జఫ్రాబాద్ ఓడరేవు నుంచి 18 నుంచి 20 నాటికల్ మైళ్ల దూరంలోనే బోట్లు సముద్రంలో మునిగిపోయాయి.
ఆ సమయంలో, అక్కడికి సమీపంలో చేపలు పడుతున్న మిగిలిన బోట్లలోని మత్స్యకారులు 15 మందిని రక్షించగా, మరో 11 మంది మత్స్యకారులు సముద్రంలో మునిగిపోయి గల్లంతయ్యారు.
గల్లంతైనవారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఫొటో సోర్స్, Faruk Kadri/BBC
సముద్రంలో మునిగిన 3 బోట్లు
సముద్రంలో మునిగిపోయిన మూడు బోట్ల పేర్లు 'జయశ్రీ తక్తరి', 'దమయంతి', ' మురళీధర్'.
''సముద్రంలో మునిగిపోయిన బోట్లలో జయశ్రీ తక్తరి, దమయంతి జఫ్రాబాద్‌కు చెందినవి కాగా, మురళీధర్ గిర్ సోమనాథ్‌లోని ఉనాకు సమీపంలోని రాజ్పారా పోర్టుకు చెందినది'' అని జఫ్రాబాద్ ఖర్వా సమాజ్ ఫిషర్‌మెన్ బోట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కనయలాల్ సోలంకి చెప్పారు.
''జయశ్రీ తక్తీ, దమయంతి బోట్లలో 9 మంది చొప్పున మత్స్యకారులు ఉండగా.. మురళీధర్‌లో 8 మంది మత్స్యకారులు ఉన్నారు. జయశ్రీ తక్తరి బోటులోని 9 మంది మత్స్యకారుల్లో ఐదుగురిని రక్షించగా.. నలుగురు గల్లంతయ్యారు. దమయంతిలోని 9 మందిలో ఆరుగురిని రక్షించగా.. ముగ్గురు కనిపించకుండా పోయారు. మురళీధర్ బోటులోని 8 మందిలో, నలుగురు మత్య్సకారులు గల్లంతయ్యారు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Faruk Kadri/BBC
సముద్రంలో బోటు మునిగిపోయిందని తెలిసినప్పటి నుంచి సరిగ్గా నిద్రపోవడం లేదని జయశ్రీ తక్తీ పడవ యజమాని యశ్వంత్ బారయా చెప్పారు.
''ఈ బోటు కెప్టెన్ దినేష్ తండేల్. బోటులో వెళ్లిన వారిలో ఒకరైన వినోద్ భాయి కూతురు పడవ మునిగిపోయిందని తెలిసినప్పటి నుంచి పదేపదే కాల్ చేస్తోంది. ఆమె ముంబయిలో ఒక షేక్ ఇంట్లో పనిచేస్తోంది. 'నాన్న తిరిగొచ్చారా? లేదా?' అని అడుగుతోంది. ఆమెకు భరోసా ఇవ్వడం తప్ప నేనేమీ చెప్పలేకపోతున్నా. ఎందుకంటే, సముద్రమంతా అల్లకల్లోలంగా ఉంది. కనిపించకుండా పోయిన మత్స్యకారులను వెతికేందుకు ఇతర బోట్లు తీసుకెళ్లుందుకు ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వడం లేదు'' అని యశ్వంత్ బీబీసీతో చెప్పారు.
''బోటు ప్రమాదం జరిగిందని తెలిసినప్పటి నుంచి నా భార్యకు బీపీ(రక్తపోటు) పడిపోయి, ఆస్పత్రిలో చేర్చాం'' అని తెలిపారు.
''దినేష్‌కు చిన్నపిల్లలు ఉన్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారిందని, తిరిగి వచ్చేస్తున్నామని మెసేజ్ పంపారు. నాలుగు మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతున్నాయని చెప్పారు. ఆ అలల్లో ఒకటి బోటు మునిగిపోవడానికి కారణమై ఉంటుంది. సముద్రంలో దూకగలిగిన వారిని, మా సోదరుడి పడవకు చెందిన మత్స్యకారులు రక్షించారు. బోటు క్యాబిన్‌లో నిద్రిస్తున్న వారు, సముద్రంలో దూకలేకపోయారు'' అని యశ్వంత్ తెలిపారు.
ఈ ఏడాది తొలిసారి ఆగస్ట్ 18న జయశ్రీ తక్తరి జఫ్రాబాద్ పోర్టు నుంచి చేపల వేటకు వెళ్లింది. వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఫిషింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, ఒక్కరోజులోనే పడవ సముద్రంలో మునిగిపోయిందని యశ్వంత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Indian Coast Guard
కొనసాగుతున్న గాలింపు చర్యలు
''ప్రతికూల వాతారణ పరిస్థితుల కారణంగా, కేవలం ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌లు మాత్రమే గల్లంతైన మత్స్యకారుల కోసం వెతుకున్నాయి'' అని అమ్రేలీ కలెక్టర్ విపక్ భరద్వాజ్ బీబీసీతో చెప్పారు.
''బోట్లు మునిగిపోయిన చోట మూడు కోస్ట్ గార్డ్ షిప్స్, నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లు వెతుకుతున్నాయి. శుక్రవారం సాయంత్రం కోస్ట్‌గార్డ్ దళాలు రెండు మృతదేహాలను గుర్తించాయి. తీరానికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. జఫ్రాబాద్ ఓడరేవులో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఉంది. దీంతో, ఇతర పడవల్లో మత్స్యకారులను వెతికేందుకు సముద్రంలోకి అనుమతించం'' అని ఆయన తెలిపారు.
సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను కాపాడేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు స్థానిక ఎమ్మెల్యే హీరా సోలంకి చెప్పారు.
''19న సాయంత్రం ఈ ఘటన జరిగిన తర్వాత, వాతావరణం చాలా ప్రమాదకరంగా మారింది. సాయం కోసం షిప్‌ను కానీ, హెలికాప్టర్‌ను కానీ పంపించలేకపోయాం. 20వ తేదీ ఉదయం నుంచి కోస్ట్ గార్డు గాలింపు చర్యలు ప్రారంభించింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాం. కొనసాగుతోంది'' అని ఆయన అన్నారు.
చేపలు పట్టేందుకు ప్రస్తుతం జఫ్రాబాద్ నుంచి సముద్రానికి ఎలాంటి పడవలను పంపడం లేదని జఫ్రాబాద్ అసిస్టెంట్ ఫిషరీస్ సూపరింటెండెంట్ ప్రవీణ్ పర్మార్ తెలిపారు.

ఫొటో సోర్స్, Kanaiyalal Solanki
‘ఆగస్ట్ 1 నుంచే ఫిషింగ్ సీజన్ ప్రారంభించాలి’
''ప్రస్తుతం జఫ్రాబాద్ ఓడరేవులో 700 పడవలు లంగరు వేసి ఉన్నాయి. జఫ్రాబాద్‌కు చెందిన ఒక బోటు మహారాష్ట్రలోని దహను ఓడరేవు వెలుపల లంగరు వేసి ఉంది. సముద్రంలో మునిగిపోయిన ఆ మూడు బోట్లు తప్ప, జఫ్రాబాద్ నుంచి మరే బోటు ఇప్పుడు సముద్రంలో లేదు'' అని జఫ్రాబాద్ ఖర్వా సమాజ్ ఫిషర్‌మెన్ బోట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కనయలాల్ సోలంకి చెప్పారు.
''భారీ వర్షాలు, వేగంగా వీచే గాలులతో గత కొన్నేళ్లుగా ఆగస్ట్ నెలల్లో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. దీనివల్ల, మత్స్యకారులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆగస్ట్ 16 నుంచే చేపలు పట్టే కాలం ప్రారంభమవుతుంది. మత్స్యకారులు పడవలను తీసుకుని, సముద్రంలోకి వెళ్తుంటారు. కానీ, వాతావరణం ప్రమాదకరంగా మారుతుండటంతో, కొన్నిసార్లు అక్కడే చిక్కుకుపోయి, పడవలు సముద్రంలో మునిగిపోతున్నాయి'' అని తెలిపారు.
ఆగస్ట్ 16 నుంచి కాకుండా ఆగస్ట్ 1 నుంచే భారత పశ్చిమ తీరంలో ఫిషింగ్ సీజన్‌ను ప్రారంభించాలని తాము ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలిపారు. అప్పుడైతే సముద్రం శాంతంగా ఉంటుందని చెప్పారు.
అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 1 నుంచే ఫిషింగ్ సీజన్‌ను ప్రారంభిస్తుండగా.. గుజరాత్ ప్రభుత్వం ఆగస్ట్ 16 నుంచి ఫిషింగ్‌కు అనుమతిస్తూ.. ఫిషింగ్ సీజన్‌ను మొదలుపెడుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














