ట్రంప్ టారిఫ్: ‘ఫ్యాక్టరీ మూతపడితే పిల్లల చదువూ ఆగిపోతుంది’

- రచయిత, సయ్యద్ మోజేజ్ ఇమామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆమె పేరు లక్ష్మి... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులోనున్న ఒక తోలు పరిశ్రమలో పనిచేయడానికి అక్కడికి పది కిలోమీటర్ల దూరంలోనున్న ఉన్నావ్ జిల్లా చిలౌలా నుంచి ప్రతి రోజూ తన భర్త శ్రవణ్ కుమార్‌తో కలిసి వస్తుంటుంది.
వారికి ఆరుగురు పిల్లలు, వారిలో నలుగురు బడికి వెళ్తున్నారు.
''నేను, నా భర్త ఇద్దరమూ యంత్రాలను ఆపరేట్ చేస్తాం. ఇల్లు గడవటం కోసం ప్రతి రోజూ ఎనిమిది నుంచి పది గంటలు పనిచేస్తాం. ఫ్యాక్టరీ మూతపడితే మేము కూలీలుగా పనిచేసుకోవాల్సి ఉంటుంది. మా పిల్లల చదువు ఆగిపోతుంది'' అని లక్ష్మి ఆందోళన చెందుతున్నారు.
అలా ఆమె ఒక్కరే కాదు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్-ఉన్నావ్ లెదర్ క్లస్టర్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన కార్మికులు, వ్యాపారులు అనేకమంది ఇలాగే ఆందోళన చెందుతున్నారు.
అమెరికా టారిఫ్‌లు తోలు ఎగుమతులపై ఎంతమేర ప్రభావం చూపిస్తాయనేది ఇప్పుడు అంతటా చర్చనీయమైంది.


అమెరికాకు కాన్పూర్ నుంచే రూ.2,000 కోట్ల విలువైన తోలు ఎగుమతులు
భారతదేశంపై అమెరికా మొత్తం 50 శాతం సుంకాన్ని ప్రకటించినప్పటి నుంచి కాన్పూర్ ప్రాంతంలో ఆందోళనలు పెరిగాయి.
ఈ సుంకం వల్ల తమకు నష్టాలు వస్తాయని తోళ్ల వ్యాపారులు ఒకవైపు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ తోలు పరిశ్రమలు మూతపడితే తమ జీవనోపాధి ఎలాగని అక్కడ పనిచేసే కార్మికులు మదనపడుతున్నారు.
అమెరికాకు రూ.2,000 కోట్ల మేర తోళ్ల వ్యాపారం ఈ కాన్పూరు నుంచే జరుగుతోంది.
తోలు ఎగుమతుల మండలి (కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్) వివరాల ప్రకారం, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో తోలు ఉత్పత్తుల పరిశ్రమకు ముఖ్యమైన స్థానం ఉంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి సుమారు రూ.10,260 కోట్ల (1.17 బిలియన్ డాలర్లు) విలువైన తోలు ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి.
2023-24లో దాదాపు రూ.7,804 కోట్లు (890 మిలియన్ డాలర్లు)కు పడిపోయాయి.
అంటే, రెండేళ్లలో దాదాపు 23 శాతం మేర తోలు ఎగుమతులు తగ్గిపోయాయి.

కాన్పూర్-ఉన్నావ్ లెదర్ క్లస్టర్ చాలా కీలకం...
అమెరికాకు భారత్ నుంచి జరుగుతున్న తోలు ఉత్పత్తుల ఎగుమతుల్లో 20 శాతం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్-ఉన్నావ్ క్లస్టర్ నుంచే వెళ్తున్నాయి.
అందుకే తోలు ఉత్పత్తులు, ఎగుమతుల్లో ఈ క్లస్టర్‌ను దేశంలోనే చాలా ముఖ్యమైందిగా పరిగణిస్తారు.
ఇక్కడి తోలుశుద్ధి పరిశ్రమలు, తోలు పరిశ్రమలు దేశీయ మార్కెట్‌లోనే గాకుండా అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందాయి.
ఇక్కడి నుంచి శుద్ధిచేసిన తోలు మాత్రమే గాకుండా పాదరక్షలు, బెల్ట్‌లు, బ్యాగ్‌లు, జాకెట్‌లు, సాడ్లెరీ (గుర్రంపై కూర్చోవడానికి తోలుతో తయారుచేసింది) తదితర తోలు ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతాయి.
తోలు ఎగుమతుల మండలి వివరాల ప్రకారం ఇక్కడ దాదాపు 400 తోలు శుద్ధి పరిశ్రమలు ఉన్నాయి. ఆ తోలుతో వివిధ వస్తువులు తయారుచేసే పరిశ్రమలు కూడా 400 నుంచి 500 వరకూ ఇక్కడ ఉన్నాయి.
ఈ తోలుపరిశ్రమ రంగంపై దాదాపు లక్ష మంది ప్రత్యక్షంగా, మరో ఐదు లక్షల మంది పరోక్షంగా ఆధారపడుతున్నారు.

అమెరికా సుంకాల పెంపు భరించలేనిది...
తోలు ఉత్పత్తులపై ఇప్పటికే 25 శాతం సుంకం ఉంది. ఇప్పుడది 50 శాతానికి పెరిగింది. ఈ పెరిగిన సుంకం తాము భరించలేనిదని ఎగుమతిదారులు చెప్పారు.
ఇప్పటికే డాలరు రేట్ పెరగడం, ముడి సరకుల ధరలు అధికమవ్వడంతో లాభాలు తగ్గిపోయాయని ఆయా తోలు ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా ఖాతాదారులు 50 శాతం సుంకం అధికంగా చెల్లించడానికి సిద్ధంగా లేరని, దీంతో ఆర్డర్లు నిలిచిపోతాయని ఆందోళన చెందుతున్నారు.
అమెరికా ఖాతాదారులు చాలా ఆర్డర్లు నిలిపేశారని కాన్పూర్‌కు చెందిన వ్యాపారి ఫరా ఫాతిమా చెప్పారు.
''చాలా స్వల్ప లాభాలతో మా పరిశ్రమ నడుస్తోంది. ధరలు పెరగకూడదని ఖాతాదారులు ఆశిస్తున్నారు. ఇప్పుడు 50 శాతం సుంకాలు పెరిగితే, పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది'' అని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదని తోలు ఎగుమతుల మండలి కూడా చెబుతోంది.
తమ ఆందోళనను వ్యక్తంచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మండలి లేఖ రాసింది.
అమెరికా మార్కెట్ మూతపడితే వాణిజ్యం దెబ్బతినడమే గాక, ఉపాధిపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆ లేఖలో పేర్కొంది.
''అమెరికా మా అతిపెద్ద కొనుగోలుదారు. 25 శాతం సుంకం విధించినప్పటి నుంచే మేము ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నాం'' అని తోలు ఎగుమతుల మండలి ప్రాంతీయ అధ్యక్షుడు అసద్ ఇరాఖి చెప్పారు.
ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవడంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి, తమకు ఉపశమన ప్యాకేజీలు ఇస్తే పరిశ్రమను కాపాడుకోవచ్చని ఎగుమతిదారులు ఆశిస్తున్నారు.
తోళ్ల పరిశ్రమకు ఎంతమేర నష్టం?
''అమెరికాకు ఇక్కడి నుంచి షూ, చెప్పులు, బెల్ట్‌లు, బ్యాగ్‌లు, జాకెట్‌లు, సాడ్లెరీ తదితర తోలు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో వాటికి డిమాండు పెరుగుతుంది'' అని లఖ్‌నవూకు చెందిన బిజినెస్ స్టాండర్డ్ సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ కలహాన్స్ చెప్పారు.
అమెరికా సుంకాలతో ఒక్క కాన్పూర్‌లోనే దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆర్డర్లు నిలిచిపోయినట్లు తెలిసిందని ఆయన అన్నారు.
భారతదేశం ఇప్పుడు రష్యా, యూరప్, మధ్యాసియా దేశాల మార్కెట్లపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా మార్కెట్ తగ్గిపోతే, ఆయా రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
''పాకిస్తాన్, బంగ్లాదేశ్ తోలు పరిశ్రమలతో భారతదేశం ఇప్పటికే పోటీ ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ఎగుమతులపై 19 శాతం, బంగ్లాదేశ్ ఎగుమతులపై 20 శాతం మాత్రమే సుంకాన్ని విధిస్తున్నారు'' అని సిద్ధార్థ చెప్పారు.

కార్మికుల జీవనోపాధిపై దెబ్బ...
అమెరికా సుంకాల ప్రభావం తోలు ఉత్పత్తి ఎగుమతిదారులకే పరిమితం కాలేదు. ఆ పరిశ్రమలను నిర్వహిస్తున్నవారి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది.
''తోళ్ల శుద్ధి పరిశ్రమ మూతపడితే నిరుద్యోగి అయిపోతాను. కుటుంబాన్ని పోషించడానికి నాకున్న ఏకైక మార్గం ఇదొక్కటే. ఇప్పుడొస్తున్నంత సంపాదన మరో పని చూసుకున్నా రాదు'' అని సచిన్ కుమార్ చెబుతున్నారు.
2014 నుంచి తోలు వ్యాపారంలో ఉన్న ఆయనకు అమెరికా సుంకాల ప్రభావం ఎలా ఉంటుందో అవగాహన ఉంది.

కొత్త మార్కెట్ల కోసం అన్వేషణ...
''ఇది చాలా భారీ సంఖ్యలో కార్మికులు పనిచేసే పరిశ్రమ రంగం. ఇక్కడే అనేక ఉత్పత్తులు తయారవుతాయి. ఈ ప్రక్రియలో ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది'' అని చెన్నైలోని లెదర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ చైర్మన్ ముక్తారుల్ అమీన్ చెప్పారు.
తోళ్ల పరిశ్రమ పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని, దాదాపుగా 5 లక్షల మంది దీనిమీద ఆధారపడి జీవిస్తున్నారని ఆయన వెల్లడించారు.
బ్రిటన్‌తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చాలామంది వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇది ఆచరణలోకి రావడానికి కొంత సమయం పడుతుంది.
''ఎఫ్‌టీఏతో మా వాణిజ్యం పెరుగుతుందని, బహుశా రెట్టింపు అవుతుందని మేము చాలా ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఇప్పటివరకూ మనం డ్యూటీ-ఫ్రీ (సుంకం లేని) దేశాలతో పోటీ పడుతున్నాం'' అని అమిన్ చెప్పారు.
గత మూడేళ్లుగా భారత్, బ్రిటన్ మధ్య అడపాదడపా చర్చల్లోనే ఉన్న ఎఫ్‌టీఏను జులై నెలలో ఇరు దేశాలూ ఆమోదించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














