ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం, అమెరికా వీసాలున్న 5.5 కోట్ల మంది రికార్డుల సమీక్ష

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దనై నెస్టా కుపెంబా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా వీసాలున్న ఐదున్నర కోట్ల మందికిపైగా రికార్డులను డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం తనిఖీ చేస్తోంది. వారు దేశంలోకి ప్రవేశించడానికి లేదా ఉండటానికి ఏవైనా నియమాలను ఉల్లంఘించారా? అని తెలుసుకోవడానికి ఈ చర్య చేపట్టింది.
వీసా హోల్డర్లు ఇప్పుడు నిరంతర పరిశీలనలో ఉంటారని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థతో అన్నారు.
''దేశంలో అనుమతించిన దానికంటే ఎక్కువ కాలం ఉండటం, నేరాలు చేయడం, ప్రజా భద్రతకు భంగం కలిగించడం, ఉగ్రవాద కార్యకలాపాల్లో చేరడం లేదా ఉగ్రవాద సంస్థకు సహాయం చేయడం వంటి నియమాలను ఉల్లంఘించే సంకేతాలు ఉంటే వీసాలు రద్దు చేస్తాం'' అని ఆ అధికారి తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన రెండవ పదవీకాలంలో వలస వ్యతిరేక విధానాలపై దృష్టి సారించారు. వీటిలో సామూహిక బహిష్కరణలు, కొన్ని దేశాలపై కఠినమైన ప్రయాణ నిషేధాలు, ఆరు వేల విద్యార్థి వీసాల రద్దు వంటివి ఉన్నాయి.

'వారికి అమెరికన్ ప్రయోజనాలు దక్కకూడదు'
వీసాల సమీక్షలో భాగంగా, అమెరికాలో చదువుకోవడానికి లేదా సందర్శించడానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలను అధికారులు తనిఖీ చేస్తారు. అమెరికన్ పౌరులు, సంస్కృతి, ప్రభుత్వం, సంస్థలు లేదా వ్యవస్థాపక సూత్రాల పట్ల శత్రుత్వ సంకేతాలున్నాయా అని పరిశీలిస్తారు.
విదేశీ ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే లేదా చట్టవిరుద్ధమైన యూదు వ్యతిరేక వేధింపులు లేదా హింసలో పాల్గొనే వ్యక్తులను గుర్తించాలని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
"అమెరికాను ద్వేషించే లేదా అమెరికా వ్యతిరేక ఆలోచనలను వ్యాప్తి చేసే వారికి అమెరికా ప్రయోజనాలు చెందకూడదు" అని యూఎస్ సిటిజెన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రతినిధి మాథ్యూ ట్రాగెస్సర్ అన్నారు.
'అమెరికన్ వ్యతిరేకతను నిర్మూలించే' విధానాలను అమలు చేయడానికి ఇమ్మిగ్రేషన్ సర్వీస్ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలు ఇవ్వడాన్ని అమెరికా 'వెంటనే' నిలిపివేస్తుందని విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పిన తర్వాత తాజా 'రివ్యూ' ప్రకటన వచ్చింది.
''అమెరికాలో భారీ ట్రక్కుల విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరగడం అమెరికన్ల జీవితాలను ప్రమాదంలో పడేస్తోంది. దేశంలోని ట్రక్కు డ్రైవర్ల ఉద్యోగాలను దెబ్బతీస్తోంది'' అని రూబియో గురువారం నాడు ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
హద్దు మీరితే అరెస్టులు, ఆంక్షలు
జనవరిలో డోనల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు చాలామంది విదేశీ విద్యార్థులను అమెరికా విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో అరెస్టు చేశారు.
ఇటీవల మలావి, జాంబియా నుంచి వచ్చే ప్రజలు పర్యటక లేదా వ్యాపార వీసా పొందడానికి దాదాపు రూ. 13 లక్షలు(15 వేల డాలర్లు) డిపాజిట్‌గా చెల్లించాలని అమెరికా తెలిపింది. 12 దేశాల ప్రజలు అమెరికాకు ప్రయాణించకుండా ట్రంప్ నిషేధించారు. మరో ఏడు దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు.
మే నెలలో, అమెరికాలో నివసిస్తున్న 5 లక్షలకు పైగా వలసదారుల చట్టపరమైన హోదాను తాత్కాలికంగా రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం వీలు కల్పించింది. జన్మతఃపౌరసత్వం (బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్) కూడా రద్దు చేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














