వందేళ్ల ఆర్‌ఎస్‌ఎస్: జాతీయ జెండా, కుల వ్యవస్థ, రాజ్యాంగంపై వైఖరి ఎలా మారింది?

ఫొటో సోర్స్, Getty Images
భారత రాజ్యాంగం, జాతీయ జెండా, కులవ్యవస్థపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయాలపై ఎప్పుడూ విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి.
ఈ మూడు ప్రధాన అంశాలపై స్వాతంత్య్రం నుంచి ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చాలాసార్లు తన అభిప్రాయాలు మార్చుకుంది.
భారత రాజ్యాంగం విషయంలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయాల చరిత్ర సంక్లిష్టమైనది.
''అనేక పశ్చిమ దేశాల రాజ్యాంగాల నుంచి అనేక విషయాలు తీసుకుని వైవిధ్యభరితంగా మన రాజ్యాంగం రూపొందించారు. దాంట్లో మన సొంతం అని పిలవడానికి ఏదీ లేదు. మన జాతీయ లక్ష్యానికి సంబంధించి, మన జీవితాల్లోని ప్రాధాన్యాలకు సంబంధించి ఒక్క పదమన్నా అదులో ఉందా? లేదు..'' అని 'బంచ్ ఆఫ్ థాట్స్' పుస్తకంలో సంఘ్ రెండో అధ్యక్షుడు మాధవ్ సదాశివరావ్ గోల్‌వాల్కర్ రాశారు.
''రేపు అధికారం చేపట్టబోతున్నవాళ్లు మన చేతుల్లో త్రివర్ణజెండా ఉంచుతారు. కానీ దాన్ని హిందువులు ఎప్పుడూ గౌరవించరు, తమ సొంతంగా భావించరు. మూడు అనే పదం మంచిది కాదు. మూడు రంగులతో ఉండే జెండా మానసికంగా చాలా తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది. దేశానికి ప్రమాదకరమైనది'' అని భారత్‌కు స్వాతంత్య్రం రావడానికి ఒకరోజు ముందు 1947 ఆగస్టు 14న తన పత్రిక ఆర్గనైజర్‌లో ఆర్ఎస్ఎస్ రాసిన వ్యాఖ్యలను చాలామంది విమర్శిస్తుంటారు.
ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించిందని ప్రముఖ లాయర్, రాజకీయ వ్యాఖ్యాత ఏజీ నురానీ 'ది ఆర్ఎస్ఎస్: దేశానికి ప్రమాదం' అనే తన పుస్తకంలో రాశారు. ఏజీ నురానీ బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పనిచేశారు.


ఫొటో సోర్స్, Reuters
ఆర్ఎస్ఎస్ శ్వేతపత్రంలో ఏముంది?
''రాజ్యాంగాన్ని హిందూ వ్యతిరేకమైనదిగా పేర్కొంటూ, దేశంలో తాము ఎలాంటి రాజకీయం కోరుకుంటున్నామో తెలియజేస్తూ 1993 జనవరి 1న సంఘ్ శ్వేతపత్రం ప్రచురించింది. భారత్ సమగ్రతను, సోదరభావాన్ని, మతపరమైన సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసింది ఎవరు? ఆకలి చావులకు, నిరుద్యోగితకు, అవినీతికి, మతపరమైన అసహనానికి కారణం ఎవరు? దీనికి సమాధానం 'భారత ప్రస్తుత రాజ్యాంగం' అనే శ్వేతపత్రంలో ఉంది'' అని నురానీ రాశారు.
1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ శ్వేతపత్రం ప్రచురితమైంది.
'వర్తమాన్ ఇండియన్ సంవిధాన్' అనే హిందీ శీర్షికలో ఇండియన్ అనే పదం ఉపయోగించడానికి ఓ కారణముంది. అది హిందూ రాజ్యాంగానికి బదులుగా ఇండియన్ రాజ్యాంగం అన్నది ప్రతిబింబించేలా ఆ పదం ఉపయోగించారు'' అని ఏజీ నురానీ రాశారు.
''ప్రస్తుత రాజ్యాంగం దేశ సంస్కృతి, స్వభావం, పరిస్థితులు మొదలైన వాటికి విరుద్ధంగా ఉంది. దీనిపై ఇతర దేశాల ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుత రాజ్యాంగాన్ని రద్దు చేసిన తర్వాతే మన ఆర్థిక విధానం, న్యాయ, పరిపాలనా నిర్మాణం, ఇతర జాతీయ సంస్థల గురించి మనం కొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది'' అని శ్వేతపత్రం పీఠికలో స్వామి హిరానంద్ రాసినట్టు నురానీ చెప్పారు.
రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఈ దేశం నీతి, ప్రతిభకు అనుగుణంగా రాజ్యాంగాన్ని స్వీకరించాలని 1993 జనవరిలో అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ రాజేంద్ర సింగ్ రాశారని తన పుస్తకంలో నురానీ పేర్కొన్నారు.
1993 జనవరి 24న అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి కూడా రాజ్యాంగాన్ని కొత్తగా పరిశీలించాలనే డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో పునరుద్ఘాటించారు.

ఫొటో సోర్స్, BJP
రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నాలు
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, కొంతమంది బీజేపీ నేతలు 'అబ్‌కి బార్ 400 పార్' (ఈసారి మేము 400 దాటతాం)అన్న నినాదం నిజమైతే...అది రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రకటనలు చేయడం ప్రారంభించారు.
అలా చేయాలనే ఉద్దేశం లేదని బీజేపీ చాలాసార్లు స్పష్టం చేసినప్పటికీ, రాజ్యాంగంలో భారీగా ప్రాథమిక మార్పులు చేయడానికి పార్టీ ప్రయత్నించిన ఉదాహరణలు ఉన్నాయి.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన ప్రముఖ వ్యక్తులపై సీనియర్ జర్నలిస్ట్, రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ్ 'ది ఆర్ఎస్ఎస్: ఐకాన్స్ ఆఫ్ ది ఇండియన్ రైట్' అనే పుస్తకం రాశారు.
"అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, వారు చేసిన మొదటి పని రాజ్యాంగాన్ని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం. చాలా గందరగోళం చెలరేగిన తర్వాత వారు కమిటీ ఏర్పాటుకు గల కారణాన్ని మార్చారు. రాజ్యాంగాన్ని పూర్తిగా సమీక్షించడానికి బదులుగా, ఇప్పటివరకు రాజ్యాంగం ఎలా పనిచేసిందో కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు'' అని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ తెలిపారు.
వాజ్‌పేయి ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారని, ప్రస్తుత రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం ఉండాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ భావించాయని ముఖోపాధ్యాయ్ తెలిపారు.
నరేంద్ర మోదీ మాత్రం 2014లో ప్రధాని అయిన వెంటనే రాజ్యాంగం భారతదేశంలోని ఏకైక పవిత్ర గ్రంథం అని, పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయం అని పిలవడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Reuters
రాజ్యాంగంపై నమ్మకముందన్న ఆర్ఎస్ఎస్
గత కొన్నేళ్లగా ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంపై తన వైఖరిని స్పష్టం చేయడానికి ప్రయత్నించింది.
''ఈ రాజ్యాంగాన్ని మన ప్రజలు తయారుచేశారు. రాజ్యాంగం మన దేశ ఏకాభిప్రాయం. కాబట్టి రాజ్యాంగాన్ని క్రమశిక్షణగా అనుసరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే దీన్ని విశ్వసిస్తోంది. స్వతంత్ర భారతదేశం అన్ని చిహ్నాలను, రాజ్యాంగ స్ఫూర్తిని మేము పూర్తిగా గౌరవిస్తూనే ఉన్నాం'' అని ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ 2018లో దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మాట్లాడుతూ అన్నారు.
బద్రీ నారాయణ్ ఒక సామాజిక చరిత్రకారుడు, సాంస్కృతిక శాస్త్రవేత్త. ఆయన ప్రస్తుతం అలహాబాద్‌లోని గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
''రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవిస్తున్నామని, రాజ్యాంగంతో ఉన్నామని, రాజ్యాంగ విలువలను విశ్వసిస్తున్నామని కొన్నేళ్లగా ఆర్ఎస్ఎస్ స్పష్టం చేస్తోంది. వివాదాలు సృష్టించాలనుకునేవారు ఏ విషయాన్నయినా లేవెనెత్తవచ్చు. అన్నింటిలో రాజకీయాలు చూడొచ్చు. మోహన్ భగవత్ లేదా ఆయన కంటే ముందు బాలాసాహెబ్ డియోరాస్ చేసిన ఆర్ఎస్ఎస్ ప్రకటనలను మీరు గమనిస్తే, ఆర్ఎస్ఎస్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసిస్తోందని స్పష్టంగా తెలుస్తుంది'' అని నారాయణ్ అన్నారు.
ఆర్ఎస్ఎస్‌కు రాజ్యాంగంతో లోతైన అనుబంధం ఉందని, రాజ్యాంగానికి సంబంధించి గత రెండు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ వైఖరి రాజ్యాంగానికి అనుకూలంగా ఉందని, అందులో ఎలాంటి వైరుధ్యం లేదని ప్రొఫెసర్ బద్రీ నారాయణ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మనస్మృతి, రాజ్యాంగం
భారత పార్లమెంటు రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు అయిన సందర్భంగా డిసెంబర్ 2024లో జరిగిన వేడుకలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాజ్యాంగం, మనుస్మృతి అంశంపై హిందుత్వ సిద్ధాంతకర్త వి. డి. సావర్కర్ రచనలను ఉదహరించడం ద్వారా బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు.
తన కుడి చేతిలో రాజ్యాంగం, ఎడమ చేతిలో మనుస్మృతి కాపీని పట్టుకుని రాహుల్ గాంధీ మాట్లాడారు. మన రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని సావర్కర్ తన రచనలలో స్పష్టంగా పేర్కొన్నారని రాహుల్ గాంధీ చెప్పారు.
రాహుల్ గాంధీ ప్రకటన పార్లమెంటు సమావేశాల్లో చాలా రోజుల పాటు గందరగోళానికి కారణమైంది.
మనుస్మృతి, రాజ్యాంగం అంశంలో కాంగ్రెస్ సహా అనేక రాజకీయ ప్రతిపక్షాలు ఆర్ఎస్ఎస్‌ను నిరంతరం విమర్శిస్తూనే ఉన్నాయి.
‘‘1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. నాలుగు రోజుల తర్వాత, సంఘ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు రాసిన ఓ సంపాదకీయంలో రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని రాసి ఉంది'' అని దిల్లీ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం బోధించిన, ఆర్ఎస్ఎస్, హిందూ జాతీయవాదం అనే విషయాలపై అనేక పుస్తకాలు రాసిన ప్రొఫెసర్ షంసుల్ ఇస్లాం చెప్పారు.
రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఉపయోగించగలిగేది ఏదీ మనుస్మృతిలో దొరకలేదా అనే ప్రశ్నను కూడా రాజ్యాంగాన్ని విమర్శించేటప్పుడు సంఘ్ లేవనెత్తిందని ప్రొఫెసర్ ఇస్లాం చెప్పారు. ''మన హిందూ దేశానికి వేదాల తర్వాత అత్యంత గౌరవనీయమైన మత గ్రంథం మనుస్మృతి అని, మనుస్మృతి హిందూ చట్టం అని సావర్కర్ ఇంతకు ముందు చెప్పారు" అని ప్రొఫెసర్ ఇస్లాం తెలిపారు.
''గోల్వాల్కర్ చేసినంతగా ముస్లిం లీగ్ కూడా భారత రాజ్యాంగాన్ని ఎగతాళి చేయలేదు'' అని గోల్వాల్కర్ రాసిన 'బంచ్ ఆఫ్ థాట్స్' ను ఉటంకిస్తూ ప్రొఫెసర్ ఇస్లాం చెప్పారు.
''రాజ్యాంగం విషయంలో ఆర్ఎస్ఎస్ ఆలోచన ఇప్పటికీ మునుపటిలాగే ఉంది. వారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు'' అని ప్రొఫెసర్ ఇస్లాం అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
మెజార్టీ ఉంటే చాలు..
గత కొన్నేళ్లుగా రాజ్యాంగంలో చేసిన ప్రధాన మార్పుల గురించి ముఖోపాధ్యాయ్ ప్రస్తావించారు. ''సీఏఏ ప్రకారం, పౌరసత్వం మతపరమైన గుర్తింపుతో ముడిపడి ఉంది. ఇది భారతదేశంలో స్థిరపడిన వారి కోసం... కానీ ముస్లింలను ఈ ప్రజల నుంచి మినహాయించారు'' అని ముఖోపాధ్యాయ్ అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంపై, దానిని మార్చలేమని 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై చర్చను ప్రారంభించిందని ముఖోపాధ్యాయ్ చెప్పారు.
''రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణం అనేదేమీ లేదని, ప్రతిదీ మార్చవచ్చని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కఢ్, న్యాయశాఖ మాజీ మంత్రి కిరణ్ రిజిజు అందుకే వాదిస్తున్నారు. చట్టసభ అత్యున్నతమని వారు చెబుతున్నారు....అంటే రాజ్యాంగంలో ఏదైనా మార్చడానికి మీకు పార్లమెంటులో మెజారిటీ ఉంటే చాలు'' అని ముఖోపాధ్యాయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జాతీయ జెండాపై వైఖరి మార్చుకున్న ఆర్ఎస్ఎస్
ఇప్పుడు ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తోంది. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు, కవాతుల్లో త్రివర్ణ పతాకం తరచుగా కనిపిస్తోంది. జాతీయ జెండాను గౌరవిస్తామని సంఘ్ చెబుతోంది.
కానీ స్వాతంత్య్రానికి ముందు, తర్వాత అనేక దశాబ్దాలుగా, త్రివర్ణ పతాకానికి సంబంధించి సంఘ్ వైఖరిపై అనేక ప్రశ్నలు తలెత్తాయి.
త్రివర్ణ పతాకంపై ఆర్ఎస్ఎస్ రెండో అధ్యక్షుడు మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ విమర్శనాత్మక వైఖరితో ఉండేవారు. ''మూడు రంగుల జెండా మన జాతీయ చరిత్ర, వారసత్వాన్ని ఆధారంగా చేసుకున్న ఏ జాతీయ దృక్పథం, లేదా వాస్తవం నుంచి ప్రేరణ పొందలేదు'' అని తన పుస్తకం ''బంచ్ ఆప్ థాట్స్‌లో గోల్వాల్కర్ రాశారు.
త్రివర్ణ పతాకాన్ని స్వీకరించిన తర్వాత, ఇది వివిధ వర్గాల ఐక్యతకు చిహ్నమని చెబుతున్నారని, హిందువులకు కాషాయం, ముస్లింలకు ఆకుపచ్చ, అన్ని ఇతర వర్గాలకు తెలుపు అని చెప్పారని గోల్వాల్కర్ తెలిపారు.
''హిందూయేతర వర్గాలలో ముస్లింల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎందుకంటే ఆ ప్రముఖ నాయకులలో చాలా మంది మనస్సులలో ముస్లింలకు ఆధిపత్యం ఉంది. వాళ్ల గురించి ప్రస్తావించకుండా మన జాతీయత సంపూర్ణంగా ఉంటుందని వారు అనుకోలేదు. ఇది మతపరమైన విధానమని కొందరు వ్యక్తులు ఎత్తి చూపినప్పుడు, వారు 'కాషాయం' త్యాగం కోసం, 'తెలుపు' స్వచ్ఛత కోసం, 'ఆకుపచ్చ' శాంతి కోసం అని ఒక తాజా వివరణ ముందుకు తీసుకొచ్చారు'' అని గోల్వాల్కర్ రాశారు.
''1929లో జరిగిన కాంగ్రెస్ లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ లేదా పూర్తి స్వాతంత్య్రం గురించి మొదటిసారి మాట్లాడినప్పుడు, 1930 జనవరి 26న స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోవాలని, త్రివర్ణ జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు. ఆ రోజు కూడా ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకానికి బదులుగా కాషాయ జెండాను ఎగురవేసింది'' అని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ చెప్పారు.
ధీరేంద్ర ఝా ఆర్ఎస్ఎస్‌పై విస్తృత పరిశోధన చేసిన ప్రసిద్ధ రచయిత. రెండో ఆర్ఎస్ఎస్ చీఫ్ గోల్వాల్కర్‌పై ఆయన రాసిన పుస్తకం ఇటీవలే ప్రచురితమైంది. దీనికి ముందు ఆయన నాథూరామ్ గాడ్సే, హిందుత్వపై కూడా పుస్తకాలు రాశారు.
1930 జనవరి 21న రాసిన లేఖలో డాక్టర్ హెడ్గేవార్ సంఘ్ శాఖలలో త్రివర్ణ పతాకాన్ని కాకుండా కాషాయ జెండాను ఎగురవేయడం గురించి మాట్లాడారని ఝా చెప్పారు.
సంఘ్ ఈ ఆరోపణలను ఖండిస్తూనే ఉంది. 1930లో త్రివర్ణ జెండాకు జాతీయ జెండా హోదా లేదు.
''డాక్టర్ హెడ్గేవార్ ఏకైక జీవిత లక్ష్యం దేశం గౌరవాన్ని, స్వాతంత్య్రాన్ని సాధించడం. అలాంటప్పుడు సంఘ్‌కు వేరే లక్ష్యం ఎలా ఉంటుంది? వాలంటీర్లకు సహజంగానే స్వాతంత్ర్యానికి సంబంధించిన అన్ని గుర్తులపై అపారమైన గౌరవం, భక్తి ఉంటాయి. సంఘ్ ఇంతకంటే మరేమీ ఆలోచించదు'' అని 2018లో ప్రస్తుత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పుడది కాంగ్రెస్ పతాకం.. జాతీయ జెండా కాదు
రామ్ బహదూర్ రాయ్ ప్రముఖ జర్నలిస్ట్. ప్రస్తుతం ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ మాజీ అధ్యక్షులు బాలాసాహెబ్ దేవరాస్‌తో పాటు భారత రాజ్యాంగంపై ఆయన పుస్తకాలు రాశారు.
1930లో ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు చెప్తున్న అంశంపై ఆయన మాట్లాడారు. ''త్రివర్ణ పతాకాన్ని వారు ఎగరవేయలేదని నేను నమ్ముతున్నా. మీరు దీనిని మానసిక కోణం నుంచి చూడాలి. ఆ సమయంలో త్రివర్ణ పతాకం స్వేచ్ఛకు ప్రాతినిధ్యం వహించలేదు, అది కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యంగా ఉండేది'' అని ఆయనన్నారు.
''ఆ సమయంలో జాతీయ స్వాతంత్య్ర పోరాటానికి కాంగ్రెస్ ప్రధాన స్రవంతి వేదికగా ఉందన్నది నిజం. స్వాతంత్య్ర లక్ష్యం నుంచి ఆర్ఎస్ఎస్ కూడా ప్రేరణ పొందింది. కానీ కాంగ్రెస్‌తో పోలిస్తే ఆర్ఎస్‌ఎస్‌కు భిన్నమైన ఉనికి ఉంది. ఆర్ఎస్ఎస్ ఉనికికి చిహ్నం కాషాయం. కాబట్టి, నా ఉద్దేశం ప్రకారం డాక్టర్ హెడ్గేవార్ రాసిన లేఖలో రెండు విషయాలు ఉండుంటాయి..'మనం స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంటున్నాం కానీ మన ఉనికి భిన్నమైంది. కాబట్టి మనం మన సొంత జెండాను ఎగురవేయాలి' అని హెడ్గేవార్ రాసి ఉంటారు'' అని రామ్ బహదూర్ రాయ్ అభిప్రాయపడ్డారు.
''మన జాతీయ జెండా లేదా హిందీలో మనం పిలిచే 'తిరంగా' మనందరికీ ప్రియమైనది. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం పొందిన రోజు, 1950 జనవరి 26న భారత్ రిపబ్లిక్‌గా అవతరించిన రోజు నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో తిరంగాను ఎగురవేశారు'' అని సంఘ్ అఖిల భారత ప్రచార ఇన్‌చార్జ్ సునీల్ అంబేకర్ తన పుస్తకం 'ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్స్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ'లో రాశారు.
1963లో గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొన్న వాలంటీర్లు త్రివర్ణ పతాకం పట్టుకున్నారని అంబేద్కర్ కూడా చెప్పారు.
1962లో చైనాతో యుద్ధం తరువాత అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1963లో గణతంత్ర దినోత్సవ పెరేడ్‌కు సంఘ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారని సంఘ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు తరచుగా చెబుతుంటారు.
''1963 గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో ఆర్ఎస్ఎస్‌కు చెందినవారి చేతిలో త్రివర్ణ పతాకం మొదటిసారి కనిపించింది'' అని ధీరేంద్ర ఝా చెప్పారు, అయితే ఈ పరేడ్‌కు ఆహ్వానించింది ఆర్ఎస్ఎస్‌ను మాత్రమే కాదని, అన్ని కార్మిక సంఘాలు, పాఠశాలలు, కళాశాలలను ఈ పరేడ్‌కు ఆహ్వానించారని ఆయన చెప్పారు.
"ఈ కవాతును ప్రజల పరేడ్‌గా భావించారు. 1962 యుద్ధం అప్పుడే ముగిసింది. సైన్యాలు ఇంకా సరిహద్దుల్లోనే ఉన్నాయి. భారతీయ మజ్దూర్ సంఘ్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వంటి సంస్థలను ఆహ్వానించారు. గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్‌పై నిషేధం అమల్లో ఉంది. వారికి(ఆర్ఎస్ఎస్ వ్యక్తులకు) చట్టబద్ధత అవసరం కాబట్టి యూనిఫాం ధరించి వారులోపలికి ప్రవేశించారు'' అని ధీరేంధ్ర ఝా తెలిపారు.
ఆ సమయంలో ఆర్ఎస్ఎస్‌కు చెందిన వారి చేతిలో త్రివర్ణ పతాకం కనిపించింది, ఎందుకంటే ఎవరూ తమ జెండా లేదా బ్యానర్లను తీసుకురావద్దని, ప్రతి ఒక్కరి చేతిలో త్రివర్ణ పతాకం మాత్రమే ఉండాలని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్పష్టం చేశారని ఝా వివరించారు.
''నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను ఆహ్వానించారని ఇక్కడ కూడా ఆ సంస్థ అబద్ధాలను వ్యాప్తి చేయడం ప్రారంభించింది'' అని ఝా చెప్పారు.
''త్రివర్ణ పతాకంతో సంఘ్‌కు ఎప్పుడూ సౌకర్యవంతమైన సంబంధం లేదు. చాలా కాలం తర్వాత త్రివర్ణ పతాకం, రాజ్యాంగం, గాంధీ ఈ దేశానికి ఆత్మ అని సంఘ్ అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు, త్రివర్ణ పతాకాన్ని గౌరవిస్తున్నట్టు నటించడం మొదలుపెట్టింది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, The Organiser
జాతీయ జెండా: సంఘ్‌పై ఆరోపణలు
ఆర్ఎస్ఎస్‌పై వచ్చే విమర్శల్లో ఒకటి సంఘ్ తన ప్రధాన కార్యాలయంలో భారత జెండాను ఎగురవేయదని. 1950 తర్వాత 2002 జనవరి 26న సంఘ్ తన ప్రధాన కార్యాలయంలో మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
2002 వరకు జాతీయ జెండాను ఎగురవేయడానికి సాధారణ పౌరులను అనుమతించనందున అప్పటి వరకు సంఘ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదని ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు, నాయకులు చెబుతుంటారు.
కానీ 2002 వరకు అమలులో ఉన్న జెండా కోడ్ నియమాల ప్రకారం ఏ భారతీయ వ్యక్తి లేదా సంస్థ గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి సందర్భంగా జెండాను ఎగురవేయడాన్ని నిరోధించలేదు.
1950, 60,70లలో ప్రైవేట్ కంపెనీలు కూడా ఆగస్టు 15, జనవరి 26న భారత జెండాను ఎగురవేసేవని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ చెప్పారు. "జెండా నియామవళి ఏకైక ఉద్దేశం జాతీయ జెండాను అగౌరవపరచకుండా చూసుకోవడం'' అని ఆయన తెలిపారు.
"అనేక సంస్థలు, ప్రభుత్వ విభాగాల తరహాలోనే, ఆర్ఎస్ఎస్‌కు కూడా దాని సొంత జెండా ఉంది. కాషాయం జెండా లేదా 'భగవా ధ్వజ్'" అని సునీల్ అంబేకర్ రాశారు.
"కాషాయ జెండా శతాబ్దాలుగా భారతదేశ సాంస్కృతిక డీఎన్‌ఏకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2004లో జెండా కోడ్‌ను నియంత్రించే నిబంధనల సరళీకరణ తరువాత, తిరంగాను క్రమం తప్పకుండా సంఘ్ ప్రధాన కార్యాలయంలో అత్యున్నత ప్రమాణాల మధ్య ఎగరేస్తున్నారు. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా జాతీయ జెండా ఎగరవేస్తారు. త్రివర్ణపతాకంతో పాటు భగవా ధ్వజ్ కూడా ఎగరేస్తారు'' అని ఆయన చెప్పారు.
త్రివర్ణ పతాకం భారతదేశ జాతీయ జెండాగా మారిన రోజు, అది అశుభ జెండా అని ఆర్ఎస్ఎస్ వ్యా ఖ్యానించిందని ప్రొఫెసర్ షంసుల్ ఇస్లాం చెప్పారు. " భారత ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఎలాంటి గుర్తులను ఆర్ఎస్ఎస్ గౌరవించలేదు. ఎందుకంటే వారి ఉద్దేశం ప్రకారం ఈ చిహ్నాలు హిందూ దేశానికి చెందినవి కావు" అని షంసుల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కుల వ్యవస్థ, కుల గణన, సంఘ్
సంఘ్ ప్రారంభ రోజుల్లో, దాని నాయకులు కుల వ్యవస్థను హిందూ సమాజంలో అంతర్భాగంగా భావించారు.
''మన సమాజంలోని మరో లక్షణం కుల వ్యవస్థ. కానీ ఇప్పుడు దీనిని 'కులతత్వం' అని పిలవడం ద్వారా ఎగతాళి చేస్తున్నారు. మన ప్రజలు కుల వ్యవస్థ గురించి ప్రస్తావించడాన్ని అవమానకరంగా భావిస్తారు. కుల వ్యవస్థలో అంతర్లీనంగా ఉన్న సామాజిక వ్యవస్థను సామాజిక వివక్షగా భావిస్తారు'' అని 'బంచ్ ఆఫ్ థాట్స్' లో గోల్వాల్కర్ రాశారు.
కుల వ్యవస్థ క్షీణిస్తుండడాన్ని, కులవ్యవస్థ గురించి వక్రీకరించిన స్వభావాన్ని చూసి కొందరు "ఈ శతాబ్దాలలో మన పతనానికి కారణం ఈ కుల వ్యవస్థ" అని నిరంతరం ప్రచారం చేస్తున్నారని గోల్వాల్కర్ అన్నారు.
అంతేకాకుండా, భారతదేశంలో పురాతన కాలం నుంచి కులాలు ఉన్నాయని, కులాలు సమాజ ఐక్యతకు విఘాతం కలిగించిన లేదా దాని పురోగతికి ఆటంకం కలిగించిన ఉదాహరణలు లేవని గోల్వాల్కర్ చెప్పారు.
గోల్వాల్కర్ మరణం తరువాత సర్‌సంఘ్‌చాలక్ అయినప్పుడు, ఆర్ఎస్ఎస్‌ను విస్తరించాల్సిన అవసరం గురించి, సంస్థ ఇతర కులాల ప్రజలను చేరుకోవాల్సిన అవసరం గురించి బాలాసాహెబ్ దేవరాస్ మాట్లాడారని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ తెలిపారు.
"సామాజిక సామరస్యం అనే పదం ఇప్పుడు మనం వింటున్నాము. 1974లో సామరస్యం అవసరం గురించి దేవరాస్ మొదటిసారి మాట్లాడారు. కానీ దిగువ కులాల ప్రజలకు ఎప్పుడూ తలుపులు మూసి ఉంచే తన విధానాన్ని ఆర్ఎస్ఎస్ కొనసాగించింది. 1980ల చివరిలోనే వారు ఇతర కులాల ప్రజలకు ఆర్ఎస్ఎస్ తలుపులు తెరిచి వారిని ఆకర్షించడం ప్రారంభించారు'' అని ముఖోపాధ్యాయ్ చెప్పారు.
1989 నవంబరులో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖోపాధ్యాయ్ గుర్తుచేసుకున్నారు. రామ మందిర ట్రస్ట్ సభ్యుడిగా ఉండి ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించిన విశ్వ హిందూ పరిషత్ షెడ్యూల్డ్ కుల నాయకుడు కామేశ్వర్ చౌపాల్ రామాలయానికి శంకుస్థాపన చేసిన వ్యక్తని ముఖోపాధ్యాయ్ చెప్పారు. ''1989 తరువాత కామేశ్వర్ చౌపాల్ కూడా కొన్ని సంవత్సరాలు బీజేపీలో ఉన్నారు. ఆ తరువాత ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి తిరిగి రామ్ మందిర్ ట్రస్ట్‌కు వెళ్లిపోయారు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముందని వాళ్లకు తెలుసు. కానీ ఓ పరిధి దాటి వాళ్లు వెళ్లేవారు కాదు. వారు ఈ గందరగోళం ఎంతకాలం కొనసాగిస్తారో నాకు తెలియదు, కానీ అది ఇప్పటికీ ఉంది'' అని ఆయన తెలిపారు.
దీనిపై 2018లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ''1950లలో సంఘ్‌లో బ్రాహ్మణులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు, ప్రాంతీయ, జోనల్ స్థాయిలో, అన్ని కులాలకు చెందిన ప్రజలు మా కార్యకర్తలుగా ఉన్నారని నేను తప్పక చెప్పాలి. అఖిల భారత స్థాయిలో కూడా, కార్యకర్తలు ఏ ఒక్క కులానికి చెందినవారు కాదు. ఇది పెరుగుతూనే ఉంటుంది. మొత్తం సమాజం వ్యవస్థీకృతమైనప్పుడు, అన్ని కులాలు, తరగతులకు చెందిన వ్యక్తులతో వర్కింగ్ గ్రూపులు ఏర్పాటుచేసుకోగలుగుతాం. ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైనదని నేను ఇప్పటికే చెప్పాను. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఆ దిశగా ముందుకు సాగుతున్నాం''అని మోహన్ భగవత్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కుల వ్యవస్థ: మారిన సంఘ్ వైఖరి
హిందూ సమాజంలో ఐక్యత అవసరమని పదే పదే చెబుతున్నఆర్ఎస్ఎస్... దళితులు, వెనుకబడిన కులాల సామాజిక-ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను ప్రారంభించింది.
కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి సామాజిక సమగ్ర వేదిక, వనవాసి కల్యాణ్ ఆశ్రమ్ వంటి సంస్థల ద్వారా, ఆర్ఎస్ఎస్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ సంస్థలు మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న దళితులు, వెనుకబడిన కులాలు, గిరిజన ప్రజలకు అవగాహన కల్పించడానికి, అట్టడుగు వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి పనిచేస్తున్నాయి.
అయితే దళితులు, వెనుకబడిన కులాల కోసం ఆర్ఎస్ఎస్ ఏం చేసినా ఆ వర్గాలను సంఘ్‌కు విధేయతగా ఉంచడమే లక్ష్యమని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
"కుల గుర్తింపు ఆధారంగా వివక్షను అంతం చేయడం కులాల మధ్య హిందూ సమైక్యతకు తప్పనిసరని ఆర్ఎస్ఎస్‌కు తెలుసు. కుల వివక్ష కొనసాగితే ఆర్ఎస్ఎస్ వృద్ధి చెందదని కూడా తెలుసు. దీని నాయకత్వం ప్రధానంగా అగ్రవర్ణాల చేతిలో ఉంది. ఇటీవలి సంవత్సరాలలో మాత్రమే ఇతర కులాలకు చెందిన కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ఉన్నత కులాల సంస్థ'' అని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'సంఘ్‌ను కొత్త కోణంతో చూడాలి'
ఒక సంస్థ ఆవిర్భవించడం మొదలైనప్పుడు, అది కులంపై ప్రధానంగా ఆధారపడి ఉంటుందని ప్రొఫెసర్ బద్రీ నారాయణ్ చెప్పారు.
"ఏ సంస్థ అయినా సామాజిక అనుసంధానంతో ప్రారంభమవుతుంది. క్రమంగా సంస్థ పెరిగినప్పుడు, అది ఎక్కువ మంది వ్యక్తులను చేర్చుకుంటుంది. అందరినీ కలుపుకుపోకుండానే.. సంఘ్ ఇంత పెద్ద సంస్థగా ఎదిగేదంటే నమ్మలేం'' అని ప్రొఫెసర్ నారాయణ్ అన్నారు.
ఇటీవలి కాలంలో సంఘ్ ప్రచారకుల ప్రొఫైళ్లను గమనించినప్పుడు.ఆర్ఎస్ఎస్‌లో పెద్ద సంఖ్యలో ఓబీసీలు, దళితులు ఉన్నారని, వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని తాను గమనించినట్టు ఆయన చెప్పారు.
"వారు ప్రాంత్ ప్రచారక్ నుంచి అనేక ఇతర పదవులు పొందుతున్నారు. సంఘ్ నిరంతరం కాలానికి అనుగుణంగా మారుతుంది. దాని ఆధారంగా కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి. కానీ చాలా మంది ఇప్పటికీ దానిని పాత కోణం నుంచి చూస్తున్నారు. సంఘ్ ఇలా లేదా సంఘ్ అలా అని చెప్పే ఓ రకమైన వామపక్ష అభిప్రాయమిది. కానీ సంఘ్‌ను నిశితంగా పరిశీలిస్తే, చాలా మార్పులు వచ్చాయన్న విషయం అర్ధమవుతుంది. సంఘ్‌ను అర్థం చేసుకోవడానికి మనం కొత్త కోణంలో పరిశీలించాల్సిన అవసరముంది. ఎందుకంటే ప్రస్తుతం, మీరు సంఘ్‌ను బయటి నుంచి చూస్తున్నారు, ఇతరులు సృష్టించిన అవగాహనా కోణంలో మీరు చూస్తున్నారు"అని ఆయన చెప్పారు.
సంఘ్ నిర్వహిస్తున్న సరస్వతి శిశు మందిర్ పాఠశాలలను ప్రొఫెసర్ బద్రీ నారాయణ్ ఉదహరించారు. "దళిత, ఓబీసీ వర్గాలకు చెందిన చాలా మంది పిల్లలు అక్కడ చదువుకోవడానికి వస్తున్నారు, అక్కడ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత జీవితంలో ముందుకెళ్తున్నారు. వారిలో చాలా మంది ప్రచారకులు కూడా అవుతారు. చాలా మంది ఉద్యోగాల కోసం వెళ్తారు. సంఘ్ సాధికారత కల్పించే సంస్థగా అభివృద్ధి చెందింది. సంఘ్ పాఠశాలలు అన్ని రకాల వర్గాలను కలుపుకొని చాలా కృషి చేశాయి. ఈ ప్రక్రియ దిగువ నుంచి ప్రారంభమై పైకి వెళ్తోంది"అని ఆయన అన్నారు.
'కుల సమస్యపై ఏదన్నా గందరగోళం చూసినప్పుడల్లా ఆర్ఎస్ఎస్ ఏదో ఒకటి మాట్లాడటం ప్రారంభిస్తుంది. కానీ ఈ రోజు వరకు దళితులు, వెనుకబడిన తరగతులు, మహిళల సంగతి పక్కన పెడితే రజ్జూ భయ్యా తప్ప, ఇతర కులం నుంచి ఎవరూ ఆర్ఎస్ఎస్‌లోకి రాలేదు. కానీ ఆర్ఎస్ఎస్ తరచుగా దళితుల సమస్యలను, గిరిజనుల కాళ్లు కడగడం వంటి విషయాలను లేవనెత్తుతుంది'' అని 'క్యాస్ట్ అండ్ ఎలక్షన్స్' అనే పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత అరవింద్ మోహన్ చెప్పారు.
శతాబ్ది సంవత్సరాన్ని జరుపుకుంటున్నప్పటికీ ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ కులతత్వం, అంటరానితనం గురించి లేదా అంటరానివారికి హక్కులు ఇవ్వడం గురించి సమాజ ఆలోచనను మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని మోహన్ విమర్శించారు.
"ఆ సంస్థ చేసిందల్లా... దళితుల ఇంట్లో భోజనం చేయడం లేదా గిరిజనుల పాదాలు కడగడం వంటివాటికి పరిమితం కావడమే. అధికార భాగస్వామ్యంలో దళితులు ఎక్కడా కనిపించరు. సంఘ్ సంస్థాగత నిర్మాణంలో కూడా దళితులు ఎక్కడా కనిపించరు"అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కుల గణన, రిజర్వేషన్లు:ఆర్ఎస్ఎస్ చిక్కుముళ్లు?
కుల గణన, రిజర్వేషన్ల అంశాలపై సంఘ్ గందరగోళ స్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది. సంఘ్‌కు మద్దతుదారులుగా ఉన్న ఉన్నత కులస్థులు పెద్ద సంఖ్యలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారని సంఘ్ భావిస్తోంది.
2023 డిసెంబరులో, విదర్భ ప్రాంతానికి చెందిన ఆర్ఎస్ఎస్ మహాసంఘచలక్ శ్రీధర్ గాడ్గే దీనిపై స్పందించారు. కుల ఆధారిత జన గణన ఉండకూడదని, ఎందుకంటే అలాంటి జన గణన అనవసరమైన ప్రక్రియ అన్నది నిరూపితమవుతుందని, ఇది కొద్దిమందికి మాత్రమే ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు.
ఈ వ్యాఖ్య తరువాత, రాజకీయ గందరగోళం చెలరేగడంతో... కుల గణనకు వ్యతిరేకం కాదని రెండు రోజుల తరువాత ఆర్ఎస్ఎస్ స్పష్టం చేయాల్సి వచ్చింది.
''ఇటీవల కుల గణనకు సంబంధించి మళ్లీ చర్చ ప్రారంభమైంది. సమాజం మొత్తం పురోగతి కోసం దీనిని ఉపయోగించాలని మేం నమ్ముతున్నాం. కులగణన చేస్తున్నప్పుడు సామాజిక సామరస్యం, సమగ్రతకు ఎలాంటి ఆటంకం లేదని అన్ని పార్టీలు హామీ ఇవ్వాలి'' అని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఒక ప్రకటనలో అన్నారు.
వివక్ష లేని, సామరస్యపూర్వకమైన, న్యాయపరమైన హిందూ సమాజాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తోందని అంబేకర్ అన్నారు. చారిత్రక కారణాల వల్ల సమాజంలోని అనేక వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నాయన్నది నిజం. అనేక ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వాటి అభివృద్ధి, సాధికారత కోసం కృషిచేశాయి. వారికి ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతు ఇచ్చింది'' అని ఆయన చెప్పారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు... రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని మాట్లాడినప్పుడు ఆ సంస్థ వివాదంలో చిక్కుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదన్న సంఘ్
మొత్తం దేశ ప్రయోజనాల గురించి నిజాయితీగా ఆందోళన చెందుతున్న, సామాజిక సమానత్వానికి కట్టుబడి ఉన్న వ్యక్తుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఏ వర్గానికి రిజర్వేషన్లు అవసరమో, ఎంతకాలం అవసరమో ఆ కమిటీ నిర్ణయించాలని భగవత్ అన్నారు.
రిజర్వేషన్ల ప్రయోజనాలు సమాజంలోని ప్రతి అణగారిన వర్గానికి చేరాలన్నది భగవత్ ఉద్దేశమని ఆర్ఎస్ఎస్ తర్వాత స్పష్టం చేసింది. అయితే భగవత్ ప్రకటనను ఉదహరిస్తూ, రిజర్వేషన్లను నిలిపి వేయడానికి సంఘ్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు.
బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓటమికి రిజర్వేషన్ల అంశంపై భగవత్ చేసిన ప్రకటన ఒక ముఖ్యమైన కారణంగా భావిస్తారు.
ఆ తర్వాత, రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేయడానికి సంఘ్ నిరంతరం ప్రయత్నించింది. కుల వివక్ష ఉన్నంత కాలం, రిజర్వేషన్లు కొనసాగుతాయని, రెండు వేల సంవత్సరాలు కష్టాలను ఎదుర్కొన్న వారి కోసం రెండు వందల సంవత్సరాల పాటు కష్టాలను భరించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని 2023 సెప్టెంబరులో మోహన్ భగవత్ అన్నారు.
కులాల ఆధారంగా జనగణనపై 2024 సెప్టెంబరులో సంఘ్ తన విధానాన్ని మరోసారి స్పష్టంచేసింది.
"వెనుకబడిన వర్గాలు లేదా కులాల సంక్షేమ కార్యకలాపాల కోసం ప్రభుత్వానికి డేటా అవసరం, అయితే అలాంటి సమాచారాన్ని ఆ వర్గాల సంక్షేమం కోసం మాత్రమే సేకరించాలి. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదు'' అని సంఘ్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
మండల్ కమిషన్ వ్యతిరేక నిరసనల్లో ఆర్ఎస్ఎస్
"కులగణనపై చేసిన వ్యాఖ్యలపై సమాజంలో గందరగోళం ఉంటే, ఆ గందరగోళాన్ని చల్లార్చడానికి ఏదో చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని కులగణనపై ఆర్ఎస్ఎస్ ప్రకటనలను ఉద్దేశించి అరవింద్ మోహన్ అన్నారు..
"ఆర్ఎస్ఎస్ స్వభావం ఏంటంటే, కష్టకాలం వచ్చినప్పుడల్లా, నమస్కరించి, దానిని దాటవేసి, తరువాత అసలు ఎజెండా కొనసాగించడం" అని ఆయన చెప్పారు.
1990లలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించిన మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరిగినప్పుడు,ఆర్ఎస్ఎస్ ఆ నిరసనల్లో పాల్గొంది.
మండల్ కమిషన్ సమయంలో వీపీ సింగ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు కూడా రిజర్వేషన్ల అంశంపై ఆర్ఎస్ఎస్,బీజేపీ వ్యతిరేకత కనిపించింది.
1990లలో మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో సంఘ్ వైఖరిని అరవింద్ మోహన్ ప్రస్తావించారు. "మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లలో బీజేపీకి ఓబీసీ ఓటుబ్యాంకు ఉండేది. సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ముందుకు సాగకపోతే అంతమవుతామని భావించిన సుశీల్ మోదీ వంటి కొందరు నాయకులు ఉన్నారు. ఈ ఒత్తిడి కారణంగా, బీజేపీ మారింది గానీ అప్పటి వరకు బీజేపీ రిజర్వేషన్లను బహిరంగంగా వ్యతిరేకించింది. సంఘ్ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించింది" అని అరవింద్ మోహన్ తెలిపారు.
కులాన్ని గుర్తింపు సాధనంగా మార్చడం ద్వారా రాజకీయాలలో కులాన్ని ఉపయోగిస్తారని ప్రొఫెసర్ బద్రీ నారాయణ్ చెప్పారు.
"మీరు అభివృద్ధి కోసం కులాన్ని ఉపయోగించాలనుకున్నప్పుడల్లా, అది గుర్తింపు సాధనంగా మారుతుంది. దీనిని నివారించడం కష్టం. కాబట్టి మనం కుల గణన గురించి మాట్లాడిన వెంటనే, కులం ప్రస్తావన వస్తుంది. కులం గుర్తింపు రాజకీయాల రూపంలో రావాలి. గుర్తింపు రాజకీయాలు అట్టడుగు వర్గాలకు కొంత కాలం పాటు సాధికారత కల్పిస్తాయి, కానీ కొంత సమయం తర్వాత అవి ఆ సాధికారతను నిలిపివేస్తాయి''అని ప్రొఫెసర్ నారాయణ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














