Food Delivery Apps: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
'స్విగ్గీ చేయ్' అంటూ ఫేమస్ అయిన స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్ ప్రారంభమైన మొదటి రోజు, ఆ యాప్‌లో ఒక్క ఆర్డరు కూడా నమోదు కాలేదు.
కానీ ఇప్పుడా సంస్థ ప్రతిరోజూ 20 లక్షల నుంచి 25 లక్షల ఫుడ్ ఆర్డర్లను డోర్ డెలివరీ చేస్తోందని సీఈఓ శ్రీహర్ష మాజేటి తెలిపారు.
ఇక మరో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా ప్రతిరోజూ 25 లక్షల ఫుడ్ ఆర్డర్లు ప్రాసెస్ చేస్తోందని ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ ఓ ఇంటర్వూలో చెప్పారు.
ప్రస్తుతం దేశంలో ఈ రెండు ఫుడ్ డెలివరీ యాప్‌లు ఆహార పరిశ్రమలో ఆధిపత్యం చూపుతున్నాయి. వీటితోపాటు ఈట్ క్లబ్, ఫ్రెష్ మెను, డోమినోస్ లాంటి యాప్‌లు చాలా ఉన్నాయి. అలాగే అనేక హోటళ్లు కూడా ఆన్‌లైన్ ఆర్డర్లు అందిస్తున్నాయి.
ఇక స్విగ్గీ, జొమాటో కలిపి దాదాపు ప్రతిరోజూ 45 లక్షల నుంచి 50 లక్షల పుడ్ ఆర్డర్లు డెలివరీ చేయడాన్ని భారతదేశ జనాభా రీత్యా చూసినప్పుడు ఈ ఆర్డర్ల సంఖ్య చిన్నదిగా కనిపించొచ్చు కానీ, భారతీయుల సంప్రదాయ ఆహార అలవాట్లలో వచ్చిన మార్పును ఇవి సూచిస్తున్నాయి.
ఇంట్లోనే వంట చేసుకోవాలనే సంప్రదాయ ఆలోచనా ధోరణిలో ఈ ఆన్‌లైన్ యాప్‌లు మార్పులు తీసుకువచ్చాయి. ''జస్ట్ ఆర్డరు పెడితే చాలు సమయం ఆదా, శ్రమ తప్పుతుంది'' అని హైదరాబాద్‌కు చెందిన కంపెనీ సెక్రటరీ హర్ష వర్థిని చెప్పారు.
గుమ్మం ముందే ఫుడ్ ఆర్డర్ సౌలభ్యం ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది? అసలు ఇంత తేలికగా ఫుడ్ డెలివరీ యాప్‌లకు ప్రజలు అలవాటు పడటానికి కారణమేంటి? దీనివల్ల మహిళలకు ఏమైనా మేలు కలుగుతోందా?


ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో ఫుడ్ డెలివరీ అనే భావన 1890లో ముంబయిలో డబ్బావాలాలతో ప్రారంభమైంది. ఇంట్లో వండిన ఆహారాన్ని టిఫిన్ బాక్సుల్లో (డబ్బాలలో) సేకరించి నగరమంతటా ప్రజలకు చేరవేయడం ఇందులోని ప్రత్యేకత. డబ్బావాలాలు ముంబయి సంస్కృతిలో ఒక భాగంగా మారారంటే ఈ వ్యవస్థ అక్కడ ఎంతగా వేళ్లూనుకు పోయిందో తెలుస్తుంది.
దీని తరువాత 1990లలో ఆఫీసులలో లంచ్ డెలివరీలు పాపులర్ కావడం మొదలైంది. నగరాలలో ఆఫీసులకు వెళ్లేవారు, వృత్తినిపుణులకు ఇది సౌలభ్యంగా మారింది.
ఇక 2000 సంవత్సరం నాటికి ఫోన్లు భారీగా అందుబాటులోకి రావడం వల్ల రెస్టారెంట్స్ ఫోన్ల ద్వారా ఆర్డర్లు తీసుకోవడం మొదలైంది. ఇది ఆఫీసులలో పనిచేసేవారికి, ఇళ్లలో ఉండేవారికీ కూడా కాలు బయటపెట్టకుండా ఇంటిపట్టునే హోటల్ ఫుడ్ తినడం మొదలైంది.
ఇక 2010 నాటికల్లా ఆన్‌లైన్ ఫుడ్ యాప్ మొదలయ్యాయి. ఇవి ప్రజలకు తమకు నచ్చిన రెస్టారెంట్ ఆహారాన్ని తెప్పించుకునే అవకాశం కల్పించాయి.
ఇంటర్‌నెట్ చౌకగా లభించడం, ఎక్కువమందికి స్మార్ట్‌ఫోన్లు చేరడంతో యాప్ ఆధారిత సేవలు వేగంగా విస్తరించాయి. పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించడం, బయటి ఫుడ్‌పై యువతరం ఆసక్తి, నగర జీవన అలవాట్లు కూడా ఫుడ్ డెలివరీల పెరుగుదలకు కారణమైంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫుడ్ యాప్‌లు ప్రజల జీవితంలో భాగమైపోవడానికి మరో ముఖ్యమైన కారణం కోవిడ్ 19. ఆ సమయంలో ప్రజలు ఎక్కువగా డోర్ డెలివరీపై ఆధారపడ్డారు.
అదే సమయంలో హోటళ్లను మూతపడే స్థితి నుంచి ఈ డోర్ డెలివరీలు రక్షించాయని చెబుతారు.
2019, 2023 మధ్య ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ 8% నుండి 12% కు పెరిగిందని స్విగ్గీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది మొత్తం ఆహార సేవలతో పోలిస్తే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో 2.8 రెట్లు పెరుగుదలను చూపుతోంది.
ఇది 2030 నాటికి 20 శాతానికి పెరుగుతుందని, పెరుగుతున్న సంపద, పట్టణీకరణ కారణంగా 2030 నాటికి ఆన్‌లైన్ ఆహార వినియోగదారుల సంఖ్య 45 కోట్లకు చేరుకోవచ్చని ఓ రిపోర్టు అంచనా వేసింది.
మరోపక్క ఆయా ఫుడ్ డెలివరీ యాప్‌లు మొదట్లో అందించిన, ఇప్పటికీ అందిస్తున్న డిస్కౌంట్లు కూడా ప్రజలు వీటికి అలవాటు పడేలా చేశాయి.
మెట్రో నగరాలకు పరిమితమైన ఫుడ్ డెలివరీ సేవలు ఇప్పుడు గ్రామీణ వాతావరణం ఉండే టైర్2, టైర్ 3 నగరాలలోనూ కనిపిస్తున్నాయి.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జొమాటో, బ్లింకిట్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లు కేవలం ఫుడ్ మాత్రమే కాక, నిత్యావసర వస్తువులు , కూల్‌డ్రింక్స్, రెడీ టు ఈట్ ఆహారాన్నీ కూడా అందిస్తున్నాయి.
అలాగే ప్రసిద్ధ రెస్టారెంట్లు కూడా తమ అమ్మకాలను పెంచుకోవడానికి స్విగ్గీ, జొమాటోలతో జతకట్టాయి. దీనివల్ల ప్రజలకు 'ఎంపిక స్వేచ్ఛ' పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫుడ్ డెలివరీ యాప్‌లు ఎన్నివచ్చినా, ఎంత ప్రసిద్ధి చెందినా భారత్‌లో ఇప్పటికీ ఇంటిపట్టున వండే వంటకే ప్రాధాన్యం ఎక్కువ.
భారతీయులు నెలకు సగటున 5సార్లు మాత్రమే బయట భోజనం చేస్తున్నారని 2024లో ప్రచురితమైన హౌ ఇండియా ఈట్స్ రిపోర్ట్ తెలిపింది.
నెలకు సగటున 5 సార్లు బయట తినడమనేది భారతీయులకు ఓ ప్రత్యేక సందర్భం లాంటిదే. ఇది 2030 నాటికి 7–8 రెట్లు పెరుగుతుందని భావిస్తున్నారు.అయితే భారతీయుల ఆహారపు అలవాట్లు ఓ కొత్త దిశగా మారిపోతున్నాయని ఆ రిపోర్టు చెప్పింది.
అమెరికా, చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నెలకి సగటున 25 నుంచి 30 సార్లు బయట తినడం సాధారణమేనని, అంటే అక్కడ భోజనం 'రుచికరంగా' కాక 'సౌలభ్యంగా' మారిందని పేర్కొంది. ఇప్పుడీ దిశగానే భారత్‌లోనూ మార్పు కనిపిస్తోందని తెలిపింది.
ప్రస్తుతం భారతీయులు నెలకి సగటున కేవలం 5 సార్లు మాత్రమే ఇంట్లో వంట మానుకుని బయట ఆర్డర్ చేస్తుండగా, భవిష్యత్తులో ఈ రంగం మరింత ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయని తెలిపింది.
ఇక బయటి ఫుడ్ తినడంలో డెలివరీ ద్వారా ఇంటికే తెప్పించుకుని తినేవారు 48 శాతం ఉండగా, బయటకు వెళ్లి తినేవారు 34 శాతం,ఇంటికి తీసుకువెళ్లి తినేవారి శాతం 18గా ఉందని ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది.
అలాగే వంటమనిషిని పెట్టుకోవడం కంటే ఆహారం బయట ఆర్డర్ చేసుకోవడమే తక్కువ ఖర్చుతో కూడిన పనిగా 43 శాతం మంది రెస్పాండెంట్స్ చెప్పారని ఉబెర్‌ఈట్స్ అధ్యయనం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ సమాజంలో వంట మహిళల పనిగా భావించే సంస్కృతి ఉంది. అయితే పట్టణీకరణ పెరగడం, మహిళలు కూడా ఉద్యోగాలు చేయడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడం, కుటుంబసభ్యులతో సమయం గడపాలనుకోవడం లాంటి కారణాల వల్ల ఇప్పుడు మహిళలు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌పై దృష్టి సారిస్తున్నారు.
దీంతోపాటు మరో ముఖ్యమైన కోణం న్యూక్లియర్ కుటుంబాలు. గతంలో ఇంట్లో ఎవరో ఒకరు పెద్దలు ఉండటం వల్ల ఎవరో ఒకరు వంట చేసేవారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులే అయితే వంట చేయడం కన్నా ఆర్డర్ చేసుకుంటే సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు.
ఇక ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ గురించి హైదరాబాద్‌లో కంపెనీ సెక్రటరీగా పనిచేస్తున్న హర్షవర్థిని బీబీసీతో మాట్లాడుతూ ''నా వయసు 26 ఏళ్లు. నేను వర్కింగ్ ఉమెన్‌ని. ఆఫీసు అయ్యాక, ఈ ట్రాఫిక్‌లో లాంగ్ జర్నీ చేసి వచ్చి, మళ్లీ కిచెన్‌లోకి వెళ్లడమనేది నాకు చాలా పెద్ద టాస్క్. అందుకే నేను ఫుడ్ డెలివరీ యాప్‌లో ఆర్డర్ పెట్టడానికి ఇష్టపడతాను. ఇది నా ఎనర్జీని కాపాడుతుంది. నేను ఎక్కువగా హోమ్ ఫుడ్స్ ఆర్డర్ పెడుతున్నాను. దీనివల్ల మన డబ్బు, సమయం, శక్తి అన్నీ ఆదా అవుతాయి'' అన్నారు.
ఇక వైజాగ్‌కు చెందిన సీబీఐ మాజీ ఉద్యోగిని శరహణ కుమారీ మాట్లాడుతూ ''గతంలో అనారోగ్యం బారినపడితే ఒంట్లో ఓపికలేకపోయినా వంట చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి సందర్భాలలో కుటుంబసభ్యుల కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టేయవచ్చు. ఇక ఆఫీసునుంచి వచ్చే సమయానికి ఎవరైనా చుట్టాలు వస్తే వంట చేయడం నిజంగా నరకమే. ఇప్పుడీ సమస్య తీరిపోయింది. మూడో సంగతి ఏంటంటే ఓ పది పదిహేను మందిని భోజనానికి పిలిచినా టెన్షన్ పడకుండా, బేసిక్‌గా రెండు మూడు పదార్థాలు చేసేసుకుని మిగిలినవి బయట ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ప్రతినెలా కనీసం మూడుసార్లు అయినా బయట ఆర్డర్ చేస్తాను'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

పట్టణ ఉన్నత ఆదాయ వర్గాలుగా ముద్రపడిన కుటుంబాలు 2023 ఆర్థిక సంవత్సరంలో తమ నెలవారీ ఆహార బడ్జెట్‌లో దాదాపు 50 శాతం ప్యాకేజ్డ్ ఫుడ్, బయట తినడం, ఫుడ్ డెలివరీ సేవల కోసం ఖర్చు చేశాయి. 10 ఏళ్ల క్రితం ఇలాంటి ఖర్చులో ఇది 41.2 శాతమని ఉందని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ గణాంకాలు చెబుతున్నాయి.
డేటా ప్రకారం, 10 సంవత్సరాలలో భారతీయులలో ఇంటిలో వంటచేయడం గణనీయంగా తగ్గింది. బయట తినడం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేసే ఖర్చు పెరిగింది. వేగవంతమైన వాణిజ్యం, ఫుడ్ డెలివరీ విస్తరణ, పెరుగుతున్న ఆదాయాలు, అభివృద్ధి చెందుతున్న ఆహార ప్రాధాన్యాల కారణంగా ఈ ధోరణి పెరుగుతోందని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక తెలిపింది.
మరోపక్క పదే పదినిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తామనే ప్రకటనలతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మరి ఈ మార్పులు, టెక్నాలజీ ‘ఇంటి ఫుడ్డు, ఇంటి ఫుడ్డే’ అనే భావన, ఇంటిపట్టునే వంట చేసుకు తినాలనే సంస్కృతిని మార్చుతుందా?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














