అమెరికా టారిఫ్‌లు: ఇండియా నష్టపోతోంది సరే, ఏ దేశాలు లాభపడుతున్నాయి?

ఫొటో సోర్స్, Dhiraj Singh/Bloomberg via Getty Images
- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా విధించిన అదనపు 25 శాతం సుంకాలు ఆగస్టు 27నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో భారత్‌పై అమెరికా విధించిన టారిఫ్‌లు 50 శాతానికి చేరాయి.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం సుమారు 4 లక్షల కోట్ల విలువైన భారత ఎగుమతులపై ప్రభావం చూపనుంది. దేశంలో అనేక కర్మాగారాలు మూతపడేస్థితికి చేరాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
దీనికి మరో కోణం కూడా ఉంది.
సుంకాల కారణంగా భారత్ సరుకుల విక్రయంలో పడే కష్టాలు అనేక దేశాలకు అవకాశంగా మారొచ్చు. ఆసియా, యూరప్, దక్షిణ అమెరికాలోని చాలా దేశాలు గతంలో భారత్ అమ్మే వస్తువులనే ఇప్పుడు అమెరికాకు అమ్ముకోవచ్చు.
అయితే ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే అమెరికా సుంకాల కారణంగా భారత్‌లో అత్యధికంగా ప్రభావితమయ్యే ఐదు రంగాలను ఏయే దేశాలు భర్తీ చేసి లబ్ధి పొందనున్నాయి?


ఫొటో సోర్స్, IDREES MOHAMMED/AFP via Getty Images

అమెరికా సుంకాల ప్రభావం భారత్‌లో ఎక్కువగా పడే రంగాలలో వస్త్రరంగం ఒకటి. రెడీమేడ్ వస్త్రాలపై సుంకాలు దాదాపు 64 శాతానికి చేరుకున్నాయి. 90 వేల కోట్లరూపాయలకు పైగా విలువైన ఎగుమతులపై సుంకాలు ప్రభావం చూపుతాయి.
వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా వంటి దేశాలు దీని ద్వారా ప్రయోజనం పొందవచ్చు. వియత్నాం ఇప్పటికే అమెరికాకు దుస్తుల ఎగుమతిలో అగ్రగామిగా ఉంది. 2024లో వియత్నాం 15.5 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులను అమెరికాకు విక్రయించింది.
చౌకైన ఫ్యాషన్ ఉత్పత్తులకు బంగ్లాదేశ్ ప్రసిద్ధి చెందింది. 2024లో బంగ్లాదేశ్ 7.49 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులను అమెరికాకు ఎగుమతి చేసింది.
అమెరికాకు భారత్ వస్త్ర ఎగుమతుల కంటే ఇది 2.22 బిలియన్ డాలర్లు తక్కువ. టారిఫ్ కారణంగా భారత్ కు జరుగుతున్న నష్టాల నుంచి బంగ్లాదేశ్ అత్యధిక లబ్ధి పొందవచ్చు.
వీటితో పాటు మెక్సికో, ఇండోనేషియా, కంబోడియా వంటి దేశాలు కూడా ఈ రంగంలో అమెరికాకు కొత్త అవకాశాలుగా ఆవిర్భవించవచ్చు.

ఫొటో సోర్స్, PUNIT PARANJPE/AFP via Getty Images

అమెరికా సుంకాలు పెంచడం వల్ల భారత్ ఆభరణాలు రత్నాల పరిశ్రమ రంగంలో దాదాపు 85 వేల కోట్ల రూపాయల విలువైన భారత్ ఎగుమతులు ప్రభావితమవుతాయని అంచనా.
ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద కట్ డైమండ్ ఎగుమతిదారు. సూరత్, ముంబయి వంటి నగరాలలో లక్షలాదిమంది ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు.
అంతర్జాతీయ పోటీలో భారత్ వజ్రాల పరిశ్రమను అమెరికా సుంకాలు బలహీన పరవచ్చు. వజ్రాల సాన, కోత విషయంలో చాలాకాలంనుంచి అగ్రగామిగా ఉన్న భారత్ ఇప్పుడు అనేక దేశాల నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఇటలీ, ఫ్రాన్స్, థాయిలాండ్, తుర్కియే, చైనా ఈ పరిశ్రమలో తమ పట్టు బిగిస్తున్నాయి.
థాయిలాండ్ రత్నాల కత్తిరింపు, డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. భారత్‌పై విధించిన సుంకాల కారణంగా అమెరికాలో ఆ దేశం వాటా పెరగొచ్చు.
అదేవిధంగా, తుర్కియే బంగారు ఆభరణాలలో పెద్ద ఎగుమతిదారు. భారత్ స్థానాన్ని ఆక్రమించుకోగలదు. మరోవైపు, చైనా సింథటిక్ రత్నాల రంగంలో అగ్రగామిగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

భారతీయ ఆటో విడిభాగాలపై 50 శాతం సుంకం విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం కూడా భారత్ లోని ఈ రంగానికి పెద్ద దెబ్బే. భారత్ ఏటా సుమారు రూ.58 వేల కోట్ల విలువైన ఆటో విడిభాగాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది.
ఇప్పుడు వీటిపై ఎక్కువ సుంకం విధించడంతో ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ఉన్న, లేదా భారత్ కంటే టారిఫ్ రేట్లు చాలా తక్కువగా ఉన్న దేశాలకు ఈ పరిస్థితి ప్రయోజనం చేకూరుస్తుంది.
యుఎస్ఎంసిఎ (యుఎస్-మెక్సికో-కెనడా ఒప్పందం) కింద జీరో డ్యూటీ ప్రయోజనాల వల్ల మెక్సికో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
మెక్సికో ఇప్పటికే అమెరికాకు ప్రధాన ఆటో విడిభాగాల సరఫరాదారుగా ఉంది. పైగా దాని భౌగోళిక సామీప్యత నుండి కూడా ప్రయోజనం పొందుతోంది.
ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా కూడా ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఈ దేశాలపై అమెరికా టారిఫ్ రేట్లు 15-20 శాతం మధ్య ఉన్నాయి, ఇది భారత్ పై విధించిన కొత్త రేట్ల కంటే చాలా తక్కువ.
సాంకేతికంగా అభివృద్ధి చెందిన జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా అమెరికాకు ఎక్కువ నాణ్యత కలిగిన ఆటో విడిభాగాలను ఎగుమతి చేస్తున్నాయి.
ఈ దేశాలు భారత్ కంటే తక్కువ టారిఫ్ రేట్లను కలిగి ఉన్నాయి. బలమైన ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్)లను కలిగి ఉన్నాయి. ఇవి వారికి అదనపు ప్రయోజనాలను ఇవ్వవచ్చు.
అమెరికా సుంకాలు పెంచినప్పటికీ తక్కువ వ్యయంతో భారీ ఉత్పత్తి సామర్థ్యం ఉండటం చైనాను పోటీదారుగా నిలబెడుతున్నాయి. అమెరికాకు చైనా ఆటో విడిభాగాల ఎగుమతులు 56.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.


సీఫుడ్ ఎగుమతులపై, ముఖ్యంగా రొయ్యలపై అమెరికా సుంకం తీవ్ర ప్రభావం చూపుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తులపై దాదాపు రూ.20 వేల కోట్ల మేర ప్రభావం పడనుంది.
ప్రపంచంలో రొయ్యల ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. అయితే, కొత్త సుంకాల కారణంగా అమెరికా మార్కెట్లో భారత్ తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
ముఖ్యంగా తూర్పు కోస్తా రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడుల్లో ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.
ఈక్వెడార్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు భారత్ నష్టాలతో ప్రయోజనం పొందవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద రొయ్యల ఎగుమతిదారుల్లో ఈక్వెడార్ ఒకటి, ఇప్పటికే అమెరికాకు భారీగా సరఫరా చేస్తోంది.
వియత్నాం బలమైన ప్రాసెసింగ్ టెక్నాలజీ, రవాణా సౌకర్యాలు కలిగి ఉంది. అలాగే యుఎస్ కు సముద్ర ఉత్పత్తుల ప్రధాన సరఫరాదారుగా ఉంది.
మరోవైపు రొయ్యలు, ట్యూనా చేపల ఎగుమతిలో ఇండోనేషియా అగ్రగామి, అమెరికా డిమాండ్ ను తీర్చే సామర్థ్యం కలిగి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఈ రంగంలో సుమారు 23 వేల కోట్ల రూపాయల విలువైన భారత ఎగుమతులపై అమెరికా సుంకం ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. మొత్తం ఎగుమతుల్లో 40 శాతం వాటా కలిగిన ఈ రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) పెద్ద వాటాను కలిగి ఉన్నాయి.
పెరిగిన సుంకాల కారణంగా, భారతీయ ఉత్పత్తులు యుఎస్ మార్కెట్లో ఖరీదైనవిగా మారతాయి. ఇది వారి పోటీతత్వాన్ని, ఆర్డర్లను తగ్గిస్తుంది.
కలుపు మందులు, శిలీంధ్రనాశకాలు, సేంద్రియ ఎరువులు, హైపోక్లోరైట్ వంటి ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది.
ఈ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల అమెరికన్లు ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశం ఉంటుంది.
జపాన్, దక్షిణ కొరియాలు అమెరికాలో తక్కువ సుంకం చెల్లించాల్సి ఉంటుంది, కాబట్టి వారి ఉత్పత్తులు చౌకగా ఉంటాయి భారత్ స్థానాన్ని ఈ దేశాలు భర్తీ చేయగలవు.
చైనాపై కొన్ని సుంకాలు ఉన్నప్పటికీ, దాని కర్మాగారాలు పెద్దవి. ఇది చౌక ధరలకే వస్తువులను తయారు చేయగలదు, కాబట్టి ఇది భారత్ కూడా భర్తీ చేయగలదు.
థాయ్‌లాండ్, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా కొన్ని చౌకైన ప్రత్యామ్నాయాలను అమెరికాకు అందించగలవు.
యూరోపియన్ యూనియన్ , కెనడా ఎక్కువ నాణ్యత కలిగిన రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. అమెరికా ఆ దేశాలనుంచి ఎక్కువ కొనుగోలు చేయవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

కొత్తమార్కెట్లు కనుగొనడం భారత్‌కు ఇప్పుడు అవసరంగా మారిందని సుప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ చెప్పారు.
''అమెరికాపై ఆధారపడటం సమస్యలతో కూడుకున్నది. దీనికి ఉదాహరణను మనం చైనా నుంచి చూశాం. అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మొదటి టర్మ్‌లో చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత చైనా నెమ్మదిగా అమెరికాకు దూరం కావడం ప్రారంభించింది. చైనా అమెరికాకు చేసే ఎగుమతుల్లో 8-9 శాతాన్ని తగ్గించింది. గతంలో 2017-18లో ఇది 18-19 శాతంగా ఉండగా, ఇప్పుడు 12 శాతానికి పడిపోయింది. చైనా ఇప్పుడు మరింత స్థిరమైన స్థితిలో ఉందని, ఇలాంటి సంఘటనల వల్ల తక్కువ ప్రభావితమైందని స్పష్టమవుతోంది'' అన్నారు.
మోహన్ కుమార్ ఫ్రాన్స్ లో భారత రాయబారి. అంతర్జాతీయ వాణిజ్యం, బహుపాక్షిక చర్చల రంగంలో నిపుణుడు.
అమెరికా సుంకాల అమలు తర్వాత ప్రస్తుతం పరిస్థితి దెబ్బతింటోందని, అయితే దీర్ఘకాలంలో మార్కెట్ శక్తులు పనిచేస్తాయని, పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన చెప్పారు.
''మార్కెట్లను బహుముఖం చేస్తాం, కొన్ని కారణాల వల్ల దేశీయంగా డిమాండ్ పెరుగుతుంది. ప్రత్యామ్నాయ మార్కెట్లను పరిశీలిస్తాం. కాబట్టి తర్వాత ఏం జరుగుతుందనే బదులుగా ప్రస్తుతం ఏం జరుగుతోందనేది ఆందోళన కలిగిస్తోంది. 25 శాతం టారిఫ్‌ను తట్టుకున్నాం. కానీ 50 శాతం టారిఫ్ ఎక్కువ నష్టాలకు కారణమవుతుంది'' అన్నారు.
ట్రంప్ అధికారంలో ఉన్నా లేకపోయినా అమెరికా వాణిజ్య విధానం అస్థిరంగా ఉంటుందని ప్రొఫెసర్ ధార్ అభిప్రాయపడ్డారు. "వారు అస్థిరతకు కారణమయ్యే వాతావరణాన్ని సృష్టించారు. భారత్ వంటి పెద్ద దేశం తన మొత్తం ఎగుమతుల్లో నాలుగో వంతుకు కేవలం ఒక దేశంపై ఆధారపడటం సరికాదు. కొత్త మార్కెట్లను కనుగొనాలి, అభివృద్ధి చెందుతున్న దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. ఈ సంబంధాలు మాత్రమే దీర్ఘకాలంలో సుస్థిరంగా ఉంటాయి, భారత ఎగుమతులకు స్థిరమైన మార్గాన్ని అందిస్తాయి'' అన్నారు.

భారత్ అమెరికా కాకుండా, ఆసియా, ఆఫ్రికా, యూరప్ వంటి ఇతర మార్కెట్ల పై భారత్ దృష్టి సారించాలా?
ఒకే అవకాశంపై భారత్ ఆశలు పెట్టుకుందని మీరు నిందించలేరని మోహన్ కుమార్ అంటారు. ''రొయ్యలు, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు వంటి కొన్ని వస్తువులకు అమెరికా మార్కెట్ చాలాఆకర్షణీయంగా ఉండేది. ఇది పెద్ద మార్పు కాదు, కానీ ఉదాహరణకు, యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడానికి భారత్ మరింత ఆసక్తిగా ఉంటుంది''
''ఇప్పటికే యూకేతో ఎఫ్‌టీఏ (స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) పూర్తి చేశాం. ఇతర మార్కెట్లను కూడా పరిశీలిస్తాం, ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో చేరే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది'' అన్నారు మోహన్ కుమార్
ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నందున ఈ సుంకాలు ఎక్కువ కాలం ఉండకపోవచ్చని మోహన్ కుమార్ భావిస్తున్నారు.
భారత్ కొత్త మార్కెట్లను కనుగొనవలసి ఉంటుందని ప్రొఫెసర్ ధార్ చెప్పారు. ఐరోపాతో పాటు ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల వైపు కూడా భారత్ దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images

రష్యా నుంచి భారత్ క్రమం తప్పకుండా చమురు కొనుగోలు చేస్తున్నందున భారత్ పై అదనంగా 25 శాతం సుంకం విధించినట్లు అమెరికా తెలిపింది.
కాబట్టి, సుంకాల భారాన్ని తప్పించుకోవడానికి, రష్యా చమురు కొనుగోలు గురించి భారత్ పునరాలోచించాలా? అనే ప్రశ్నపై ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ మాట్లాడుతూ
''చౌకైన చమురు లభిస్తున్నంతకాలం మార్పు కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న సందర్భంలో మిగిలిన దేశాలు ద్రవ్యోల్బణం, కోవిడ్ అనంతర పరిస్థితుల నుంచి కోలుకునే దశలో ఉన్నాయి. ఈ సమస్యల నుంచి తప్పించుకున్న అతికొద్ది దేశాలలో ఇండియా ఒకటి. ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థ 6 నుంచి 6.5 శాతానికి చేరాలని భావిస్తున్నాం. మనం ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని దిగుమతి చేసుకోలేం. రష్యా కంటే ఓపెక్ దేశాల నుంచి చమురు కొనుగోలు ఖర్చుతో కూడుకున్నపని'' అన్నారు.
రష్యా నుంచి మాత్రమే చమురు కొనుగోలుకు భారత్ మొండిగా లేదని మోహన్ కుమార్ చెప్పారు. ఎక్కడ ధర తక్కువగా ఉంటే అక్కడ, లేదంటే పరిస్థితులు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడి నుంచి కొనుగోలు చేస్తుందని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














