‘ఎప్పటికైనా మనం కలవాల్సిందే’.. అమెరికా మంత్రి ప్రకటన సుంకాలపై మెత్తబడ్డారనేందుకు సంకేతమా?

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించినప్పటికీ, రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
కొత్త సుంకాలు అమల్లోకి వచ్చిన రోజే, అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ‘ఫాక్స్ బిజినెస్ చానల్’తో మాట్లాడుతూ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి సంకేతాలిచ్చారు.
భారత్, అమెరికా మధ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయానికి ఇంకా అవకాశం ఉందని ఆయన అన్నారు.
అలాగే, ‘ఈ సుంకాల సమస్య పరిష్కారానికి సంబంధించి చర్చలకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయి, అన్నీ తిరిగి గాడిన పడతాయని ఆశిస్తున్నాం’ అని భారత ప్రభుత్వవర్గాలు పేర్కొన్నట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
ఇంతకుముందు భారత్‌పై అమెరికా 25 శాతం సుంకాలు విధించింది. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న కారణంగా ఆగస్ట్ 6న అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించింది.

ఈ సుంకాలు ఆగస్ట్ 27 ఉదయం 9.30 గంటల(భారత కాలమానం ప్రకారం) నుంచి అమల్లోకి వచ్చాయి.
రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ లాభాలు గడిస్తోందని, తద్వారా యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సాయం చేస్తోందని అమెరికా వాదిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
'భారత్, అమెరికా కలవాలి'
ఫాక్స్ బిజినెస్ చానల్‌లో సుంకాల గురించి అడిగినప్పుడు బెసెంట్ స్పందిస్తూ.. అమెరికా - భారత్ మధ్య సంబంధాలు చాలా సంక్లిష్టమైనవని, కానీ రెండు దేశాలు ఎట్టకేలకు కలిసి పనిచేస్తాయనే విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు.
భారత్‌పై జరిమానాలు విధించడాన్ని బలంగా సమర్థించారు స్కాట్ బెసెంట్.
భారత్, అమెరికా మధ్య ఇటీవల తలెత్తిన ఉద్రిక్తత కేవలం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మాత్రమే కాదన్న సంకేతాలిచ్చారు. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో జాప్యం కారణంగా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉంది.
బెసెంట్ మాట్లాడుతూ, "లిబరేషన్ డే అనంతరం సుంకాలపై భారత్ చర్చలను ప్రారంభించింది, కానీ నేటికీ ఒప్పందం కుదరలేదు. మే లేదా జూన్ నాటికి ఒప్పందం ఖరారవుతుందని అనుకున్నా. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే తొలి దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటుందని అనుకున్నా. కానీ, భారత్ చర్చలను వాయిదా వేస్తూ వస్తోంది. అదే సమయంలో, రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ భారీ లాభాలను ఆర్జిస్తూనే ఉంది" అని అన్నారు.
అయితే, రష్యా చమురు కొనుగోళ్లను టార్గెట్ చేయడం 'అన్యాయం' అని భారత్ పేర్కొంది.

''వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నట్లు భారత్ ఇప్పటివరకు కనిపించింది. భారత్‌తో అమెరికాకు వాణిజ్య లోటు భారీగా ఉంది. ఇంత వాణిజ్య మిగులు ఉన్న దేశం భారత్.. ఒప్పందం కుదుర్చుకోవడంపై శ్రద్ధ వహించాలి. భారత్ వస్తువులను విక్రయిస్తోంది, కానీ వాళ్ల దేశంలో భారీ సుంకాలను విధిస్తోంది'' అని బెసెంట్ అన్నారు.
భారత్ బ్రిక్స్ దేశాలతో డాలర్‌కు బదులు రూపాయితో లావాదేవీలు నిర్వహిస్తుందని ఆందోళన చెందుతున్నారా? అని బెసెంట్‌ను అడిగినప్పుడు, "నాకింకా చాలా ఆందోళనలు ఉన్నాయి. కానీ, అవి రిజర్వ్ కరెన్సీగా రూపాయి మారడం గురించి కాదు. ఎందుకంటే, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అత్యల్ప స్థాయిలో ఉంది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయి'
బెసెంట్ వ్యాఖ్యల వేళ, భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పందిస్తూ అమెరికాతో చర్చలను పూర్తిగా నిలిపివేయలేదని చెప్పారు.
సుంకాల ప్రభావాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించేందుకు మంత్రిత్వ శాఖ పరిశ్రమవర్గాలతో కలిసి పనిచేస్తోంది.
వాణిజ్య ఒప్పందం ఖరారు చేసుకోవడం కోసం ఆగస్ట్ 25న అమెరికన్ ప్రతినిధుల బృందం భారత్‌కు రావాల్సి ఉంది. కానీ, ఆగస్ట్ 6న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు ప్రకటించడంతో ఆ చర్చలు రద్దయ్యాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్ పర్యటన అనంతరం అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడం గమనార్హం.
ఈ ఏడాది చివరి నాటికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు ఇద్దరు నేతలు ప్రకటించారు.
తమ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, తమ మధ్య తరహా కార్లకు మార్కెట్ తెరవాలని అమెరికా కోరుకుంది. కానీ, అందుకు భారత్ సిద్ధంగా లేదు.
ప్రస్తుతానికి, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ఫార్మా, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులను సుంకాల నుంచి మినహాయించారు.
భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికా. 2024 - 25లో భారత్ మొత్తం 437.42 బిలియన్ డాలర్ల (సుమారు 38 లక్షల 31 వేల 602 కోట్ల రూపాయలు) విలువైన ఎగుమతులు చేస్తే, వాటిలో దాదాపు 20 శాతం ఒక్క అమెరికాకే ఎగుమతయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ సన్నాహాలు
అదే సమయంలో, వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసిన దాని ప్రకారం.. పరిస్థితులు భయపడుతున్నంత దారుణంగా ఏమీ ఉండవని భారత అధికారులు హామీ ఇస్తున్నారు.
భారత్, అమెరికా మధ్య తలెత్తిన వివాదం పరిష్కారమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూనే, మరోవైపు ఎగుమతులు తగ్గడం వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
ఎగుమతుల కోసం కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని, ఎగుమతిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు పీటీఐ పేర్కొంది.
వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. వస్త్రాల ఎగుమతులు పెంచేందుకు 40 దేశాలతో సంబంధాలు ఏర్పరుచుకునే ప్రయత్నాల్లో భారత్ ఉంది.
అయితే, భారీ సుంకాల కారణంగా తమ ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతాయని ఎగుమతిదారులు అంటున్నారు.
బంగ్లాదేశ్, థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలపై అమెరికా తక్కువ సుంకాలు విధించింది. ఫలితంగా, పోటీ దేశాల నుంచి విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి.
అమెరికాకు దాదాపు 10.3 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసే వస్త్ర పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమవుతుందని అపారల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ మిథిలేశ్వర్ అభిప్రాయపడినట్లు పీటీఐ పేర్కొంది.
ఇప్పుడు అమెరికన్ కొనుగోలుదారులు 20 శాతం డిస్కౌంట్ డిమాండ్ చేస్తున్నారని తోలు పరిశ్రమకు చెందిన ఎగుమతిదారులు తెలిపారు.
థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) .. అమెరికా సుంకాలు దాదాపు 66 శాతం భారత ఎగుమతులపై ప్రభావం చూపుతాయని పేర్కొంది. 2025-26లో అమెరికాకు భారత ఎగుమతులు 49.6 బిలియన్ డాలర్లకు తగ్గొచ్చని తెలిపింది.
10, 15 శాతం సుంకాలనే భరించలేమని చాలామంది భారతీయ ఎగుమతిదారులు చెబుతున్నారు. ఈ 50 శాతం సుంకాలనేది వారికి ఇబ్బందేనంటున్నారు.
"50 శాతం సుంకాల కారణంగా భారత్ జీడీపీ 0.2 శాతం నుంచి 0.4 శాతం వరకు తగ్గొచ్చు. ఫలితంగా, ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6 శాతం కంటే తక్కువ నమోదు కావొచ్చు" అని జపనీస్ బ్రోకరేజ్ సంస్థ నొమురా ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
సుంకాలతో అమెరికా మార్కెట్లోనూ ఆందోళన తప్పదా?
భారత్‌పై సుంకాల కారణంగా అమెరికన్ మార్కెట్లో వస్తువుల ధరలు పెరుగుతాయని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణకు డోనల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో ధరలు పెంచనున్నట్లు కొద్దిరోజుల కిందట స్పోర్ట్స్ షూ తయారీదారు అడిడాస్ తెలిపింది.
ఆ కంపెనీ ఉత్పత్తులలో సగానికి పైగా వియత్నాం, ఇండోనేషియాలో తయారవుతాయి, ఆ దేశాలపై 20 శాతం, 19 శాతం సుంకాలు విధించింది అమెరికా.
అమెరికాలో తమ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని స్పోర్ట్స్ వస్తువుల తయారీ సంస్థ నైకి కూడా పేర్కొంది.
ఈ టారిఫ్‌ల కారణంగా, కంపెనీ ఖర్చులు భారీగా పెరిగే అవకాశముందని తెలిపింది.
విదేశాల నుంచి ముడిపదార్థాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరమున్న అమెరికన్ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
కొత్త సుంకాలతో అమెరికా సరిహద్దుల వద్ద కస్టమ్స్ తనిఖీలను కూడా కఠినతరం చేసే అవకాశముంది, వీటి ఫలితంగా బోర్డర్ దాటి ఉత్పత్తులు రావడంలో సహజంగానే జాప్యానికి దారితీస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














