'తల తిరిగిపోయే సుంకాలు విధిస్తానని మోదీకి, పాకిస్తాన్‌కు చెప్పా':డోనల్డ్ ట్రంప్

డోనల్డ్ ట్రంప్, అమెరికా, భారత్, వాణిజ్యం

ఫొటో సోర్స్, Getty Images

వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసి, సుంకాలు విధిస్తానని బెదిరించి భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు.

భారత్-పాకిస్తాన్ యుద్ధం కొనసాగితే, 'మీ తల తిరిగేలా భారీ సుంకాలు విధిస్తామని చెప్పాను' అని డోనల్డ్ ట్రంప్ అన్నారు.

భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం సుంకం ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చింది.

ఘర్షణ సమయంలో మోదీతో మాట్లాడినట్లు చెబుతున్న విషయాలను బుధవారం వైట్‌హౌస్‌లో జరిగిన తన మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ వెల్లడించారు.

భారత్, పాకిస్తాన్ మధ్య సంఘర్షణను నివారించానని క్రెడిట్ తీసుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్ ఏమన్నారు?

"నేను మోదీతో మాట్లాడాను. మీకు, పాకిస్తాన్‌కు మధ్య ఏం జరుగుతోందని అడిగాను'' అని ట్రంప్ మంత్రివర్గ సమావేశంలో చెప్పారు.

''అక్కడ చాలా ద్వేషం ఉంది. చాలాకాలంగా కొనసాగుతోంది. వేర్వేరు పేర్లతో వందల సంవత్సరాలుగా జరుగుతోంది" అన్నారాయన.

ఆ తర్వాత పాకిస్తాన్‌తో వాణిజ్యం గురించి మాట్లాడినట్లు, మీకు భారతదేశానికి మధ్య ఏం జరుగుతోంది? అని అడిగానని ట్రంప్ చెప్పారు.

తన జోక్యంతోనే పాకిస్తాన్‌ వెనక్కి తగ్గిందని చెప్పుకున్నారు ట్రంప్.

"ఏం జరుగుతోంది? నేను ఎటువంటి వాణిజ్య ఒప్పందం చేసుకోను. మీరు (భారత్, పాకిస్తాన్) అణుయుద్ధం చేయబోతున్నారు. మీరు ఆ యుద్ధంలో చిక్కుకుంటారు. రేపు మళ్లీ నాకు ఫోన్ చేయండి కానీ, గుర్తుంచుకోండి. మేం మీతో ఎటువంటి వాణిజ్య ఒప్పందం చేసుకోం' అని అన్నట్లు ట్రంప్ చెప్పారు.

ఈ సంభాషణ జరిగిన ఐదు గంటల్లోనే ఇరుపక్షాలు వెనక్కి తగ్గాయని ట్రంప్ పేర్కొన్నారు.

ప్రమాదాన్ని నివారించినని, ఇది మళ్లీ జరిగితే వాణిజ్య ఒప్పందం నిలిపివేస్తామని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

అదనపు సుంకాలు

రష్యా నుంచి భారత్ భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేసి, దానిని ఇతర దేశాలకు అమ్మడం ద్వారా లాభాలు ఆర్జిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు.

అమెరికా నిర్ణయం 'అన్యాయం, అహేతుకం' అని భారత్ అంటోంది. అమెరికా, యూరప్ స్వయంగా రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయని, కానీ భారత్ పట్ల ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్నాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది.

మంత్రిత్వ శాఖ ప్రకారం, రష్యా నుంచి ఎరువులు, ఖనిజ ఉత్పత్తులు, రసాయనాలు, యంత్రాలు వంటి వాటిని కూడా యూరప్ కొనుగోలు చేస్తుంది. అమెరికా తన అణు పరిశ్రమ కోసం రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం పల్లాడియం, ఇంకా ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటోంది.

దేశ ఇంధన భద్రతకు రష్యా నుంచి చమురు కొనుగోలు తమకు ముఖ్యమని భారత్ వాదిస్తోంది.

కాగా, అమెరికా సుంకాలు భారత ఎగుమతులు, ఆర్థిక వృద్ధిపై భారీ ప్రభావాన్ని చూపవచ్చు. భారత్ ప్రతి సంవత్సరం అమెరికాకు సుమారు రూ. 7.2 లక్షల కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తుంటుంది. అదనపు సుంకం కొనసాగితే, మొత్తం ఎగుమతి తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది.

చాలామంది భారత ఎగుమతిదారులు 10–15 శాతం సుంకాన్ని భరించలేమని చెబుతున్నారు. ఇక 50 శాతం సుంకాన్ని భరించడం వారి సామర్థ్యానికి మించినది.

'వాణిజ్య నిషేధం'

"ఈ సుంకం అమలైతే అది ఒక రకమైన 'వాణిజ్య నిషేధం' అవుతుంది" అని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా ఒక రిపోర్టులో పేర్కొంది.

"సుంకం ద్వారా ప్రభావితమయ్యే ఉత్పత్తుల ఎగుమతి వెంటనే ఆగిపోవచ్చు" అని అభిప్రాయపడింది.

భారతదేశ అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికా. భారత్ తన వస్తువులలో 18 శాతం అమెరికన్ మార్కెట్‌కు ఎగుమతి చేస్తుంది. ఇది భారత జీడీపీలో 2.2 శాతం. 50 శాతం సుంకం విధింపు అనేది జీడీపీలో 0.2 నుంచి 0.4 శాతం తగ్గడానికి కారణం కావొచ్చు. ఇది ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధిని ఆరు శాతం కంటే తక్కువగా ఉంచవచ్చు.

వాణిజ్యం, భారత్

ఫొటో సోర్స్, Getty Images

'1,300 కోట్ల విలువైన విమానాలు కూల్చేశారు'

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఏడు లేదా అంతకంటే ఎక్కువ ఫైటర్ జెట్లను కూల్చివేశారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అంచనా వేశారు.

"వారు పోరాడుతుండటం చూశాను. ఏడు జెట్లను కూల్చివేశారు. అది కరెక్టు కాదని చెప్పాను. మీకు తెలుసా, రూ. 1,300 కోట్ల విలువైన విమానాలను కూల్చేశారు. అవి ఏడు, బహుశా అంతకంటే ఎక్కువుండొచ్చు. సరిగ్గా ఎన్ని కూల్చారో కూడా వారు చెప్పలేదు" అని ట్రంప్ అన్నారు.

అంతకుముందు, ఐదు విమానాలు కూలిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు.

సోమవారం దక్షిణ కొరియా అధ్యక్షుడితో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్, "నేను ఈ యుద్ధాలన్నింటినీ ఆపాను. అతిపెద్ద యుద్ధాలలో ఒకటి భారత్, పాకిస్తాన్ మధ్య" అని అన్నారు.

"సరే, ఇప్పుడు యుద్ధం జరగడం లేదు. నేను చాలా సందర్భాలలో అలా చేశాను. వ్యాపారాన్ని ఉపయోగించాను. నేను చేయాల్సిందల్లా చేశాను" అని ట్రంప్ అన్నారు.

"గత ఐదు నెలల్లో ఐదు యుద్ధాలను ఆపాను. గత రెండు-మూడు నెలల ఉదాహరణలను పరిశీలిస్తే, నమ్మశక్యంగా లేదు" అని అన్నారు.

గతంలో చాలాసార్లు

పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ అణు సంఘర్షణ అంచుకు చేరుకోకుండా నిరోధించినట్లు ట్రంప్ ఈ ఏడాది జూలైలో పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశం పాత్ర లేదని భారత్ చెబుతూ వస్తోంది.

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిరోధించినట్లు ఆగస్టు నెలలో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా ట్రంప్ పేర్కొన్నారు. వార్తాసంస్థ పీటీఐ ప్రకారం, ట్రంప్ 30 సార్లకు పైగా ఇలా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)