'ట్రంప్ టారిఫ్‌లు చట్ట విరుద్ధం'.. యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ తీర్పు

అమెరికా, డోనల్డ్ ట్రంప్, సుంకాలు, పరస్పర సుంకాలు, అమెరికన్ పార్లమెంట్, అప్పీల్ కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాక్స్ మట్జా, ఆంథోనీ జర్చర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలలో చాలావరకు చట్ట విరుద్ధమని అమెరికా అప్పీల్స్ కోర్ట్ ఒకటి తీర్పునిచ్చింది.

డోనల్డ్ ట్రంప్ వివిధ ప్రపంచ దేశాలపై విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్‌తో పాటు చైనా, మెక్సికో , కెనడాపై విధించిన ఇతర సుంకాలను ఈ తీర్పు ప్రభావితం చేయనుంది.

ఎమర్జెన్సీ ఎకనమిక్ యాక్ట్‌ కింద సుంకాలను విధించే హక్కు ఉందన్న ట్రంప్ వాదనను ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్’ న్యాయమూర్తులు 7-4 మెజారిటీతో తిరస్కరించారు.

ట్రంప్ విధించిన సుంకాలు చట్ట విరుద్ధమని, అవి చెల్లవని చెప్పారు.

అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా అక్టోబర్14 వరకు ఈ తీర్పు అమల్లోకి రాదని కోర్ట్ పేర్కొంది.

కోర్ట్ తీర్పును విమర్శిస్తూ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.

"ఈ తీర్పును అమలు చేస్తే, అది అమెరికాను నాశనం చేస్తుంది" అని అందులో పేర్కొన్నారు.

"టారిఫ్‌లను తొలగించాలని పక్షపాత అప్పీల్స్ కోర్టు తప్పుగా చెప్పింది. అయితే చివరకు అమెరికా గెలుస్తుందని వాళ్లకు తెలుసు" అని ఆయన తన మెసేజ్‌లో పేర్కొన్నారు

"సుంకాలను తొలగిస్తే అది దేశానికి విపత్తుగా మారుతుంది. ఆర్థికంగా మనల్ని బలహీనులను చేస్తుంది. మనం బలంగా ఉండాలి" అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్( ఐఈఈపీఏ) కింద సుంకాలు విధించడాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు.

దేశానికి అసాధారణ ముప్పు ఏర్పడినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు అధ్యక్షుడికి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

వాణిజ్యంలో అసమతుల్యత జాతీయ భద్రతకు హానికరమని వాదిస్తున్న ట్రంప్ వాణిజ్యంపై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

అయితే సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడి పరిధిలోకి రాదని, అది ‘యూఎస్ కాంగ్రెస్’కు ఉన్న అధికారమని కోర్టు పేర్కొంది.

అమెరికా, డోనల్డ్ ట్రంప్, సుంకాలు, పరస్పర సుంకాలు, అమెరికన్ పార్లమెంట్, అప్పీల్ కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తూ ట్రంప్ ఏప్రిల్‌లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

కోర్టు ఏం చెప్పింది?

ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ కింద టారిఫ్‌లు విధించే హక్కు ఉందన్న ట్రంప్ వాదననను తిరస్కరిస్తూ అవి చట్టవిరుద్ధమని, చెల్లవని యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ తెలిపింది.

127 పేజీల తీర్పులో "ఐఈఈపీ యాక్ట్‌లో సుంకాలు అని కానీ, సుంకాలకు బదులుగా ఇతర సమానార్థక పదాలను కానీ ప్రస్తావించలేదని.. సుంకాలను విధించేందుకు అధ్యక్షుడికి ఉన్న అధికారంపై విధానపరమైన పరిమితులను కానీ ప్రస్తావించలేదు" అని కోర్టు తెలిపింది.

అందుకే పన్నులు, సుంకాలు విధించే అధికారం యూఎస్ కాంగ్రెస్‌కే చెందుతుందని కోర్టు తెలిపింది.

యూఎస్ కాంగ్రెస్‌కు ఉన్న ఈ అధికారాన్ని ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అధిగమించలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

1977లో యూఎస్ కాంగ్రెస్ ఈ చట్టాన్ని ఆమోదించినప్పుడు, పన్నులు విధించే విషయంలో గతంలో తనకున్న అధికారాలను పక్కన పెట్టి, అధ్యక్షుడికి అపరిమిత అధికారాలను ఇవ్వలేదు అని కోర్టు తీర్పులో పేర్కొంది.

"సుంకాలను విధించే అధికారాన్ని అధ్యక్షుడికి అప్పగించాలని యూఎస్ కాంగ్రెస్ అనుకున్నప్పుడల్లా అది టారిఫ్, డ్యూటీ లాంటి స్పష్టమైన పదాలను ఉపయోగించింది" అని న్యాయమూర్తులు తీర్పులో రాశారు.

అమెరికన్ రాష్ట్రాల కూటమి, చిన్న వ్యాపారులు దాఖలు చేసిన రెండు దావాల్లో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ప్రపంచంలోని ప్రతి దేశంపైనా 10 శాతం నుంచి అంత కంటే ఎక్కువ సుంకాలు విధిస్తూ ఏప్రిల్‌లో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. ఈ ఆర్డర్లపై కోర్టులో కేసు వేశారు.

ఈ సుంకాలు చట్ట విరుద్ధమని న్యూయార్క్‌లోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మేలో ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ కోసం ఈ నిర్ణయాన్ని నిలిపివేశారు.

తాజా తీర్పు అమలైతే కెనడా, మెక్సికో, చైనాపై విధించిన సుంకాలు తగ్గుతాయి. కాగా అమెరికాలోకి డ్రగ్స్ దిగుమతిని అడ్డుకోవడానికి ఈ సుంకాలు అవసరమని ట్రంప్ వాదిస్తున్నారు.

ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు సుంకాల అమలును కొట్టి వేస్తే అది 1929 తరహా మాంద్యానికి దారి తీస్తుందని, స్టాక్ మార్కెట్లు కూలిపోతాయని వాదించారు.

అమెరికా, డోనల్డ్ ట్రంప్, సుంకాలు, పరస్పర సుంకాలు, అమెరికన్ పార్లమెంట్, అప్పీల్ కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్టులో ఏం జరగనుంది?

తాజా పరిణామాలను దృష్ట్యా అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం ఖాయంగా కనిపిస్తోంది.

గతంలో జో బైడెన్ అధ్యక్షుడిగా తీసుకున్న కొన్ని నిర్ణయాలపైనా సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది.

సుప్రీంకోర్టులోని 9 మంది న్యాయమూర్తులు ఈ కేసు విచారణకు అంగీకరిస్తే, ఇది సుంకాలు విధించడం ద్వారా అధ్యక్షుడు తన పరిధిని అతిక్రమించారా లేక చట్ట పరిధిలోనే ఆయనకున్న అధికారాలను ఉపయోగించుకున్నారా అనేది తేలుతుంది.

అప్పీలు కోర్టులో అధ్యక్షుడి నిర్ణయానికి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఈ కోర్టులోని 11 మంది న్యాయమూర్తులలో ముగ్గురు మాత్రమే రిపబ్లికన్లు నియమించిన వారు అని వైట్‌హౌస్ సమర్థించుకోవచ్చు.

అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆరుగురిని రిపబ్లికన్లు నియమించారు. వారిలో ముగ్గుర్ని ట్రంప్ స్వయంగా ఎంపిక చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)