బులాకీ షా: ఒక నగరంలో సగంమందికి అప్పులు ఇచ్చిన ఆయన చివరకు ఏం చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
1929 ఏప్రిల్ 17న పూర్తయిన ఒక భవనం, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ లోపల ఉన్న 'గుమ్టీ బజార్'లో ఉంది.
దిల్లీ గేట్ నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. కానీ లాహోర్‌లోని ఈ పాత ప్రాంతానికి చెందిన ఆసిఫ్ బట్, 19వ శతాబ్దంలో నిర్మించిన నీటి చెరువువైపు నుంచి ఇక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
భవనం ముందు భాగంలో చెక్కిన అక్షరాలను ఆసిఫ్ బట్ చదవడం ప్రారంభించారు. 'బి'... తర్వాత కొన్ని అక్షరాలు చెరిగిపోయాయి. ఆ తర్వాత 'కె'...ఇంకా...
నేను (ఈ కథనం రచయిత వకార్ ముస్తఫా) ఈ భవనానికి స్వయంగా వెళ్ళలేకపోయాను. కానీ ఆసిఫ్ బట్ ఫోన్‌లో ఈ అక్షరాలు చెప్పిన తర్వాత, నేను ఆ పదాలను పూర్తి చేశాను. ఆయన కూడా పదేపదే ఆ విషయమే చెప్పారు 'బులాకీ మల్ & సన్ బ్యాంకర్స్, లాహోర్' అని.
ఆ ఇంటి యజమాని అసలు పేరు బులాకీ మల్. కానీ చరిత్రకారులు ఆయన్ను బులాకీ షా అని పిలుస్తారు.

ఆ కాలంలో అతిపెద్ద వడ్డీ వ్యాపారి
లాహోర్‌లో ఆ రోజుల్లో అతి పెద్ద వడ్డీ వ్యాపారి ఆయన. వడ్డీకి అప్పులు ఇచ్చేవారు. "బులాకీ షా లెడ్జర్లలో (రిజిస్టర్లు) పెద్ద భూస్వాముల వేలిముద్రలు, సంతకాలు ఉండేవి. ఆయన ఎవరు అడిగినా లేదనలేదు. మహిళలకు ఒక ప్రత్యేక స్థలం ఉండేది. అక్కడ ఆయన వారిని గౌరవంగా కూర్చోబెట్టేవారు. తర్వాత వారి అవసరాల గురించి అడిగేవారు. పెళ్లిళ్లు, పేరంటాల వంటి వాటికోసం మహిళలకు ఆయన డబ్బు అప్పుగా ఇచ్చేవారు. ఎవరైనా నగలు తాకట్టు పెడితే ఆయనకిక ఎలాంటి ఆందోళన ఉండేది కాదు’’ తన చందర్ త్రికా అనే వ్యక్తి తన వ్లాగ్‌లో చెప్పారు.
ఆ సమయంలో పంజాబ్ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, చరిత్రకారుడు ఇష్తియాక్ అహ్మద్ తన 'ది పంజాబ్ బ్లడీడ్, పార్టిషన్డ్ అండ్ క్లెంస్డ్' పుస్తకంలో ఇలా రాశారు.
''సమాజంలోని ప్రతి వర్గం ఏదో ఒక స్థాయిలో ఆ వడ్డీ వ్యాపారికి రుణపడి ఉంది. కానీ ఈ ఆర్థిక పరిస్థితి వల్ల ముస్లింలు ఎక్కువగా ప్రభావితమయ్యారు" అని రాశారు.
లాహోర్‌కు చెందిన బులాకీ షాను ఈ సాధారణ అప్పుల వ్యవస్థకు ఉత్తమ ఉదాహరణగా భావించేవారు. పెద్ద పెద్ద భూస్వాములు కూడా ఆయన దగ్గర అప్పుల కోసం నిలబడేవారు. .
"మీరు 100 రూపాయలు తీసుకుంటే, ఆయన మొదటి మూడు నెలల వడ్డీని వసూలు చేసేవారు కాదు. ఆయన వడ్డీకి ఇచ్చి కొంత డబ్బు త్యాగం చేసేవారు'' అని మోచి దర్వాజా నివాసి హఫీజ్ మెరాజుద్దీన్ చెప్పినట్టు మునీర్ అహ్మద్ మునీర్ అనే వ్యక్తి తన పుస్తకం 'మిట్తా హువా లాహోర్'లో రాశారు.
చాలామంది ముస్లిం భూస్వాములు లేదా దిగువ మధ్యతరగతి ప్రజలు లాహోర్‌లోని అతిపెద్ద వడ్డీ వ్యాపారి బులాకీ షా నుంచి రుణాలు తీసుకునేవారని దానీశ్వర్ అబ్దుల్లా మాలిక్ తన 'పురానీ మహ్‌ఫిలేం యాద్ ఆ రహి హై' అనే పుస్తకంలో రాశారు.
ఆయన కుటుంబం కూడా బులాకీ షా దగ్గర రుణగ్రహీతే.
అబ్దుల్లా మాలిక్ అనే వ్యక్తి ఇలా రాశారు, "బులాకీ షా భవనం అంటే మా తాత కూడా భయపడ్డారు. బులాకీ షా అంటే భయం నా మనసులో లోతుగా పాతుకుపోయింది. ఒకరోజు నేను నా తాత వేలు పట్టుకుని గుమ్టీ బజార్ గుండా వెళ్తున్నా. నేను రోడ్డు చూస్తూ నడుస్తున్నా. అకస్మాత్తుగా నా తాత ఆగి....బాబూ బులాకీ షాకు సెల్యూట్ చేయి'' అన్నారు.
"బులాకీ షా పేరు వినగానే నాకు భయం వేసింది. నేను ఆయనవైపు చూశాను. భయం ఇంకా ఎక్కువైపోయింది. ఆ భయంతో నిల్చున్న దగ్గరే మూత్ర విసర్జన చేశాను. అది చూసి, బులాకీ షా చిన్నగా నవ్వి, నన్ను ఆశీర్వదించి ముందుకెళ్లిపోయారు'' అని మాలిక్ వివరించారు.
పెద్దపెద్ద ప్రభువులు తమ భూములను బులాకీ షా వద్ద తాకట్టు పెట్టారని హఫీజ్ మెరాజుద్దీన్ అన్నారు.

ఫొటో సోర్స్, Waqar Mustafa
క్రికెట్ క్లబ్‌లో మెంబర్
1971లో ‘ది పాకిస్తాన్ రివ్యూ’ అనే ఆంగ్ల భాషా పత్రికలో ఒక రచయిత ఇలా రాశారు.
‘‘1920ల మధ్యలో నా తాత, పర్షియన్ కవి, అల్లామా మొహమ్మద్ ఇక్బాల్ స్నేహితుడు అయిన హాజీ అహ్మద్ బక్ష్, లాహోర్‌లోని తన 65 కానాల్‌ల( సుమారు 8 ఎకరాల) భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఆ భూమిని లాహోర్‌లోని అతిపెద్ద వడ్డీ వ్యాపారి బులాకీ షా దగ్గర రూ. 20 వేలకు తనఖా పెట్టారు" అని రాశారు.
2013లో 104 సంవత్సరాల వయసులో మరణించిన ఫోటో జర్నలిస్ట్ ఎఫ్.ఇ.చౌధురి, జర్నలిస్ట్ మునీర్ అహ్మద్ మునీర్‌తో మాట్లాడుతూ, లాహోర్‌లోని సగంమంది ముస్లింలు బులాకీ షాకు రుణపడి ఉన్నారని చెప్పారు. ఆయన ధనవంతులకు పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చేవారు. మజంగ్‌లోని షాల భవనాలన్నింటినీ బులాకీ షాకు తాకట్టు పెట్టారు" అని చెప్పారు.
బులాకీ షా పిల్లలు సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో చదువుకున్నారని ఎఫ్.ఇ.చౌధురి తన ఇంటర్వ్యూలో చెప్పారు.
పీటర్ ఒబోర్న్ తన 'వూండెడ్ టైగర్, ఎ హిస్టరీ ఆఫ్ క్రికెట్ ఇన్ పాకిస్తాన్' పుస్తకంలో క్రెసెంట్ క్రికెట్ క్లబ్ అతిపెద్ద మద్దతుదారుల్లో బులాకీ షా ఒకరని రాశారు.
"లాహోర్ మోచి దర్వాజాలోని క్రికెట్ ప్రేమికులు ఈ క్లబ్‌ను స్థాపించారు. ఈ క్లబ్‌లో బాగా ప్రసిద్ధిగాంచిన ఆటగాళ్ళలో లాలా అమర్‌నాథ్ ఒకరు" అని ఆ పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Waqar Mustafa
కోర్టులకెక్కిన కొన్ని లావాదేవీల వివాదాలు
బులాకీ షా తన రుణగ్రస్తులలో కొంతమందితో వచ్చిన వివాదాలను కోర్టుల దాకా తీసుకెళ్లారు. ఈ కేసులను గమనిస్తే ఆయన నుంచి రుణాలు తీసుకున్నది ముస్లింలు మాత్రమే కాదని అర్ధమవుతుంది.
1901 అక్టోబర్ నాటి 'సివిల్ జడ్జిమెంట్స్' అనే పత్రంలో బులాకీ షా యూరోపియన్ రైల్వే అధికారి టి.జి. అకర్స్‌కు అప్పు ఇచ్చారు. నెలకు 3 శాతం వడ్డీ రేటుకు రూ. ఒకటిన్నర వేయి అప్పుగా ఇచ్చినట్లు ఆ పత్రాల్లో ఉంది.
అకర్స్ కొంత వడ్డీ చెల్లించారు కానీ అసలు మొత్తాన్ని సకాలంలో చెల్లించలేకపోయారు. అంత అధిక వడ్డీ సమర్థనీయం కాదని దిగువ కోర్టులు పేర్కొన్నాయి.
కానీ, ఈ విషయం లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి హారిస్ ముందుకు వచ్చినప్పుడు, అకర్స్ రుణ ఒప్పందాన్ని స్వయంగా రాశారని, ఎటువంటి ఒత్తిడీ లేదా మోసానికి ఆధారాలు లేవని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Waqar Mustafa
లాహోర్ వదిలిన బులాకీ షా కుటుంబం
విభజన సమయంలో, బులాకీ షా కుటుంబం లాహోర్ వదిలి వెళ్ళవలసి వచ్చింది. అల్లర్లు ప్రారంభమైన సమయంలో, లాహోర్ కాల్వల్లో రుణగ్రహీతల పేర్లున్న రిజిస్టర్లు చిరిగిపోయి కనిపించాయి.
భారత్‌కు వచ్చిన తర్వాత బులాకీ షా తన దగ్గరున్న అప్పుల చిట్టాలను చించివేసి, తాను అందరినీ క్షమించానని చెప్పినట్టు మజీద్ షేక్ రాశారు.
కానీ, ఫకీర్ సయ్యద్ ఇజాజుద్దీన్ తన 'ది బార్క్ ఆఫ్ ఎ పెన్: ఎ మెమరీ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ స్పీచెస్' అనే పుస్తకంలో, ఆయన నుంచి రుణాలు తీసుకున్న దాదాపు అందరు భూ యజమానులు తమ భూములను తనఖా పెట్టారని రాశారు.
1947లో, బులాకీ షా తన రిజిస్టర్లతో సహా భారతదేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ రిజిస్టర్లలో పెట్టిన తనఖాలు సరిహద్దుకు అవతలి వైపున ఉండిపోయాయి.
సనా మహ్రా భారత్‌లోని డెహ్రాడూన్‌లో నివసిస్తున్నారు. మేము ఆమెను సంప్రదించ లేకపోయాం. కానీ బులాకీ షా తన ముత్తాత అని ఆమె సోషల్ మీడియాలో తెలిపారు.
"వారి చివరి వారసురాలు (నా అమ్మమ్మ, శ్రీమతి విజయ్ లక్ష్మి మహారా) కరోనా కారణంగా మరణించారు. వివాహానికి ముందు ఆమె పేరు రమా కుమారి. ఆమె ఎప్పుడూ గుమ్టీ బజార్, విక్టోరియా స్కూల్/నాన్హాల్ హవేలీ, ఇతర జ్ఞాపకాల గురించి మాట్లాడేవారు. ఆమె చివరి రోజుల్లో లాహోర్ వెళ్లాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు వెళ్లలేకపోయారు" అని రాసుకున్నారు.
ఆమె 1929లో లాహోర్‌లో జన్మించారు. గుమ్టీ బజార్‌లో బులాకీ షా నాలుగు అంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తి చేసిన సంవత్సరం ఇది.

ఫొటో సోర్స్, Asif Butt
కొన్ని రోజుల కిందట ఆసిఫ్ బట్ ఈ భవనాన్ని చూసినప్పుడు, అక్కడ బూట్లు తయారీ పరిశ్రమ కనిపించింది. కింద నాలుగు దుకాణాలు ఉన్నాయి. అవి బూట్లు, ఇతర తోలు సంబంధిత వస్తువులను విక్రయిస్తాయి. పెయింట్, కెమికల్ దుకాణం ఉంది.
ఇప్పుడు లాహోర్‌లో శిథిలావస్థలో ఉన్న ఈ భవనం ఉన్న గుమ్టీ బజార్‌లో చాలామందికి, నగరంలో సగంమంది రుణం ఇచ్చిన బులాకీ షా అనే వ్యక్తి గురించి తెలియదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














