'భారత్ మమ్మల్ని బందీల్లా బోటులోకి ఎక్కించి, తర్వాత సముద్రంలోకి తోసేసింది'

- రచయిత, సమీరా హుస్సేన్
- హోదా, దక్షిణాసియా ప్రతినిధి, బీబీసీ న్యూస్
నూరుల్ అమీన్ చివరిసారిగా 2025 మే 9న తన సోదరుడితో మాట్లాడారు. కాసేపే ఫోన్‌లో మాట్లాడిన ఆయనకు ఒక దుర్వార్త తెలిసింది.
మియన్మార్‌కు భారత ప్రభుత్వం పంపించిన 40 మంది రోహింజ్యాలలో తన సోదరుడు ఖైరుల్‌తో పాటు మరో నలుగురు బంధువులు ఉన్నట్లుగా ఆ ఫోన్ కాల్ ద్వారా ఆయనకు తెలిసింది.
వారంతా భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కొన్నేళ్ల కిందట మియన్మార్ నుంచి పారిపోయారు.
ప్రస్తుతం మియన్మార్‌లో తీవ్రమైన అంతర్యుద్ధం జరుగుతోంది. 2021లో జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత అధికారంలోకి వచ్చిన మిలీషియా, రెసిస్టెన్స్ ఫోర్సెస్‌తో పోరాడుతోంది.
అమీన్ బహుశా తన కుటుంబాన్ని మళ్ళీ చూడలేకపోవచ్చు.

''నా తల్లిదండ్రులు, ఇతర బంధువులు దారుణ బాధను అనుభవిస్తున్నారు'' అని 24 ఏళ్ల అమీన్ దిల్లీలో బీబీసీతో మాట్లాడుతూ అన్నారు.
దిల్లీ నుంచి వారిని తరలించిన మూడు నెలల తర్వాత మియన్మార్‌లోని ఈ శరణార్థులను బీబీసీ సంప్రదించింది.
చాలామంది 'బా థూ ఆర్మీ'తో ఉంటున్నారు. ఇది దేశ నైరుతి భాగంలో సైన్యంతో పోరాడుతున్న ఒక ప్రతిఘటన సమూహం.
''మియన్మార్ మాకు భద్రంగా అనిపించడం లేదు. మేమున్నది ఒక యుద్ధ క్షేత్రం దగ్గర'' అని సయ్యద్ నూర్ ఒక వీడియో కాల్‌లో బీబీసీతో చెప్పారు. 'బా థూ ఆర్మీ' సభ్యుడి ఫోన్ నుంచి ఆయన ఈ కాల్ మాట్లాడారు..
శరణార్థుల సాక్ష్యాలు, దిల్లీలోని వారి బంధువుల ప్రకటనలు, పరిశోధన చేస్తున్న నిపుణులతో మాట్లాడిన తర్వాత వారికి ఏం జరిగిందో బీబీసీకి తెలిసింది.
బీబీసీ ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం, భారత నౌకా దళం ముందు ఉంచింది. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు.

ఫొటో సోర్స్, Noorul Amin
''లైఫ్ జాకెట్ వేసి సముద్రంలో పడేశారు''
బీబీసీకి అందిన సమాచారం ప్రకారం, వారిని దిల్లీ నుంచి బంగాళాఖాతంలో ఉన్న ఒక ద్వీపానికి తీసుకువెళ్ళారు.
నౌకాదళానికి చెందిన ఒక ఓడలో ఎక్కించారు. చివరికి, వారికి లైఫ్ జాకెట్లు వేసి అండమాన్ సముద్రంలో వదిలివేశారు.
తర్వాత వీరంతా ఒడ్డుకు చేరుకున్నారు. ఇప్పుడు వారి భవిష్యత్ మియన్మార్‌లో అనిశ్చితిలో ఉంది.
ముస్లిం రోహింజ్యా కమ్యూనిటీకి చెందిన చాలామంది ప్రజలు గత కొన్నేళ్లలో హింస నుంచి తప్పించుకోవడానికి వదిలిపెట్టిన దేశం మియన్మార్.
ఈ బృందంలోని జాన్ అనే ఒక వ్యక్తి ఫోన్‌లో బీబీసీతో మాట్లాడారు. ''వారు మా చేతులు కట్టేసి, మా ముఖాలు కప్పేసి, ఖైదీలను తీసుకొచ్చినట్లుగా ఓడలోకి తీసుకువచ్చారు. తర్వాత సముద్రంలో పడేశారు'' అని చెప్పారు.
ఒడ్డుకు చేరుకున్న వెంటనే జాన్, తన సోదరుడికి ఫోన్ చేసి జరిగినదంతా విషయం చెప్పారు.
''మనుషులను ఇలా సముద్రంలో ఎవరైనా పడేస్తారా? ప్రపంచంలో మానవత్వం ఇంకా మిగిలే ఉంది. కానీ భారత ప్రభుత్వంలో నాకు ఎలాంటి మానవత్వం కనిపించలేదు'' అని అమీన్ ఆరోపించారు.
ఈ ఆరోపణలను నిరూపించడానికి కావాల్సిన ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితిలో మియన్మార్‌లో మానవ హక్కుల పరిస్థితిని పర్యవేక్షించే ప్రత్యేక అధికారి థామస్ ఆండ్రూస్ అన్నారు.
ఈ ఆధారాలను ఆయన జెనీవాలోని భారత మిషన్ చీఫ్‌కు సమర్పించారు. కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.
బీబీసీ కూడా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను అనేకసార్లు సంప్రదించింది. కానీ, ఈ కథనం ప్రచురితమయ్యే సమయానికి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఈ సమస్యపై పనిచేస్తున్న కార్యకర్తలు భారత్‌లో రోహింజ్యాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చాలాసార్లు చెప్పారు.
రోహింజ్యాలను భారత్ శరణార్థులుగా కాక, అక్రమ వలసదారులుగా పరిగణిస్తుంది.
పెద్ద సంఖ్యలో రోహింజ్యా శరణార్థులు భారత్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌లో అత్యధికంగా అంటే పది లక్షల కంటే ఎక్కువ మంది రోహింజ్యాలు నివసిస్తున్నారు.
2017లో సైన్యం చేపట్టిన భయంకరమైన హింసాకాండ తర్వాత చాలామంది మియన్మార్‌ను వదిలి వెళ్ళారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేమైంది?
దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న, యూఎన్‌హెచ్‌సీఆర్ కార్డులు ఉన్న 40 మంది రోహింజ్యా శరణార్థులను మే 6న స్థానిక పోలీస్ స్టేషన్లకు పిలిచారని మియన్మార్‌కు చేరుకున్న శరణార్థులు చెప్పారు. .
బయోమెట్రిక్ డేటా సేకరించడానికి పిలిచామని పోలీసులు తమకు చెప్పినట్లు వారు తెలిపారు.
రోహింజ్యా శరణార్థుల ఫోటోలు, వేలిముద్రలు సేకరించడం భారత ప్రభుత్వం వార్షిక ప్రక్రియ. కొన్ని గంటల తర్వాత వారిని ఇంద్రలోక్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.
''ఇదే సమయంలో నా సోదరుడు నాకు ఫోన్ చేసి, తమను మియన్మార్‌కు తీసుకువెళుతున్నారని చెప్పాడు. లాయర్‌ను సంప్రదించి, యూఎన్‌హెచ్‌సీఆర్‌కు సమాచారం ఇవ్వమని నాతో చెప్పాడు'' అని అమీన్ గుర్తు చేసుకున్నారు.
మే 7న, తామందరినీ దిల్లీలోని హిండాన్ విమానాశ్రయానికి తీసుకెళ్లి, అక్కడి నుంచి అండమాన్ నికోబార్ దీవులకు విమానంలో తీసుకెళ్లారని మియన్మార్‌కు వెళ్లిన రోహింజ్యాలు చెప్పారు.
''విమానం దిగిన తర్వాత, మమ్మల్ని తీసుకెళ్ళడానికి రెండు బస్సులు వచ్చాయి. వాటిపై 'భారతీయ నౌకాదళం' అని రాసి ఉంది. మేము బస్సు ఎక్కగానే, వారు మా చేతులను ప్లాస్టిక్‌తో కట్టేసి, మా ముఖాలకు నల్లటి వస్త్రం కట్టారు'' అని నూర్ వీడియో కాల్‌లో చెప్పారు.
కొంతసేపటికే ఆ బృందాన్ని బంగాళాఖాతంలో ఉన్న ఒక ఓడలోకి ఎక్కించినట్లు, 14 గంటల పాటు ఓడలో ఉన్నట్లు నూర్ తెలిపారు.
కొంతమంది శరణార్థులు తమపై హింస జరిగిందని, తమను అనుమానించారని చెప్పారు.
''మమ్మల్ని చాలా దారుణంగా చూశారు. కొంతమందిని బాగా కొట్టారు. చాలాసార్లు చెంపదెబ్బలు కొట్టారు'' అని నూర్ అన్నారు.
వీడియో కాల్‌లో ఫయాజ్ ఉల్లా తన కుడి మణికట్టుపై ఉన్న గాయాలను చూపించారు. తనను పదేపదే కొట్టారని, వీపు, ముఖంపై చెంపదెబ్బలు కొట్టారని, వెదురు కర్రతో పొడిచారని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
''శరణార్థులను ప్రమాదంలోకి నెట్టారు''
మే 8న స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 7 గంటలకు, ఓడ అంచున ఉన్న నిచ్చెన నుంచి కిందకు దిగమని శరణార్థులకు చెప్పారు. ఓడ కింద తమకు నాలుగు చిన్న రబ్బరు పడవలు కనిపించాయని వారు చెప్పారు.
శరణార్థులను రెండు పడవల్లో కూర్చోబెట్టారు. మిగతా రెండు పడవల్లో డజను మంది సిబ్బంది ఉన్నారు.
"ఒక పడవ ఒడ్డుకు చేరుకుంది. ఒక చెట్టుకు పొడవైన తాడు కట్టారు. ఆ తాడును మా పడవల వరకు తీసుకువచ్చారు. మాకు లైఫ్ జాకెట్లు ఇచ్చారు. చేతులు విప్పి, నీటిలో దూకమని చెప్పారు. మేం తాడు పట్టుకుని 100 మీటర్లకు పైగా ఈది ఒడ్డుకు చేరుకున్నాము. మీరు ఇండోనేసియా చేరుకున్నారు అని చెప్పి వారు మమ్మల్ని వదిలేసి వెళ్లారు'' అని నూర్ అన్నారు.
బీబీసీ ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం, భారత నౌకాదళం ముందు ఉంచింది. కానీ ఎలాంటి స్పందన రాలేదు.
మే 9 తెల్లవారుజామున, ఈ బృందానికి స్థానిక మత్స్యకారులు కనిపించారు. మీరు మియన్మార్‌లో ఉన్నారని మత్స్యకారులు వారికి చెప్పారు.
వారు శరణార్థులను తమ ఫోన్‌లు ఉపయోగించుకోవడానికి అనుమతించారు. తద్వారా వారు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులకు కాల్ చేయగలిగారు.
మియన్మార్‌లోని తనిన్‌తరి ప్రాంతంలో చిక్కుకున్న శరణార్థులకు మూడు నెలలుగా ఆహారం, ఆశ్రయం కల్పిస్తూ బా థూ ఆర్మీ సహాయం చేస్తోంది.
ఇదంతా నిజమేనని, శరణార్థులను ప్రమాదంలోకి నెట్టారని ఆండ్రూస్ అన్నారు.

సుప్రీం కోర్టు ఏం నిర్ణయించనుంది?
అమీన్, మరో ఇద్దరు శరణార్థులు కలిసి మే 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను దిల్లీకి తిరిగి తీసుకురావాలని, ఇలాంటి బహిష్కరణలను తక్షణమే నిలిపివేయాలని, ఆ 40 మందికి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో వారు కోరారు.
''ఈ ఘటన రోహింజ్యాల బహిష్కరణకు సంబంధించిన భయంకరమైన నిజాన్ని దేశం మొత్తానికి తెలియజేసింది'' అని సుప్రీం కోర్టులో శరణార్థుల తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ కొలిన్ గొంజాల్వెస్ అన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఒకరు ఈ ఆరోపణలను ''కల్పిత ఆలోచన'' అని పేర్కొన్నారు.
తమ వాదనలను నిరూపించడానికి ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలు సమర్పించలేదని కూడా ఆయన అన్నారు.
రోహింజ్యాలను శరణార్థులుగా పరిగణించవచ్చా? లేదా వారు అక్రమ వలసదారులు కాబట్టి వారిని తిరిగి పంపవచ్చా అని నిర్ణయించడానికి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 29న ఈ కేసుపై వాదనలు విననుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














