ట్రంప్ సుంకాలను ‘మోదీ మంత్రం’తో ఎదుర్కోగలమా? ఆ దారిలో ఉన్న 5 అడ్డంకులేమిటి?

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘శక్తివంతమైన, అభివృద్ధి చెందిన భారత్‌కు.. స్వయంసమృద్ధి చెందిన భారతదేశమే పునాది. రక్షణ, సాంకేతికత, ఇంధన, అంతరిక్షంతో పాటు తయారీ రంగాల్లో పురోగతి 2047 నాటికి మనల్ని అభివృద్ధి చెందిన భారత్‌గా నిలుపుతుంది’

ఇటీవల 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలను నొక్కిచెబుతూ చేసిన వ్యాఖ్యలివి.

ఇంకా ఆయన మాట్లాడుతూ, "యువత స్వదేశంలోనే జెట్ ఇంజిన్లు, సెమీకండక్టర్ చిప్స్, ఇతర సాంకేతిక ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని కోరుతున్నా. తద్వారా మనం స్వయంసమృద్ధి సాధించగలం" అని అన్నారు.

స్వయంసమృద్ధి అంటే, కేవలం దేశానికే పరిమితం కాదని.. ఇతర దేశాలతో పరస్పర సహకారం కొనసాగిస్తూ శక్తిసామర్థ్యాలను, స్వయంప్రతిపత్తిని పెంపొందించుకోవడమని కూడా అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రస్తుతం, ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి.

కార్లు, ఫోన్ల తయారీ నుంచి వస్త్రాలు, ఆహార భద్రత వరకూ భారత్ గత కొన్నేళ్లుగా అద్భుతమైన పురోగతి సాధించింది.

అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు, భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాల విధింపు వంటి వాటి కారణంగా, 'స్వదేశీ' ప్రచారం ఊపందుకుంటోంది.

వ్యవసాయం, మైనింగ్, ఇనుము, ఉక్కు, వాహనాల విడిభాగాలు, పారిశ్రామిక యంత్రాలు, ఫర్నిచర్, తోలు, పాదరక్షల తయారీ, దేశీయ రక్షణ రంగ ఉత్పత్తులు, ఐటీ, ఇతర డిజిటల్ సేవల రంగాల్లో భారత్ స్వావలంబన సాధించింది.

కానీ, ఇంకా విదేశీ ముడి పదార్థాలు, టెక్నాలజీ, రీసర్చ్‌పై ఆధారపడిన అనేక రంగాలున్నాయి.

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు

మొబైల్ ఫోన్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి అవసరమైన సెమీకండక్టర్ చిప్స్ వంటి హైటెక్ ముడి వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటోంది.

అంతేకాకుండా.. చైనా సాంకేతిక నైపుణ్యం, సరసమైన ధరల కారణంగా భారత్ ఈ వస్తువుల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది.

ఈ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇప్పటికే విధానపరమైన నిర్ణయాల విషయంలో చొరవ తీసుకుంది.

మేక్ ఇన్ ఇండియా, ఇండియా సెమీకండక్టర్ మిషన్, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి స్కీముల ద్వారా భారత్‌లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి అనువైన వాతావరణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ముడి పదార్థాలు/వస్తువుల లభ్యత గురించి ఎలిస్టా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీఎండీ సాకేత్ గౌరవ్ మాట్లాడుతూ, "మేం స్మార్ట్ టీవీలను తయారుచేస్తాం. వాటిలో వినియోగించే ముఖ్యమైన విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. మా ఉత్పత్తులలో వినియోగించే అనేక భాగాలను ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నాం. అవి భారత్‌లో తయారవడం లేదు" అని చెప్పారు.

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు
ఫొటో క్యాప్షన్, సాకేత్ గౌరవ్, సీఎండీ, ఎలిస్టా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్

ఎలిస్టా కంపెనీ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో రూ.250 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించింది.

"అలాగే భారతీయ బ్రాండ్లు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి ఏంటంటే.. ఇక్కడ తయారైన వస్తువులు నాణ్యత పరంగా బాగున్నప్పటికీ, మన వినియోగదారులు విదేశీ బ్రాండ్లనే ఇష్టపడతారు" అని సాకేత్ గౌరవ్ అన్నారు.

అయితే, రానున్న ఐదేళ్లలో సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధిస్తుందని కూడా ఆయన అన్నారు.

"ఐదు నుంచి ఆరేళ్లలో ముఖ్యమైన విడిభాగాలను ఇక్కడే తయారు చేయగలమని ఆశిస్తున్నా. ప్రస్తుతం, అందుకు అవసరమైన టెక్నాలజీ, ప్రాసెస్ చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు" అని సాకేత్ గౌరవ్ చెప్పారు.

''భారత్‌లో తయారైన ఉత్పత్తులు విదేశీ బ్రాండ్ల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. కానీ, వినియోగదారులు విదేశీ బ్రాండ్లనే ఇష్టపడుతున్నారు.''

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల నుంచి టర్బైన్ల వరకు, పర్మినెంట్ మాగ్నెట్స్, లైటింగ్, రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు, అనేక ఇతర రోజువారీ నిత్యవసరాలతో సహా అనేక ఉత్పత్తుల తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ మెటీరియల్స్ కోసం భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది.

భారత్ తనకు అవసరమైన రేర్ ఎర్త్ మెటీరియల్స్‌లో దాదాపు 99 శాతం దిగుమతి చేసుకుంటోంది. అందుకు చైనాపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.

భారత్‌లో రేర్ ఎర్త్ మెటీరియల్స్‌ను రీసైక్లింగ్ చేసే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన అటెరో సీఈవో, కంపెనీ సహ వ్యవస్థాపకులు నితిన్ గుప్తా మాట్లాడుతూ, "భారత్ ప్రస్తుతం 99 శాతం రేర్ ఎర్త్ మెటీరియల్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. కానీ, ఈ పరిశ్రమ పురోగతికి అనువైన వ్యవస్థను అభివృద్ధి చేసినట్లయితే.. భారత్ 70 శాతం అవసరాలను రీసైక్లింగ్‌ ద్వారా తీర్చుకోవచ్చు" అని అన్నారు.

అటెరో కంపెనీ ఇటీవల తన సామర్థ్యాన్ని 300 టన్నుల నుంచి 30 వేల టన్నులకు పెంచుకుంది.

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు
ఫొటో క్యాప్షన్, నితిన్ గుప్తా, సీఈవో, అటెరో

"చాలా ముఖ్యమైన ఉత్పత్తుల తయారీలో రేర్ ఎర్త్ మెటీరియల్స్ చాలా కీలకం. భారత్ ఈ విషయంలో స్వయంసమృద్ధి సాధించే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది. భారత్‌లోనూ రేర్ ఎర్త్ మెటీరియల్స్ నిల్వలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం వాటి మైనింగ్ జరగడం లేదు. ప్రపంచంలోని మొత్తం రేర్ ఎర్త్ మెటీరియల్స్‌లో 99 శాతం చైనా నుంచే వస్తున్నాయి, ఈ విషయంలో భారత్ ఇప్పటివరకూ పెద్దగా చేసిందేమీ లేదు" అని నితిన్ గుప్తా అన్నారు.

"రీసైక్లింగ్ హబ్‌గా మారడం ద్వారా భారత్ తన అవసరాలను తీర్చుకునే దిశగా ముందుకెళ్లొచ్చు. మనం మార్కెట్‌లో పోటాపోటీ ధరకు రీసైకిల్ చేయగలం, కానీ అది భారీ స్థాయిలో జరగాల్సిన అవసరముంది."

అయితే, కేవలం రీసైక్లింగ్ ద్వారానే భారత్ అవసరాలు తీరతాయా? అనేదే ఇక్కడి ప్రశ్న.

ఈ విషయంలో నితిన్ గుప్తా ఆశావహంగానే ఉన్నారు. "నూతన ఆవిష్కరణల ద్వారా దీనిని సాధించగలం. అందుకోసం భారత్ విధానపరమైన చర్యలు చేపట్టాలి. రేర్ ఎర్త్ మెటీరియల్స్ మైనింగ్, రిఫైన్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు

2025 ఏప్రిల్‌లో భారత్ తనకు అవసరమైన ముడిచమురులో 90 శాతం దిగుమతి చేసుకుంది.

ఇది మాత్రమే కాకుండా.. రసాయనాలు, ఎరువుల విషయంలోనూ భారత్ ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది.

భారత్‌లో కెమికల్ ఇండస్ట్రీ భారీ స్థాయిలో విస్తరించి ఉన్నప్పటికీ, అనేక ఉత్పత్తులకు అవసరమైన ముడి పదార్థాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

2024 - 25 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 54 బిలియన్ డాలర్ల విలువైన కెమికల్స్, ఫెర్టిలైజర్స్‌ను దిగుమతి చేసుకుంది. వీటిలో ముడి చమురు నుంచి తీసే పెట్రోకెమికల్స్‌తో పాటు ఇతర కెమికల్ ఇంటర్మీడియేట్స్ ఉన్నాయి.

2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో, భారత్ 9.74 లక్షల టన్నుల డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్ఫేట్)ను దిగుమతి చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో డీఏపీ మొత్తం దిగుమతులు దాదాపు 45.7 లక్షల టన్నులు. యూరియా దాదాపు 56 లక్షల టన్నులు. ఎరువుల తయారీలో ఇది చాలా కీలకం.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారత్ పెట్రోకెమికల్స్ దిగుమతులపై ఆధారపడడానికి ప్రధాన కారణం.. దేశీయంగా అవసరమైన ఖనిజాల కొరతతో పాటు అభివృద్ధి చెందిన మైనింగ్, ప్రాసెసింగ్ వ్యవస్థ లేకపోవడం.

లిథియం, కోబాల్ట్, మెగ్నీషియం, నికెల్ వంటి ముఖ్యమైన ఖనిజాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అయితే, ఈ కీలకమైన ఖనిజ నిల్వలు భారత్‌లో పరిమితంగానే ఉన్నాయి. లేదంటే నిల్వలు ఉన్నప్పటికీ.. మైనింగ్ సాధ్యమయ్యే పరిస్థితి లేదు.

ఆర్థిక వ్యవహారాల విశ్లేషకులు, జర్నలిస్ట్ నరేంద్ర తనేజా మాట్లాడుతూ, "భారతీయ పరిశ్రమలు ముడి చమురు, పెట్రోకెమికల్స్ దిగుమతులపై ఆధారపడి ఉన్నాయి. పెట్రోకెమికల్స్‌పై ఆధారపడని రంగం దాదాపుగా అరుదు. కానీ, ఈ అవసరాలన్నింటికీ భారత్ దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. భారత్‌లో ముడిచమురు నిల్వలు లేవని కాదు, కానీ అవి ఉన్నచోట్ల వాటిని వెలికితీయడంలోనూ సవాళ్లున్నాయి" అని అన్నారు.

"బంగాళాఖాతం, అరేబియా సముద్రం, అండమాన్‌లో తగినన్ని చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నప్పటికీ.. భారత్ తన అవసరాల్లో దాదాపు 88 శాతం వరకూ దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఈ నిల్వల అన్వేషణకు అవసరమైన ఖరీదైన టెక్నాలజీ, వెలికితీతకు అవసరమైన పెట్టుబడులు లేవు. వాస్తవానికి, నడిసముద్రంలో చమురు, గ్యాస్ నిల్వల వెలికితీత ఖరీదైన వ్యవహారం, అలాగే అక్కడ మైనింగ్ చేయడం కూడా చాలా ప్రమాదకరం. టెక్నాలజీకి, పెట్టుబడులకు ఇదే అతిపెద్ద సవాల్" అని తనేజా అన్నారు.

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే ఔషధాల ఉత్పత్తికి భారత్ ప్రధాన కేంద్రంగా ఉంది. భారత్‌ను ఔషధ కర్మాగారం అని కూడా పిలుస్తారు.

కానీ, ఔషధాల తయారీకి అవసరమైన ఏపీఐ(యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్)ల కోసం దిగుమతులపై ఆధారపడుతోంది.

భారత్ తన మొత్తం అవసరాల్లో దాదాపు 65 శాతం ఏపీఐలను దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది. అందులోనూ ఎక్కువ భాగం చైనా నుంచే వస్తోంది.

తక్కువ ఖర్చుతో ఐపీఐని భారీగా ఉత్పత్తి చేయగల సామర్థ్యం చైనా దగ్గరుంది.

నరేంద్ర తనేజా మాట్లాడుతూ, "అమెరికాలో ప్రతి రెండో వ్యక్తి వినియోగించే మందులు భారత్‌లో తయారైనవే. కానీ, ఈ మందులను తయారు చేసేందుకు భారత్ చైనాపై ఆధారపడుతోంది. ఈ రంగంలో స్వయంసమృద్ధి సాధించే దిశగా భారత్ చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.

అయితే, భారత్‌కు ఇది సాధ్యమేనా అనేదే ప్రశ్న. ఏపీఐ ఉత్పత్తిలో రెండు కీలక అంశాలు. మొదటిది ముఖ్యమైన రసాయనాలు, రెండోది వాటిని ప్రాసెస్ చేసే సాంకేతిక సామర్థ్యం. ఈ రెండు విషయాల్లో భారత్‌కు ఉన్న అవకాశాలు పరిమితం.

"భారత్ చైనా నుంచి ఏపీఐలను దిగుమతి చేసుకున్నప్పటికీ, వాటికి విలువను జోడిస్తూ ముందుకెళ్తోంది. అందులో భారత్‌కు నైపుణ్యముంది. చైనాపై ఆధారపడుతున్నప్పటికీ, భారత ఫార్మా ఇండస్ట్రీ నిరంతరం బలపడుతోంది" అని తనేజా అంటున్నారు.

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీ, భారత్, వాణిజ్యం, ట్రంప్ సుంకాలు

భారత్ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తిని ప్రోత్సహించినప్పటికీ, రక్షణ పరమైన అవసరాల కోసం ఇప్పటికీ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడి ఉంది.

యుద్ధ విమానాల నుంచి జలాంతర్గాముల వరకు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను కూడా భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

2023 గణాంకాల ప్రకారం, భారత్ తన రక్షణ బడ్జెట్‌లో 36 శాతం దిగుమతులపైనే ఖర్చు చేసింది.

జెట్ ఇంజిన్లు, రాడార్ల వంటి హైటెక్ పరికరాలను భారత్ ఇప్పటికీ దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది.

ఇంకా, అధునాతన ఆయుధాల కోసం కూడా విదేశాలపై ఆధారపడుతోంది.

అయితే, భారత్ దేశీయంగానూ రక్షణ రంగ ఉత్పత్తిని పెంచింది. 2014 - 15లో భారత్ రూ.46,429 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను తయారుచేయగా, అది 2023 - 24 నాటికి 1.27 లక్షల కోట్లకు పెరిగింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)