జమ్మూకశ్మీర్: భారీ వరదలతో విరిగిపడిన కొండచరియలు... ఎనిమిది మంది మృతి... వైష్టోదేవి యాత్ర నిలుపుదల

జమ్మూలో వరదలు, వైష్టోదేవి యాత్ర నిలుపుదల, విరిగిపడిన కొండ చరియలు

ఫొటో సోర్స్, Rising Star Corps, Indian Army/X

ఫొటో క్యాప్షన్, జమ్మూలో సహాయ చర్యల్లో సైనికులు

భారీ వర్షాలతో ఉత్తర భారతదేశంలో చాలాచోట్ల పరిస్థితులు క్లిష్టంగా మారాయి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది.

జమ్మూ రీజియన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఎనిమిది మంది మృతి చెందారు. వైష్ణోదేవి యాత్రను నిలిపేశారు. ఈ ప్రాంతంలో పరిస్థితిపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లో చంఢీగఢ్-మనాలి జాతీయ రహదారి దెబ్బతింది.

పంజాబ్‌లో ఆగస్టు 30వ తేదీ వరకూ పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

జమ్మూ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

జమ్మూ తావి, కాట్రా మధ్య ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. రైల్వే అధికారులు 18 రైళ్లను రద్దు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్

ఫొటో సోర్స్, Rising Star Corps, Indian Army/X

ఫొటో క్యాప్షన్, వైష్ణోదేవి యాత్రామార్గంలో కూలిన కొండచరియల్లో చిక్కుకున్న అనేక మందిని ఆర్మీ రక్షించింది

వైష్ణోదేవి యాత్ర మార్గంలో కూలిన కొండచరియలు...

జమ్మూలోని వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో చాలామంది యాత్రికులు వాటి మధ్య చిక్కుకుపోయారు. చాలామందిని సైనికులు రక్షించారు.

న్యూస్ ఏజెన్సీలందించిన వివరాల ప్రకారం, ఐదుగురు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు.

''సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐదుగురి మృతదేహాలను కాట్రాలోని సామాజిక ఆసుపత్రి (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)కి తరలించాం. పది నుంచి పదకొండు మంది వరకూ గాయపడ్డారు'' అని కాట్రా ఎస్‌డీఎం పీయూష్ ధోత్రా ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.

''కాట్రా, పరిసర ప్రాంతాల్లో మూడు బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అర్ధకుమ్వారి ప్రాంతంలో ప్రజలను రక్షించేందుకు మరో బృందం పనిచేస్తోంది'' అని భారత సైన్యానికి సంబంధించిన వైట్ నైట్ కార్ప్స్ 'ఎక్స్'లో సమాచారం పోస్టు చేసింది.

''కాట్రా నుంచి థక్రా కోట్‌కు వెళ్లే రోడ్డులో కొండ చరియలు విరిగిపడిన ప్రదేశానికి రెండో సహాయక బృందం చేరుకుంది. మూడో బృందం జౌరియన్‌కు దక్షిణ ప్రాంతంలో సహాయం అందిస్తోంది'' అని వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది.

''వైష్ణోదేవి యాత్ర, శివ్‌ఖోడి యాత్ర వాయిదాపడ్డాయి. అక్కడకు వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఎనిమిది నుంచి తొమ్మిది మంది వరకు గాయపడ్డారు. వారిని రక్షించాం. అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి'' అని జమ్మూ డివిజినల్ కమిషనర్ రాకేష్ కుమార్ చెప్పారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విచారం వ్యక్తం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

అమిత్‌షా, ఒమర్ అబ్దుల్లా విచారం...

ఈ దుర్ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు.

''భారీ వర్షాలతో వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ఈ ఘటన గురించి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నరు మనోజ్ సిన్హాలతో మాట్లాడాను. క్షతగాత్రులకు సపర్యల్లోనూ, ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యల్లోనూ స్థానిక అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్‌డీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడికి చేరుకుంది'' అని అమిత్ షా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

''మాతా వైష్ణోదేవి యాత్రకు వచ్చిన భక్తులు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలిగించాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను'' అని ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

దోడాలో భారీవర్షాలతో ముగ్గురి మృతి...

జమ్మూ డివిజన్‌లో భారీ వర్షాల కారణంగా నదులు, వాగులన్నీ ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, పలు జనావాసాలు నీటమునిగాయి.

తావి నది ఉగ్రరూపంపై ఏఎన్ఐ ఒక వీడియోను విడుదల చేసింది.

దోడా జిల్లాలో కుండపోత వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ముగ్గురు చనిపోయారని పీటీఐ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

రానున్న 40 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బసంతర్, తావి, చీనబ్ నదుల్లో నీటి ప్రవాహం ప్రస్తుతం ప్రమాదకర స్థాయి చేరుకుందని జమ్మూ డివిజన్ కమిషనర్ కార్యాలయం 'ఎక్స్'లో వెల్లడించింది.

నదుల ఒడ్డుకు, వరద ప్రభావిత ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని స్థానిక ప్రజలను, యాత్రికులను హెచ్చరించింది.

జిల్లావారీ హెల్ప్‌లైన్ నంబర్లను అధికారులు ప్రకటించారు.

భారీ వర్షాలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్ నది వరద ఉధృతికి జాతీయ రహదారి చాలాభాగం దెబ్బతింది

హిమాచల్ ప్రదేశ్‌లో భయానక పరిస్థితులు...

భారీవర్షాలతో ఉధృతంగా మారిన బియాస్ నది ధాటికి ఛండీగఢ్-మనాలి జాతీయ రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయింది.

''మంగళవారం నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కులు-మనాలి, కంగ్రా, యునా జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడ ప్రజలందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పంటలకు భారీ నష్టం వాటిల్లింది. పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది'' అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు.

''కుండపోత వర్షాలతో చాలాచోట్ల జాతీయ రహదారి దెబ్బతింది. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అనవసరంగా ఎక్కడికీ ప్రయాణించవద్దని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం'' అని పర్యటకులకు కులు డిప్యూటీ కమిషనర్ టోరల్ ఎస్ రావీష్ సూచించారు.

ఆగస్టు 27 నుంచి 30వ తేదీ వరకూ పాఠశాలన్నీ మూసివేయాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు పీటీఐ వెల్లడించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)