మహాబలిపురంలో 7 ఆలయాలు ఉండేవా, మరి ఒక్కటే ఎందుకు కనిపిస్తోంది, మిగతావి ఏమయ్యాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహాబలిపురంలో సముద్రమట్టం తగ్గినప్పుడు, నీళ్లలో కొన్ని రాతి నిర్మాణాల్లాంటివి కనిపిస్తాయి. దీంతో స్థానికులు సముద్రం ఒడ్డున ఉన్న ఆలయం కాకుండా, ఇంకా కొన్ని దేవాలయాలు సముద్రగర్భంలో మునిగిపోయి ఉండొచ్చని నమ్ముతున్నారు.
దీనిపై భారత పురావస్తు శాఖ ఇప్పటికే నిర్వహించిన ఒక సర్వేలో సముద్రగర్భంలో కొన్ని నిర్మాణాల వంటివి ఉన్నట్లు నిర్ధరించింది.
తాజాగా ఈ ఆగస్ట్ నెల మధ్యలో, మహాబలిపురం తీరానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో, నీటిఅడుగున పురావస్తు శాఖ అధ్యయనం నిర్వహించింది.
ఇందుకోసం అత్యాధునిక రిమోట్ ఆపరేటెడ్ వెహికల్‌ను ఉపయోగించింది.
మరి, ఈ అధ్యయనంలో ఏం తేలింది? భారత పురావస్తు శాఖ ఏం చెబుతోంది?


ఫొటో సోర్స్, Getty Images
7 ఆలయాలు ఉన్నాయా?
చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని, మహాబలిపురం బీచ్‌లోని ఆలయాన్ని తమిళనాడులో నిర్మితమైన తొలి ఆలయ నిర్మాణంగా పరిగణిస్తున్నారు. ఈ ఆలయంలో సింహభాగం 8వ శతాబ్దంలో, నరసింహవర్మన్ II నిర్మించినట్లు చెబుతారు.
ఇక్కడ మొత్తం 7 ఆలయాలు ఉండేవని, వాటిలో ప్రస్తుతం బీచ్ టెంపుల్ (తీర ఆలయం) మాత్రమే మిగిలి ఉందని చాలామంది భావిస్తున్నారు. ఇందుకు ఉన్న అనేక కారణాలలో ఈ ప్రాంతంలో సముద్రమట్టం తగ్గినప్పుడు కొన్ని రాళ్లు బయటికి కనిపిస్తుండడం కూడా ఒకటి.
16వ శతాబ్దం నుంచి యూరోపియన్ రికార్డుల్లో మహాబలిపురం ప్రస్తావన ఉంది. ఈ ఆలయాలను సెవెన్ పగోడాస్, అంటే ఏడు దేవాలయాలని అనేవారు. 1772లో మహాబలిపురం ప్రాంతాన్ని సందర్శించిన విలియం చాంబర్స్..కలకత్తా నుంచి ప్రచురితమైన ఏసియాటిక్ రీసర్చెస్‌లో దీని గురించి ఒక వ్యాసం రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
మహాబలిపురంలో 7 దేవాలయాల గురించి ప్రస్తావించినప్పటికీ, అవి ఏ ఏడు ఆలయాలు అన్నది స్పష్టంగా పేర్కొనలేదు. ఒకే రాయితో తయారు చేసిన రథాలు, బీచ్ ఆలయాన్ని కలిపి 7 ఆలయాలుగా చెబుతారని కొంతమంది అంటున్నారు.
మరికొందరు, తీరం వెంబడి 7 దేవాలయాలు ఉన్నాయని.. వాటిలో ఆరు సముద్రంలో మునిగిపోగా ఒకటి మాత్రమే మిగిలి ఉందని నమ్ముతారు.
అయితే, కొన్ని నిర్మాణాలు సముద్రంలో మునిగిపోయి ఉండొచ్చనే ఊహాగానాలు కొనసాగాయి.

ఫొటో సోర్స్, ASI
పురావస్తు శాఖ తవ్వకాలు
అందుకే, ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(భారత పురావస్తు శాఖ) నిర్ణయించింది. 1990-91లో, భారత పురావస్తు శాఖ, చెన్నై విభాగం మహాబలిపురం బీచ్‌లో తవ్వకాలు నిర్వహించింది. ఈ తవ్వకాల్లో వరాహ స్వామి ఏకశిలా విగ్రహం, ఒక పురాతన బావి, పల్లవుల కాలంనాటి కొన్ని శాసనాలు, మెట్ల లాంటి నిర్మాణం ఒకటి బయటపడ్డాయి.
1998 నుంచి 2000 వరకు మరోసారి జరిపిన తవ్వకాల్లో బీచ్ వెంబడి మెట్ల వంటి నిర్మాణం ఉన్నట్లు తేలింది. బీచ్‌లో ఉన్న ఆలయానికి పశ్చిమాన ఇటుకలతో నిర్మించిన ఓ నిర్మాణాన్ని కూడా కనుగొన్నారు.
అంతకుముందు 1995లో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన ఉమ్మడి అధ్యయనంలో మహాబలిపురం సముద్రతీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో పురావస్తు పరిశోధన అవసరమని తేలింది.

ఫొటో సోర్స్, ASI
ఈ నేపథ్యంలోనే భారత పురావస్తు శాఖ అండర్ వాటర్ ఎక్స్‌కవేషన్స్ డివిజన్ ఈ ప్రాంతంలో సముద్రగర్భంలో సర్వేలు నిర్వహించాలని నిర్ణయించింది.
2001 నవంబర్‌లో, మహాబలిపురం తీరం వెంబడి సబ్‌మెర్సిబుల్ సర్వే నిర్వహించారు. అదేవిధంగా, భూఉపరితలంపై కూడా సర్వేలు జరిగాయి.
ఆ తర్వాత, 2002 మార్చిలో మళ్లీ సర్వేలు నిర్వహించారు. ఈసారి సర్వేలు ఆలయానికి ఉత్తరంగా, సముద్రం కొద్దిగా లోపలికి చొచ్చుకొచ్చిన ప్రాంతంలో నీటి అడుగున నిర్వహించారు.

ఫొటో సోర్స్, ASI
సముద్రంలో 2 కిలోమీటర్ల మేర అన్వేషణ
మరోసారి జరిపిన తవ్వకాల్లో, నిర్మాణాలకు ఉపయోగించిన చెక్కిన రాళ్లు బయటపడ్డాయి. వాటిపై వివిధ రకాల శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఇవన్నీ పల్లవుల కాలంనాటివిగా విశ్వసిస్తున్నారు.
అనంతరం 2004లో మరో సర్వే నిర్వహించారు. భారత నౌకా దళం సాయంతో ఈ సర్వే జరిపారు. బీచ్ వెంబడి అనేక నిర్మాణాలు, రాళ్లను గుర్తించారు. ఇవన్నీ చివరికి.. ఈ ప్రాంతంలో నిర్మాణాలు ఉన్నాయని, బీచ్ ఆకృతిలో వచ్చిన మార్పుల కారణంగా అవి మునిగిపోయినట్లు స్పష్టం చేశాయి.
ఈ క్రమంలోనే ఆగస్ట్ 14, 15 తేదీల్లో భారత పురావస్తు శాఖ సముద్రగర్భంలో మరోసారి అధ్యయనం నిర్వహించింది.
వీటి గురించి పురావస్తు శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, ''అక్కడ నీటి అడుగున ఇప్పటికే సర్వే జరిగింది. ఆ సమయంలో, కొన్ని నిర్మాణాలు కనిపించాయి. అవి ఇప్పుడెలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకున్నాం. అందులో భాగంగానే, మరోసారి సర్వే చేశాం. గతంలో సర్వే కోసం, సైనికులు సముద్రంలో దూకి అడుగుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఈసారి రిమోట్‌తో పనిచేసే వాహనాన్ని ఉపయోగించి సర్వే చేశాం'' అని చెప్పారు.
20 ఏళ్ల కిందట కనుగొన్న నిర్మాణాలు నేటికీ చెక్కు చెదరలేదని ఈ సర్వే వెల్లడించింది. ''మెట్ల వంటి మానవ నిర్మాణాలను కూడా కనుగొన్నాం. కొన్ని రాతి నిర్మాణాలు కూడా కనిపించాయి. ఈ సర్వేలు తీరం నుంచి ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో జరిగాయి'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, ASI
"అదనపు నిధులు"
మహాబలిపురంలో ఈ అధ్యయనం నిర్వహించడానికి చాలా కారణాలున్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన భారత పురావస్తు శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అలోక్ త్రిపాఠి చెప్పారు.
‘‘ 2005లో జరిగిన తవ్వకాలకు కొనసాగింపుగా ఈ తాజా అధ్యయనం నిర్వహించాం. ఇది కేవలం 2 రోజులు మాత్రమే జరిగింది. సముద్రగర్భంలో కొన్ని నిర్మాణాలు, రాళ్లను మేం రికార్డ్ చేశాం. నీటిమట్టాలు పెరగడం, తగ్గడం వల్ల సముద్రగర్భంలో మార్పులు వస్తాయి. ఎంతమార్పు వచ్చిందనే దానిపై పరిశోధన జరిపాం. సముద్ర జీవరాశి పెరుగుదలకు ఎంత అవకాశం ఉంది, ఆ ప్రదేశంలో సముద్ర వాతావరణం ఎలా ఉందనేది పరిశోధించడమే ఈ అధ్యయనం ముఖ్యోద్దేశం" అన్నారు.
సముద్రగర్భ అన్వేషణలకు నిధుల కేటాయింపులు కూడా పెరిగాయని, దానికి అనుగుణంగా ఈ పరిశోధనలను కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అలోక్ త్రిపాఠి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














