2500 ఏళ్ల కిందట మనిషి ముఖం ఎలా ఉండేది? పుర్రెల ఆధారంగా ఆకృతులు రూపొందిస్తున్న మదురై కామరాజ్ యూనివర్సిటీ పరిశోధకులు

కొందగైలో గుర్తించిన పుర్రెలు

ఫొటో సోర్స్, Face Lab/Liverpool John Moores University

ఫొటో క్యాప్షన్, కొందగైలో గుర్తించిన 2500 ఏళ్ల నాటి పుర్రెల ఆధారంగా ముఖాకృతులు రీకనస్ట్రక్ట్ చేశారు పరిశోధకులు
    • రచయిత, చెరిలాన్ మొలాన్
    • హోదా, బీబీసీ న్యూస్

తమిళనాడులోని ఒక యూనివర్సిటీ ప్రయోగశాలలో 2500 ఏళ్ల నాటి దంతాల నుంచి ఎనామెల్‌ను (దంతాలపై ఉండే పొర) తొలగించేందుకు పరిశోధకులు ఒక చిన్న డ్రిల్‌ను ఉపయోగిస్తున్నారు.

ఒకప్పుడు ఆ ప్రాంతంలోని మనుషులు ఎలా ఉండేవారో అర్థం చేసుకునేందుకు డిజిటల్‌గా ముఖాకృతులు తయారు చేసేందుకు తాము మోడల్‌గా తీసుకున్న రెండు పుర్రెల్లో.. ఒక పుర్రెకు చెందిన దంతాలు ఇవి అని మదురై కామరాజ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు.

ఇద్దరు పురుషులకు చెందిన ఈ రెండు పుర్రెలను కీళడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన స్మశాన వాటిక కొందగై నుంచి వెలికితీశారు.

ప్రస్తుతం ఈ పురావస్తు ప్రదేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

కీళడిలో క్రీస్తు పూర్వం 580లో పట్టణ నాగరికత ఉండేదని తమిళనాడు రాష్ట్ర విభాగానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం భారతదేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో 5000 ఏళ్ల క్రితం నాటి సింధు లోయ నాగరికతనే దేశంలోని తొలి ప్రముఖ నాగరికతగా పేర్కొంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కానీ, కీళడి తవ్వకాల్లో బయల్పడిన ఆధారాలు తొలిసారి దక్షిణ భారతదేశంలో కూడా పురాతన నాగరికత ఉండేదని తెలియజేస్తున్నాయని తమిళనాడు పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

కీళడిలో నివసించినవారు అక్షరాస్యులని, వారికి చదవడం, రాయడం వచ్చని ఈ ఆధారాలను బట్టి తెలుస్తోందని తమిళనాడు పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.

వీరు అత్యంత సమర్థమైన నిపుణులని, భారత ఉపఖండం వ్యాప్తంగా, విదేశాలలో వాణిజ్యం జరిపేవారని తెలిపారు.

ఇటుకతో కట్టిన ఇళ్లల్లో వారు నివసించే వారని, చనిపోయిన వారి మృతదేహాలను ఆహార ధాన్యాలు, కుండలతో పాటు కొందగైలోని పెద్ద స్మశాన వాటికల్లో ఖననం చేశారని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు.

పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఈ ప్రాంతం నుంచి ఇలాంటి 50 స్మశాన వాటికలను తవ్వారు.

కీళడిలో నివసించిన వారు ఎవరు, వారి జీవనశైలి ఎలా ఉండేదో మెరుగ్గా అర్థం చేసుకునేందుకు ఈ స్మశాన వాటిల్లో దొరికిన పుర్రెలు, ఇతర వస్తువుల నుంచి డీఎన్‌ఏలను సేకరిస్తున్నామని మదురై కామరాజ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు.

''మన పూర్వీకుల వంశపారపర్యాన్ని, వలస విధానాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాం'' అని యూనివర్సిటీలో జెనెటిక్స్ డిపార్ట్‌మెంట్‌కు హెడ్‌గా ఉన్న ప్రొఫెసర్ జీ కుమారేసన్ చెప్పారు.

''మనం ఎవరం? మనం ఇక్కడకు ఎలా వచ్చి, బతుకుతున్నాం?'' అనే ఒక అతిపెద్ద ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కునే దిశగా సాగే ప్రయాణమే ఇదని తెలిపారు.

కొందగై శ్మశాన వాటికలో గుర్తించిన మానవుని అవశేషాలు, వస్తువులు

ఫొటో సోర్స్, Tamil Nadu State Department of Archaeology

ఫొటో క్యాప్షన్, కొందగై స్మశాన వాటికలో వెలికితీసిన పాత్రలు

2500 ఏళ్ల నాటి పుర్రెలతో ముఖాలను తిరిగి రూపొందించిన ప్రక్రియతో ఈ ప్రశ్నలో కనీసం ఒకదానికైనా సమాధానం దొరికింది.

''ఈ ముఖాలు ప్రధానంగా దక్షిణ భారతీయుల లక్షణాలతో ఉన్నాయి. భారత ఉపఖండంలోని తొలి నివాసితులుగా ఈ ప్రజలను భావించవచ్చు'' అని ప్రొఫెసర్ కుమారేసన్ చెప్పారు.

అయితే, కీళడి ప్రజల పూర్వీకుల గురించి సరిగ్గా తెలుసుకునేందుకు మరింత పరిశోధన అవసరమని కుమారేసన్ తెలిపారు.

మదురై కామరాజ్ యూనివర్సిటీలోని పరిశోధకులు ఈ పుర్రెలకు చెందిన త్రీడీ స్కాన్లను క్రియేట్ చేయడం ద్వారా ముఖాలను తిరిగి రూపొందించే ప్రక్రియను మొదలు పెట్టారు.

ఈ డిజిటల్ స్కాన్లను యూకేలోని లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీలోని ఫేస్ ల్యాబ్‌కు పంపారు.

మనిషి పుర్రెల డిజిటల్ స్కాన్లకు కండరాలను, చర్మాన్ని డిజిటల్‌గా జోడించేందుకు ల్యాబ్‌లోని నిపుణులు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్లను వాడారు.

దీంతో, అచ్చమైన మనిషి ముఖ కవళికలను రూపొందించారు.

ప్రామాణికమైన మానవ శరీర నిర్మాణ నిష్పత్తులు, కొలతలు బట్టి ముఖానికి ఈ జోడింపులు చేశారు.

అయితే, ఈ చిత్రాలకు రంగును జోడించడం అతిపెద్ద సవాలుగా మారింది.

ఆ సమయంలో ఈ పురుషుల శరీర రంగు ఎలా ఉండేది? కళ్ల రంగు ఏమిటి? వారి జుట్టు ఎలా ఉండేది? వంటి ప్రశ్నలు తలెత్తాయి.

ప్రస్తుతం తమిళనాడులో నివసిస్తున్న ప్రజల శారీరక లక్షణాలకు సరిపోయే రంగులను ఉపయోగించే ప్రామాణిక పద్ధతిని అనుసరించామని ప్రొఫెసర్ కుమారేసన్ చెప్పారు.

కానీ, డిజిటల్‌గా గీసే మనిషి చిత్రాలపై ఇప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి.

జాతి, సంస్కృతి, వారసత్వం విషయంలో భారత సమాజంలో ఎంతో కాలంగా విభజనలు ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.

మదురై కామరాజ్ యూనివర్సిటీలోని డీఎన్ఏ ల్యాబ్
ఫొటో క్యాప్షన్, మదురై కామరాజ్ యూనివర్సిటీలోని డీఎన్ఏ ల్యాబ్

అయితే, కీళడి పుర్రెలకు చెందిన ముఖ చిత్రాలు మరింత సంక్లిష్టమైన, సమగ్రమైన సందేశాన్ని అందిస్తున్నాయని ప్రొఫెసర్ కుమారేసన్ చెప్పారు.

''మనం గ్రహించిన దానికంటే ఎక్కువ వైవిధ్యంగా ఉన్నామనే సందేశాన్ని మీరు తెలుసుకోవచ్చు. దీనికి ఆధారం మన డీఎన్ఏనే'' అని చెప్పారు.

భారత్‌లోని పరిశోధకులు పురాతన పుర్రెలతో మనిషి ముఖాలను తిరిగి రూపొందించేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు.

భారత్‌లో అత్యంత ముఖ్యమైన సింధు లోయ నాగరికత ప్రదేశం రాఖీగఢీ స్మశానంలో గుర్తించిన రెండు పుర్రెలకు 2019లో శాస్త్రవేత్తలు ముఖాలను రూపొందించారు. కానీ, ఈ చిత్రాలకు సరైన రంగు, ఇతర ముఖ కవళికలు రాలేదు.

''మనుషులుగా మనకు ముఖాలంటే కాస్త ఇష్టం, ఆకర్షణ ఉంటాయి. ముఖాలను గుర్తించే, అర్థం చేసుకునే సామర్థ్యం ఒక సామాజిక జాతిగా మన విజయంలో భాగం'' అని కీళడి పుర్రెలపై పనిచేసిన ఫేస్ ల్యాబ్ టీమ్ హెడ్ కరోలిన్ విల్కింన్సన్ చెప్పారు.

''ఈ ముఖ చిత్రాలు కళాఖండాలుగా కాకుండా మన పూర్వీకుల గురించి మరింత అర్థం చేసుకునేలా ప్రోత్సహిస్తాయి. విస్తృతమైన జనాభా చరిత్ర కంటే ఒక వ్యక్తి కథనం ద్వారా ఈ అనుబంధాన్ని ఏర్పరచాలి'' అని ఆమె తెలిపారు.

సింధు లోయ నాగరికత మాదిరి కీళడి గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నాలు మదురై కామరాజ్ యూనివర్సిటీలో కొనసాగుతున్నాయి.

'' ఇప్పటి వరకు కీళడిలోని ప్రజలు వ్యవసాయం, వాణిజ్యం, పశువుల పెంపకం చేపట్టేవారని తెలిసింది. వారి వద్ద మేకలు, అడవి పందులు ఉండేవి. ఎక్కువగా బియ్యం, మిల్లెట్లు తినేవారు'' అని ప్రొఫెసర్ కుమారేసన్ చెప్పారు.

ప్రస్తుతం తమిళనాడులో ఖర్జూరం సర్వసాధారణం కానప్పటికీ వారు ఖర్జూరం కూడా తిన్నట్లు ఆధారాలు లభించాయని ఆయన చెప్పారు.

అయితే, సవాలుతో కూడుకున్న విషయం ఏంటంటే.. కొందగైలో దొరికిన మానవుల అస్థిపంజరాల నుంచి జెన్ లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన డీఎన్ఏను వెలికితీయడం.

ఎందుకంటే, ఈ అస్థిపంజరాలు చాలా వరకు కుళ్లిపోయి ఉన్నాయి. వీటి నుంచి తీసే డీఎన్ఏ తక్కువ క్వాలిటీతో ఉంటుంది.

అయితే ఈ ప్రయత్నాల వల్ల కొంత మేలు జరుగుతుందని ప్రొఫెసర్ కుమారేసన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)