మావోయిస్టులను అంతమొందించే "సల్వాజుడుం" ఎందుకు కనుమరుగైంది.. ఇప్పుడు మళ్ళీ చర్చ ఎందుకు...?

సల్వా జుడుం

ఫొటో సోర్స్, c g khabar

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ.. 'సల్వాజుడుం' మరోసారి వార్తల్లోకి వచ్చింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇండియా కూటమి మద్దతుతో ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేస్తున్న జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై 'సల్వాజుడుం తీర్పు' విషయంలో చేసిన విమర్శలే ఇందుకు కారణం.

''వామపక్ష తీవ్రవాదం, నక్సలిజానికి మద్దతుగా సల్వాజుడుంపై తీర్పు ఇచ్చిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. అప్పట్లో సల్వాజుడుం తీర్పు రాకపోయి ఉంటే వామపక్ష తీవ్రవాదం 2020కి ముందే ముగిసిపోయేది'' అని ఇటీవల జరిగిన పీటీఐ కాంక్లేవ్‌లో అమిత్ షా వ్యాఖ్యానించారు.

నందిని సుందర్ వర్సెస్ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కేసులో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సల్వాజుడుం వ్యవస్థను నిలిపివేస్తూ 2011 జులై 5న ఆదేశాలు జారీ చేసింది.

అమిత్ షా వ్యాఖ్యలపై జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి కూడా స్పందించారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడవద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు.

''అది నా తీర్పు కాదు, అది నేను రాసిన తీర్పు. అది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం. దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా చదివాక దానిపై స్పందించవచ్చు. అంతేకానీ, దాన్ని రాసిన వ్యక్తిని ఎంచుకుని వ్యాఖ్యలు చేయడం సరికాదు'' అని 'ది హిందూ' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సల్వా జుడుం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సల్వాజుడుంను ఎప్పుడూ ప్రభుత్వం శాంతి దళంగానే చెప్పేది.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011లో ఛత్తీస్‌గఢ్, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సల్వాజుడుం కార్యకలాపాలను నిలిపివేశాయి.

''సల్వాజుడుం, కోయ కమాండోలు వంటి గుంపులతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేయిస్తున్న ఎలాంటి ఆపరేషన్ అయినా నిలిపివేయాలి. రాజ్యాంగ విరుద్ధంగా లేదా వ్యక్తుల మానవ హక్కులను హరించేలా లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలను నిలిపివేయాలి'' అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్‌లతో కూడిన ధర్మాసనం అప్పట్లో పేర్కొంది.

''ఎస్పీవోలను వాడుకుని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టరాదు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మావోయిస్టులు లేదా నక్సలైట్లను నియంత్రించడం, నిరోధించడం, నిలువరించేందుకు ఎస్పీవోలను వాడరాదు'' అని ఆ ఆదేశాల్లో ఉంది.

నక్సలైట్లకు వ్యతిరేకంగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీవో)లను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని ఆదేశాల్లో స్పష్టం చేసింది సుప్రీం కోర్టు.

సల్వా జుడుం క్యాంప్

ఫొటో సోర్స్, alok putul

ఫొటో క్యాప్షన్, సల్వా జుడుం క్యాంప్

అసలు ఏంటీ సల్వాజుడుం?

సల్వాజుడుం అనే మాట గోండు భాషకు చెందినది. 'శాంతియాత్ర' అని దీనికి అర్థం.

ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలకు చెందిన గిరిజన, ఆదివాసీ యువతతో మావోయిస్టులు లేదా నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రత్యేక దళంగా 2005 జూన్‌లో సల్వాజుడుం ఏర్పాటైంది. 'యాంటీ నక్సలైట్ ఉద్యమం'గా దీన్ని కొందరు పేర్కొనేవారు.

సల్వాజుడుం గురించి మానవ హక్కుల వేదిక వ్యవస్థాపక సభ్యుడు, న్యాయవాది కె.బాలగోపాల్ తన పుస్తకం ''ఆదివాసీ సమాజంలో అంతర్యుద్ధం: ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం సృష్టి, దాని పర్యవసానాలపై నివేదిక''లో ప్రస్తావించారు. 2007 మేలో ఈ పుస్తకం ప్రచురితమైంది.

''జనజాగరణ్ అభియాన్ పేరిట 1989-91, 1998లో జరిగిన ఉద్యమమే 2005లో సల్వాజుడుంగా మారింది. పరిమాణంలో తేడా తప్ప గుణంలో రెండింటి మధ్య తేడా లేదు'' అని రాశారు బాలగోపాల్.

ప్రధానంగా దంతెవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన సల్వాజుడుం.. తర్వాత బస్తర్, బీజాపూర్ ప్రాంతాలకు విస్తరించింది.

అప్పట్లో రాష్ట్రంలో బీజేపీ, కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పటికీ, సల్వాజుడుం విషయంలో రెండూ కలిసి పనిచేశాయి.

2006 ఆగస్టులో హ్యుమన్ రైట్స్ ఫోరం విడుదల చేసిన నివేదికలో సల్వాజుడుం గురించి రాశారు.

''సల్వాజుడుం అనేది ఛత్తీస్‌గఢ్‌ పాలన యంత్రాంగం చేపట్టిన మావోయిస్టు వ్యతిరేక తిరుగుబాటు వ్యూహం'' అని ఫోరం ప్రెసిడెంట్ బి.రాములు, ప్రధాన కార్యదర్శి కె.బాలగోపాల్ సహా మరికొందరు ఆ నివేదికలో పేర్కొన్నారు.

సల్వా జుడుం వ్యవస్థ అగ్ర నేతల్లో ఒకరిగా చైతరామ్ అట్టామీని పరిగణిస్తారు

ఫొటో సోర్స్, alok putul

ఫొటో క్యాప్షన్, సల్వా జుడుం వ్యవస్థ అగ్ర నేతల్లో ఒకరిగా చైతరామ్ అట్టామీని పరిగణిస్తారు (ఫైల్ ఫోటో)

మహేంద్ర కర్మకు సల్వాజుడుంతో సంబంధమేంటంటే..!

తొలుత జనజాగరణ్ అభియాన్‌లో ప్రముఖ పాత్ర పోషించిన కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మనే సల్వాజుడుం ప్రారంభకుడిగా చెబుతారు. ఈయనది దంతెవాడ సమీపంలోని ఫరస్పాల్ గ్రామం.

గుత్తికోయ వర్గానికి చెందిన వ్యక్తి. మొదట్లో సీపీఐ కార్యకర్త అయినప్పటికీ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.

''మావోయిస్టులపై ద్వేషం మహేంద్రకర్మ రాజకీయ ప్రధాన లక్షణం'' అని రాశారు బాలగోపాల్.

2011లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సల్వాజుడుం కార్యకలాపాలు నిలిచినట్లుగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. తర్వాత వివిధ రూపాల్లో కొనసాగిప్పటికీ, 2013 మేలో నక్సల్స్ దాడిలో మహేంద్రకర్మ మరణించడంతో ఈ వ్యవస్థ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయని చెబుతుంటారు.

స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు నెలకు గౌరవ వేతనం లభించేది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు నెలకు గౌరవ వేతనం లభించేది

ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'ప్రైవేటు సైన్యం'

సల్వాజుడుం ప్రారంభించే సమయంలో మహేంద్ర కర్మ, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

ఈ సల్వాజుడుంకు ప్రభుత్వ మద్దతు ఉండటమే కాదు, అధికారిక పాలసీలో భాగమైందని బాలగోపాల్ పేర్కొన్నారు.

ఇందులో పనిచేసే కార్యకర్తలను ఎస్పీవోలుగా పిలిచేవారు. ఇది పూర్తి ప్రైవేటు సైన్యం అనే విమర్శలు ఉన్నప్పటికీ, ఎస్పీవోలను పోలీసు చట్టంలోని సెక్షన్ 17 కింద నియమిస్తున్నట్లుగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ప్రకటించేది. వీరి సంఖ్య వేలల్లో ఉండేది. వీరికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1500 నుంచి రూ.3000 వరకు గౌరవ వేతనంగా ఇచ్చేవారు.

''2006 మేలో దంతెవాడ వెళ్లేనాటికి ఐదు వేల మంది ఎస్పీవోల నియామకం జరిగిందని కలెక్టర్ చెప్పారు'' అని బాలగోపాల్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

సల్వాజుడుం ఏర్పాటు వెనుక ప్రత్యేక కారణం ఒకటి ప్రచారంలో ఉందని బాలగోపాల్ అన్నారు.

''2005 వేసవిలో పనులు లేకపోవడం, సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టుల దాడులు, కరవు పరిస్థితులపై ప్రజలు సమావేశాలు పెట్టుకుని సమస్యలపై మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఆయుధాలు లేకుండా మావోయిస్టులను చర్చలకు పిలిపించి పోలీసులకు అప్పగించారు. అలా మొదలైన ప్రజా ప్రతిఘటన గ్రామగ్రామానికి విస్తరించి సల్వాజుడుం ఆవిర్భవించిందనేది అధికారికంగా ప్రచారంలో ఉన్న కథనం'' అని చెప్పారు.

అయితే, ప్రజలలో వచ్చిన అసంతృప్తిని గమనించిన మహేంద్ర కర్మ, తన మనుషులతో మావోయిస్టు పార్టీ ప్రతినిధులను చర్చలకు పిలిపించి పోలీసులకు అప్పగించేలా చేశారని దంతెవాడకు చెందిన కొందరు తమతో చెప్పారని బాలగోపాల్ తన పుస్తకంలో రాశారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Reuters

సల్వాజుడుంపై తీవ్ర ఆరోపణలు

అయితే, సల్వాజుడుం కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరిగిందని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అభిప్రాయపడ్డాయి.

మావోయిస్టులకు సహకరించినట్లు అనుమానం ఉన్న వేలాది గ్రామాలను ఖాళీ చేయించి, ప్రజలను ప్రభుత్వ శిబిరాల్లోకి తరలించారు.

''సల్వాజుడుం సభ్యులు సభలకు వచ్చి వెళ్తూ గ్రామాల్లో ఇళ్లను తగలబెట్టేవారని చెబుతారు. దీంతో వేలాది మంది ఛత్తీస్‌గఢ్‌ వదిలి సరిహద్దులో ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు వలస వచ్చారు'' అని బాలగోపాల్ తన పుస్తకంలో రాశారు.

''సల్వాజుడుంను ప్రభుత్వం గాంధేయ ఉద్యమంగా చూపించే ప్రయత్నం చేసింది. కానీ, దళ సభ్యులు ఒక్కో గ్రామానికి వెళ్లి తగలబెట్టడం, అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు చేశారు'' అని 2011లో అల్ జజీరా తన కథనంలో రాసింది.

సల్వాజుడుం అనేది ప్రైవేటు వ్యవస్థ, అధికారికంగా ఎక్కడా దానికి స్థానం లేదని ఆంధ్ర ప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

''అదొక ప్రైవేటు సైన్యం. దానికి నియంత్రణ అంటే.. ఎలాంటి పరిమితులు ఉంటాయి? పోలీసులు, రక్షణ వ్యవస్థలు అంటే వాటికి పరిమితులు, అధికారులు ఉంటారు. సల్వాజుడుం అనేది ప్రైవేటు ఆర్మీ. సల్వాజుడుం కూడా ఓ ఇన్ఫార్మర్ల వ్యవస్థ లాంటిదని ప్రభుత్వం భావించింది. కానీ క్షేత్రస్థాయిలో జరిగే హింసాకాండను గ్రహించలేకపోయింది'' అని చెప్పారు ఆ అధికారి.

నాటి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ వాదన ఏంటంటే..

సల్వాజుడుంను ఎప్పుడూ ప్రభుత్వం శాంతి దళంగానే చెప్పేది. అందుకే ఈ ఆరోపణలను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఖండించింది.

''సల్వాజుడుం అనేది ప్రజల మద్దతుతో నడుస్తున్న ఉద్యమం. దాని వెనుక వేరే ఉద్దేశాలు లేవు. మానవ హక్కుల ఉల్లంఘన గాని, సాధారణ పౌరులపై హత్యలు, అత్యాచారాలు గాని జరగలేదు'' అని వెల్లడించింది.

'హ్యూమన్ రైట్స్ వాచ్' ప్రకారం, సల్వాజుడుం కారణంగా 644 గ్రామాలను ఖాళీ చేయించగా దాదాపు 60వేల నుంచి 2 లక్షల మంది తమ ఇళ్లను,ఊళ్లను వదిలేసి వేరేచోటకు వెళ్లిపోవాల్సి వచ్చిందని అంచనా.

అలాగే సుప్రీం కోర్టులో వేసిన రిట్ పిటిషన్‌లో సల్వాజుడుం కారణంగా 2002 జూన్ నుంచి 2007 ఆగస్టు మధ్య దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో హత్యలు, ఇళ్ల దహనాలు పెద్దసంఖ్యలో జరిగాయని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ప్రకటించింది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో సల్వాజుడుం తరహా వ్యవస్థ ఏర్పాటు ఆలోచనను వ్యతిరేకించినట్లు పేరు ప్రచురించడానికి ఇష్టపడని మాజీ డీజీపీ ఒకరు బీబీసీతో చెప్పారు.

''సల్వాజుడుం అంటే ఒక రకంగా ఆదివాసీలు వాళ్లకు వాళ్లే పోరాటం చేయడం. అలాంటి వ్యవస్థ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదని ప్రభుత్వానికి స్పష్టం చేశాం'' అని అన్నారు.

సల్వాజుడుం పేరుతో ప్రైవేటు సైన్యం తయారు చేసి, ఆయుధాలు ఇచ్చి నక్సలైట్లను అంతమొందించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాయని జస్టిస్ చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు.

''ప్రభుత్వమే ప్రైవేటు సైన్యం ఎలా తయారు చేస్తుంది? పోలీసులు, పారా మిలటరీ బలగాలు, ఇతరత్రా బలగాలు ఉంటాయి. ప్రైవేటు సైన్యం ఏర్పాటు చట్టవిరుద్ధం అవుతుంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

జస్టిస్ చంద్రకుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, ANI

అమిత్ షా వ్యాఖ్యలపై న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారంటే..

అమిత్ షా వ్యాఖ్యలపై వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు 18 మంది ఓ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు.

''సల్వాజుడుం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమిత్ షా చేసిన ప్రకటన బహిరంగంగా ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉంది. ఇది దురదృష్టకరం. ఈ తీర్పులో ఎక్కడా నక్సలిజం, దాని సిద్ధాంతానికి మద్దతిస్తూ రాయలేదు'' అని ప్రకటించారు.

న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలించాలే తప్ప ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా అనేది ముఖ్యం కాదని జస్టిస్ చంద్రకుమార్ బీబీసీతో చెప్పారు.

''కోర్టులు ఇచ్చే తీర్పులను జడ్జిల వ్యక్తిగత అభిప్రాయాలుగా చూడకూడదు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టసభలు, సభ్యులు వ్యవహరిస్తే, అలాంటి వాటిని కొట్టేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉంది'' అని ఆయన చెప్పారు.

సల్వాజుడుంపై ఇచ్చిన తీర్పులను ఆ విధంగానే చూడాలని జస్టిస్ చంద్రకుమార్ చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)