జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను హౌస్ అరెస్ట్ చేశారనే ప్రచారంపై అమిత్‌ షా ఏమన్నారు?

అమిత్ షా, జగ్‌దీప్ ధన్‌ఖడ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఈ దేశంలో ఎవరూ కూడా జైలులో నుంచి ప్రభుత్వాన్ని నడపలేరని అమిత్ షా అన్నారు

మాజీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదటిసారి స్పందించారు.

అనారోగ్య కారణాలతోనే ధన్‌ఖడ్ రాజీనామా చేశారని అమిత్ షా చెప్పారు. జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను గృహ నిర్బంధంలో (హౌస్ అరెస్ట్)లో ఉంచారనే ప్రచారాన్ని హోంమంత్రి కొట్టిపారేశారు.

అమిత్‌ షా ప్రకటన జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఏమయ్యారనే మిస్టరీని మరింత పెంచిందని కాంగ్రెస్ పేర్కొంది.

ధన్‌ఖడ్ రాజీనామాతో పాటు 130వ రాజ్యాంగ సవరణ, రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలు వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరిని అమిత్ షా, ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జగ్‌దీప్ ధన్‌ఖడ్

ఫొటో సోర్స్, Getty Images

జగ్‌దీప్ ధన్‌ఖడ్ గృహ నిర్బంధంలో ఉన్నారా?

మాజీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందా? అనే ప్రశ్నకు అమిత్ షా సమాధానమిస్తూ.. 'ధన్‌ఖడ్ సాబ్ రాసిన లేఖలో రాజీనామాకు గల కారణాలు స్పష్టంగా ఉన్నాయి. తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజీనామా చేశారు. మంచి పదవీకాలం గడిపానంటూ ప్రభుత్వంలోని మంత్రులకు, ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు'' అని అన్నారు.

అమిత్ షా ప్రకటన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్‌లో ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.

"ఈ రోజు హోం మంత్రి దీని గురించి ఏదో చెప్పారు, కానీ ఇది మిస్టరీని మరింత పెంచింది. రైతులకు మద్దతుదారుగా ఉన్న చురుకైన, నిర్మొహమాటంగా మాట్లాడే జగ్‌దీప్ ధన్‌ఖడ్ నెల రోజులకు పైగా ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారో ఎవరికీ తెలియదు'' అని రాశారు.

జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ గృహనిర్బంధంలో ఉన్నారా? ఆయన తిరుగుబాటు చేయాలనుకున్నారా? అనే ప్రశ్నపై అమిత్ షా మాట్లాడుతూ.. ''అలాంటిదేమీ లేదు. అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం మంచి పనులు చేశారు. అనారోగ్యం కారణంగా ఆయన రాజీనామా చేశారు. ఏదైనా విషయాన్ని ఎక్కువగా సాగదీసి అదేమిటో కనుక్కోవాలని ప్రయత్నించకూడదు'' అని చెప్పారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్

''జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరు''

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.

అవినీతి లేదా తీవ్రమైన నేరాలకు పాల్పడి కనీసం 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నా, అరెస్టు అయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను తొలగించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

ఈ బిల్లు కఠినమైనదని ప్రియాంకా గాంధీ, ఇది రాజ్యాంగ విరుద్ధమని అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు.

''ఒకవేళ ఒక వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తే, తర్వాత ఆ వ్యక్తి నిర్దోషిగా బయటకొస్తే, సదరు వ్యక్తిపై తప్పుడు కేసు దాఖలు చేసిన మంత్రికి ఎన్నేళ్ల జైలు శిక్ష విధించాలి?'' అని ఈ బిల్లును విమర్శిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

దేశంలో ఎన్డీయే ముఖ్యమంత్రులే ఎక్కువగా ఉన్నారని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా అన్నారు.

''ప్రధానమంత్రి కూడా ఎన్డీయేకు చెందినవారే. కాబట్టి ఈ బిల్లు కేవలం విపక్షాలకు సంబంధించినదే అని చెప్పలేం. ఇది మా ముఖ్యమంత్రులపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది. మీ వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదని విపక్షాలు అంటున్నాయి. వీళ్లంతా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒక వ్యక్తిపై ఆరోపణలు వస్తే కోర్టుకు వెళ్లొచ్చు. అప్పుడు ఆ కేసు విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలా? వద్దా? అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇందులో అధికార పక్షం, విపక్షాలు అన్న మాటకు తావు ఎక్కడ ఉంది?'' అని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఈ దేశంలో ఎవరూ కూడా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరని అమిత్ షా అన్నారు.

30 రోజుల్లో బెయిల్ మంజూరు చేయలేని పరిస్థితిని ప్రభుత్వం సృష్టిస్తుందని, అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వస్తుందని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.

కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని అమిత్ షా అన్నారు.

''మన్మోహన్ ప్రభుత్వ హయాంలో, దోషులుగా తేలిన ఎంపీలను కాపాడటానికి కాంగ్రెస్ ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. రాహుల్ గాంధీ బహిరంగంగా దాన్ని చింపివేశారు. ఇప్పుడు అదే రాహుల్, దోషులుగా తేలిన లాలూ యాదవ్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు.

జగ్‌దీప్ ధన్‌ఖడ్

ఫొటో సోర్స్, Getty Images

విపక్షాలు ఏమంటున్నాయి?

ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా వార్తా సంస్థ ఏఎన్‌ఐతో అన్నారు.

దేశంలో ఇప్పటికే పీఎంఎల్‌ఏ చట్టం ఉందని, మళ్లీ కొత్తగా ఇంకో చట్టం అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్ష ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకోవడమే ఈ బిల్లు ఉద్దేశమని సీపీఐ (ఎం) నాయకురాలు సుభాషిణి అలీ వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)