షేర్ మార్కెట్లో పెట్టుబడికి భయపడుతున్నారా, సులభమైన పెట్టుబడికి మరో ఐదు మార్గాలేంటి?

పెట్టుబడి, స్టాక్స్, మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, అజిత్ గధ్వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత ఆరు నెలలుగా స్టాక్ మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత కారణంగా, పెట్టుబడిదారులు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్‌లలో భారీ నష్టాలను చవిచూశారు.

సెప్టెంబర్ 2024 చివరి నాటికి, సెన్సెక్స్ దాదాపు 85,000కి చేరుకుంది. తర్వాత, మళ్లీ హెచ్చుతగ్గులకు గురైంది. కేవలం ఆరు నెలల్లోనే, సెన్సెక్స్ దాదాపు 13 శాతం పడిపోయింది.

చిన్న, మధ్య తరహా కంపెనీలలో పెట్టుబడిదారులు మరింత తీవ్రంగా దెబ్బతిన్నారు. 25 నుంచి 30 శాతం నష్టాలను చూశారు. సిప్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టిన వారు కూడా అనుకున్నంత రాబడిని పొందలేకపోయారు.

ముఖ్యంగా డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి అధికారం చేపట్టి, టారిఫ్ వార్ ప్రకటించిన తర్వాత, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి తగ్గింది. ఇది మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.

ఈ సమయంలో చాలామంది పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండి, ఈక్విటీలు కాకుండా ఇతర ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ల కోసం చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు డబ్బు పెట్టుబడి పెట్టగల ఆప్షన్లపై బీబీసీ ఆర్థిక నిపుణులతో మాట్లాడింది. వారు కొన్ని ఆప్షన్లను సూచించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బిజినెస్, బాండ్స్, పెట్టుబడులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
షేర్ మార్కెట్

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఒకటి నుంచి మూడేళ్ల వరకు స్థిరమైన రాబడిని కోరుకుంటే, కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడిని, స్థిర డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. అయితే, దీని కోసం బాండ్ రేటింగ్‌ను పరిశీలించడం ముఖ్యం.

"దేశంలో నాలుగు రకాల బాండ్లు ఉన్నాయి - కేంద్ర ప్రభుత్వ బాండ్లు, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్లు, కార్పొరేట్ బాండ్లు" అని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మిథున్ జాథల్ అన్నారు.

"బాండ్లతో సంబంధం ఉన్న రెండు రకాల నష్టాలు ఉన్నాయి - డిఫాల్ట్ రిస్క్, వడ్డీ రేటు ప్రమాదం" అని తెలిపారు.

"భారత ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్లు అత్యంత సురక్షితమైనవి. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడం లేదా డిఫాల్ట్ అయ్యే ప్రమాదం వాటిలో దాదాపు సున్నా. అయితే, కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త ముఖ్యం. ఎందుకంటే అధిక వడ్డీని సంపాదించాలనే ఆశతో కొంతమంది తక్కువ నాణ్యతతో, అంటే, తక్కువ రేటింగ్ పొందిన బాండ్లను సైతం కొనుగోలు చేస్తారు. అలాంటి కంపెనీలు డబ్బును తిరిగి చెల్లించలేకపోతే, పెట్టుబడిని పూర్తిగా కోల్పోవల్సి వస్తుంది" అని ఆయన అన్నారు.

"మీరు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే, చాలా నగదు ఉన్న, 'AAA' రేటింగ్ ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెట్టండి" అని మిథున్ సూచించారు.

అలాగే, ఏడాది కంటే తక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే, A1+ అత్యధిక రేటింగ్.

"ఎప్పుడూ AA లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న కంపెనీల బాండ్లను కొనుగోలు చేయండి. తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీలో రిస్క్ ఉంటుంది" అని మిథున్ సూచించారు.

అంతకుముందు, 2018లో ఐఎల్&ఎఫ్ఎస్ తన బాండ్లపై డిఫాల్ట్ చేసింది. ఇది ఆర్థిక మార్కెట్లలో సమస్యను సృష్టించింది. అదేవిధంగా, 2019లో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా తన బాండ్లపై డిఫాల్ట్ చేసింది.

మనీ, పెట్టుబడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

"ప్రభుత్వ బాండ్లలో ప్రత్యక్ష పెట్టుబడి అనేది చిన్న పెట్టుబడిదారులకు కష్టం. ఎందుకంటే కొన్ని బాండ్లకు కనీసం రూ. 10 లక్షల పెట్టుబడి అవసరం. అందువల్ల, చిన్న పెట్టుబడిదారులు డెట్ మ్యూచువల్ ఫండ్ల ద్వారా కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు" అని మిథున్ అన్నారు.

"ఒక కంపెనీ తన బాండ్లపై 9 శాతానికి పైగా వడ్డీని చెల్లిస్తుంటే, అందులో ఉన్న నష్టాలను జాగ్రత్తగా పరిశీలించడం ముఖ్యం" అని ఆయన సూచించారు.

అహ్మదాబాద్‌లోని ఇన్వెస్టర్ పాయింట్ వ్యవస్థాపకుడు, ఆర్థిక సలహాదారు జయదేవ్‌సిన్హ్ చుడాసమా మాట్లాడుతూ "మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదనుకుంటే, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌సీడీలు) మంచి ఆప్సన్. దీంతో పాటు, ఈక్విటీల మాదిరిగానే పన్ను ప్రయోజనాలున్న డెట్ , డెరివేటివ్‌ల మిక్స్‌డ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అటువంటి ఫండ్స్‌లో కంపెనీలు 9 నుంచి 9.60 శాతం మధ్య వడ్డీని అందించగలవు" అన్నారు.

బ్యాంకులు, పెట్టుబడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్యాంకులు ( ప్రతీకాత్మక చిత్రం)
షేర్ మార్కెట్

బ్యాంక్ ఎఫ్‌డీ అనేది బాగా పాపులర్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. చాలామంది సీనియర్ సిటిజన్లు వీటిని విశ్వసిస్తారు. కానీ, వడ్డీ రేట్లు, బ్యాంకు వైఫల్యాల ప్రమాదాలు, ముందస్తు విత్‌డ్రాయల్స్‌కు జరిమానాలు వంటి అంశాలను కూడా పరిగణించాలి.

బ్యాంక్ దివాలా తీసినప్పటికీ, రూ. 5 లక్షల వరకు ఎఫ్‌డీలు బీమా పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ మొత్తం సురక్షితమైనదిగా పరిగణించవచ్చు.

"ప్రభుత్వ బ్యాంకులు లేదా పెద్ద ప్రైవేట్ బ్యాంకుల ఎఫ్‌డీలలో పెట్టుబడి సురక్షితం. అయితే, అధిక వడ్డీ రేట్ల ఆకర్షణతో సహకార బ్యాంకుల ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించడం ముఖ్యం. ఎందుకంటే నష్టపోయే ప్రమాదం ఉంది" అని మిథున్ అన్నారు.

"కోవిడ్ కాలంలో పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంకు దివాలా తీసింది. ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది" అని మిథున్ గుర్తుచేశారు.

"బ్యాంక్ దివాలా తీసినా డిపాజిటర్లకు రూ. 5 లక్షల వరకు లభిస్తుంది. కానీ, దానికోసం బ్యాంకు ఆస్తులను అమ్మి చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి" అని ఆయన అన్నారు.

"అంతేకాకుండా, బ్యాంకు ఎఫ్‌డీని దాని మెచ్యురిటీకి ముందే క్లోజ్ చేస్తే జరిమానా ఉంటుంది. కాబట్టి దీనిని కూడా పరిగణించాలి" అని అన్నారు.

బ్యాంకుల కంటే 2 నుంచి 3 శాతం ఎక్కువ వడ్డీని అందించే ప్రైవేట్ కంపెనీలలో కూడా ఎఫ్‌డీలు చేయవచ్చు. కానీ, అలాంటి కంపెనీలలో పెట్టుబడి పెట్టే ముందు, వారి ట్రాక్ రికార్డ్‌ తనిఖీ చేయడం ముఖ్యం.

"ప్రైవేట్ కంపెనీలు చాలా ఎక్కువ వడ్డీ రేట్లు చెల్లిస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక కంపెనీ అధిక వడ్డీ రేట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఎవరూ తక్కువ రేటుకు మూలధనం ఇవ్వడానికి సిద్ధంగా లేరని అర్థం. కాబట్టి, వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది" అని మిథున్ తెలిపారు.

స్థిర, సురక్షితమైన ఆదాయాన్ని కోరుకునే వారు పోస్టాఫీస్ స్కీం లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

బంగారం, పెట్టుబడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
షేర్ మార్కెట్

భారతీయులు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతుంటారు. వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాలలో ఆభరణాల కోసం బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. ప్రజలు పెట్టుబడి కోసం డిజిటల్ గోల్డ్ లేదా బంగారు నాణేలను కూడా కొనుగోలు చేస్తారు.

గతంలో, ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రారంభించింది. కానీ, భారతదేశంలో పెరుగుతున్న వాణిజ్య లోటు కారణంగా ఈ పథకాన్ని నిలిపివేసింది.

ప్రజలు ఇప్పుడు డిజిటల్ లేదా పేపర్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వాటిలో గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మీరు వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, సిల్వర్ ఈటీఎఫ్‌లు, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

బంగారం లేదా వెండిని డిజిటల్‌గా కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, దానిని నిల్వ చేయడం లేదా దాని స్వచ్ఛత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బంగారు ఆభరణాల ధర వేల రూపాయలు అయితే, డిజిటల్ గోల్డ్ కేవలం రూపాయికే కొనుగోలు చేయవచ్చు.

ఇల్లు, రియల్ ఎస్టేట్, పెట్టుబడులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రియల్ ఎస్టేట్ రంగం ( ప్రతీకాత్మక చిత్రం)
షేర్ మార్కెట్

భారతదేశంలో రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఆకర్షణీయమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ప్రజలు తరచుగా ఇళ్లు, షాపులు, ఫామ్‌హౌస్‌లు, భూమి లాంటి వాటిలో డబ్బును పెట్టుబడిగా పెడతారు. కానీ, తరచుగా ఈ లావాదేవీలు పారదర్శకంగా ఉండవు. దీని కోసం నల్లధనం ఎక్కువగా ఉపయోగిస్తారు.

అంతేకాకుండా, రియల్ ఎస్టేట్ కొనడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. ప్రత్యామ్నాయంగా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ) ఆప్షన్ ఇప్పుడు అందుబాటులో ఉంది.

"చాలామంది పెట్టుబడిదారులు స్థిర ఆదాయాన్ని సంపాదించడానికి ఒక ఆప్షన్‌గా ఆర్ఈఐటీల వైపు మొగ్గు చూపుతున్నారు" అని ఆర్థిక సలహాదారు జయదేవ సిన్హ్ చుడాసమా అన్నారు.

"ఆర్ఈఐటీలు రియల్ ఎస్టేట్‌ ఉన్న లేదా ఆపరేట్ చేసే కంపెనీలు. వారికి ఆఫీసు బిల్డింగులు, గోడౌన్లు, షాపింగ్ మాల్స్, డేటా సెంటర్లు వంటి ఆస్తులున్నాయి. పెట్టుబడిదారులు రూ. 10,000 కంటే తక్కువ ధరతో ప్రారంభించవచ్చు. అద్దెదారులను గుర్తించడం, పేపర్ వర్క్ లాంటివన్నీ ఆర్ఈఐటీనే చూసుకుంటుంది. వారు టాక్సబుల్ ఇన్‌కంలో 90 శాతాన్ని వాటాదారులకు డివిడెండ్‌గా పంపిణీ చేయాల్సి ఉంటుంది" అని తెలిపారు.

అదేవిధంగా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ లేదా ఐఎన్వీఐటీ అనే ఆప్షన్ ఉంది. ఐఎన్వీఐటీ అనేది మ్యూచువల్ ఫండ్ లాంటిది. ఇది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి, హైవేలు, రోడ్లు, పైప్‌లైన్‌లు, గోడౌన్‌లు, విద్యుత్ ప్లాంట్లు వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడిగా పెడుతుంది. లాభాలను డివిడెండ్‌లుగా చెల్లిస్తుంది.

షేర్ మార్కెట్

స్టార్టప్‌లకు తరచుగా డబ్బు అవసరం. పెట్టుబడిదారుల కోసం వెతుకుతుంటాయి. మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, స్టార్టప్ ఈక్విటీలో పెట్టుబడి పెట్టవచ్చు.

దీని కోసం ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, పెట్టుబడి పెట్టే ముందు తగినంత పరిశోధన చేయడం ముఖ్యం.

దీనితో పాటు, భారతదేశంలోని సీనియర్ సిటిజన్లకు పెట్టుబడి పథకాలు, పీర్ టు పీర్ (P2P) రుణాలు, ఆస్తి లీజింగ్ వంటి ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

(గమనిక: ఈ వ్యాసంలో అందించిన సమాచారం ఆర్థిక పరిజ్ఞానం కోసమే. దీనిని ఆర్థిక సలహాగా భావించకూడదు. పాఠకులు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సొంతంగా పరిశోధన చేసి లేదా ఆర్థిక సలహాదారుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నాం. ఈ సమాచారం ఆధారంగా చేసిన పెట్టుబడుల వల్ల కలిగే ఏదైనా ఆర్థిక నష్టానికి BBC తెలుగు బాధ్యత వహించదు.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)