మీ ఫ్యామిలీ బడ్జెట్‌లో రూపాయి ఎటు నుంచి వస్తోంది? ఎటు పోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
- హోదా, బిజినెస్ అనలిస్ట్, బీబీసీ కోసం
మంచి స్మార్ట్ ఫోన్, కాస్ట్‌లీ బైక్, బ్రాండెడ్ దుస్తులు... ఇలా ఫాల్స్ ప్రెస్జీజ్ కోసం ఇబ్బందిపడుతూ కొందరు మిడిల్ క్లాస్ ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోతున్నారా?
మధ్య తరగతి ప్రజలకు నిజంగా ఖర్చులు పెరిగిపోతున్నాయా? లేక అవసరాలే మారిపోయాయా?
రూపాయి రూపాయి పోగేస్తున్నా.. మన పర్సుకు చిల్లు ఎక్కడ పడుతోంది?
బడ్జెట్ ఎక్కడ లీక్ అవుతోందో కొందరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు?
దీని గురించి ఓసారి ఆలోచిద్దాం.

ప్రైస్ క్రైసిస్ వర్సెస్ ప్రయార్టీ క్రైసిస్
- ట్రాఫిక్ జామ్‌లో డ్రైవింగ్ కష్టమని ర్యాపిడో రైడ్ బుక్ చేస్తుంటారు
- ఇంట్లో వంట చేయడానికి ఓపిక లేదని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తుంటారు
- చిప్స్, పాలప్యాకెట్ కోసం అంత దూరం ఏం వెళ్తాంలే అని.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి 5 నిమిషాల్లో తెప్పించేస్తారు
- థియేటర్లకు వెళ్లడం ఎందుకు అని ఇంట్లోనే ఓటీటీలకు సబ్‌స్క్రైబ్ చేస్తారు
- ఫ్రీడం సేల్ వచ్చిందని పాత ఫోన్ మార్చేసి (జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐతో) కొత్త ఫోన్ కొనేస్తుంటారు
ఇవీ ఇప్పుడు కొందరి ఆలోచనలు. కొందరికి ప్రైస్ క్రైసిస్ కన్నా ప్రయార్టీ క్రైసిస్ ఎక్కువగా ఉంది. ఒకప్పుడు లగ్జరీ అనుకున్నవి ఇప్పుడు సాధారణం అయిపోయాయి.
బడ్జెట్ లెక్కలు తారుమారు కావడానికి, ఈఎంఐల ట్రాప్‌లో కూరుకుపోవడానికి కారణం... పెరుగుతున్న సరకుల ధరల కన్నా సింపుల్ లగ్జరీలను రోజువారీ లైఫ్‌లో కొందరు తమ భాగం చేసుకోవడమే.

ఫొటో సోర్స్, Getty Images
రూ. 50 వేల జీతం ఎటు పోతోంది?
దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ ఉదాహరణ చూద్దాం.
సురేష్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి.
ఆయనకు భార్య, ఒక బాబు. నెలకు రూ.50వేల జీతం.
కానీ ఇది ఏ మూలకూ సరిపోవడం లేదనేది ఆయన చెప్పే మాట.
ఇంతకీ ఆయన నెల బడ్జెట్ చూస్తే అర్థమవుతోంది.. తేడా ఎక్కడ ఉందో.
ఈ దిగువ ఉన్న టేబుల్‌లో ఆయన నెలవారీ బడ్జెట్ ఉంది పరిశీలించొచ్చు.

పైన ఉన్న బడ్జెట్ ప్రకారం.. సురేష్‌కు చివరకు నెలాఖరులో చేతిలో మిగిలింది రూ.6 వేలు. పైన వేసిన లెక్కలన్నీ కూడా కొన్ని ఖర్చులు మాత్రమే.
మధ్యలో వచ్చే హాస్పిటల్ ఖర్చులు, పాలు, కూరగాయలు, పిల్లల స్టేషనరీ.. ఇలా అన్నీ కలిపి.. ఖర్చులు కనీసం మరో 30-40 శాతం అధికంగానే ఉంటాయి.
రూపాయి పొదుపు చేయట్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ ధ్యాసే లేదు. రిటైర్మెంట్ ప్లానింగ్, ఎమర్జెన్సీ ఫండ్ లేదు. ఏదో అలా బండి లాగించేస్తున్నారు సురేష్.
కుటుంబంలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే పరిస్థితేంటి?
సొంతంగా ఇల్లు కొనాలంటే డౌన్ పేమెంట్ డబ్బు ఎలా?
రిటైర్మెంట్ వంటి అవసరాలకు ప్లానింగ్ ఎలా?
మీలో ఎంతమంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో ఆలోచించండి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి?
ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫార్మ్ జొమాటో మార్కెట్ విలువ (18 జూలై 2025) రూ.2.34 లక్షల కోట్లుగా ఉంది.
ఈ సంస్థలో 23 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా. 2008లో ప్రారంభమైన ఈ కంపెనీ ద్వారా 7 లక్షల మంది డెలివరీ ఏజెంట్స్ లబ్ది పొందుతున్నారు.
అతి తక్కువ కాలంలో ఈ సంస్థ రూ.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ దాటి దేశంలోనే టాప్ 40 సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
1907లో మొదలైన టాటా స్టీల్‌లో 78వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉక్కులో పేరెన్నిక గల ఈ సంస్థ మార్కెట్ క్యాప్ ఇప్పటికీ రూ.2.03 లక్షల కోట్లు మాత్రమే.
రెండు రంగాలకూ పోలిక లేనప్పటికీ, ఫ్యూచర్‌లో ఎంతో పెరిగే అవకాశం ఉండడం వల్లే ఇంత వేల్యుయేషన్ అతి తక్కువ కాలంలో వచ్చింది.
స్విగ్గీ, బెయిన్ అండ్ కంపెనీ 2024లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం భారత్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ 2030 నాటికి రూ.2.12 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.
2023 నాటికి ఈ విలువ రూ.66 వేల కోట్లుగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా బయటపడాలి?
కోరికలన్నీ చంపేసుకుని పప్పు, చారుతో అన్నం తిని ఏం లాభం? ఇలాంటి లైఫ్ ఏం అవసరం? అని ఠక్కున అనేస్తారు. లైఫ్‌లో చిన్న ఆనందాలు కచ్చితంగా కావాలి. కానీ కొద్దో గొప్పో ప్రణాళిక ఉంటే ప్రధాన సమస్యలను మనకు ఎదురుకావు.
30 రోజుల లీక్ ఆడిట్...
ఒక నెల రోజుల పాటు ప్రతి రూపాయికీ లెక్క రాయండి. ఖర్చు ఎక్కడ పెడుతున్నారో చూడండి. మీకే లీకేజెస్ ఎక్కడుంటాయో ఈజీగా అర్థమైపోతుంది.
ఆటో రెన్యువల్ ఆపండి...
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ ప్లస్, గానా, ఫిట్‌నెస్ యాప్స్ వంటి వాటికి ఆటో రెన్యువల్ ఆపండి. వీటిల్లో నిజంగా మీరు ఏమేం వాడుతున్నారో అర్థమవుతుంది.
మీరు ప్రతి వారమో, నిత్యం వీటిని వాడకపోతే వీటిని కొనసాగించడం అనవసరం.
వారానికి ఐదు రోజులు ఇంటి ఫుడ్...
బయట తినాలంటే మినిమం ఒకొక్కరికీ తక్కువలో తక్కువ రూ.200 ఖర్చవుతుంది. నలుగురు ఉన్న కుటుంబానికి ఒక్కసారికి రూ.800-1000 వరకూ అవుతుంది. ఇలా ప్రతి వీకెండ్ వెళ్తే రూ.4 -5 వేలు అవుతాయి. ఫుడ్ అంటే ఎవరికైనా ఆనందమే. కానీ ఎంత మూల్యానికి? ఓసారి ఆలోచించండి.
ఖర్చుకు ముందే పొదుపు...
ఇది బేసిక్ రూల్. మొదట పొదుపు చేయండి, మిగిలిన దాంట్లోనే ఖర్చు చేయండి. నెలకు కనీసం రూ.2-3వేలు అయినా సరే సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి.
పిల్లలకు నేర్పించండి...
పిల్లలకు చిన్నప్పటి నుంచే పొదుపు సూత్రాలు నేర్పించండి. పెద్ద బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అడిగిన వెంటనే కొనివ్వడం కాదు. అది నిజంగా అవసరమా, దాన్ని కొనేందుకు ఎంత కష్టపడాలి, ఆ డబ్బు ఎలా సంపాదించాలి అనే అంశాలను అర్థమయ్యేలా వివరించండి. ఆనందం డబ్బులు ఖర్చు చేయడంలో లేదని, దాన్ని ఆదా చేయడంలో, అవసరానికి ఉపయోగించడంలో ఉంటుందని వివరించండి.

ఫొటో సోర్స్, Getty Images
బడ్జెట్ వర్సెస్ రియాల్టీ
మీరు డబ్బులు సంపాదించడానికి కష్టపడుతున్నారు. రోజులో అధిక శాతం ఆఫీస్‌లో, ట్రాఫిక్‌లోనే గడిచిపోతోంది. మీ బాసుల ఇగో, పక్క ఉద్యోగులు పెట్టే ఇబ్బందులతో వీకెండ్స్ కూడా పనిచేయాల్సి వస్తోంది. రోజుకు 12-13 గంటలు ఉద్యోగానికే సరిపోతోంది.
అంతగా కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన డబ్బును అత్యవసరం కాని అంశాల కోసం ఖర్చు చేయకండి.
మీ బడ్జెట్, జీతం... మీకు సెక్యూరిటీని, ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వాలి. మీకు, మీ కుటుంబానికి భద్రత కల్పించాలి. స్ట్రెస్‌ను దూరం చేయాలి.
ఎందుకంటే ఈ పరుగు పందెంలో ఏదో రోజు మీ వేగం తగ్గుతుంది. అప్పుడు మీరు సంపాదించిన డబ్బు మీకోసం రెట్టింపు వేగంతో పరుగులు తీయాలి. అలా జరగాలంటే ఇప్పటి నుంచే మీ రూపాయిని మీరు ఇప్పటి నుంచే రెడీ చేయాలి.
(గమనిక - ఇవన్నీ కేవలం అవగాహన కోసం అందించిన వివరాలు మాత్రమే. ఆర్థిక అంశాలపై మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిపుణులను సంప్రదించగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














