భారత్‌పై సుంకాలతో 'అమెరికా తన కాలు తనే నరుక్కున్నట్లు ఉంది' అని యూఎస్ ఆర్థికవేత్తలు ఎందుకంటున్నారు?

అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, అమెరికా, భారత్, సుంకాలు

ఫొటో సోర్స్, Tom Brenner for The Washington Post via Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ (ఫైల్)

భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ఇది భారత్‌లోని వస్త్ర, తోలు, రొయ్యలు, హస్తకళల వంటి అనేక ఇతర పరిశ్రమలపై ప్రభావం చూపడం ప్రారంభించింది.

ఇందులో 25 శాతం సుంకాలను రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ట్రంప్ ప్రభుత్వం జరిమానాగా విధించింది. అయితే, కొన్ని ఉత్పత్తులను ఈ సుంకాల నుంచి మినహాయించారు. కానీ, ఈ 50 శాతం సుంకాల వల్ల అమెరికాకు భారత ఎగుమతుల్లో 60 శాతానికి పైగా ప్రభావితమవుతాయని అంచనా.

కాగా, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చర్యలపై అమెరికా ఆర్థిక వేత్తలు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని అణచివేత చర్యగా అభివర్ణించగా, మరికొందరు ప్రపంచ వాణిజ్యంలో మెరుగైన అవకాశాల కోసం వెతికేలా ఈ సుంకాలు భారత్‌ను ప్రోత్సహిస్తాయని అంటున్నారు.

మరోవైపు, ఈ 'టారిఫ్ వార్' కారణంగా అమెరికా నష్టాలను చవిచూడవచ్చని, జాతీయ ప్రయోజనాలు కూడా ప్రభావితమవుతాయని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, అమెరికా, భారత్, సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

'కఠినమైన, అణచివేత' సుంకాలు

ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలు 'కఠినమైనవి'గా అమెరికన్ పెట్టుబడి సంస్థ జెఫరీస్‌లో వ్యూహకర్త అయిన క్రిస్ వుడ్ అభివర్ణించారు.

సుంకాల కారణంగా భారత్ దాదాపు రూ. 4.8 లక్షల కోట్ల నుంచి రూ. 5.2 లక్షల కోట్ల వరకు నష్టాన్ని చవిచూడవచ్చని ఆయన అంచనా వేశారు. దీంతో, ఇండియాలోని వస్త్ర, షూ, ఆభరణాలు, హస్తకళల పరిశ్రమలు దెబ్బతినొచ్చని క్రిస్ వుడ్ అభిప్రాయపడ్డారు.

భారత్‌లో వస్త్ర, తోలు, హస్తకళల పరిశ్రమలలో ఎక్కువ భాగం చిన్న వ్యాపారాలు. ఈ రంగాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి పొందుతున్నారు.

ఈ సుంకాలు భారత్‌లోని ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలు) ప్రభావితం చేస్తాయని.. అయితే ఐటీ, సేవల రంగాన్ని ప్రభావితం చేయలేవని క్రిస్ వుడ్ అభిప్రాయపడ్డారు.

ఈ సుంకాలు ఆర్థిక కారణాల కంటే, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యక్తిగత కోపం వల్లే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించిన క్రిస్.. ఇది రెండు దేశాలకూ నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.

అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, అమెరికా, భారత్, సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

'అమెరికాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది'

సుంకాల ప్రభావం అమెరికాకు ప్రతికూలంగా ఉండొచ్చని అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ రష్యా ప్రభుత్వ వార్తా ఛానల్ ఆర్టీతో అన్నారు.

భారత్ ఒంటరిగా ఉంటే, బ్రిక్స్ వంటి ఇతర ఆర్థిక సమూహాలతో మెరుగైన వ్యాపార సంబంధాలను ఏర్పరచుకునే దిశగా ముందుకు సాగుతుందని, ఇది అమెరికన్ ప్రభావాన్ని తగ్గించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా కఠిన వైఖరితో భారత్ తన ఉత్పత్తులను ఇతర మార్కెట్లలో విక్రయించాల్సి వస్తుందని రిచర్డ్ వోల్ఫ్ అన్నారు.

"అధిక సుంకాలను విధించి ఇండియాకు యూఎస్ మార్కెట్‌ను మూసివేస్తే, ఆ దేశం తన ఉత్పత్తులను విక్రయించడానికి ఇతర మార్కెట్లను వెతుకుతుంది. బ్రిక్స్ సభ్య దేశాలకు ఎగుమతి చేస్తుంది" అని ఆయన అన్నారు.

వోల్ఫ్ ప్రకారం, ఈ సుంకాలు "బ్రిక్స్‌ను పశ్చిమ దేశాలకు పెద్ద, మరింత వ్యవస్థీకృత, బలమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా" మారుస్తాయి.

"అమెరికా ప్రకారం, భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే, ఆ దేశం ఏం చేయాలో అమెరికా చెప్పడం ఏనుగును ఎలుక కొట్టడం లాంటిది" అని ఆయన అన్నారు.

'అమెరికా తన కాలు తనే నరుక్కున్నట్లు ఉంది'

ప్రస్తుత కాలంలో, ఈ ఆర్థిక ఉద్రిక్తతను చూస్తుంటే ఒక చారిత్రక క్షణానికి సాక్షి అయినట్లు ఉందని రిచర్డ్ వోల్ఫ్ అన్నారు. ఈ సుంకాలతో అమెరికా తన కాలు తనే నరుక్కున్నట్లు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని, అది అమెరికా ఒత్తిడికి తలొగ్గదని, తన ఎగుమతులను మరింత విస్తరిస్తుందని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మొదట భారత దేశంపై 25 శాతం సుంకాలు విధించారు. ఆ సమయంలో, వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

కానీ, ఊహించని విధంగా ట్రంప్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని అదనంగా 25 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా చెప్పారు.

వాస్తవానికి, యుక్రెయిన్ యుద్ధానికి ముందు, భారత్ తన ముడి చమురు అవసరాలలో రష్యా నుంచి కొనుగోలు చేసింది రెండు శాతం కంటే తక్కువే. కానీ, రష్యా భారతదేశానికి డిస్కౌంట్‌తో ముడి చమురును విక్రయిస్తోంది. భారత్ తన జాతీయ ప్రయోజనాలుగా పేర్కొంటూ, అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ ముడి చమురును కొనుగోలు చేస్తోంది.

రష్యా, భారత్

ఫొటో సోర్స్, Press Information Bureau (PIB)/Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 జూలై 9న రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిశారు.

రష్యా చమురుతో భారత్‌కు లాభాలు

భారత్ ప్రస్తుతం తన ముడి చమురులో 35 శాతానికి పైగా రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. కానీ, ఈ ముడి చమురును భారత్ దేశీయ అవసరాలకే కాకుండా ఎగుమతుల కోసం కూడా కొనుగోలు చేస్తోంది.

ఈ ముడి చమురును భారత్ శుద్ధి చేసి యూరప్, ఆఫ్రికా, ఆసియాలోని అనేక దేశాలకు విక్రయిస్తూ, లాభాలు ఆర్జిస్తోంది. దీంతో, భారత్‌కు బలమైన సందేశం ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు భారత ఉత్పత్తులపై అదనంగా 25 శాతం సుంకాలు విధించారు.

అయితే, ఈ సుంకాల ప్రభావం భారత వ్యాపారవేత్తలపై పడుతోంది. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారులు, పరిశ్రమలు, రైతులను రక్షించడానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

అదే సమయంలో యూకే, జపాన్, దక్షిణ కొరియాతో సహా 40కి పైగా దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ ప్రత్యేక చొరవ(స్పెషల్ ప్రోగ్రాం)ను ప్రారంభించింది.

భారత్ చైనాకు దగ్గరవుతుందా?

భారత్‌ను దౌత్యపరంగా, ఆర్థికంగా శిక్షించే అమెరికా విధానం కూడా చైనాకు దగ్గర చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా విదేశాంగ విధాన రూపకర్తలు చాలాకాలంగా నివారించేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఇది.

చైనా నుంచి భారత్‌కు దిగుమతులు పెరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

దీనిపై క్రిస్ వుడ్ ఇలా అన్నారు, "టారిఫ్ వార్ భారత్‌ను చైనాకు దగ్గర చేస్తుంది. ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు ప్రారంభమవుతున్నాయి. చైనా నుంచి భారత్ వార్షిక దిగుమతులు రూ. 10.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రతి ఏటా ఇది 13 శాతం చొప్పున పెరుగుతోంది. చైనా నుంచి చౌకైన సోలార్ ప్యానెల్స్ వంటి వస్తువులు భారత్‌కు అవసరం."

ఒకవేళ భారత్ చైనాకు దగ్గరైతే.. అది అమెరికా జాతీయ ప్రయోజనాలకు అంత అనుకూల పరిస్థితి ఉండకపోవచ్చని క్రిస్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)