చైనాను భారత్ నమ్మొచ్చా? అమెరికాతో ఉద్రిక్తతల మధ్య రెండు దేశాలూ దగ్గరవుతాయా?

ఫొటో సోర్స్, Getty Images
భారత్, చైనాలు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఈ రెండు దేశాలూ ఉన్నాయి.
చాలా సంవత్సరాల తర్వాత ఈ రెండు దేశాల అగ్ర నాయకత్వం ఒక పెద్ద వేదికపై సమావేశమైతే, అది దౌత్య ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవాళ్టి(ఆగస్టు 31) నుంచి చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరు కానున్నారు.
2020లో గాల్వాన్ వివాదం తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. అంతకుముందు, ఆయన 2018లో చైనా వెళ్లారు.
గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జిన్‌పింగ్‌ను మోదీ కలిశారు, కానీ అప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
ప్రస్తుతం అమెరికా విధించిన 50 శాతం సుంకాన్ని భారత్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్ సమావేశానికి ప్రాముఖ్యం పెరిగింది.
అయితే మేలో భారత్, పాకిస్తాన్ సంక్షోభంలో చైనా స్పష్టంగా పాకిస్తాన్ వైపు ఉందనేది గమనించదగ్గ విషయం. ఈ పరిస్థితుల్లో, అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భారతదేశం, చైనా నిజంగా దగ్గర కాగలవా? చైనాను భారత్ విశ్వసించగలదా? ఈ సందర్శనను చైనా ఎలా చూస్తోంది? ఈ పరిస్థితిని చైనా ఏ విధంగానైనా ఉపయోగించుకోగలదా?
బీబీసీ హిందీ 'ది లెన్స్'లో కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముఖేశ్ శర్మ ఈ ప్రశ్నలను చర్చించారు.
ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో చైనా అధ్యయనాల ప్రొఫెసర్ శ్రీపర్ణ పాఠక్, చైనాలో నివసించి అక్కడి సమస్యలను అర్థం చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ సైబల్ దాస్‌గుప్తా, భద్రత విషయాలపై నిపుణులు రిటైర్డ్ కల్నల్ అజయ్ శుక్లా ఈ చర్చలో పాల్గొన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
భారతదేశం, చైనా నిజంగా దగ్గరవుతాయా?
లద్దాఖ్‌లో ఏప్రిల్ 2020కి ముందు ఉన్న స్థితి తిరిగి ఏర్పడనప్పటకీ ప్రధాని మోదీ పర్యటన జరుగుతోంది. భారత్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. గత ఏడాది చైనాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 127.7 బిలియన్ డాలర్లు.
దీనికి తోడు, భారత పరిశ్రమ చైనాపై ఆధారపడటం పెరుగుతోంది. 2024లో చైనా నుంచి భారత్ 48 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్, విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంది.
ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని, అమెరికా కారణంగానే భారత్, చైనా దగ్గరవుతున్నాయని అనుకోవచ్చా..?
"భారతదేశం, చైనా దగ్గర కాలేవు. రెండు కత్తులు ఒకే ఒరలో ఉండలేవని మనకు ఒక సామెత ఉంది, అదేవిధంగా రెండు సింహాలు ఒకే పర్వతంపై ఉండలేవని చైనాలో ఒక సామెత ఉంది" అని ప్రొఫెసర్ శ్రీపర్ణ పాఠక్ అన్నారు.
"ఆర్థిక కోణంలో చైనా చాలా సమర్థమైనది. మరో శక్తివంతమైన దేశం(భారత్) ఏర్పడాలని అది ఎప్పటికీ కోరుకోదు. భారతదేశాన్ని దక్షిణాసియాకే పరిమితం చేయడం దాని ఉద్దేశం, కాబట్టి చైనా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తుంది. భారతదేశం మార్కెట్ చాలా పెద్దది. చైనా ఈ మార్కెట్‌పై దృష్టి పెట్టింది"
భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారత్-చైనా సంబంధాల్లో అనేక ఒడుదొడుకులు ఏర్పడ్డాయి. చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని గుర్తించిన మొదటి దేశాలలో భారత్ ఒకటి. రెండు దేశాల మధ్య స్నేహ స్ఫూర్తి, శాంతియుత సహజీవనం ఉన్నాయి.
1950లో, టిబెట్‌ను చైనా తన ఆధీనంలోకి తీసుకుంది, ఇది భారత్‌లో ఆందోళనలను పెంచింది. 1950లలో, భారతదేశం, చైనా పంచశీల సూత్రాల ఆధారంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. 'హిందీ-చీనీ భాయ్-భాయ్' అనే నినాదం వచ్చింది.
ఆ తర్వాత 1962 యుద్ధం జరిగింది. రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా ఉద్రిక్తంగా మారాయి. 1988లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చైనా పర్యటన సమయంలో ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నం జరిగింది. కానీ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సరిహద్దు ఘర్షణల కారణంగా రెండు దేశాల మధ్య వైరం నెలకొంది.
ప్రపంచంలోని ఏ దేశమూ మరే దేశాన్ని నమ్మకూడదని భద్రతా నిపుణులు, రిటైర్డ్ కల్నల్ అజయ్ శుక్లా అన్నారు.
" భారతదేశ ప్రయోజనాల కోసం చైనా పనిచేస్తుందో లేదో మనం ఆశించకూడదు. భారత్, చైనాలు తమ దేశాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని మాత్రమే ఆలోచించాలి. చైనా తనకు దగ్గరైందని, తన ప్రయోజనాల కోసం పనిచేస్తుందని భారత్ భావిస్తే...అది పెద్ద తప్పవుతుంది" అని రిటైర్డ్ కల్నల్ అజయ్ శుక్లా విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని మోదీ పర్యటనను చైనాలో ఎలా చూస్తున్నారు?
మోదీ పర్యటనకు ముందు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారతదేశానికి వచ్చారు. ఆయన పర్యటన మోదీ చైనా పర్యటనతో ముడిపడి ఉన్నట్టు భావించారు.
ప్రపంచ పరిస్థితిని ఎదుర్కోవడానికి చైనా, భారతదేశం మధ్య సహకారం ముఖ్యమని చైనా మీడియా నొక్కి చెబుతోంది. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి?
"చైనాలో, ఈ పర్యటనను ప్రధానంగా డోనల్డ్ ట్రంప్, పుతిన్ కోణం నుంచి చూస్తున్నారు. చైనా కోణంలో చూస్తే, రెండు అంశాలు ముఖ్యమైనవి. మొదటిది - బలహీనమవుతున్న చైనా ఆర్థిక పరిస్థితి, రెండోది - చైనా లోపల జిన్‌పింగ్ ఇమేజ్. జిన్‌పింగ్‌ను బలహీనపరచాలని ట్రంప్ అనుకుంటున్నట్టుగా సందేశం వెళితే, అది చైనాలో ఆమోదయోగ్యం కాదు. ఇద్దరూ ట్రంప్ సుంకాలను ఎదుర్కొంటున్నందున జిన్‌పింగ్ ఇమేజ్‌ను సరిగ్గా ఉంచడానికి చైనాకు భారతదేశం అవసరం" అని సీనియర్ జర్నలిస్ట్ సైబల్ దాస్‌గుప్తా విశ్లేషించారు.
ట్రంప్ రెండో పదవీకాలానికి ముందు, భారతదేశం, అమెరికా మధ్య సంబంధాలు బాగున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఈ సంబంధాలలో సుంకాల గోడను నిర్మించడంతో, అమెరికన్ విధానం విఫలమైందా? భారత్ నుంచి అమెరికా ఏం సాధించాలనుకుంటోంది?
"అమెరికా ఎప్పుడూ ఎవరికీ మిత్రదేశం కాదు. ట్రంప్ భారత సంతతికి చెందిన ప్రజల ఓట్లను తీసుకుని ఇప్పుడు చైనాను సవాలు చేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు'' అని ప్రొఫెసర్ శ్రీపర్ణ పాఠక్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, చైనా మధ్య వివాదాలు, సవాళ్లు
భారతదేశం, చైనా మధ్య 3,000 కి.మీ.లకు పైగా సరిహద్దు ఉంది. ఇది ఇప్పటికీ స్పష్టంగా లేదు. బ్రహ్మపుత్ర నది గురించి రెండు దేశాల మధ్య జల వివాదం ఉంది.
సరిహద్దు ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌పై భారతదేశం చాలా కాలంగా ఆరోపణలు చేస్తోంది, అయితే పాకిస్తాన్‌కు చైనా సైనిక, ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే ప్రధాన విషయం.
చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) కూడా వివాదాస్పద అంశం.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కూడా ఎస్‌సీఓలో పాల్గొంటారు. కాబట్టి ఈ సమస్యలు భారతదేశానికి ఎంత పెద్ద సవాలుగా ఉంటాయి?
"ఇటీవల, జిన్‌పింగ్‌కు ఇచ్చిన దానికంటే ట్రంప్‌కు పాకిస్తాన్ ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చింది. 2013 నుంచి చైనా దాదాపు 60 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినప్పటికీ, ట్రంప్‌కు జనరల్ మునీర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది చైనాను ఆందోళనకు గురిచేస్తోంది" అని సైబల్ దాస్‌గుప్తా అన్నారు.
"ఇప్పుడు చైనా కూడా పాకిస్తాన్‌ను ఎంతవరకు విశ్వసించవచ్చో ఆలోచిస్తోంది. అన్ని వివాదాల మధ్య, భారతదేశం ఎక్కడ ప్రయోజనం పొందగలదో, ఎక్కడ నష్టపోతుందో చూడటం ముఖ్యం"
సరిహద్దులో ఉద్రిక్తతను తగ్గించడానికి భారత్, చైనా కొన్ని చర్యలు తీసుకోగలవా?
"సరిహద్దుకు సంబంధించి ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. 2020 లేదా 2021లో ఉన్న దానికంటే పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది" అని రిటైర్డ్ కల్నల్ అజయ్ శుక్లా, అన్నారు.
" అమెరికాను పక్కనబెట్టి భారత్ నేరుగా చర్చలు ప్రారంభించాలని చైనా నిపుణులు భావిస్తున్నారు. ఈ షరతుపై సరిహద్దు నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలా వద్దా అనే దానిపై భారతదేశంతో చైనా మాట్లాడుతుంది. అమెరికా ఒత్తిడితో సరిహద్దు నుంచి వెనక్కి తగ్గుతామనే సందేశాన్ని ఇవ్వడానికి చైనా ఇష్టపడదు"
చైనాతో పాటు, రష్యా, అమెరికా కోణంలో కూడా పరిశీలించాల్సిఉంటుంది కాబట్టి విదేశాంగ విధానాన్ని భారత్ ఆలోచనాత్మకంగా రూపొందించాల్సి ఉంటుందని రిటైర్డ్ కల్నల్ అజయ్ శుక్లా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, చైనాకు ఏం కావాలి?
భారత్,అమెరికా, చైనా.. రాబోయే కాలంలో వాటి భవిష్యత్తు ఎలా ఉంటుంది?
"ఇక్కడ మనం మూడు దేశాల గురించి కాకుండా ముగ్గురు నాయకుల గురించి ఆలోచించాలి. ఉదాహరణకు, ప్రధాని మోదీ ఎస్‌సీఓకి వెళ్తున్నారు. ఈ పర్యటన వల్ల భారత్‌కు ఏం జరుగుతుందన్నది ప్రజలు గమనిస్తారు. నేను చైనాలో ఉన్నప్పుడు, చైనా ప్రజలు భారతదేశం నుంచి మందులు దిగుమతి చేసుకోవాలని కోరుకున్నారు. కానీ మొండితనంతో చైనా ప్రభుత్వం దీనికి పెద్ద ఎత్తున అనుమతి ఇవ్వలేదు" అని సైబల్ దాస్‌గుప్తా వివరించారు.
"మొత్తం మీద భారత్‌తో సంబంధాలను పెంచుకోవాలని చైనా అనుకుంటే, సరిహద్దుతోపాటు మరికొన్ని హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. మూడు దేశాలు ఒకదానికొకటి ఎలా మద్దతు ఇవ్వాలనే దానిపై ఉమ్మడి అవగాహన ఏర్పరచుకోవాలి. ఏదీ ఏకపక్షంగా ఉండకూడదు"
చైనా నుంచి భారత్ భారీగా దిగుమతులు చేసుకుంటుంది. భారతీయ పరిశ్రమలు ఇప్పటికీ అనేక రంగాలలో చైనా ముడి పదార్థాలపై ఆధారపడవలసి ఉంది. చైనాలో చౌకైన ఉత్పత్తుల కారణంగా, భారత రిటైల్ మార్కెట్లో వాటికి డిమాండ్ ఉంది.
భారతదేశం చైనాకు భారీ వినియోగదారుల మార్కెట్. భారతీయులు ఐటీ, ఫార్మా రంగాలలో బాగా రాణిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎవరికి ఎవరు ఎక్కువ అవసరం, భారత్‌కా.... చైనాకా?
ఈ సమయంలో చైనాకు భారతదేశం ఎక్కువ అవసరం అని ప్రొఫెసర్ శ్రీపర్ణ పాఠక్ అంటున్నారు.
"చైనా ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం అది యూరప్‌కు లేదా అమెరికాకు ఎగుమతి చేయలేకపోతోంది. చైనాకు ఇప్పుడు ఓ మార్కెట్‌ను గుర్తించడం చాలా ముఖ్యం. దానికి భారత్ మంచి ఎంపిక కావచ్చు. మనదేశంలో వినియోగం చాలాబాగుంది, చైనాలో వినియోగం చాలా తక్కువగా ఉంది" అని భారత్ అవసరం చైనాకు ఎందుకుందో వివరించారు శ్రీపర్ణ పాఠక్.
అంతర్జాతీయ సంబంధాలలో ఇలాంటి ఉద్రిక్తత ఏర్పడినప్పుడల్లా, ఏదో ఒక కొత్త మార్గం ఏర్పడుతుందని ప్రొఫెసర్ శ్రీపర్ణ పాఠక్ అభిప్రాయపడ్డారు. బహుశా భారత్‌కు కూడా ఇది అలాంటి అవకాశమే కావచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














