భారత్ - చైనా: 'ప్రత్యర్థులుగా కాదు, భాగస్వాములుగా ఉందాం', మోదీ - జిన్‌పింగ్ ఇంకా ఏమన్నారంటే..

నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తియాంజిన్‌లో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ సమావేశం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు.

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న చైనాలోని తియాంజిన్‌లో ఇద్దరు నాయకుల మధ్య ఈ సమావేశం జరిగింది.

చైనా, భారత్‌లు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్‌పింగ్ మోదీకి చెప్పగా, ఇరు దేశాల మధ్య ఇప్పుడు "శాంతి, స్థిరత్వ వాతావరణం" ఉందని మోదీ అన్నారు.

షీ జిన్‌పింగ్‌తో జరిగిన చర్చల సందర్భంగా, నరేంద్ర మోదీ మాట్లాడుతూ "గత సంవత్సరం జూన్‌లో మేం చాలా అర్థవంతమైన చర్చలను జరిపాం. మా సంబంధాలు సానుకూల దిశగా సాగాయి. సరిహద్దులో బలగాలు వెనక్కి వెళ్లిన తర్వాత శాంతి, స్థిరత్వ వాతావరణం ఏర్పడింది. సరిహద్దు నిర్వహణకు సంబంధించి మా ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది" అని అన్నారు.

మరోవైపు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ "ప్రపంచం మార్పు దిశగా కదులుతోంది. చైనా, భారత్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రెండు నాగరికతలు. ఈ రెండూ ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు, గ్లోబల్ సౌత్‌లో భాగం. డ్రాగన్, ఏనుగు స్నేహితులుగా ఉండటం, మంచి పొరుగువారిగా ఉండటం చాలా ముఖ్యం" అని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షాంఘై సహకార సంస్థ, చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది.

తూర్పు లద్దాఖ్‌లో ఏప్రిల్ 2020కి ముందు ఉన్న స్థితి తిరిగి ఏర్పడనప్పటికీ, ప్రధాని మోదీ చైనా పర్యటన జరుగుతోంది. 2020 తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల పేర్లను చైనా మాండరిన్‌లో చాలాసార్లు మార్చింది. అంతేకాదు, అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్ అని పిలుస్తోంది చైనా.

టిబెట్, తైవాన్ రెండూ చైనాలో భాగమనే 'వన్ చైనా' విధానాన్ని భారత్ విశ్వసిస్తుందా? లేదా అనేది వేరే విషయం.

చైనాలో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలనే ప్రధాన మంత్రి మోదీ నిర్ణయం ఊహించనిది. 2023లో ఎస్‌సీఓ అధ్యక్ష పదవిని భారత్ నిర్వహించింది. అయితే, ఇది వర్చువల్‌గా జరిగింది. చైనా ఆధిపత్య కూటమి పట్ల భారత్ పెద్దగా ఉత్సాహంగా లేకపోవడమే దీనికి కారణం.

అంతకుముందు, 2022లో జీ-20 శిఖరాగ్ర సమావేశం దిల్లీలో జరిగింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దానికి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మోదీ చైనా పర్యటన అమెరికాతో క్షీణిస్తున్న భారత సంబంధాలతో ముడిపడి ఉంది.

అంతకుముందు, 2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో మోదీ, జిన్‌పింగ్ సమావేశమయ్యారు. కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఈ భేటీ జరిగింది. బ్రిక్స్, ఎస్‌సీవో రెండూ అమెరికన్ ప్రయోజనాలకు వ్యతిరేక గ్రూపులుగా పరిగణిస్తున్నారు.

కజాన్‌లో మోదీ, జిన్‌పింగ్ కలిసిన సమయంలో రెండు దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తతను తగ్గించడం ఒక ఛాలెంజ్‌గా ఉంది. ఇక, తాజాగా తియాంజిన్‌లో జిన్‌పింగ్‌ను మోదీ కలిసిన సమయంలో భారత్-చైనా సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, అమెరికన్ సుంకాలను ఎదుర్కోవడం కూడా సవాలే.

ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌ను కూడా నరేంద్ర మోదీ కలుస్తారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరువురి కలయిక మొదటిసారి.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరస్పర విశ్వాసం, గౌరవంతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాని మోదీ ఏం చెప్పారు?

గత సంవత్సరం కజాన్‌లో జరిగిన సమావేశంతో పాటు, రెండు దేశాల మధ్య ఇటీవల కుదిరిన వివిధ ఒప్పందాలపై తియాంజిన్‌లో జిన్‌పింగ్‌తో నరేంద్ర మోదీ చర్చించారు.

ఇటీవలి కాలంలో ఇరు దేశాల పురోగతిని ప్రధాన మంత్రి మోదీ ప్రస్తావిస్తూ "కైలాష్ మానసరోవర్ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు కూడా తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య సహకారంతో 280 కోట్ల మంది ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి" అని అన్నారు.

"ఇది మొత్తం మానవాళి సంక్షేమానికి మార్గం సుగమం చేస్తుంది. పరస్పర విశ్వాసం, గౌరవంతో మా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాం. ఎస్‌సీవోకి అధ్యక్షత వహించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను" అని అన్నారు మోదీ.

చైనా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏడు సంవత్సరాల తర్వాత చైనాను సందర్శించారు. రెండు దేశాల మధ్య సంబంధాలలో చాలాకాలంగా ఉద్రిక్తత ఉన్నందున ఈ పర్యటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు.

2018 తర్వాత ఇద్దరు నాయకులు చైనాలో ముఖాముఖి కలవడం ఇదే మొదటిసారి. చైనాతో సంబంధాలను మెరుగుపరచడం ద్వారా అమెరికా ఒత్తిడికి వ్యతిరేకంగా భారత్ బ్యాలెన్స్ సాధించగలదని నిపుణులు భావిస్తున్నారు. చైనా ఇప్పటికే భారత్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వామి అయితే, బ్యాలెన్స్ చైనాకు అనుకూలంగా పెరుగుతోంది.

ఒబామా ప్రభుత్వంలో రష్యాకు అమెరికా రాయబారిగా పనిచేసిన మైఖేల్ మెక్‌ఫాల్ ఎక్స్‌లో ఈ భేటీపై స్పందించారు.

"నిరంకుశ పాలకులైన జిన్‌పింగ్, పుతిన్‌లతో ఒక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేంతగా మోదీని ట్రంప్ ఎలా దూరం చేసుకున్నారు? గత సంవత్సరం, చైనా, భారత్ ఒకదానితో ఒకటి యుద్ధంలో ఉన్నాయి. ట్రంప్, ఆయన బృందం దౌత్యంలో పూర్తిగా విఫలమయ్యాయి" అని రాశారు.

భారత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. గత సంవత్సరం చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రూ. 11.2 లక్షల కోట్లు. అంతేకాకుండా, చైనాపై భారత్ ఆధారపడటం పెరుగుతోంది. 2024లో చైనా నుంచి భారత్ రూ.4.23 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్, విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంది.

నిపుణులు ఏమంటున్నారు?

నరేంద్ర మోదీ చాలా బలహీన స్థితిలో ఉన్న సమయంలో జిన్‌పింగ్ కలుస్తున్నారని రక్షణ నిపుణులు సుశాంత్ సింగ్ అంటున్నారు.

"మోదీ చాలా బలహీన స్థితిలో చైనాకు వెళ్తున్నారు. ఎందుకంటే, ట్రంప్ ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనకు ఒత్తిడి కలిగించే శక్తి కూడా లేదు. భారత్‌తో చైనా స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుంది. కానీ, పూర్తిగా దాని సొంత నిబంధనల ప్రకారమే అది ఉంటుంది. చైనా భారతదేశానికి ఎల్ఏసీ, వాణిజ్యం, టిబెట్, రేర్ ఎర్త్ మెటీరియల్స్‌పై ఎటువంటి హామీ ఇవ్వలేదు" అని సుశాంత్ సింగ్ ఎక్స్‌లో తెలిపారు.

"పాకిస్తాన్‌కు సంబంధించి సైనిక సహకారం లేదా మరే ప్రాంత విషయంలోనైనా వాగ్దానం చేయడానికి చైనా సిద్ధంగా లేదు. అంతిమంగా, చైనా అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఉండకూడదు. ఈ మూడు పార్టీలకు ఇది తెలుసు"అని ఆయన తెలిపారు.

అమెరికాతో పాటు, రష్యా, చైనాల మధ్య స్నేహం కూడా 'భారతదేశానికి పెద్ద సవాల్' అని థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో సీనియర్ ఫెలో అయిన తన్వి మదన్ అభిప్రాయపడ్డారు.

"భారత్ ఎదుర్కొంటున్న సవాల్ ఏంటంటే, ప్రస్తుతం ఇండియా కంటే రష్యా, చైనాలకు ఒకదానితో మరోదానికి దగ్గరి సంబంధాలున్నాయి. వాటిలో ఒకటి భారత ప్రత్యర్థి (చైనా), మరోటి (రష్యా) ఆ ప్రత్యర్థిపై ఎక్కువగా ఆధారపడేది. భారత్, రష్యా మధ్య పాత సన్నిహిత సంబంధాలకు ప్రధాన కారణం చైనాతో వారి వివాదమేనని ప్రజలు మర్చిపోతున్నారు" అని ఆమె ఎక్స్‌ పోస్టులో తెలిపారు.

'చైనాతో జాగ్రత్త'

గత అనుభవాల ఆధారంగా, భారత బలహీనతను ఉపయోగించుకోవడానికి చైనా ప్రయత్నించవచ్చని వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ అంటున్నారు.

"చైనా విశ్వసనీయ భాగస్వామిగా మారడం కంటే భారత బలహీనతలను ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుందని గత అనుభవం చెబుతుంది. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు, సంబంధాలు మెరుగుపడతాయని మొదట్లో ఆయనకు నమ్మకం ఉంది. ఈ విశ్వాసం తప్పు కాదు కానీ, మోదీ స్నేహపూర్వక విధానాన్ని ఉపయోగించుకొని నిశ్శబ్ద ప్రాదేశిక లాభాలకు చైనా ప్రయత్నించింది" అని తెలిపారు.

"ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉంటాయని నమ్మడానికి చైనా ఎటువంటి హామీ ఇవ్వలేదు. మే నెలలో పాకిస్తాన్ ఉగ్రవాద లక్ష్యాలపై భారత్ దాడి చేసినప్పుడు, పాకిస్తాన్‌కు రియల్-టైమ్ రాడార్, ఉపగ్రహ డేటాతో సహా చైనా సాయపడింది. అంతేకాకుండా, భారత సరిహద్దుకు సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను నిర్మించే ప్రణాళికలను చైనా ఇటీవల ధ్రువీకరించింది. ఇది భారతదేశానికి తీవ్రమైన పర్యావరణ, జాతీయ భద్రతా చిక్కులను కలిగించవచ్చు" అని బ్రహ్మ చెల్లానీ అభిప్రాయపడ్డారు.

కాగా, డోనల్డ్ ట్రంప్ ఒత్తిడికి నరేంద్ర మోదీ తలొగ్గరని 'ది హిందూ' ఆంగ్ల వార్తాపత్రిక అంతర్జాతీయ సంపాదకుడు స్టాన్లీ జానీ అభిప్రాయపడ్డారు.

"ట్రంప్ ఒత్తిడి వ్యూహాలకు మోదీ తలొగ్గడం లేదు. అలాగే, భారత్ ఎక్కడి నుంచి చమురు కొనుగోలు చేయాలనే నిర్ణయం అమెరికాలో కాకుండా భారత్‌లోనే జరుగుతుంది. దీనర్థం భారత్-అమెరికా సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయని కాదు" అని తెలిపారు.

"సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకునే అవకాశం ఉంది కానీ, అది ట్రంప్ నిబంధనలపై మాత్రమే కాదు. చైనాతో అధికార సమతుల్యత లేదని ఇండియాకు బాగా తెలుసు. అవును, భారత్ తన వ్యూహాత్మక అంతరాలను పూరించడానికి అమెరికా అవసరం. కానీ, అమెరికా శత్రువులా ప్రవర్తిస్తూ ఉంటే, భారత్‌కు ఇతర ఆప్షన్లు ఉన్నాయి" అని అన్నారు స్టాన్లీ జానీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)