Caste: 'కులం మానసిక ఆరోగ్యంపై ప్రమాదకర ప్రభావం చూపుతోంది'

కులవివక్ష, తమిళనాడు, దళితులు, సమాజంలో అసమానతలు

ఫొటో సోర్స్, BBC/Getty

    • రచయిత, కె.శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నేను అప్పుడు 6వ తరగతి. నన్ను స్కూల్ నుంచి మాకు దగ్గర్లోనే ఉండే టౌన్‌‌లో జరుగుతున్న పెయింటింగ్ కాంపిటీషన్‌కి తీసుకెళ్లారు. అందులో నేను గెలిచాను"

"కానీ, కొంతమంది ఉపాధ్యాయులు 'ఎవర్రా.. ఆ కాలనీకి చెందిన అమ్మాయిని ఎంపిక చేసింది అంటూ జడ్జిలను నిందించారు', దీంతో వారు నన్ను పక్కనబెట్టి వాళ్ల పట్టణానికే చెందిన మరో విద్యార్థికి బహుమతి ఇచ్చారు."

తిరునెల్వేలికి చెందిన గ్రాడ్యుయేట్ దర్శిని (పేరు మార్చాం) ఈ విషయం బీబీసీతో చెప్పారు. తనకు ఎదురైన ఆ ఘటన తర్వాత డ్రాయింగ్ వేయడం, పోటీలలో పాల్గొనడం పూర్తిగా మానేశానని ఆమె చెప్పారు.

"కుల మనస్తత్వం ఒక సామాజిక మానసిక వ్యాధి. ఇది చాలా మంది ప్రతిభను దెబ్బతీసింది. ఆ మనస్తత్వం ఉన్నవారికి మానసిక చికిత్స చాలా అవసరం."

భారతీయ సమాజంలో కుల నిర్మాణం, విద్య, ఆర్థిక వ్యవస్థ, జీవన నాణ్యత గురించి అనేక కోణాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

మానసికంగా, "కులం ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతోంది. కానీ, దాని గురించి చాలా అరుదుగా మాట్లాడతారు" అని అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది, సామాజిక కార్యకర్త సూరజ్ యెంగ్టే అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కుల హింస: భారతదేశంలో కొనసాగుతున్న కథ

తమిళనాడులోని రెండు వేర్వేరు ప్రాంతాలు తిరునల్వేలి, కడలూరులలో ఇటీవల కులం పేరుతో ఇద్దరు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులను హత్య చేసిన కేసులు సంచలనం సృష్టించాయి.

దేశంలో పరువు హత్యలే కాకుండా కుల ఆధారిత హింసాత్మక దాడులు కూడా పునరావృత్తం అవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడిస్తోంది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం, 2020 నుంచి 2022 వరకు మూడు సంవత్సరాలలో, భారత్‌లో 1,366 కుల ఘర్షణలు జరిగాయి. ముఖ్యంగా 2022లో ఒక్క తమిళనాడులోనే 75 కుల ఘర్షణల కేసులు నమోదయ్యాయి. వీరిలో 110 మంది బాధితులుగా ఉన్నారు.

ఆ మూడేళ్లలో భారత్ అంతటా షెడ్యూల్డ్ కులాలపై జరిగిన నేరాలకు సంబంధించి మొత్తం 1,58,773 నమోదయ్యాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 41,228 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 4,412 కేసులు నమోదయ్యాయి.

పరువు హత్యలు, కుల ఆధారిత హింస, దైనందిన జీవితంలో నిశ్శబ్దంగా పాటించే వివక్ష వరకూ.. ప్రతీదీ దళిత ప్రజలను మానసికంగా తీవ్ర ప్రభావితం చేస్తోంది.

కులవివక్ష, తమిళనాడు, దళితులు, సమాజంలో అసమానతలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుల వివక్ష మానసికంగా ప్రభావం చూపుతోందని బాధితులు చెబుతున్నారు.

' మానసికంగా కుంగిపోయాం, కానీ ఏం చేయగలం?'

కుల ఆధారిత హింస, వివక్ష మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావాల గురించి తమిళనాడులోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది మధ్య వయస్కులైన మహిళలతో బీబీసీ మాట్లాడింది.

చాలా సంవత్సరాలుగా తీవ్ర నిరాశతో బాధపడుతున్నట్టు దాదాపు అందరూ అంగీకరించారు. అదే సమయంలో, కుల వివక్ష మానసిక ప్రభావాలను తమ 'తలరాత'గా భావిస్తున్నామని, ఎందుకంటే తాము దానిని రోజువారీ జీవితంలో తరతరాలుగా చూశామని చాలామంది చెప్పారు.

దాని ప్రభావాలను అనుభవిస్తున్నప్పటికీ, కొంతమందికి ఎక్కడ, ఎలా చికిత్స పొందాలో తెలియదు. వారిలో ఒకరు తేన్ముడియానూర్ గ్రామానికి చెందిన చంద్ర (పేరు మార్చాం).

తిరువణ్ణామలై జిల్లాలోని తేన్ముడియానూర్ గ్రామంలో ఉన్న 80 ఏళ్లనాటి మరియమ్మన్ ఆలయంలోకి అధికారుల జోక్యంతో 2023 జనవరిలో దళితులు ప్రవేశించారు.

ఇది నచ్చని ఇతర కులాల వారు మరో గుడి కట్టుకున్నారు. ఇది తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని దళిత వర్గానికి చెందిన చంద్ర బీబీసీతో చెప్పారు. గ్రామంలో కులం విషయంలో అంత దురభిమాన వైఖరి ఉందని అన్నారు.

దేవాలయాల్లోకి వెళ్లేటప్పుడు మాత్రమే కాకుండా, దైనందిన జీవితంలోనూ అనేక రకాల వివక్ష, హింసను ఎదుర్కొన్నానని చంద్ర చెప్పారు. పిల్లలను కూడా వారి కుల నేపథ్యం ఆధారంగా గుర్తిస్తారని, చాలా ఏళ్లుగా తాను రోజూ తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

"నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నా. కానీ, నేనేం చేయగలను? దీనికి ఏదైనా చికిత్స ఉందా? అది ఎక్కడ పొందగలను?" అనేది చంద్ర ప్రశ్న. ఇది చంద్ర పరిస్థితి మాత్రమే కాదు, దేశమంతటా గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది మహిళల పరిస్థితి అని దళితుల కోసం బ్లూ డాన్ అనే మానసిక కౌన్సెలింగ్ సంస్థ నిర్వహిస్తున్న దివ్య కందుకూర్ అంటున్నారు.

ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో.. "మహిళలు నీళ్ల కోసం కుళాయిల దగ్గరకు వచ్చినప్పుడు పుకార్లు చెప్పుకుంటుంటారని అంటారు. కానీ, అక్కడే వారు తమ బాధలను బయటపెట్టుకోగలుగుతారు, అది వారి భర్తల చేతుల్లో గృహ హింస అయినా లేదా వారి పిల్లలు పాఠశాలలో ఎదుర్కొంటున్న వివక్ష అయినా."

అంతే కాకుండా, అధికారికంగా కౌన్సెలింగ్ లేదా చికిత్స ఇంకా గ్రామీణ మహిళలకు, ముఖ్యంగా దళితులకు చేరలేదని దివ్య అంటున్నారు.

కులవివక్ష, తమిళనాడు, దళితులు, సమాజంలో అసమానతలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కులవివక్ష దళితవర్గాల పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతోందని సామాజిక నిపుణులు అంటున్నారు.

తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న దళితులు

ప్రజల మానసిక ఆరోగ్యంపై సామాజిక వివక్ష ప్రభావాలు లెక్కలేనన్ని రూపాలు తీసుకుంటాయని అమెరికాలోని హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో గ్లోబల్ హెల్త్ అండ్ పాపులేషన్ ప్రొఫెసర్ డాక్టర్ విక్రమ్ పటేల్ చెప్పారు.

భారతీయ సమాజంలో ఉన్న అసమానతల కారణంగా దళిత సమాజాలు ఇలాంటి ప్రభావాల వల్ల ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన అన్నారు.

పిల్లలు పెరిగే సామాజిక వాతావరణం వారి అభివృద్ధి, దీర్ఘకాలిక ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతుందని ప్రొఫెసర్ విక్రమ్ పటేల్ అంటున్నారు. భారతదేశంలో పేదరికంలో నివసిస్తున్న 100 మందిలో 3.9 మంది నిరాశతో బాధపడుతున్నారని కూడా ఆయన అధ్యయనంలో తేలింది.

2019-21 సంవత్సరానికి 5వ జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే ప్రకారం, భారత్‌లో "71 శాతం షెడ్యూల్డ్ తెగలు, 49 శాతం షెడ్యూల్డ్ కుల కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన, పేదరికం, తీవ్ర పేదరికంలో ఉన్నాయి."

దీని ప్రకారం, నిరాశతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారేనని అర్థం చేసుకోవచ్చు. అయితే, కులం ఆధారంగా ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ప్రభావాలపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

కులవివక్ష, తమిళనాడు, దళితులు, సమాజంలో అసమానతలు

ఫొటో సోర్స్, Handout

ఫొటో క్యాప్షన్, విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు కులం ఒక ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి.

విద్యార్థులపై ప్రభావం

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేస్తున్న వామపక్ష విద్యార్థి నాయకుడు, కేరళకు చెందిన కె.ఎస్. రాందాస్‌ను దుష్ప్రవర్తన కారణంగా ఏప్రిల్ 2024లో రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు. మేలో, సుప్రీంకోర్టు ఆయన సస్పెన్షన్‌ను తగ్గించి, చదువును తిరిగి ప్రారంభించడానికి అనుమతించింది.

విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి కుల ఆధారిత వైఖరులు, వివక్ష విస్తృతంగా ఉన్నాయని, ఫలితంగా విద్యార్థులు నిరాశకు గురవుతున్నారని ఆయన బీబీసీతో చెప్పారు.

విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు కులం ఒక ప్రధాన కారణమని ఆయన అన్నారు.

"ప్రభుత్వాన్ని విమర్శించినందుకు, నిరసనల్లో పాల్గొన్నందుకు నాపై ఈ చర్య తీసుకున్నారు" అని రాందాస్ అన్నారు.

"ఆ సమయంలో, రిజర్వేషన్లను ఇప్పటికే విమర్శిస్తున్న హిందూ కులాల విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో 'నేను ఇంకా ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు?' వంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు షేర్ అవడాన్ని నేను చూశాను" అని రాందాస్ చెప్పారు.

ఈ అనుభవాలు తీవ్ర నిరాశకు గురిచేశాయని, తాను, తన కుటుంబం ఇప్పటికీ దాని కోసం మానసిక చికిత్స పొందుతున్నామని ఆయన అన్నారు.

"విద్యా సంస్థలలో నిశ్శబ్దంగా ఇలాంటి వివక్షను అనుభవిస్తున్న విద్యార్థుల పరిస్థితిని ఊహించుకోండి" అని రాందాస్ అన్నారు.

దీని గురించి రాందాస్ మాత్రమే కాదు, చెన్నైలోని కిల్పాక్ ప్రభుత్వ సైకియాట్రికాలేజ్ ప్రొఫెసర్ కూడా మాట్లాడారు. ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

"ఇప్పుడు, కళాశాలల్లో రిజర్వేషన్ శాతాన్ని బెంచ్‌మార్క్‌గా ఉపయోగించి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను గుర్తించే ప్రమాదకరధోరణి కొనసాగుతోంది" అని ఆయన అన్నారు.

" ఇలాంటి వైఖరులు, వివక్ష విద్యా సంస్థలలో రిజర్వేషన్లపై ఆధారపడిన విద్యార్థుల గుర్తింపును దోచుకుంటాయి" అని సూరజ్ యెంగ్టే అన్నారు.

అంతేకాకుండా, కుల సమస్యల ప్రభావాలు చికిత్సతో ముగియవని ఆయన అంటున్నారు.

''ఇప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలను కులంతో గుర్తించడం కొనసాగుతోంది. అందువల్ల, అన్ని రూపాల్లో వివక్ష అనేది రోజువారీ సంఘటన."

"దీని బారిన పడిన వ్యక్తి మానసిక చికిత్స పొందినప్పటికీ, అతను లేదా ఆమె తిరిగి అదే సమాజంలోకి వెళ్తారు. అప్పుడు వారు మళ్లీ అదే వివక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఒక చైన్ రియాక్షన్" అని ఆయన చెప్పారు.

దీనిని తొలగించాలంటే, కుల మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ముందుగా మానసిక చికిత్స అందించాలి.

మానసిక చికిత్సలో కులాన్ని ఎందుకు విస్మరిస్తారు?

డాక్టర్ విక్రమ్ పటేల్ చెప్పినట్టుగా, సమాజంలో కులం ఆధారంగా జరిగే అనేక రకాల వివక్ష, హింస వల్ల నిరాశ, ఆందోళన, ఒత్తిడి సహా చాలా రకాల హాని కలుగుతుంది.

యువతరం, ముఖ్యంగా పిల్లల ఆత్మవిశ్వాసానికి ఇది హాని కలిగిస్తుందని, ఇది చాలామంది తమపై తాము నమ్మకం కోల్పోయేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కులం ప్రజలపై తీవ్రమైన ప్రభావాలను చూపుతున్నప్పటికీ, మానసిక ఆరోగ్య నిపుణులందరికీ కుల నిర్మాణం, ఈ సమస్యల గురించి అవగాహన లేదని దివ్య కందుకూర్ అంటున్నారు.

కుల సమస్యలపై అవగాహన ఉన్న మానసిక ఆరోగ్య నిపుణుల కొరత పెరుగుతోందని మానసిక వైద్యురాలు రాధిక మురుగేశన్ అన్నారు.

ఆమె పెరియార్ మానసిక చికిత్సపై ఒక పుస్తకం రాశారు "మనం మనస్తత్వ శాస్త్రవేత్తలతో కులం గురించి మాట్లాడితే, వాళ్లు దాన్ని పట్టించుకోరు.''

"మనస్తత్వశాస్త్ర పాఠ్యాంశాలు పాశ్చాత్య నేపథ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటిని మరింత వ్యక్తిగత, సమగ్రమైన విధానాన్ని అందించడానికి అనుగుణంగా మార్చుకోవాలి" అని డాక్టర్ రాధిక అంటున్నారు.

ఎందుకంటే, "మానసిక ఆరోగ్య సంరక్షణలో కులతత్వాన్ని విస్మరించడం అంటే, దళితులు తరతరాలుగా మోస్తున్న మానసిక గాయాలను పూర్తిగా విస్మరించడమే" అని ఆమె అభిప్రాయపడ్డారు.

కులవివక్ష, తమిళనాడు, దళితులు, సమాజంలో అసమానతలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కులవివక్ష పాటించేవారికి మానసిక చికిత్స అవసరమని నిపుణులు అంటున్నారు.

కుల ఆధారిత మానసిక చికిత్స అవసరం

"పాశ్చాత్య విద్యా వ్యవస్థ తరహాలో ఉన్న మనస్తత్వశాస్త్ర పాఠ్యాంశాల్లో కుల ఆధారిత చికిత్సా విధానాన్ని విస్మరించారు" అని తమిళనాడులో పనిచేస్తున్న మిలిర్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రీతి షణ్ముగప్రియ అన్నారు.

కుల ఆధారిత వివక్ష, హింస వల్ల ఏర్పడే సామాజిక-మానసిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న ప్రజలకు మానసిక ఆరోగ్య సహాయాన్ని అందించడం, కులాన్ని తిరస్కరించడంపై యువతకు అవగాహన కలిగించడం లక్ష్యంగా 'మిలిర్' సంస్థ తమిళనాడులో పనిచేస్తోంది.

ఈ సంస్థ వ్యవస్థాపకులు, సైకో థెరపిస్ట్ ప్రీతి, అంబేడ్కర్ భావాలను అనుసరించే స్త్రీవాద పరిశోధకురాలు అశ్విని దేవి. తాము ఎదుర్కొన్న వివక్ష, దాని వల్ల కలిగిన మానసిక ఆరోగ్య ప్రభావాలకు తగిన మానసిక సహాయం లేకపోవడం ఈ సంస్థను ప్రారంభించడానికి ప్రేరేపించాయని వారు చెప్పారు.

"కులం మమ్మల్ని చాలా విధాలుగా ప్రభావితం చేసింది. మనం ఎవరితోనైనా ప్రేమలో ఉన్నప్పుడు కూడా, కులాన్ని ప్రస్తావించి, వారికి దానితో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. దళిత మహిళలు ఎదుర్కొనే సామాజిక వాతావరణం అలాంటిది."

"కులం వల్ల కలిగే మానసిక ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకుని చికిత్స చేసే మానసిక ఆరోగ్య సలహాదారులు చాలా తక్కువ. మేం దానిని సరైన మార్గంలో అందించాలని నిర్ణయించుకున్నాం" అని ప్రీతి చెప్పారు.

చిన్నతనంలో తన ఉపాధ్యాయుల కుల వివక్ష కారణంగా డ్రాయింగ్ మానేసిన దర్శిని, అప్పటి నుంచి అనేక చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు కూడా తాను అనేక రకాలుగా బాధపడ్డానని ఆమె చెప్పారు.

"కుల వివక్ష ఉన్న సమాజంలో ఒకరిని చూసే విధానం మారలేదు. అది ఆధునికరూపం సంతరించుకుంది" అని ఆమె చెప్పారు.

"ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు తమ మనుగడ కోసం కష్టపడి పనిచేయడం, వారి హక్కుల కోసం పోరాడడాన్ని రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాం. కుల మనస్తత్వం ఉన్నవారు ఆ బాధను మొదట అర్థం చేసుకోవాలి" అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)