పాము చనిపోయిన తర్వాత కూడా కాటేస్తుందా?

పాములు, అస్సాం, పాము కాటు

ఫొటో సోర్స్, Thilina Kaluthotage/NurPhoto via Getty Images

    • రచయిత, కె. శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో 2022, 2023లో నిర్ఘాంతపరిచే మూడు సంఘటనలు జరిగాయి.

ఈ మూడు సందర్భాల్లోనూ చనిపోయిన పాములు కొన్ని గంటల తర్వాత మనుషులను కరిచాయి.

భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పాముల జాతులకు చెందిన మోనోక్లెడ్ కోబ్రా(నాగుపాము), బ్లాక్ క్రైట్ (కట్లపాము) ఈ సంఘటనలకు కారణమయ్యాయి.

చనిపోయిన పాము నిజంగా మనిషిని కాటేయగలదా? పాము చనిపోయిన తర్వాత కూడా దాని విషం పని చేస్తుందా? అనే ప్రశ్నను లేవనెత్తాయి ఈ సంఘటనలు.

దీనిపై జరిగిన అధ్యయనంలో ఇది సాధ్యమేనని తేలింది.

పాము చనిపోయినా దానిలో ఉండే విషం కొన్ని గంటల పాటు చురుగ్గా ఉంటుంది. ఇది ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ మూడు సంఘటనలు

తొలి సంఘటన: తెగిపడిన కోబ్రా తలే కాటు వేసింది.

ఇది అస్సాంలోని శివసాగర్ జిల్లాలో జరిగింది. తన ఇంట్లో కోళ్లపై పాము దాడి చేయడాన్ని చూసిన వ్యక్తి ఆ పాము తల నరికేశాడు.

ముక్కలైన పాము శరీర భాగాలను పారేస్తున్నప్పుడు పాము తల ఆయన బొటనవేలిని కొరికింది.

దీంతో ఆ వ్యక్తి బొటన వేలు నల్లగా మారింది. భుజాల వరకు విపరీతమైన నొప్పి పుట్టింది.

దీంతో అతన్ని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్ చేయడంతో ఆయన కోలుకున్నారు.

రెండో సంఘటన: ట్రాక్టర్ కింద నలిగిన పాము డ్రైవర్‌ను కరిచింది.

ఈ సంఘటన కూడా అస్సాంలో, మొదటి సంఘటన జరిగిన ప్రాంతంలోనే జరిగింది.

ఒక రైతు నడుపుతున్న ట్రాక్టర్ చక్రాల కింద పడి నాగుపాము ఛిద్రమై చనిపోయింది.

కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి ట్రాక్టర్ నుంచి దిగగానే నాగుపాము ఆయన కాలును కాటేసింది. పాము చనిపోయిన కొన్ని గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది.

పాము కాటు వేసిన ప్రదేశంలో వాపు రావడం, ఆ వ్యక్తికి వాంతులు రావడం వంటివి జరిగాయి.

25 రోజులు చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నారు. చికిత్సలో భాగంగా ఆయనకు యాంటీవీనమ్, యాంటీబాడీస్ ఇచ్చారు.

మూడో సంఘటన: చనిపోయిన 3 గంటల తర్వాత కాటేసిన కట్లపాము

అస్సాంలోని కామ్‌రూప్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒకరోజు సాయంత్రం కొంతమంది వ్యక్తులు కట్లపామును చంపేసి ఇంటి వెనుక విసిరేశారు.

మూడు గంటల తర్వాత, రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఒక వ్యక్తి చనిపోయిన పామును చూసేందుకు వెళ్లారు.

చనిపోయిన పామును చేతులతో పట్టుకున్నారు. దీంతో పాము ఆయన చిటికెన వేలుపై కాటు వేసింది.

కాటు వేసిన ప్రదేశంలో నొప్పి, వాపు లాంటివేమీ లేకపోవడంతో ఆయన పట్టించుకోలేదు.

అయితే, రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆ వ్యక్తి శరీరంలో న్యూరోటాక్సిన్ (నరాలను ప్రభావితం చేసే విషం) ప్రభావం కనిపించడం ప్రారంభమైంది.

ఆందోళన పెరగడంతో పాటు ఒళ్లంతా నొప్పులు మొదలయ్యాయి. శరీర భాగాలు తిమ్మిరిగా మారడంతో ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆరు రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు.

పాములు, అస్సాం, పాము కాటు

ఫొటో సోర్స్, Rishikesh Choudhary/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, పాము చనిపోయినా, దాన్ని రెండు ముక్కలు చేసిన తర్వాత కూడా ప్రమాదకరమేనని అధ్యయనంలో తేలింది.

చనిపోయిన పాము ఎలా కరుస్తుంది?

ఈ మూడు సంఘటనలను నమ్మడం కష్టంగా అనిపించవచ్చు. అయితే, ఇలా జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అస్సాంలో జరిగిన ఈ సంఘటనలపై పరిశోధకులు అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనం( A Case Report of Dead Snake Emvenoming and Treatment) అనే పేరుతో ఫ్రాంటియర్స్ ఇన్‌ ట్రాపికల్ డిసీజెస్‌లో ప్రచురించారు.

ఇందులో పామును చంపేసినా, తల నరికేసినా అది కాటు వేస్తే ఎంతవరకు ప్రమాదమో చర్చించారు.

కొన్ని పాములు చనిపోయిన 3 గంటల తర్వాత కూడా కాటు వేయగలవు. పాము శరీరంలో ఉన్న విషం కొన్ని గంటల పాటు చురుగ్గా ఉంటుంది. అది కాటేసిన వారిపై ప్రభావం చూపుతుందని నివేదిక తెలిపింది.

ముందువైపు విషపూరిత దంతాలు ఉండే ఎలాపిడే (అత్యంత విషపూరిత పాములు నాగుపాము, తాచుపాము, కట్లపాముల జాతి), విపిరిడే(రక్తపింజరి, చిన్నపింజరి పాముల జాతి), అట్రాక్టాస్పిడిడే(ఇవి బొరియల్లో ఎక్కువగా ఉంటాయి) అనే మూడు రకాల జాతుల పాములతో ఇలాంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని యూనివర్సల్ స్నేక్‌బైట్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ఎస్ మనోజ్ చెప్పారు.

ఫ్రాంటియర్స్ ఇన్ ట్రాపికల్ డిసీజెస్‌లో ప్రచురితమైన అధ్యయనం ఇలా పేర్కొంది.

"పాము విషం మానవ లాలాజలాన్ని పోలి ఉంటుంది. విషాన్ని విడుదల చేసే గ్రంథి పాము కోరలకు అనుసంధానించి ఉంటుంది, ఈ వ్యవస్థ సిరంజిలా పనిచేస్తుంది. పాము కరిచినప్పుడు విషం విషగ్రంథుల నుంచి విడుదలై దంతాల ద్వారా కరిచిన వ్యక్తి శరీరంలోకి చేరుతుంది."

"అస్సాంలో జరిగిన మొదటి సంఘటనలో తెగిపోయిన పాము తలను పట్టుకున్నప్పుడు, ఆ వ్యక్తి పొరపాటున పాము విష గ్రంథిని నొక్కి ఉండవచ్చు. అలా విషం విడుదలై ఉండవచ్చు" అని అధ్యయనం వెల్లడించింది.

పాములు, అస్సాం, పాము కాటు
ఫొటో క్యాప్షన్, పాము చనిపోయినా సరే, సరైన రక్షణ లేకుండా దాన్నిపట్టుకోవద్దని డాక్టర్ మనోజ్ సూచించారు.

నిపుణులు ఏమంటున్నారు?

చనిపోయిన పాములతో ఇలాంటి సంఘటనలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్ మనోజ్ హెచ్చరించారు. దీని వెనుక శాస్త్రీయ నేపథ్యం ఉందని చెప్పారు.

"నిద్రలో దోమ కుట్టినప్పుడు మనకు తెలియకుండానే దాన్ని తరిమేస్తాం. శరీరంలో ఈ కదలిక గురించి మనకు తెలియదు. ఈ ప్రతిచర్య మెదడు నుంచి కాకుండా, వెన్నుపూస నుంచి వస్తుంది" అని ఆయన చెప్పారు.

మానవులలో నాడీ వ్యవస్థ మెదడు నుంచి ప్రారంభమై వెన్నుపూస ద్వారా మొత్తం శరీరాన్ని చేరుకుంటుంది. ఈ మొత్తం వ్యవస్థను కేంద్ర నాడీ వ్యవస్థ అంటారు.

"అలాగే పాము చనిపోయిన తర్వాత దాని నాడీ వ్యవస్థ పూర్తిగా ఆగిపోదు. మరణం తర్వాత వాటి అంతర్గత భాగాలు నెమ్మదిగా పనిచేయడం మానేస్తాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో మరణం తర్వాత కూడా వెన్నుపాము నుంచి కాటు వేసే ప్రతి చర్య ఉండవచ్చు" అని డాక్టర్ మనోజ్ వివరించారు.

పాము కాటులో ప్రమాదకరం కాని వాటి గురించి కూడా ఈ అధ్యయనంలో చర్చించారు. కొన్నిసార్లు విషపూరిత పాములు తమ శత్రువులను కాటు వేస్తాయి. అయితే, శరీరంలోకి విషాన్ని ఇంజెక్ట్ చేయవు. అలాంటి కాటు వేయడం ద్వారా అవి తమ శత్రువులను హెచ్చరిస్తాయని అధ్యయనం వెల్లడిచింది.

పాములు కాటు వేసినప్పుడు విషగ్రంథి నుంచి విడుదలయ్యే విషం పరిమాణాన్ని నియంత్రించగలవు. శత్రువును చూసినప్పుడు, విషగ్రంథి నుంచి మొత్తం విషాన్ని తీసుకోవాలా? లేదా తక్కువగా తీసుకోవాలా? అని అవి నిర్ణయించుకోవచ్చు.

"చనిపోయిన పాము శరీరంలో ఈ నియంత్రణ కోల్పోతుంది. అందువల్ల, శరీరంలోని ఏదైనా కదలిక కారణంగా (మరణించిన తర్వాత కూడా), చనిపోయిన పాము దంతాలు ఎవరికైనా గుచ్చుకుంటే, విషం దంతాల ద్వారా చొచ్చుకుపోతుంది. పాము దానిని నియంత్రించలేకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో, విషగ్రంథిలో నిల్వ ఉన్న విషం అంతా వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది" అని అధ్యయనం చెబుతోంది.

పాములు, విషం, భారత్,

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలా మంది మూఢనమ్మకాల కారణంగా చనిపోయిన పాములను పట్టుకుంటూ ఉంటారు.

చనిపోయిన తర్వాత కూడా కాటు వేసే పాములేవి?

ఇలాంటి ప్రవర్తన అమెరికాలోని ఎడారి ప్రాంతంలో కనిపించే రాటిల్ స్నేక్స్‌లో కనిపిస్తుందని, ఇవి అత్యంత విషపూరితమైనవని డాక్టర్ మనోజ్ చెప్పారు.

ఆస్ట్రేలియాలోని పొడ పాములు, చైనాలో కింగ్ కోబ్రాలు చనిపోయిన తర్వాత కూడా కాటు వేసినట్లు కర్ణాటకలోని కళింగ ఫౌండేషన్ పరిశోధన డైరెక్టర్ డాక్టర్ ఎస్ఆర్ గణేష్ తెలిపారు.

భారత్‌లో కనిపించే పాములలో ఈ రకమైన ముప్పు రస్సెల్ వైపర్(రక్తపింజరి), సా స్కేల్డ్ వైపర్(చిన్న పింజరి), బాంబూ పిట్ వైపర్(పసిరిక పాము), మలబార్ పిట్ వైపర్(పింజరి జాతికి చెందినది), కోరల్ స్నేక్(ఎలాపిడే జాతికి చెందినది), బ్యాండెడ్ పిట్ వైపర్ జాతుల నుంచి రావొచ్చు.

పాము చనిపోయినా కూడా దాన్ని పట్టుకోకూడదని, పామును పట్టుకునే ముందు తగిన జాగ్రత్తలు అవసరమని డాక్టర్ మనోజ్ సూచించారు.

"అనేక మంది చనిపోయిన పామును పట్టుకోవాలని అనుకుంటారు. ఇది ప్రమాదకరం. 'మానవుడి మరణానికి' వైద్య నిర్వచనం ఉన్నా, పాములు, ఇతర సరీసృపాల మరణాలకు అలాంటిదేమీ లేదు. పామును కొట్టి ఛిద్రం చేసినా లేదా దాని తల తెగినా లేదా ఎక్కువసేపు కదలకుండా పడి ఉన్నా అది చనిపోయిందని అనుకుంటాం" అని ఆయన అన్నారు.

పాము చనిపోయిన తర్వాత దాని విషం ఎంతసేపు ప్రభావ వంతంగా ఉంటుంది. కాటు వేస్తే ఎంత వరకు ప్రమాదకరం లాంటి అంశాలపై అధ్యయనాలు చేయలేదని డాక్టర్ ఎస్ఆర్ గణేష్ చెప్పారు.

డాక్టర్ మనోజ్ కూడా దీంతో ఏకీభవించారు.

"దేశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. పామును చంపి దానిపై అలాంటి అధ్యయనం చేయడం సాధ్యం కాదు. అందుకే అస్సాంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఇటువంటి అధ్యయనాలు జరుగుతాయి" అని ఆయన చెప్పారు.

పాము కాటు, చనిపోయిన పాములతో వ్యవహరించాల్సిన తీరు గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, అలాగే చనిపోయిన పాములు కరుస్తాయా? ఇంకా ఏయే జాతి పాములతో ఇలాంటి ప్రమాదం ఉందనే దాని గురించి అధ్యయనం జరగాలని అస్సాంలో జరిగిన సంఘటనలు చెబుతున్నాయి.

పాములు పట్టుకునే వారు, రక్షణ లేకుండా పాములతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వచ్చే ప్రమాదాల గురించి కూడా ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)