తల్లిపాలను ఇంట్లో నిల్వ చేసుకోవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ దేశం పీఆర్
- హోదా, బీబీసీ కోసం
మీరు పచ్చి బాలింతలా?
మీరు బాలింతలైనా బిడ్డను వదిలి ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తోందా? పాలు ఎక్కువై రొమ్ము బరువుగా, నొప్పిగా ఉంటోందా? అప్పుడు రొమ్ముపాలను పిండేసి పడేస్తున్నారా?
అలాగైతే ఈ కథనం మీకోసమే..
ఆవు పాల లాగే మనుషుల పాలు కూడా నిలువ చేసుకోవచ్చని మీకు తెలుసా?
ఏయే జంతువు పాలు, వాటి వాటి పిల్లలకు ఎలా అయితే ఆరోగ్యకరమో, శిశువులకు కూడా వారి తల్లి పాలు అంతే ఆరోగ్యకరం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు బిడ్డ పుట్టిన మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.
ఆ 6 నెలలు వారికి నీళ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఆరు నెలల తర్వాత వారికి ఇతర ఆహార పదార్థాలు తినిపించవచ్చు.
కానీ, తల్లి పాలను మాత్రం కనీసం రెండు సంవత్సరాల వరకు కొనసాగించాలి.


ఫొటో సోర్స్, Getty Images
ఇలా చేయడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది.
అయితే, ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని సందర్భాల్లో పచ్చి బాలింతలైన మహిళలకు బిడ్డలకు పాలిచ్చేందుకు సమయం దొరకడంలేదు.
చాల మంది ఉద్యోగులు, శ్రామికులైన తల్లులు తమ పాలు నిలువ చేసుకునే వీలుందని తెలియక బిడ్డకు రెండు మూడు నెలలు నిండగానే ఫార్ములా పాలను లేదా ఆవు పాలను ఇస్తున్నారు.
అయితే, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే అమ్మ పాలను కూడా జంతువుల పాలలా నిల్వ చేసుకోవచ్చు. కాస్త విచిత్రంగా అనిపించినా ఇది నిజం.

ఫొటో సోర్స్, Getty Images
ముర్రుపాలు మంచిది
బిడ్డ పుట్టాక మొదటి మూడు రోజులు వచ్చే పాలను ముర్రు పాలు అంటాము.
ఇవి అసలు వస్తున్నాయా? లేదా? అన్నట్లుగా చుక్కలు చుక్కలుగా వస్తుంటాయి.
ఇవి మాములుగా వచ్చే పాల కన్నా లేత పసుపు రంగులో, చిక్కగా ఉంటాయి.
పూర్వ కాలంలో ఈ పాలు మురుగు పాలగా అనుకుని బామ్మలు పిండేసి పడేయమని సలహా ఇస్తూ ఉండేవారు.
ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ముర్రుపాలను వ్యర్థంగా పడేస్తూ ఉండటం చూస్తాము.
అయితే, ఈ మొదటి మూడు రోజులు వచ్చే ముర్రుపాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
ఇందులో పసిబిడ్డకు అవసరమైన నీటితో పాటు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, పిండిపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు, బిడ్డ ఎదుగుదల కు ఉపయోగపడే కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి.
అప్పుడే పుట్టిన బిడ్డకు రోగ నిరోధక శక్తి అంతగా ఉండదు.
తల్లి పాల నుంచి మాత్రమే యాంటీబాడీస్ బిడ్డకు చేరతాయి.
బిడ్డ పుట్టిన అరగంటలోపు బిడ్డ నోటిని తల్లి రొమ్ముకి ఆనించాలి.
ఎంత తొందరగా బిడ్డ ఆ పాలను అందుకుంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది.
ఆ సమయం నుంచి మూడు నాలుగు రోజుల దాకా ఈ ముర్రుపాలను పట్టించాలి.
బరువు తక్కువగా ఉన్న పిల్లలకి, నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకి, ఐసీయూ అడ్మిషన్ అవసరమైన పిల్లలకు కూడా వీలైతే ఈ పాలే పట్టించాలి.
ఈ పాలను ఒక చిన్న సిరంజీ ద్వారా సేకరించి బిడ్డ నోట్లో పోయొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలి..
తల్లి చనుమొన చుట్టూ ఉన్న నల్లని ప్రాంతాన్ని ఇంగ్లీషులో ఏరియోలా అంటాము.
దాని వెలుపల భాగంలో ఉండే చర్మాన్ని ఇంగ్లీషు సి ఆకారంలో చేత్తో పట్టుకుని పిండితే పాలు బయటకి వస్తాయి.
ఆ ఒకటి రెండు చుక్కల పాలనే సిరంజీ ద్వారా సేకరించాలి.
చాలా మంది తల్లిదండ్రులు ఇలా చేయొచ్చని తెలియక ఫార్ములా పొడిని ఆశ్రయిస్తుంటారు.
మొదటి మూడు రోజులు బిడ్డకి రోజుకి కేవలం ఐదు నుంచి ముప్పై మిల్లీలీటర్ల పాలు మాత్రమే సరిపోతాయి, అంటే.. ఆ చుక్కా చుక్కా వచ్చే పాలే సరిపోతాయి.
కాబట్టి పాలు సరిపడా రావడం లేదని కంగారు పడక్కర్లేదు.
పూర్తిగా ఒకటి రెండు చుక్కలు కూడా రాని పరిస్థితి ఉన్నపుడే, వైద్యుల సూచన మేరకు మాత్రమే ఫార్ములా పొడిని వాడాలి.
ఆసుపత్రిలో ఇతర సిబ్బంది చెప్పినా కూడా పిల్లల వైద్యులతో మాట్లాడాక మాత్రమే ఈ పాల పొడులను వాడాలి.

ఫొటో సోర్స్, Getty Images
పాలు తెల్లగా ఎప్పుడు మారతాయి?
మొదటి మూడు నాలుగు రోజుల తర్వాత నుంచి తల్లి పాలు కాస్త పలచబడతాయి.
తెలుపు రంగులోకి మారుతాయి. ఎక్కువగా వస్తాయి.
పూర్తిగా తెల్ల పాలు రావడానికి వారం కూడా పట్టొచ్చు.
ప్రపంచంలో ప్రతీ తల్లీ తన బిడ్డకు అవసరం అయ్యేంత పాలను ఉత్పత్తి చేస్తుంది.
చాలా అరుదుగా మాత్రమే బిడ్డకు సరిపడా పాలు ఉత్పత్తి కాకుండా ఉంటాయి.
అలాంటి పరిస్థితిలో కూడా తల్లి పాలు మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నించాలి.
ఆవు పాలు, బర్రె పాలల్లో ఉండే పోషకాలు తల్లి పాలతో పోలిస్తే చాలా వేరుగా ఉంటాయి. అవి వాటి దూడల జీర్ణానికి సరిపడా పాలను ఉత్పత్తి చేస్తాయి.
అలాగే మహిళలు కూడా వారి వారి బిడ్డల జీర్ణ వ్యవస్థకు సరిపడా పాలనే ఉత్పత్తి చేస్తారు.
పాలను నిలువ చేయడం ఎలాగో తెలుసుకునే ముందు, తల్లిదండ్రులు బిడ్డని సంరక్షించే ప్రతీ ఒక్కరూ వీలైన మేరకు తమ కుటుంబంలోని బిడ్డకి ఎన్నో పోషకాలున్న తల్లి పాలను మాత్రమే పడతామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి.
ఈ విషయంలో తల్లికి సహాయంగా ఉండే ఇతరులు కూడా కృత నిశ్చయంతో ఉండాలి.
బిడ్డ ఎదుగుదల విషయంలో, బిడ్డలకు ఎలాంటి అంటురోగాలు రాకుండా, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈ కృత నిశ్చయం ఎంతో అవసరం.

ఫొటో సోర్స్, Getty Images
తల్లిపాలను నిల్వ ఉంచుకునేదెలా?
ముందుగా ఒక వెడల్పాటి మూతి ఉన్న గిన్నెను శుభ్రంగా కడిగి, వేడి నీళ్లలో ఐదు నిముషాలు ఉడకబెట్టాలి.
చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
సౌకర్యవంతంగా కూర్చొని, ముందుగా రొమ్ముని వలయాకారంలో మసాజ్ చేయాలి. వెచ్చని గుడ్డతో కూడా మసాజ్ చేయవచ్చు.
బిడ్డను (బిడ్డ దగ్గర లేనట్లయితే బిడ్డ ఫోటోని) చూడటం వల్ల తల్లి శరీరం లో ఆక్సిటోసిన్ అనే హార్మోను విడుదలయ్యి పాలు ఉత్పత్తి అవుతాయి.
అప్పుడు పైన చెప్పిన విధంగా ఎడమ వైపు రొమ్ము నుంచి పాలు తీసేట్టయితే, కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలుని 'సి' ఆకారం లో పెట్టి, ఏరియోలా బయట ఉన్న చర్మాన్ని వత్తాలి.
మొదట చిన్న చుక్కలుగా వచ్చినా, కొంచెం సేపు ప్రయత్నిస్తే ఎక్కువగా వస్తాయి.
ఇలా చేస్తున్నపుడు చను మొనని గానీ, ఏరియోలాని గానీ నొక్కకూడదు.
అలా చేస్తే రొమ్ము నెప్పి గా ఉంటుంది. వచ్చిన పాలని కడిగి ఉంచుకున్న గిన్నె లేదా బాటిల్‌లోకి పిండాలి.
ఐదారు నిమిషాల తర్వాత ఇంకో రొమ్ముని ఇదే పద్ధతిలో పిండాలి.
ఒక రొమ్ములో పాలన్నీ అయిపోయాక మాత్రమే ఇంకొక రొమ్ములోని పాలు పిండాలి. ఎందుకంటే, రొమ్ము నుంచి మొదట వచ్చే పాలలో బిడ్డ దాహం తీర్చడానికి నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
ఆ తర్వాత మూడు నాలుగు నిమిషాలు వచ్చే పాలల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్ కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఒక రొమ్ములో పూర్తిగా అయ్యాకే, ఇంకొక రొమ్ములో పిండాలి.
ఇలా తీసిన పాలు మన దేశంలో సాధారణ గది ఉష్ణోగ్రత (29 డిగ్రీలు లేదా తక్కువ) లో నాలుగు గంటల పాటు పెట్టొచ్చు.
అంటే, నాలుగు గంటల లోపు ఈ పాలని బిడ్డకు పట్టించాలి.
చల్లని దేశాల్లో అయితే, ఆరు గంటల వరకు కూడా పాడవకుండా ఉంటాయి.
అంతకంటే ఎక్కువ సేపు వాటిని నిలువ ఉంచాలంటే రిఫ్రిజిరేటర్‌లో పెట్టాల్సిందే.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రిజ్లో ఎంతసేపు పెట్టవచ్చు?
సాధారణంగా రిఫ్రిజిరేటర్‌లో ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
ఫ్రిడ్జ్ డోర్ వద్ద కాకుండా లోపల భాగంలో పాలను నిలువ చేయాలి.
ఇలా పెట్టిన పాలు నాలుగు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి.
ఇంకా ఎక్కువ కాలం నిలువ చేయాలంటే ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో పెట్టాలి.
ఫ్రీజర్ లో ఉష్ణోగ్రత -18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇక్కడ కూడా డోర్ లో కాకుండా ఫ్రీజర్ లోపల భాగంలో పెట్టాలి.
ఇలా పెట్టిన పాలు ఆరు నెలల వరకు కూడా పాడవకుండా ఉంటాయి.
ఒకసారి ఫ్రీజర్ నుంచి బయటకి తీసిన పాలను మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టకూడదు.
అందుకే పాలు రొమ్ము నుంచి తీసిన వెంటనే, చిన్న చిన్న బాటిల్స్‌లో (౩౦ నుంచి 60 మిల్లీలీటర్లు) నిల్వ చేయాలి.
ఆ బాటిళ్ల పైన నీటితో చెరగని ఇంకు పెన్నుతో తేదీ, సమయం వేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. మొదలు తీసిన పాలని వాడేశాక, తర్వాత తీసిన పాలను వాడాలి.
మార్కెట్లో రక రకాల బ్రెస్ట్ పంపులు అందుబాటులో ఉన్నాయి.
చెయ్యితో ఎక్కువగా పిండలేకపోతున్నారు, అలిసిపోతున్నారు అనుకుంటే ఈ పంపుల సహాయం తీసుకోవచ్చు.
చెయ్యితో పిండితే రెండు రొమ్ముల్లో పాలు అయిపోవడానికి 20 నుంచి 30 నిముషాలు పడుతుంది.
అదే పంపులతో అయితే 10 నుంచి 15 నిముషాలు పడుతుంది.
పనిచేసే చోట అనువుగా ఉంటే అక్కడ కూడా రెండు గంటలకి ఒకసారి పాలను తీసి నిల్వ చేమొచ్చు.
చాలా మంది మహిళలు పని చేసే చోట పాలు పిండేసి పడేస్తూ ఉంటారు.
అలా కాకుండా శుభ్రంగా కడిగిన బాటిల్, బ్రెస్ట్ పంప్ దగ్గర పెట్టుకుంటే పాలు తీసి ఫ్రిడ్జ్‌లో గానీ, ఫ్రీజర్‌లో గానీ నిల్వ చేయొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
తల్లిపాలను వేడిచేయకూడదు..
గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పాలను కొద్దిగా స్పూన్‌తో అటూ ఇటూ కలిపి బిడ్డకు పట్టించవచ్చు.
అయితే, ఇవి నాలుగు గంటల లోపు మాత్రమే పట్టించవలసి ఉంటుంది. నాలుగు గంటలు దాటితే వాటిని పడేయాలి.
ఫ్రిజ్‌లో పెట్టిన పాలను అయితే తీసి అలాగే తాగించవచ్చు.
బిడ్డకి చల్లని పాలు తాగడం ఇష్టం లేకపోతే, బాటిల్ ను వెచ్చటి నీళ్లలో కాసేపు ఉండనిచ్చి ఆ తర్వాత బాటిల్‌ను అటూ ఇటూ కదిపి బిడ్డకు పట్టించవచ్చు.
పాలను ఎప్పుడూ కూడా స్టౌ పైన గాని లేదా మైక్రోవేవ్‌లో కానీ వేడి చేయకూడదు. తల్లిపాలను వేడి చేస్తే అందులో ఉన్న పోషకాలు నశిస్తాయి.
ఫ్రిజ్‌లో పాలను నాలుగు రోజులపాటు అలాగే ఉంచితే అందులో హానికరమైన క్రిములు చేరవా? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది.
కానీ, తల్లి పాలలో సహజ సిద్ధంగానే రోగనిరోధక శక్తికి అవసరమైన యాంటీబాడీస్, బిడ్డకు మంచి చేసే బ్యాక్టీరియా ఉంటాయి.
అవి హానికారక క్రిములను పెరగనివ్వవు.
కాబట్టి ఈ పాలను మళ్లీ వేడి చేయాల్సిన పని లేదు.
బిడ్డ నోటికి నచ్చేలాగా వెచ్చగా ఉంటే సరిపోతుంది.
ఫ్రీజర్ లో పెట్టిన పాలను ఉపయోగించాలంటే ముందు రోజే తీసి వాటిని ఫ్రిజ్లో పెట్టాలి. మరుసటి రోజుకి అవి కరుగుతాయి.
అప్పుడు ఆ బాటిల్‌ను పైన చెప్పిన విధంగానే వేడి నీళ్లలో లేదా వెచ్చని నీళ్లలో కాసేపు ఉంచాలి.
ఇలా కరిగిన పాలను రెండు నుంచి నాలుగు గంటల లోపు బిడ్డకు తాగించాలి.
ఈ పాలు మిగిలిపోతే మళ్లీ ఫ్రీజర్‌లో కానీ, ఫ్రిజ్‌లో కానీ పెట్టడం చేయకూడదు.
బిడ్డ తాగగా మిగిలిన పాలను పడేయడం ఉత్తమం.

ఫొటో సోర్స్, Getty Images
పాలు పిండిన ప్రతిసారీ0 రొమ్ముని శుభ్రం చేయాల్సిన పనిలేదు.
రోజుకి రెండుసార్లు శుభ్రంగా స్నానం చేస్తే సరిపోతుంది.
రొమ్ముపైన, చనుమొనల పైన బిడ్డలకు మంచి చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి వాటిని మాటిమాటికీ కడగకుండా లేదా తుడవకుండా ఉండడమే మంచిది.
అయితే, ఇలా నిలువ చేసుకునే వీలున్నా కూడా తల్లి బిడ్డ పక్కనే ఉంటే గనక, తల్లి రొమ్మును బిడ్డకు అందించడం చాలా ఉత్తమమైన పని.
దీనివల్ల తల్లీబిడ్డ మధ్య అనుబంధం బలపడుతుంది.
తల్లికి పాలు ఆగకుండా వస్తూనే ఉంటాయి.
బిడ్డ ఎన్నిసార్లు పాలు తాగితే రొమ్ము నుంచి పాలు ఎంత తరచుగా పిండితే అంత ఎక్కువగా పాల ఉత్పత్తి జరుగుతుంది.
పాలు పిండకుండా వదిలేసినా, బిడ్డకి ఎక్కువసేపు పాలు ఇవ్వకుండా ఉండిపోయినా కూడా రొమ్ములో పాలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
పూర్వ కాలం పాల దాయిలని ఉండేవారు.
వారు ధనవంతుల ఇళ్లల్లో మహిళల బిడ్డలకు పాలిచ్చే వారు.
ఇప్పుడు అలాంటి వారు కనపడటం లేదు.
అయితే, కొన్ని ప్రాంతాల్లో బ్రెస్ట్ మిల్క్ స్టోరేజీ (రొమ్ము పాలను నిలువ చేసే) బ్యాంకులు వచ్చాయి.
హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రిలో ధాత్రి అనే సంస్థ బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ బ్యాంక్ నిర్వహిస్తుంది. విజయవాడ వంటి నగరాల్లోనూ బ్రెస్ట్ మిల్క్ స్టోరేజీ బ్యాంకులు ఉన్నాయి.
అక్కడ అడ్మిషన్‌లో ఉన్న పిల్లలకు ఆ పాలను ఇస్తారు.
ఆరోగ్యంగా ఉండి, పాల ఉత్పత్తి ఎక్కువ ఉన్న ఏ తల్లి అయినా అక్కడికి వెళ్లి తన బ్రెస్ట్ మిల్క్‌ను దానం చేయవచ్చు.
అనేక మంది పిల్లలు అవసరమైనన్ని తల్లిపాలు లేక పోషకాహార లోపంతో బాధపడుతూ ఉంటారు.
బ్రెస్ట్ మిల్క్ దానం వల్ల అలాంటి పిల్లలకు మేలు జరుగుతుంది.
(గమనిక: రచయిత డాక్టర్. ఇది వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే. అవసరమైన సమయాల్లో నేరుగా వైద్యులనే సంప్రదించాలి.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














