తిరుపతి - పద్మావతి హృదయాలయం: చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు, విదేశాల నుంచి కూడా రోగులు

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు అందిస్తోంది తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం.
సుమారు నాలుగేళ్ల కాలంలో, ఇప్పటికే ఈ ఆస్పత్రిలో 4 వేల గుండె ఆపరేషన్లు, 20 గుండెమార్పిడి శస్త్రచికిత్సలు చేశారు.
నిజానికి, ఇది చిన్నపిల్లల ఆస్పత్రే అయినా పెద్దలకు కూడా గుండె ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే, అత్యంత క్లిష్టమైన సర్జరీలు, గుండెమార్పిడి శస్త్ర చికిత్సలు మాత్రమే ఇక్కడ చేస్తున్నారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చయ్యే గుండె ఆపరేషన్లను ఉచితంగా చేస్తున్నట్లు ఇక్కడి డాక్టర్లు చెబుతున్నారు.
ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తయిన కొత్త భవనంపై ఎయిర్ ఆంబులెన్స్ ల్యాండ్ అయ్యేలా హెలీప్యాడ్ కూడా నిర్మిస్తున్నారు. దీనివల్ల గుండెమార్పిడి సమయంలో గుండెను వేగంగా తీసుకురావడానికి వీలవుతుంది.


నాలుగేళ్లలోపే 4 వేలకు పైగా సర్జరీలు
పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి ప్రారంభించిన నెలకే గుండె శస్త్రచికిత్సలు ప్రారంభించామని ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనాథ రెడ్డి చెప్పారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం అక్టోబర్ 2021న మొదలుపెట్టాం. ఇప్పటివరకూ ఈ ఆస్పత్రిలో దాదాపు 4050 వరకూ సర్జరీలు చేశాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఈ ఆస్పత్రి ప్రారంభమైంది. ఈ 60 పడకల ఆస్పత్రి.. ప్రత్యేకంగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయడానికే నిర్మించిన హాస్పిటల్'' అని అన్నారు.
ఈ ఆస్పత్రిలో 15 మంది వైద్య నిపుణులు, 100 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
''పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అయిన కాంబినేషన్ హార్ట్, హార్ట్ లోపలి గదుల్లో లోపాలు, రంధ్రాలు ఉండటం, కవాటాలలో సమస్య, మంచిరక్తం, చెడురక్తం కలవడం వంటి సమస్యలు ఉంటాయి. ప్రతి 1000 మంది పిల్లల్లో 10 మందికి, వందలో ఒకరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి.''

''ఆంధ్రప్రదేశ్‌లో ఏటా పుట్టే పిల్లల్లో గుండె సమస్యలు ఉన్న పిల్లలు 10 వేల మంది వరకూ ఉంటారు. అలాంటి వారిలో 3 వేల మంది పిల్లలకు మొదటి సంవత్సరంలోనే సర్జరీ చేయాలి. లేదంటే వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.''
''పిల్లలకు బైపాస్ సర్జరీ.. అన్ని గుండె సర్జరీల్లో కంటే అత్యంత క్లిష్టం. చిన్నపిల్లల్లో గుండె నిమ్మకాయ సైజు ఉంటుంది. ఆ గుండెకు సర్జరీ చేయాల్సినప్పుడు, మనకు లూప్స్, అత్యాధునిక పరికరాలు, మంచి టీమ్ ఉంటేగానీ చేయలేం. టీటీడీ వల్ల ఆస్పత్రిలో ఆ సామర్థ్యం ఉంది కాబట్టి, అలాంటి ఆపరేషన్లు మేం చేయగలుగుతున్నాం'' అని శ్రీనాథరెడ్డి చెప్పారు.

రూపాయి ఖర్చు లేకుండా..
ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా.. కుటుంబం బీపీఎల్ పరిధిలో ఉండి, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నా ఈ ఆస్పత్రిలో పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు.
ఇవేవీ లేకపోయినా సీఎం రిలీఫ్ ఫండ్ చాలా సాయపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీని ద్వారా స్కీమ్స్‌లో అందుబాటులో లేని కేసులు కూడా కవర్ అవుతాయని తెలిపారు.
ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి చికిత్స అందిస్తున్నట్లు శ్రీనాథరెడ్డి తెలిపారు.

'అక్కడ ఐదారు లక్షలు ఖర్చవుతుందన్నారు'
తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో తమ పాపకు గుండె ఆపరేషన్ చేయించామని విజయవాడకు చెందిన జ్యోతిక చెప్పారు.
''విజయవాడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించాం. ఐదారు లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. అందువల్ల దూరమైనా సరే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం, మేడం చెప్పే విధానం మాకు నచ్చి.. నమ్మకం కుదిరి ఇక్కడే ఆపరేషన్ చేయించాం. మూడుసార్లు వచ్చి చూపించుకున్న తర్వాత, ఫోర్త్ టైం సర్జరీ చేశారు'' అని ఆమె చెప్పారు.

పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉన్న తన బిడ్డకు సర్జరీల కోసం ఆస్పత్రికి వచ్చానని, ఒక సర్జరీ ఉచితంగా చేశారని, మరో సర్జరీ జరగాల్సి ఉందని చంద్రగిరికి చెందిన నిర్మల తెలిపారు.
''మా పాపకి పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది. ఒకటిన్నర నెల ఉన్నప్పుడు జలుబు వల్ల మామూలు ఆస్పత్రికి తీసుకెళ్తే గుండెలో రంధ్రాలు ఉన్నాయని చెప్పారు. అవి చిన్నగా ఉన్నాయి అన్నారు. పాపకు మూడేళ్లు ఉన్నప్పుడు వీళ్లు కూడా అదే చెప్పారు. ఐదేళ్లు వచ్చేవరకూ చూద్దాం అన్నారు. ఇప్పుడు ఒక రంధ్రానికి సర్జరీ చేశారు. ఇంకొకటి ఉంది. సైజు పెద్దదైతే సమస్య అవుతుందని, ఆపరేషన్ చేసుకోవాలన్నారు. మేము అడ్మిట్ అయ్యాం, సర్జరీ ఫ్రీగానే చేశారు.''
''మాకు అవసరమైన ఫండింగ్ ప్రాణదాన ట్రస్ట్ చేస్తుంది. మాకు విరాళాలు ఇచ్చేవారిలో చాలామంది స్వామివారి భక్తులు ఉన్నారు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయడానికి దాతలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు'' అని శ్రీనాథ రెడ్డి తెలిపారు.
''బయటి రాష్ట్రాల వారు ఎక్కువగా వస్తారు. బిహార్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాల వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా సర్జరీలు చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

రూ.50 లక్షలు అయ్యే సర్జరీ...
ఇదే ఆస్పత్రిలో తన భర్త నర్సింహులుకు గుండెమార్పిడి శస్త్ర చికిత్స చేయించినట్లు రాజమండ్రికి చెందిన పుష్ప చెప్పారు. బయట రూ.50 లక్షలు అయ్యే హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని ఉచితంగానే చేశారని ఆమె అన్నారు.
''మేం ఇక్కడికి గుండెమార్పిడి చేయించుకోవడానికి వచ్చాం. 8 సంవత్సరాల నుంచి గుండె వీక్‌గా ఉందని రాజమండ్రిలో చెప్పారు. రోజూ మెడిసిన్ వాడుతూ బాగా వీక్ అయిపోయారు. హైదరాబాద్.. అన్నీ తిరిగాం. ఆర్థిక సమస్య వల్ల కాకినాడ హాస్పిటల్‌కు వెళ్తే, ఇక్కడికి రిఫర్ చేశారు. బయట 50 లక్షలు అవుతుందన్న సర్జరీ ఇక్కడ ఉచితంగా చేశారు. సర్జరీ కూడా సక్సెస్ అయ్యింది. మా ఆయన నడుస్తున్నారు'' అని పుష్ప తెలిపారు.
ఈ ఆస్పత్రికి కులమతాలకు అతీతంగా రోగులు వస్తుంటారు.

వీలైనంత వరకు క్లిష్టమైన ఆపరేషన్లకు వెయిటింగ్ లిస్ట్ ఉండదని, ఎమర్జెన్సీ అయితే ఏ సమయంలోనైనా ఆపరేషన్లు చేయడానికి సిద్ధంగా ఉంటామని ఇక్కడి డాక్టర్లు చెబుతున్నారు.
ఈ ఆస్పత్రిలో 20 గుండెమార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు శ్రీనాథ రెడ్డి చెప్పారు.
''గుండెమార్పిడి చికిత్స కూడా చేస్తాం. చిన్న వయసులోనే హార్ట్ ఫెయిల్యూర్ అయిన వారికి గుండెమార్పిళ్లు కూడా చేస్తాం. గుండెమార్పిడి సర్జరీ చేసుకున్న తర్వాత ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఏడాది వరకూ ఉచితంగా మందులు కూడా ఇస్తున్నాం'' అని ఆయన వివరించారు.

''24 గంటలు కనీసం ముగ్గురు స్పెషల్ డాక్టర్స్ హాస్పిటల్‌లో ఉంటాం. ఏ బేబీ వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ చేస్తాం. సాధారణంగా, బటన్ ఆపరేషన్ అయితే నాలుగో రోజున, ఓపెన్ హార్ట్ ఆపరేషన్ అయితే పదో రోజున డిశ్చార్జ్ చేస్తాం'' అని వైద్యురాలు సౌమ్య కస్తూరి చెప్పారు.
పెద్దవారు తమకెలా ఉందో చెబితే తెలుస్తుంది. కానీ, పిల్లలు చెప్పలేరు, సర్జరీ తర్వాత నవ్వుతూ ఓపీడీకి వస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుందని ఆమె అన్నారు.

విదేశాల నుంచీ రోగులు
విదేశాల నుంచి కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
''బయటి దేశాల వాళ్ల నుంచి కూడా చాలా ఎంక్వయిరీస్ వస్తున్నాయి. బంగ్లాదేశ్ వాళ్లు కూడా ఇక్కడ వచ్చి ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. ఆఫ్రికా, ఇరాక్, బాంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి కూడా ఎంక్వయిరీస్ వస్తుంటాయి'' అని శ్రీనాథ రెడ్డి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














