నాగర్ కర్నూల్: పడిపోయిన చెట్టు.. మళ్ళీ నిలబడింది.. ఇక్కడ రాఖీ కట్టే సంప్రదాయం ఎలా వచ్చిందంటే..

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది నాగర్ కర్నూలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల.
జూలై 28.. ఉదయం 9 గంటలకు అక్కడికి వెళ్లేసరికి కొందరు బాలికలు చెట్టు చుట్టూ అందమైన ముగ్గులు వేస్తున్నారు.
బెలూన్లతో అలంకరించి మామిడాకులు కట్టి పుట్టిన రోజు కోసం సిద్ధం చేశారు.
అవును, మీరు చదివింది నిజమే. చెట్టు పుట్టిన రోజు అది. పుట్టిన రోజు అనేకంటే కూడా పునర్జన్మించిన రోజు అనడం బాగుంటుంది.
అది చీమ చింతకాయ చెట్టు. చెట్టు పునర్జన్మించిన రోజును ఏటా ఇక్కడి బాలికలు రాఖీ కట్టి పండుగ జరుపుకొంటారు.
పర్యావరణాన్ని కాపాడాలనే సందేశం ఇస్తూ ఆ చెట్టుతో పాఠశాలకు, తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు.


ఫొటో సోర్స్, VataFoundation
'నాలో ఇంకా ప్రాణం ఉంది'
అప్పటికి దాదాపు 30 ఏళ్ల వయసున్నదిగా చెబుతున్న చీమ చింతకాయ చెట్టు 2017 మే నెలలో వచ్చిన గాలివానకు నేలకూలింది. ఆ తర్వాత రెండు నెలలు గడిచిపోయాయి.
అప్పుడు 'నాలో ఇంకా ప్రాణం ఉంది' అన్నట్లుగా ఆ చెట్టు చిగురు వేయడం మొదలు పెట్టిందని పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయురాలు గుడిబండ యశోదా రెడ్డి బీబీసీతో చెప్పారు.
''రోజూ చెట్టును దాటుకుని తరగతి గదుల్లోకి వెళ్లేవాళ్లం. అది కింద పడిపోయినా కొత్తచిగురు వచ్చి పైకి పెరగడం మొదలుపెట్టింది'' అని చెప్పారు.
చెట్టును తిరిగి నిలబెడతామనే ఆశ అప్పట్లో తమకు లేదన్నారు యశోద.
వంట చెరకుగా అయినా ఉపయోగపడుతుందని, చెట్టును కట్టెలుగా నరకడానికి రూ.600కు ఆ సమయంలో ఉన్న ప్రధానోపాధ్యాయురాలు కాంట్రాక్ట్ మాట్లాడారని చెప్పారు యశోద.
''పాఠశాల లోపలికి వచ్చేందుకు అడ్డంగా ఉంది. నరికేసేందుకు కూలీలను మాట్లాడానని నాతో చెప్పారు. రెండు రోజులు ఆగమని చెప్పాను'' అని అప్పట్లో జరిగిన సంఘటనను బీబీసీతో పంచుకున్నారు.

'ట్రాన్స్‌లొకేషన్'తో తిరిగి నిలబెట్టారు..
ప్రస్తుతం బీబీసీ ప్రతినిధిగా ఉన్న నేను... 2017 జూలైలో ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు 'వట ఫౌండేషన్' గురించి రాసిన కథనం ఆ పత్రిక సండే మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.
అప్పటికే వట ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెద్దిరెడ్డి ఉదయ్ కృష్ణ బృందం చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌పై పనిచేస్తోంది.
ఆ కథనం చూసి వట ఫౌండేషన్‌కు కాల్ చేశానని యశోద చెప్పారు.
"ఫోన్ చేసి చెట్టు గురించి వివరించిన తర్వాత దాన్ని నిలబెడతామని ఉదయ్ కృష్ణ చెప్పారు. నా చెట్టు బతికిపోయిందని అనుకున్నాను" అని ఆమె అన్నారు.
అలా జూలై 28న వట ఫౌండేషన్ నుంచి ఉదయ్ కృష్ణ సహా 8 మంది సభ్యులు పాఠశాలకు వచ్చి చెట్టును తిరిగి నిలబెట్టే పని చేపట్టారు.

''ఉపాధ్యాయులను ఆ రోజు ఒకటే కోరాం. మేం చెట్టు నిలబెట్టే పని చేస్తున్నంతసేపు పిల్లలు అక్కడే ఉండి చూడాలని చెప్పాం'' అని ఉదయ్ కృష్ణ గుర్తు చేసుకున్నారు.
విద్యార్థుల ఎదుటే చెట్టును నిలబెట్టడం ద్వారా చెట్ల ప్రాధాన్యంతో పాటు వారికి పర్యావరణ ప్రాధాన్యం తెలుస్తుందనేది ఉదయ్ కృష్ణ మాట.
''చెట్టును నిలబెట్టడం చూస్తే విద్యార్థినులకు వాళ్ల జీవితంలో అదొక మెమొరీగా ఉండిపోతుంది'' అని భావించామని చెప్పారాయన.
చెట్టును తిరిగి నిలబెట్టేందుకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని ఉదయ్ కృష్ణ బీబీసీతో చెప్పారు.
సాధారణంగా భారీ చెట్టును తిరిగి నిలబెట్టే సమయంలో క్రేన్ అవసరమవుతుంది. కానీ, క్రేన్ అందుబాటులో లేకపోవడంతో పొక్లెయిన్ సాయంతోనే చెట్టును నిలబెట్టి తిరిగి నాటామని వివరించారు.

అలా మొదలైంది.. వారి రాఖీ పండుగ
అప్పట్నుంచి చెట్టును నిలబెట్టి, పునరుద్ధరించిన రోజును పురస్కరించుకుని జూలై 28న ఏటా విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఆ రోజును చెట్టు పుట్టినరోజులా జరుపుకొంటున్నారు. చెట్టుకు రాఖీ కట్టి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు విద్యార్థులు.
''చెట్టు కిందనే మేం ఆడుకుంటాం. ఎండ కాసినప్పుడు దాని నీడలోనే కూర్చుని చదువుకుంటాం. చీమ చింతకాయలు కాసినప్పుడు కోసుకుని తింటుంటాం'' అని ఎనిమిదో తరగతి విద్యార్థిని మాధవి చెప్పారు.
అలాగే, ఆరోజు ఉపాధ్యాయులు పర్యావరణ ప్రాధాన్యాన్ని వివరించేలా బాలికలకు పోటీలు పెట్టి బహుమతులు అందిస్తున్నారు. నాటికలు, వక్తృత్వ పోటీలు నిర్వహించి పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు.
''మొదట రాఖీ పౌర్ణమి రోజు చెట్టుకు రాఖీ కట్టాలనుకున్నాం. కానీ, దాన్ని నిలబెట్టిన రోజు చేస్తేనే.. చెట్టుకు ఎందుకు రాఖీ కడుతున్నామో తెలుస్తుంది. బడి వాతావరణంలో చెట్టును పదేపదే గుర్తు చేసినట్లుగా ఉంటుందని అనుకున్నాం'' అని యశోద చెప్పారు.
అలా ఏటా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, వట ఫౌండేషన్ సభ్యులు నాగర్ కర్నూలుకు చేరుకుని, చెట్టు పుట్టిన రోజును జరుపుకొంటున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఉదయ్ కృష్ణ 2015లో వట ఫౌండేషన్‌ను ప్రారంభించారు. వట వృక్షం అనే అర్థంలో ఆ పేరు పెట్టామని ఆయన చెబుతున్నారు.
''చెట్లను నరికివేస్తుండటంతో ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో బతికిస్తే బాగుంటుందని అనుకున్నాం. ఆ ఆలోచనతో 2010 నుంచి చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేస్తున్నాం. అభివృద్ధి పనుల్లో భాగంగా చాలా చోట్ల చెట్లను కొట్టేస్తుంటారు. వాటిని తీసుకెళ్లి మేం వేరే చోట మళ్లీ నాటుతుంటాం'' అని బీబీసీతో చెప్పారు ఉదయ్ కృష్ణ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














