విజయవాడ: బుడమేరు బీభత్సానికి ఏడాది.. వరద సమయంలో ఏం చెప్పారు, ఇప్పటి వరకు ఏం చేశారు?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఎన్టీఆర్ జిల్లాలో పుట్టి ఏలూరు జిల్లా కొల్లేరులో కలిసే బుడమేరు వాగుకు వరదలొస్తే అది సృష్టించే బీభత్సం ఇంతాఅంతా కాదు. వరదలొచ్చినప్పుడల్లా విజయవాడ మీద విరుచుకుపడుతోంది.
ఏడాది క్రితం సగం విజయవాడ నగరాన్ని, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని లక్షల ఎకరాలను ముంచెత్తి ప్రజలకు నరకయాతన చూపించింది.
మామూలు రోజుల్లో చిన్న మురికి కాలవలా కనిపించే బుడమేరు వాగు ఉగ్రరూపం ఎలా ఉంటుందో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో అంతా చూశారు.
ఏడాదవుతున్నా నాటి వరద జ్ఞాపకాలు ఈ ప్రాంత ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.
బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు.
అయితే ఒక్కసారిగా 40 నుంచి 45 వేల క్యూసెక్కుల వరద పోటెత్తి బెజవాడను ముంచేసింది.
విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లోని 32 డివిజన్లు బుడమేరు తాకిడికి అల్లకల్లోలంగా మారాయి.
దాదాపు మూడులక్షల మంది వరద బాధితులయ్యారు.
రాజరాజేశ్వరిపేట, సింగ్‌నగర్, అంపాపురం, పాయికాపురం, కండ్రిక ప్రాంతాల్లోని ప్రజలైతే దాదాపు నెల రోజుల పాటు ఇళ్లు విడిచి వేరే చోటకు వెళ్లిపోయారు.
పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవడానికి 2 నెలలు పట్టింది.
ఇళ్లల్లోని విలువైన సామాన్లతో పాటు వాహనాలు నీట మునిగి బాధితులు ఆర్ధికంగా చాలా నష్టపోయారు.
ఎనికేపాడు వద్ద ఉన్న అండర్ టన్నెల్ సామర్ధ్యం చాలక బుడమేరు నీరు ఏలూరు కాలువలోకి ప్రవాహం ప్రవేశించడంతో వరద ఉద్ధృతి పెరిగి వేల ఎకరాలు తుడిచిపెట్టుకుపోయాయి.


బుడమేటికి వరదలు కొత్త కాదు.. కానీ
బుడమేటికి వరదలు రావడం కొత్తకాదు.
60 ఏళ్ల కిందట ఓ సారి, 2005లో మరోసారి బుడమేరు ఉగ్రరూపం చూపించి సమీపంలోని ఇళ్లను ముంచెత్తింది.
ఆ తర్వాత కూడా భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడల్లా కట్ట వెంబడి, సమీపకాలనీల్లో ఇళ్లలోకి నీరు వచ్చి స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
కానీ 2024లో పరిస్థితి మరీ దారుణం.
అంతకు ముందెన్నడూ లేని విధంగా విజయవాడ నగరంలోని 32 డివిజన్లు అల్లకల్లోలంగా మారాయి.
బుడమేటికి కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి.
చరిత్రలో తొలిసారి బుడమేరు ఉద్ధృతికి విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలోని ఇళ్లు కూడా మునిగిపోయాయి.

ఫొటో సోర్స్, UGC
అంత వరదెలా వచ్చింది?
ఎన్టీఆర్ జిల్లా మైలవరం కొండల్లో పుట్టిన బుడమేరు విజయవాడ, మీదుగా ఏలూరు జిల్లా కొల్లేరులో కలుస్తుంది.
బుడమేరు నీటిని కృష్ణా నదిలోకి మళ్లించేందుకు విజయవాడ సమీపంలోని వెలగలేరు వద్ద రెగ్యురేటర్ నిర్మించారు.
బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా 15వేల క్యూసెక్కుల నీటి ప్రవహాన్ని కృష్ణా నదిలోకి మళ్లించవచ్చు.
మిగిలిన నీళ్లు విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, కృష్ణా జిల్లాల్లోని పలు గ్రామాల మీదుగా ఏలూరులో జిల్లా కొల్లేరులో కలుస్తాయి.
వెలగలేరు వరకు మంచినీటి వాగుగా ఉండే బుడమేరును విజయవాడ నుంచి కొల్లేరులో కలిసే వరకూ బుడమేరు డ్రెయిన్‌గా పరిగణిస్తారు.
గతేడాది ఆగస్టు చివరలో కృష్ణా నదిలో ప్రవాహం ఎక్కువగా ఉంది.
దీంతో డైవర్షన్ కెనాల్ ద్వారా నదిలో కలవాల్సిన వరద జలాల వెనక్కి నెట్టాయి.
వరద తీవ్రతకు డైవర్షన్ కెనాల్‌లోకి 45వేల క్యూసెక్కుల వరద వచ్చింది.
పై నుంచి వరద పోటెత్తడం, కింద కృష్ణా నదిలోకి నీరు వెళ్లే అవకాశం లేకపోవడంతో వరద విజయవాడ మీద విరుచుకు పడింది. జలాలు నగరం మీద పడ్డాయి.

అప్పుడు ప్రభుత్వం ఏమంది?
"కృష్ణాలో కలవాల్సిన వరద నీరు వెనక్కి రావడం, విజయవాడలో బుడమేరు కాలువ చుట్టూ ఆక్రమణల వల్లే గతేడాది బుడమేటి వరద నగరాన్ని ముంచేసింది" అని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్‌రావు బీబీసీతో చెప్పారు.
భవిష్యత్తులో బుడమేరు వల్ల విపత్కర పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.
బుడమేరు కెనాల్ ఆధునికీకరణతో పాటు కట్ట వెంబడి ఆక్రమణలు తొలగిస్తామని మంత్రి రామానాయుడు చెప్పారు.
ఆపరేషన్ బుడమేరును త్వరలోనే చేపడతామని ఆయన చెప్పారు.

‘ఆపరేషన్ బుడమేరు’ ప్రతిపాదనలు..
- వెలగలేరు రెగ్యురేటర్ వద్దనున్న బుడమేరు డైవర్షన్ ఛానల్(బీడీసీ) సామర్థ్యం 15వేల క్యూసెక్కుల నుంచి 37,500వేల క్యూసెక్కులకు పెంచడం.
- బుడమేరు వెంబడి ఆక్రమణల తొలగింపు.
- విజయవాడలో బుడమేరుని 50 మీటర్ల నుంచి 150 మీటర్లకు విస్తరించడం.
- విజయవాడ దాటిన తర్వాత ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు ఉన్న బుడమేరు డ్రెయిన్ సామర్ధ్యం పెంచడం.
- బుడమేరు నీరు నగరంలోకి రాకుండా వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు ఓల్డ్ చానెల్‌కి సమాంతరంగా ఉన్న పాత కాలువను విస్తరిస్తే.. నగరంలోని ఇళ్ల జోలికి వెళ్లనవసరం లేదు.
- ఇది ఇరిగేషన్ స్థలాలు, పొలాల నుంచి వెళుతున్నందున భూసేకరణ సులువవుతుందనే ప్రతిపాదన.
- బుడమేరు నుంచి కొల్లేరు వరకు పూడిక తీత పనులు చేయాలని ప్రతిపాదించారు.
- గతేడాది కొండపల్లి సమీపంలోని శాంతినగర్ వద్ద బుడమేటికి భారీగా గండ్లు పడ్డాయి. గండ్లను పూడ్చి అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించడం.

ఏడాది క్రితం ఏం చెప్పారు?
బుడమేరు అంతా విజయవాడలో ఇళ్ల మధ్య నుంచే ప్రవహిస్తోంది.
విజయవాడ సిటీ, రూరల్ పరిధిలో బుడమేరు దాదాపు 18 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. ఇందులో నగరంలో 8.9 కిలోమీటర్ల పొడవున ఉంటుంది.
నగరంలోని ఏలూరు కాలువ, బుడమేరుకు ఒక గట్టు ఉమ్మడిగా ఉంటుంది.
బుడమేటి గట్ల వెంబడి ఖాళీ ప్రదేశాలను ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకోవడం 60 ఏళ్ల కిందటే మొదలైంది.
అయితే గత ఇరవై ఏళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బుడమేరును మరింత చిన్నదిగా చేస్తూ వెంచర్‌లు వేయడంతో చిన్న మధ్య తరగతి ఇళ్ల నిర్మాణాలు, కాలనీలు వెలిశాయి.
ఏ కొండూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో సుమారు 2930 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తుండగా దాదాపు 580 ఎకరాల మేర ఆక్రమణలకు లోనైనట్లు గతేడాది అధికారులు ప్రాధమికంగా గుర్తించారు.

ఇక సర్వే నంబర్ల వారీగా ఆక్రమణల వివరాలు నమోదు చేసిన తర్వాత వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు ఉన్న ప్రవాహ మార్గంలో 4వేల ఇళ్లు బుడమేరు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా అప్పట్లో అసెంబ్లీలో ప్రకటించారు.
ఆ 4వేల ఇళ్లలో ఆరు వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా వేరే చోట టిడ్కో ఇళ్ల మాదిరి నిర్మించి ఆ కుటుంబాలను తరలించే ఆలోచన చేస్తున్నామన్నారు.
అలాగే ఈ ప్రతిపాదనలన్నీ అమలు చేయడానికి ఐదారు వేల కోట్ల రూపాయల ఖర్చవుతుదని చెప్పారు.
రాష్ట్ర ఆర్ధిక స్థితి దృష్ట్యా ఆపరేషన్ బుడమేరుకు అవసరమైన నిధులు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి సమీకరించాలని భావిస్తున్నట్లు రామానాయుడు చెప్పారు.
ఆ నిధుల సమీకరణ సాధ్యమైనంత త్వరగా చేసి.. వచ్చే సీజన్‌కల్లా..ఆపరేషన్ బుడమేరుకు ఓ రేపు రేఖలు తీసుకొస్తామన్నారు.

ఏడాదిలో ఏం చేశారు?
బుడమేరు ఆధునికీకరణ పనుల్లో భాగంగా కొండపల్లి పరిధిలోని శాంతినగర్ వద్ద 363 మీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసిన ప్రభుత్వం మరో 183 మీటర్లు మేర నిర్మాణాన్ని నవంబర్ కల్లా పూర్తి చేస్తామని చెబుతోంది.
ఇందుకోసం రూ. 38కోట్లు మంజూరైతే అందులో రూ. 28కోట్లు ఖర్చు చేసినట్టు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్‌రావు తెలిపారు.
బుడమేటి వాగు ప్రవాహానికి అడ్డుకట్టగా ఉన్న గురప్రు డెక్కను తొలగించే పనిని ఏడాదిగా వదిలేసిన ప్రభుత్వం ఇటీవల భారీ వర్షాలు సంభవించినప్పుడు మాత్రం హడావుడిగా నగరంలోని కొన్నిచోట్ల ఆ పని చేపట్టింది.
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సింగ్‌నగర్ సమీపంలో గుర్రపుడెక్కను కొంతమేర తొలగించారు.
"ఇప్పటివరకు జరిగింది ఇదే అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదని 'ఆపరేషన్ బుడమేరు'ను ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసింది" అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు విమర్శించారు.

ఎవరేమన్నారు?
ఇరిగేషన్ అధికారులు..
వెలగలేరు రెగ్యురేటర్ వద్దనున్న బుడమేరు డైవర్షన్ ఛానల్(బీడీసీ) సామర్ధ్యం 15వేల క్యూసెక్కులు.
దీన్ని 37,500వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టినట్లు జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ సుగుణాకర్‌రావు బీబీసీతో చెప్పారు.
వచ్చే ఏడాదికి ఈ పనులు పూర్తి చేస్తామని అన్నారు.
ఇక బుడమేరు మొదలు నుంచి సముద్రంలో కలిసే కొల్లేరు వరకు ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించామని అయితే వాటి తొలగింపు కొంత కష్టమైన వ్యవహారమని ఆయన చెప్పారు.
ఆక్రమణలు తొలగించేలోగా బుడమేరు డైవర్షన్ కెనాల్ విస్తరణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు.
జలవనరుల శాఖ మంత్రి
ఆపరేషన్ బుడమేరు విషయంలోప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు, పనుల గురించి మాట్లాడేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది.
అయితే, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఆయన స్పందిస్తే అప్‌డేట్ చేస్తాం.
జిల్లా కలెక్టర్
ఆక్రమణలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తాము చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా బీబీసీకి చెప్పారు.
అయితే భారీవర్షాలు కురిసినా గతేడాది మాదిరి వరద పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.
ఆపరేషన్ బుడమేరుపై మాట్లాడేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర సుముఖత వ్యక్తం చేయలేదు.
పార్టీలు
ఆపరేషన్ బుడమేరుపై ప్రభుత్వ తీరు దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు విమర్శించారు.
"విజయవాడ నగరానికి బుడమేటి వరద ముప్పు నుంచి శాశ్వత నివారణ చర్యలు కావాలంటే పదివేల కోట్ల రూపాయలు కావాలి. కేవలం రూ. 28కోట్లతో రిటైనింగ్ వాల్ కట్టేసి ఇక బుడమేరు ముప్పు ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎంత అన్యాయం" అని ఆయన అన్నారు.
ప్రభుత్వ నిర్వాకాన్ని నిరసిస్తూ "బుడమేటి వరదకు సంవత్సరీకం" పేరిట నిరసన కార్యక్రమాలు చేపడతామని బాబూరావు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














