నీళ్లలో బండి నడుపుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నిన్నటిదాకా రవి వానలో బైక్‌పై తిరుగుతూనే ఉన్నాడు. తానైతే రెయిన్‌కోట్ వేసుకుని తడిసిపోకుండా తప్పించుకున్నాడుగానీ, బైక్ అలా కాదు కదా...అది పూర్తిగా తడిసిపోయింది.
అందుకే పొద్దున్నే రవి బండి స్టార్ట్ చేస్తే మొరాయించింది. చేసేది లేక బండిని తోసుకుంటూ మెకానిక్ దగ్గరకు తీసుకువెళ్లాడు.
ఆయిల్ ట్యాంక్‌లోకి నీళ్లు చేరాయని బండిని పరీక్షించిన మెకానిక్ తేల్చాడు. తరువాత బాగుచేసిన బండి మీద అలా ఓ రౌండ్ వేసి వచ్చాడు. తరువాత కూడా మెకానిక్ బండి రిపేరుకు సంబంధించి ఓ లిస్టు చదివాడు.
బ్రేకులు తుప్పు పట్టాయని, టైర్లు అరిగిపోయాయని, సైలెన్సర్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని వీటన్నింటినీ మార్చుకుంటే బెటర్ అని రవి జేబును గట్టిగా పట్టుకునే మాటలు చెప్పాడు.
ఎంతవుతుంది అన్న ప్రశ్నకు మెకానిక్ తన గ్రీజు అంటుకున్న చేతులతోనే ఓ కాగితంపై లెక్కలు వేసి ఓ నంబర్ చూపించాడు.
‘‘వీటిల్లో ఏవీ ఇంపార్టెంటో అవి ముందు చేసేయ్ తరువాత మిగతావి చేసుకుందాం’’ అన్నాడు రవి.
సార్ ‘‘వానా కాలం కదండీ, మొత్తం చేయించుకుంటే మీరు కూడా సేఫ్‌గా ఉంటారు’’ అన్నాడు మెకానిక్.
మెకానిక్ సరిగ్గానే చెప్పాడు. వానాకాలం వచ్చేముందు మన బండిని సర్వీసింగ్ చేయించడం ఎంతో ముఖ్యమని వాహన తయారీ కంపెనీలు కూడా చెబుతున్నాయి. పైగా బండి వానలో అదేపనిగా నడపడం వల్ల కూడా చాలా సమస్యలు వస్తాయి.
అసలు ఇంతకీ వానాకాలం వేళ బండిని ఎలా చూసుకోవాలి? ఏమేం రిపేర్లు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


ఫొటో సోర్స్, Getty Images

ఇది ఒక్క రవి సంగతే కాదు... టూవీలర్లు, ఫోర్ వీలర్లు ఉన్నవారు చాలామంది వానాకాలంలో తమ వాహనాల విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. రిపేర్లకు తడిసి మోపెడయ్యేంత ఖర్చు చేస్తుంటారు.
ఒక్క వానాకాలంలోనే వాహనాల బీమా క్లెయిమ్‌లు భారీగా పెరిగాయని హాన్స్ ఇండియా ఓకథనంలో పేర్కొంది.
వర్షాకాలం (జూన్-సెప్టెంబర్) వార్షిక మోటారు బీమా క్లెయిమ్‌లదే ఎక్కువ వాటా అని, మోటారు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు 2024లో 3.2 శాతం ఉండగా, 2025లో 9.4 శాతం పెరిగినట్టు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

వానలో వాహనాలు ఎక్కువగా తడిసినా, నడిపినా ఎలాంటి సమస్యలు వస్తాయో వైజాగ్‌కు చెందిన ఆటోమొబైల్ ఇంజినీర్ సత్యగోపాల్ బీబీసీకి వివరించారు. కుంభవృష్ఠిలాంటి వర్షాలలో బైకులను, కార్లను అలాగే వదిలేస్తే ఏమవుతుందో తెలిపారు.
- వర్షపునీటిలో సైలెన్సర్లు మునగనంత వరకు ఎటువంటి ప్రమాదం ఉండదని, హెడ్‌లైట్స్ వరకు నీరు చేరితే ప్రమాదమేనని ఆయన అన్నారు. దీనివల్ల నీరు ఇంజిన్‌లోకి వెళ్లి, అది పాడయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు.
- అలాగే నీరు ఎక్కువగా ఉన్న మార్గాలో కార్లు, బైకులు నడిపితే ఎయిర్ ఫిల్టర్ల ద్వారా నీరు ఇంజిన్ లోకి వెళ్లి ఇంజిన్ పాడయ్యే అవకాశం ఉందని, ఎలక్ట్రిక్ సెన్సార్‌లు మాల్‌ఫంక్షన్ జరిగే అవకాశం ఉందన్నారు.
- వానలో ఎలక్ట్రిక్ కార్లు, బైకులు నడపొచ్చా అని ప్రశ్నిస్తే వానలో నడపొచ్చని, కానీ మరీ లోతుగా ఉండే ప్రాంతాలలో వెళ్లడం శ్రేయస్కరం కాదన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలలో ఎక్కువ ఎలక్ట్రిక్ సెన్సార్లు ఉంటాయని, లోతైన నీటి కారణంగా అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువని చెప్పారు.
- హెడ్‌లైట్ స్థాయిలో ఉన్న నీటిలో వెళ్లకపోవడమే మంచిది. పైగా ఎలక్ట్రికల్ వాహనాలకు బ్యాటరీ ప్యాక్ వాహనం అడుగున అమర్చి ఉంటుంది. దీనివల్ల కూడా డీప్ వాటర్‌లో వెళ్లడం శ్రేయస్కరం కాదని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల (జూన్ -సెప్టెంబర్) సీజన్‌లొ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మే నెలలో భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తగినట్టుగానే వానలు విపరీతంగా కురుస్తున్నాయి.
వానాకాలంలో ఎప్పుడు వానపడుతుందో, ఎప్పుడు ఒరుపు అవుతుందో చెప్పలేం. చినుకులు కాస్త కుంభవృష్ఠి కావచ్చు. అందుకే ఇలాంటి అనూహ్యపరిస్థితులకు మన వాహనాలు సిద్ధంగా ఉండేలా ముందే జాగ్రత్త పడాలి.
వానలో తడవకుండా రెయిన్‌కోట్, గొడుగుతో ఎలా సిద్ధంగా ఉంటామో, వాహనాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీ వానాకాలంలో టూవీలర్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images

- టైర్ త్రెడ్ డెప్త్ (టైర్లపై ఉండే గీతలు, వాటి మధ్య గ్యాప్)ఎలా ఉందో చూడండి. అవి అరిగిపోయినట్టు ఉంటే నీటిలో ప్రయాణం సురక్షితం కాదు.
- టైర్లు పాతబడితే వానాకాలంలో రిస్క్ వద్దు. వెంటనే మార్చుకోవాలి.
- టైర్లలో ఎప్పుడు తగినంత గాలి ఉండేలా చూసుకోవాలి.
- బ్రేక్ ప్యాడ్స్ సరిగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి.
- బ్రేక్ ఆయిల్ కూడా గమనించాలి.
- బ్రేకు లీవర్లు, కేబుల్స్ సరిగా ఉన్నాయో లేవో చూసి, లేకపోతే మార్చుకోండి.

ఫొటో సోర్స్, Getty Images

- వానాకాలంలో ఎక్కువ ఇబ్బంది పెట్టేవి బండి బ్యాటరీ, లైట్లే.
- బండి బ్యాటరీ జీవితకాలాన్ని గమనించండి. దాని పరిమితి ముగిసిపోతే కొత్తది వేయించండి. ఇది మీ బండి వానలో ఆగిపోయే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది.
- బ్యాటరీ లేకపోతే లైట్లు పని చేయక వానపడినప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలు మనకు కనపడటం, మనం ఇతర వాహనచోదకులకు కనిపించడం కష్టంగా మారుతుంది.
- బండి హెడ్‌లైట్, స్టాప్ లైట్, టెయిల్ లైట్, ఇండికేటర్లతో సహా అన్ని లైట్లు పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.
- మీ బైక్ హారన్ గట్టిగా, స్పష్టంగా వినబడేలా చూసుకోండి.
- మొత్తం స్విచ్ గేర్ ని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఏమైనా లోపాలు కనిపిస్తే ఆ భాగాలు మార్పించండి. లేదా రిపేర్ చేయించండి.

- వానా కాలంలో బండి నడపకపోతే దాన్ని అలా వానలోనే వదిలేయకండి.
- బండిని వాన పడని ప్రదేశంలో పార్క్ చేయండి.
- లేదంటే చక్కని కవర్ కొని, దాంతో బండిని పూర్తిగా కప్పేసి, అడుగున తాళ్లతో కట్టేయండి.
- మీరు తరచూ వరదల బారిన పడే ప్రాంతాలలో నివపిస్తుంటే మీ బండి కొట్టుకుపోయే అవకాశం లేకుండా సురక్షిత ప్రాంతాలలో పార్క్ చేయండి. వాతావరణ సూచనలను తరచూ ఫాలో అవుతూ ఉండండి.
- మీకు అంతగా తెలియని ప్రాంతాలకు బైక్‌పై వెళ్లినప్పుడు, మీతోపాటే బండిలో బైక్ కవర్ ఉండేలా చూసుకోండి.
- మీ బండిని వాన నీటి నుంచి రక్షించుకోవడానికి ఎప్పుడూ ఈ కవర్‌ను ఓ బ్యాగులో పెట్టి బండిలో ఉంచండి.

ఫొటో సోర్స్, Getty Images

- మనం దుమ్ము వాతావరణంలో జీవిస్తున్నాం. దీనికి వానతోడైతే బురద బురదే. వానాకాలంలో బండి బురదపాలు కాకుండా కాపాడుకోవడం కొంచెం కష్టమే.
- కానీ కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు మీ బైకు జీవితకాలాన్ని పెంచుతాయి.
- బురదలో బండి నడిపాక వెంటనే దానికి వాటర్ వాష్ చేయించడం మంచిది.పేరుకుపోయిన దుమ్మును, బురదను బండినుంచి తొలగించడం అంత తేలిక కాదు. అందుకే వాటర్ వాష్ చేయించాలి.
- ప్రయాణ సమయాలలో బండిని శుభ్రంగా ఉంచుకునేందుకు ఓ పొడిగుడ్డను మీ బైక్‌లో ఉంచండి.
- ముఖ్యంగా పెట్రోల్ క్యాప్, స్విచ్‌ల వంటి ప్రాంతాలలో నీరు చేరకుండా చూసుకోండి.
- మీ బండికి మడ్‌గార్డ్ లేకపోతే దానిని అమర్చడానికి వానాకాలమే సరైనది.
- ఇది మీ బండి టైర్లు రంగు మారకుండా చూడటమే కాకుండా, ఇతరులపై బురద పడకుండా కాపాడుతుంది.
- ఇక బండి చైన్ ఎప్పుడూ శుభ్రంగా, లూబ్రికెంట్‌తో ఉండేలా చూడండి.

ఫొటో సోర్స్, Getty Images

- మీరు ఫోర్ వీలర్ నడుపుతున్నట్టయితే విండ్ స్క్రీన్ వైపర్‌ను ఉపయోగించండి.
- తడిరోడ్లపై కారును వేగంగా నడపకండి. ఇది బ్రేకులు వేయడానికి మీకు తగిన నియంత్రణ కల్పిస్తుంది.
- తడిరోడ్లపై నడిపేటప్పుడు క్రూజ్ కంట్రోల్‌ను ఆపేయండి.
- మీరు ఇతర కార్ల మధ్య తగిన దూరాన్ని పాటిస్తున్నారో లేదో గమనించుకోవాలి.
- ఎక్కువ నీరున్న మార్గంలో ప్రయాణించకండి. బ్రేకులు, కారు పెయింట్, ఇంజిన్ దెబ్బతినొచ్చు.
- రోడ్డుమలుపుల వద్ద, బ్రేకులు వేసే సమయంలో జాగ్రత్తగా నడపండి.భారీ వాహనాల పక్కన, వెనుక అతి సమీపంగా మీ కారును నడపకండి
- వానలో తడవకుండా వెళ్లాలని చాలామంది రోడ్డుపై పరుగులు తీస్తుంటారు. వానలో డ్రైవ్ చేసేటప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడూ మదిలో ఉంచుకోవాలి.
- వానా కాలంలో కేవలం ఫోర్ వీలర్లే కాదు, టూవీలర్లను కూడా జాగ్రత్తగా నడపాలి. ముఖ్యంగా మలుపులు దగ్గర జాగ్రత్తగా ఉండాలి.

- మీ బండిని వానాకాలానికి ముందే సర్వీస్ చేయించండి.
- వర్షాలు ఆగాకా సర్వీసింగ్ చేయించాలనుకోవడం సరికాదు.
- చిన్న సమస్యలు వానాకాలంలో పెద్దవయ్యే అవకాశం ఉంటుంది.
- ఇంజిన్ ఆయిల్, బ్రేకు ఆయిల్ సరిపడా ఉన్నాయోలేవో చూసుకోండి.
- బ్రేకులు, స్పార్క్ ప్లగ్‌లు చెక్ చేసుకోవాలి.
- వానలో కష్టపడటం కంటే ముందే సర్వీస్ సెంటర్‌కు వెళ్లడం ఉత్తమం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














