నీలం రంగులో ‘కోడి గుడ్డు’, ఇది సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Syed Noor
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
గర్భవతైన మహిళకు బిడ్డ పుట్టడానికి ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎంతగా ఎదురుచూస్తారో, అంతే ఆసక్తిగా ఓ కోడి గుడ్డును పెట్టడం చూడడానికి కర్ణాటకలోని పశువైద్యులు ఎదురుచూస్తున్నారు.
కోడి గుడ్డు పెట్టడం చూడటానికి పశువైద్యులు వేచి ఉండటం వింతగా అనిపించవచ్చు కానీ, ఈ కోడి కూడా అసాధారణమైనదే.
ఈ కోడి నీలి రంగు గుడ్డు పెట్టి తనను ఆశ్చర్యానికి గురిచేసిందని దాని యజమాని అంటున్నారు.
అవును, మీరు చదివింది నిజమే. నీలి రంగు గుడ్డే.
ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో చోటుచేసుకుంది.
"రెండేళ్ల కిందట చిన్న కోడిపిల్లగా ఉన్నపుడు దీన్ని కొన్నాను. అప్పటి నుంచి, ప్రతిరోజూ మాదిరే శనివారం కూడా తెల్ల గుడ్డు పెట్టింది. కానీ, సోమవారం నీలి రంగు గుడ్డు పెట్టింది" అని కోడి యజమాని సయ్యద్ నూర్ బీబీసీతో చెప్పారు.

'నమ్మడం కష్టం'
అసీల్ జాతికి చెందిన (ఏషియన్ జాతి) ఈ కోళ్లు 10 రోజుల పాటు నిరంతరం గుడ్లు పెడతాయి. ఆ తర్వాత, దాదాపు పదిహేను రోజుల వరకు గుడ్లు పెట్టవు.
కానీ, తన కోడి "గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజూ గుడ్డు పెడుతోంది" అని నూర్ అంటున్నారు.
ఈ నీలం రంగు గుడ్డు వార్తలు అంతటా వ్యాపించడం ప్రారంభించాయి. దీంతో, చాలామంది ఆ కోడిని, గుడ్డును చూసేందుకు దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకా నెల్లూరు గ్రామంలోని సయ్యద్ నూర్ ఇంటికి తరలివస్తున్నారు.
"దీన్ని నమ్మడం కష్టం" అని బీదర్ జిల్లాలోని కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ యూనివర్సిటీలో పౌల్ట్రీ సైన్స్ మాజీ ప్రొఫెసర్ మొహమ్మద్ నదీమ్ ఫిరోజ్ బీబీసీతో చెప్పారు.
వారు దీనిని నమ్మకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, గుడ్డు రంగు సాధారణంగా తెలుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. మధ్యప్రదేశ్ అడవులలో కనిపించే కడక్‌నాథ్ జాతి నల్ల కోడి పెట్టే గుడ్డు కూడా నల్లగా ఉండదు.

ఫొటో సోర్స్, Syed Noor
కోళ్లలో ఎన్ని రకాలుంటాయి?
కోళ్లలో సాధారణంగా నాలుగు రకాలు ఉంటాయని ప్రొఫెసర్ నదీమ్ ఫిరోజ్ చెప్పారు -ఏషియన్ జాతి (భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అసీల్ జాతి కోళ్లు), ఇంగ్లీష్ జాతి (కార్నిష్), మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో కనిపించే జాతి (లేయర్స్, ఈ కోళ్లు తెల్ల గుడ్లు పెడతాయి), అమెరికన్ జాతి.
"నీలం గుడ్లు పెట్టే మైనా వంటి పక్షులు దాదాపు 10 నుంచి 15 ఉన్నాయి" అని చన్నగిరి తాలూకాలోని పశుసంవర్ధక, పశువైద్య విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ జీబీ చెప్పారు.
"కానీ, ఈ నీలి గుడ్డు అరుదైన కేసు, ఇది భారతదేశంలో అసాధారణం" అని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Syed Noor
పరీక్షిస్తున్న వైద్యులు
"ఈ జాతి కోళ్లు సంవత్సరానికి 100 నుంచి 126 గుడ్లు పెడతాయి. 10 రోజుల పాటు ప్రతిరోజూ ఒక గుడ్డు పెడతాయి. తరువాత పదిహేను రోజులు గుడ్లు పెట్టవు. ఆ తరువాత, 15 రోజుల పాటు ప్రతిరోజూ గుడ్డు పెడతాయి" అని డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు.
"మేం ఈ కోడిని పర్యవేక్షిస్తున్నాం. అధికారులకు ఒక రిపోర్టును పంపుతాం. శరీరంలోని కాలేయం బిలివర్డిన్ అనే వర్ణద్రవ్యాన్ని స్రవిస్తుంది. ఇది పెద్ద మొత్తంలో గుడ్డు షెల్‌పైకి చేరి ఉండొచ్చు" అని ఆయన అన్నారు.
"దీనిని నిర్ధరించడానికి, మేం మళ్లీ మళ్లీ చెక్ చేయాల్సి ఉంటుంది, అంతేకాదు కోడి మన ముందే గుడ్డు పెట్టడం ముఖ్యం. అప్పుడే ఏదైనా నిర్ధరించగలం, దాని రక్తం, షెల్‌ను పరీక్ష కోసం పంపగలం. గుడ్డు షెల్ ఎందుకు, ఎలా నీలం రంగులోకి మారిందో కనుగొనాల్సి ఉంది" అని డాక్టర్ అశోక్ కుమార్ వివరించారు.
"ఈ కోడిని పరిశీలనలో ఉంచాలని మేం సంబంధిత వైద్యుడికి చెప్పాం. కానీ, అది నీలం గుడ్డు పెట్టినప్పుడు మాత్రమే దర్యాప్తు చేయగలం" అని ఆయన అన్నారు.
గుడ్డు నీలం రంగులోకి ఎందుకు మారిందనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు సయ్యద్ నూర్ ఆ 'నీలి గుడ్డు' ని ఫ్రిజ్‌లోనే ఉంచుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














