ఆస్ట్రేలియాలో తీవ్ర వరదలు, మొసళ్లు పొంచి ఉంటాయి జాగ్రత్త అని హెచ్చరిస్తున్న అధికారులు...

ఫొటో సోర్స్, Reuters
ఈశాన్య ఆస్ట్రేలియాను వరదలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల ప్రభావంతో ఓ మహిళ చనిపోయారు. ఇళ్లు విడిచివెళ్లాళ్సిందిగా వేలమంది ఆస్ట్రేలియన్లను అధికారులు ఆదేశించారు.
వరద నీరు రెండో అంతస్తు స్థాయికి చేరవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ స్థాయిలో వరదలు రావడం ప్రమాదకరమని, ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.
గడచిన 24 గంటల్లో ఉత్తర క్వీన్స్‌లాండ్‌లోని పలు ప్రాంతాల్లో 1000 మి.మీకు పైగా వర్షం కురిసింది. ''సోమవారం కూడా రికార్డు స్థాయిలో వర్షం కురవనుందన్న సూచనలు ఆందోళన కలిగిస్తున్నాయి.’’ అని క్వీన్స్‌లాండ్ స్టేట్ ప్రీమియర్ డేవిడ్ క్రిసాఫుల్లీ చెప్పారు.

60 ఏళ్ల తర్వాత భయంకరమైన వరదలు
వరదల కారణంగా ఇంఘమ్‌లో ఓ మహిళ మరణించారని క్రిసాఫుల్లీ తెలిపారు. ఆమె ప్రయాణిస్తున్న రెస్క్యూ బోట్ చెట్టును ఢీకొని బోల్తాపడడంతో ప్రమాదం జరిగిందన్నారు. పడవలోని మిగిలిన ఐదుగురిని రక్షించామన్నారు.
ఈ స్థాయి వరదలు సంభవించడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో ఇప్పటిదాకా ఉన్న పరిస్థితులకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉందని క్రిసాఫుల్లి అంటున్నారు.
''వర్షాల తీవ్రత మాత్రమే కాదు. అవి ఎక్కువ రోజులు కూడా కొనసాగనుండటం దీనికి కారణం.'' అని ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టర్ ఏబీసీతో ఆయన చెప్పారు.
టౌన్స్‌విల్లేలో నివసిస్తున్న వేలాదిమందిని ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. లక్ష ఇసుక బ్యాగులతో వరద నీటిని ఆపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
టౌన్స్‌విల్లేకు, పర్యాటక కేంద్రమైన కెయిన్స్‌కు మధ్య రోడ్డు కొన్నిచోట్ల తెగిపోయింది. దీంతో ఇసుక బ్యాగులను ఆ ప్రాంతానికి తెచ్చేందుకు రెస్క్యూ టీమ్‌లు చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
మొసళ్లతో జాగ్రత్త
''రోడ్లు మునిగిపోయాయి. మంచినీరు, విద్యుత్ కొరతతో వేలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు విమానాలు రద్దయ్యాయి'' అని ఏబీసీ వెబ్‌సైట్ పేర్కొంది.
సోమవారం వంద స్కూళ్లకు సెలవు ప్రకటించారని వెబ్‌సైట్ తెలిపింది.
ఆ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం...
మంగవాళం వరకు వర్షాలు తెరిపినిచ్చే పరిస్థితి కనిపించడం లేదని, కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
టౌన్స్‌విల్లేలో దాదాపు రెండులక్షల మంది నివసిస్తున్నారు. వరదలు ముంచెత్తే ప్రమాదముందని, తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలనిహెచ్చరిస్తూ పోలీసులు, భద్రతా సిబ్బంది వేలాది ఇళ్లకు వెళ్లి చెప్పారు.
బ్లాక్‌జోన్‌గా పిలిచే టౌన్స్‌విల్లే ఆరు శివారు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.
ఇంఘమ్ దగ్గర హెర్బర్ట్ నది పోటెత్తుతోంది. కుండపోత వర్షాలతో ఇక్కడ 1967నాటి వరదల పరిస్థితి తలెత్తే ప్రమాదముందని ప్రజలు భయపడుతున్నారు.
1967లో సంభవించిన వరదలను ఇంఘమ్‌లో అతి తీవ్రమైనవిగా భావిస్తారని అక్కడే పుట్టి పెరిగిన క్రిసాఫుల్లి చెప్పారు.
ఇవి వందేళ్లకోసారి వచ్చే వరదలని, ఇంతకుముందెప్పుడూ ఇలాంటి వరదలను చూడలేదని హించిన్‌బ్రూక్ ఎంపీ నిక్ డమెట్టో చెప్పారు.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల్లో దాదాపు 180మి.మీ. వర్షం కురిసింది.
ఇంఘమ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
టౌన్స్‌విల్లే తీరప్రాంతంలోని పామ్ ఐస్‌లాండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడి ఎయిర్‌పోర్టును మూసివేశారు. శివార్లలో ఎమర్జెన్సీ వార్నింగ్స్ జారీచేశారు.
వరదనీటిలో మొసళ్లు ఉండే ప్రమాదముందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని క్వీన్స్‌లాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ హెచ్చరించింది.
వరదల సమయంలో నీళ్లు నెమ్మదిగా ప్రవహించే చోటును వెతుక్కునే క్రమంలో మొసళ్లు కొత్త ప్రాంతాలకు వస్తాయని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














