దేశ ప్రధాని ఫోటోలనే మార్ఫింగ్ చేసి అభ్యంతరకరంగా పోస్ట్ చేసిన వెబ్‌సైట్ మూతపడింది

ఫొటో సోర్స్, Getty Images/LaPresse via AP
- రచయిత, సారా రెయిన్స్‌ఫోర్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ సహా ప్రముఖ మహిళల చిత్రాలకు మార్పులు చేసి, వాటికి అసభ్య వ్యాఖ్యలు జోడించి పోస్ట్ చేసిన ఇటాలియన్ వెబ్‌సైట్‌పై ప్రముఖ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ వెబ్‌సైట్‌ను మూసివేశారు.
ఆ వెబ్‌సైట్ పేరు ఫికా. ఇటలీ భాషలో 'యోని'ని స్థానిక మాండలికంలో వ్యవహరించే ఫిగా అనే పేరు నుంచి ఈ వెబ్‌సైట్‌కు ఫికా అని పేరు పెట్టారు.
ప్రస్తుతం ఈ సైట్ ఓపెన్ చేయగానే 'కొందరు యూజర్ల చెడు ప్రవర్తనకు చింతిస్తూ వెబ్‌సైట్ మూసివేస్తున్నాం’ అనే సందేశం కనిపిస్తోంది.
ఈ సైట్ 'అసహ్యకరంగా' ఉందన్న జార్జియా మెలోని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
మియా మోగ్లీ(నా భార్య) అనే ఫేస్‌బుక్ గ్రూప్‌లో వేల మంది పురుషులు తమ భార్యల పర్సనల్ ఫోటోలను వారికి(భార్యలకు) తెలియకుండా ఎక్సేంజ్ చేసుకుంటుండేవారు. ఈ గ్రూప్‌పై ప్రముఖులతో పాటు ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో దాన్ని తొలగించారు. ఆ తరువాత రోజే ఫికాను కూడా మూసివేశారు.
మియా మోగ్లీ గ్రూపులో పోస్ట్ చేసిన చిత్రాలపై అసభ్యకరమైన, హింసాత్మక వ్యాఖ్యలు రాశారు. వీటిని పోస్ట్ చేసిన వారిలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పోలీసు అధికారులు ఉన్నారు.
"అడల్ట్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేసన్ పాలసీస్’ ఉల్లంఘించినందుకు గాను ఈ ఫేస్‌బుక్ గ్రూప్‌ను తొలగిస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది.
ఫికా మీద గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ వెబ్‌సైట్‌కు 7లక్షల మంది యూజర్లు ఉండేవారు.


‘ఫికా’కు పోర్న్ వెబ్‌సైట్‌గా గుర్తింపు
ఫికా వెబ్‌సైట్ వీఐపీ సెక్షన్‌లో ప్రముఖ మహిళా రాజకీయ నేతల ఫోటోలు, సినీ తారలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, ఇతర ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి.
ప్రముఖులు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, వారి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తీసుకున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర వ్యాఖ్యలు జోడించి ఫికా సైట్‌లో పోస్ట్ చేసేవారు.
బీచ్‌లలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫోటోలను తీసుకుని వాటిని మార్ఫింగ్ చేసి "హాట్ పొలిటీషియన్స్" అనే పేరు ఆ ఆల్బమ్‌కు పెట్టారు.
ఫోటోల కింద సెక్సిస్ట్ క్యాప్షన్స్ పెట్టడంతో యూజర్లు అసభ్యకరమైన కామెంట్లు పెట్టారు.
ఫికా వెబ్‌సైట్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్ అలెస్సాండ్రా మోరెటీ ఇందులో అత్యాచారానికి ప్రేరేపించడం కూడా ఉందని బీబీసీతో చెప్పారు.
"ఇది అనేక మంది మహిళల భద్రతకు మాత్రమే కాకుండా వారి మానసిక ఆందోళనకు కూడా ప్రమాదకరంగా మారింది. ఫోటోల కింద కుప్పలు తెప్పలుగా అసభ్యకర వ్యాఖ్యలు ఉన్నాయి"అని ఆమె అన్నారు.
బాధిత మహిళలకు అండగా నిలిచి వారి తరపున మాట్లాడాల్సిన బాధ్యత తనలాంటి రాజకీయ నేతలకు ఉందని ఆమె అన్నారు.
"హింస, రేప్ లాంటి వాటిని ప్రేరేపించేలా వ్యవహరిస్తున్న ప్లాట్‌ఫామ్‌లను మూసి వేయాల్సిందే. హింస వల్ల హింసే పుడుతుంది. దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది" అని చెప్పారు.
వెబ్‌సైట్‌ను మూసివేసిన ఫికా యూజర్లను నిందించింది. తమ సైట్ ఉద్దేశాలు, లక్ష్యాలను కొంతమంది చెడ్డవాళ్లు వక్రీకరించారని "సురక్షిత వాతావరణంలో తమ కంటెంట్ పంచుకోవాలన్నదే తమ లక్ష్యమని" ప్రకటించింది.
"ఇలాంటి సైట్‌కు దూరంగా ఉండాలని ప్రజలు భావించేదిగా, తాము సిగ్గు పడే విధంగా" వ్యవహరించినట్లు ఈ వెబ్‌సైట్ అంగీకరించింది. సైట్‌లో ఉన్న కంటెంట్ మొత్తం తొలగిస్తామని హామీ ఇచ్చింది.
ఈ ప్రకటన కన్నీరు పెడుతున్నట్లు ఎమోజీలను జత చేసి "త్వరలో కలుస్తాం" అనే పదాలతో ముగిసింది.

ఫొటో సోర్స్, change.org/en-IN
వెబ్‌సైట్ మీద దర్యాప్తు జరుగుతోందని ఇటలీలో సైబర్ నేరాలను విచారించే పోలీస్ విభాగం బీబీసీకి తెలిపింది.
మైనర్లకు సంబంధించిన చిత్రాలు, హింసను ప్రేరేపించే వాటిని తాము తమ వెబ్‌సైట్‌లో ఎన్నడూ పోస్ట్ చేయలేదని ఫికా తెలిపింది.
ఈ సైట్ మూసి వేయాలంటూ చేంజ్. ఓఆర్‌జీ అనే సంస్థ ఆన్‌లైన్‌లో తీసుకొచ్చిన పిటిషన్‌పై 1.72 లక్షల మంది సంతకం చేశారు.
ఈ సైట్‌లో పబ్లిక్ బాత్‌రూమ్‌లో, దుస్తులు మార్చుకుంటున్న గదులు, సెలూన్లలో దృశ్యాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించారని పిటిషన్‌పై సంతకంచేసిన వారు చెప్పారు.
మియా మోగ్లీ గురించి గతంలో వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదు.
అయితే గత వారం రచయిత్రి కరోలినా కాప్రియా ఈ గ్రూప్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను ఖండిస్తూ రాసిన పోస్ట్ వైరల్ కావడంతో పరిస్థితి మారింది. ఆ చిత్రాలలో తమను తాము గుర్తించిన మహిళలు దీనిపై స్పందించారు.
అప్పటి నుంచి ఫికాతో పాటు ఇతర సైట్ల గురించి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెప్పారు.
"2025లోనూ మహిళ గౌరవాన్ని కాలరాయడం సాధారణమైనదిగా, చట్టబద్ధమైనదిగా భావించే వారు, మహిళలపై లైంగిక, అసభ్యకర పదాలతో దాడి చేసేవారు, చీకటిలో లేదా కీబోర్డు వెనుక దాక్కుని ఉండటం నిరాశను కలిగిస్తోంది" అని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లాసెరాతో చెప్పారు.
తమ అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్న చిత్రాలపై ఫిర్యాదు చేయాలని ఆమె మహిళలను కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














